"ఏమిటీ? ఎవరింట్లో?" అంది మళ్ళీ__
"అవునమ్మా! మన రమేష్ బాబు గారింట్లో.... ...."
శకుంతల ఒక్క క్షణం ఆలోచించి, "పద! అక్కడికి వెళ్దాం!" అంది. శామి వెంటనే సంబరంగా, "రండి!" అంది. తన ఆలోచనలలో తానున్న శకుంతల గమనించలేదు కానీ, లేకపోతే శామి సంబరం ఆమెకు విడ్డూరంగా తోచి ఉండేది.
శామితో కలిసి అకుమ్తల బయటకు రాగానే జీప్ సిద్దంగా ఉంచాడు డ్రైవరు జీప్ లో తుపాకితో గూర్ఖా.... శకుంతలకు ఆ క్షణంలో తనకు తానొక బందీ అయినట్లుగా పోలీసు కష్టడీలో వెళ్తున్నట్లూ అనిపించింది.
రమేష్, దినకర్, మరికొందరు మిత్రులూ హాట్ డ్రింక్స్ తీసుకుంటున్నారు. శకుంతలను చూసి రమేష్, ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయి పోయాడు. స్వయంగా కుర్చీ తెచ్చి వేశాడు. ఒక పనివాడిని కాఫీపెట్టమని పురమాయించాడు. శామీ-"నమస్తే దొరా!" అంటే గడబిడ పడుతూ, "ఆఁ.... ....ఆ!" అన్నాడు.
కూచుని చుట్టూ చూసింది శకుంతల. అది డాబా ఇల్లు లోపలి గదులు ఎంత విశాలమైనవో, అక్కడ ఎవరున్నారో శకుంతల ఊహించ లేకపోయింది. కానీ, హాలులో మాత్రం రమేష్ పక్కనే అందుబాటులో తుపాకి వుంది గోడకి తగిలించి హంటర్ ఉంది. గోడలమీద అందమైన సినిమాతారల క్యాలెండర్లు ఉన్నాయి. సోఫాలుమధ్యన టీపాయ్ దానిమీద గ్లాసులు, బాటిల్స్ ప్లేట్లలలో నాన్ వెజ్ స్నేక్స్.
శకుంతల తమను ఆస్థితిలో చూసినందుకు వాళ్ళలో ఒక్కరుకూడా సిగ్గుపడలేదు. సంకోచపడలేదు. అదేదో అత్యంత సహజమయిన స్థితి అన్నట్లు స్వాగత సూచకంగా చిరునవ్వులు నవ్వారు-చేతిలో గ్లాసులతో.
"దినకర్! మీతో నేను మాట్లాడతనికి వచ్చాను" అంది శకుంతల.
"చెప్పండి!" గ్లాసు పైకెత్తి తాగకుండా ఆపి అన్నాడు.
"అయామ్ సారీ!"
"నాకు తెలుసు."
"బహుశః ప్రస్తుతానికి నేనేమీ చెయ్యలేను. మీరు ఏం చెయ్యగలరో ప్రయత్నించండి. మీకు ఏవిధంగానూ అడ్డుపడను. వీలైతే సమంజస మనిపిస్తే సహకరిస్తాను."
"థేంక్యూ! కానీ ఒకసారి డబ్బులు చేతిలోపడిన తర్వాత వాళ్ళను ఉద్రేకపరచలేం! ఏదో ఆలోచిద్దాం. మీ సహకారం ఉంటుందన్నారు కదా- ఆ మాట చాలు!"
రమేష్ కల్పించుకొని, "శకుంతలా! కావాలనుకుంటే మీ రిద్దరూ లోపలికి వెళ్ళి డిస్కస్ చేసుకోండి!" అన్నాడు.
ఉలిక్కిపడింది శకుంతల.
అతని కళ్ళలో కనిపించిన భావం ఆమెకు కంపరం కలిగించింది. ఒక్కసారి చీదరగా చూసి, "అవసరం లేదు. వస్తాను!" అని నమస్కారం చేసి బయటకు వచ్చేసింది.
