* * *
"వీల్లేదు. ఇలా ఎంతమాత్రం వీల్లేదు. 'మరిచిపో!" "క్షమించు' లాంటి చిన్న చిన్న పొడి మాటలతో ఇన్నాళ్ళుగా మన మధ్య అల్లుకున్న అనుబంధాన్ని తెగకోయ్యలేవు. నువ్వు నావాడివి. నిన్ను నా నుండి ఏ వ్యక్తీ, ఏ శక్తి ఏ విలువా వేరు చెయ్యలేదు."
మాధవ మెడ చుట్టూ చేతులు పెనవేసి అతని గుండెల్లో తలపెట్టి హృదయవిదారకంగా ఏడ్చింది సరళ. మాధవకూ కళ్ళు చెమ్మగిల్లాయి.
"ఇప్పుడెలా సరళా!" అన్నాడు వెక్కి వెక్కి ఏడుస్తున్న సరళ శిరాసు ఓదార్పుగా నిముర్తూ.
"ఎలా ఏముందీ? ఆవిడకు విడాకులిచ్చేయ్యి. కావాలంటే పోషణకు నెలకింతని ఇయ్యి. నీ ఆస్తంతా ఇచ్చేసినా నాకు అభ్యంతరం లేదు"
"అంత అన్యాయమా?"
సరళ అడ త్రాసులా కస్సున లేచింది.
"అన్యాయమా? ఏది అన్యాయం? ఒకనాడు నా మనసులో ఆశలు నింపింది అన్యాయం కదా? మనసులో నన్ను పెట్టుకుని ఎవరికో, ఎందుకో తాళి కట్టటం అన్యాయం కాదా? నువ్వు లేకపోతే నిలవలేని నన్ను ఏవేవో కుంటి కారణాలతో తోసి పారేయ్యాలనుకోవడం అన్యాయం కాదా? నా మాటలు మాత్రం