ఆ చికాకులో రమేష్, శామీలు పరస్పరం చేసుకొన్న సైగలు గమనించలేదు.
శామీ రెండు రోజులు సెలవు కావాలంది. ఎందుకని అడిగితే చుట్టాల పెళ్ళి అంది.
"వెళ్ళు!" అంది శకుంతల.
శామి వెంటనే వెళ్లలేదు. ఏదో చెప్పబోయి ఆగిపోయిన దానిలా కనిపించింది.
"ఏమిటి అంది శకుంతల.
"మీరిట్టా దిగాలుగుంటే సూడలేకుండున్నానమ్మా! ఓ యిసయం సెప్పనా. వద్దా అని ఆలోచిస్తున్నా!"
శామి ఇంగ్లీషు మాటలు ఒకటి రెండూ పట్టుకోగలిగినా, తన యాస పోగొట్టుకోలేక పోతోంది పూర్తిగా.
"ఏ విషయం? మంచిదయితే చెప్పు!"
"అమ్మా! గురూగారు మీకు బాగా తెలుసా?"
"ఏ గురువుగారు?"
"ఆరి పేరు తెలవదు. అల్లారోజు మనం అడవిలో కలిసాం చూడూ ఆరూ.....!"
పడుకొని మాట్లాడుతున్నది- దిగ్గున లేచి కూచుంది శకుంతల.
"రాజా!"
"ఏమోను! ఆ రోజు మీ రారితో అడవిలో ఉన్నారు గదా!"
"తెలుసు! అయితే?"
"ఆరూ ఈ పెళ్ళికొత్తున్నారు."
"నిజంగా!"
"పెమాణకంగా!"
"అయితే పెళ్ళికి నేనూ వస్తాను."
"హమ్మో! వద్దు మీరాపూరు రాకూడదు. వస్తే మావోళ్ళు నా పేనాలు తీస్తారు!"
"అదేమిటి? ఎందుకు?"
"అంతేనండీ! అది మాకట్టు. ఆ అడవులయినా లేకపోతే ఆపదలో మేం తల దాచుకొనే దెక్కడ? మీ అసుమంటోళ్ళని మా ఊళ్లలోకి రానియ్యం."
"మరి రాజు ఎలా వస్తున్నాడు?"
"అల్లు రారండీ! అల్లంటే మా వోళ్ళకి భక్తి మరోల్లు అటేపు కొస్తే పేనాలు పోవల్సిందే! అంతే గాదండీ! మా తోడు లేకుండా ఈ అడవుల్లో మీరు రాలేరండి దారులు తెలవ్వు!"
"వాళ్ళు అంటే ఇంకా చాలామంది ఉన్నారా?"
"ఉన్నారండి. ఆ రోజు సూసారు గదండీ!"
శామీ! ఎలాగైనా నన్ను పెళ్ళికి తీసికెళ్ళాలి. మా బంగారు తల్లివి గదూ!"
"నాకు భయం గుందండి!"
"నేను అచ్చు మీ మనిషిలా తయారై వస్తాను. అక్క డెవరికీ బయట మనిషి వచ్చినట్లు తెలీదు."
"అదేం కుదర్ధండి! ఊరంటే ఎంత పెద్దూరనుకున్నారు? అంతా కలిసి వందమందుండరు. మామూలు గయితే బయటోళ్ళు రాలేరు. కానీ, పెళ్ళిగదండీ! రెండు మూడూళ్ళోల్లు వస్తారు. కలిసిపోవచ్చు. కానీ మీరు గురూగారిని గుర్తుపట్టి మాటాడిస్తే అందరూ నన్ను సంపుతారు."
"లేదు. రాజుని గుర్తుపట్టినా పలకరించను. తను నన్ను గుర్తుపట్టకుండా జాగ్రత్త పడతాను. గుంపులో కలిసిపోతాను."
"మనవాళ్ళు గుర్తుపడితే ఇద్దరిపనీ అయిపోతాది. అక్కడేనయినా సరే? మీ రస్సలు మాట్లాడకూడదు."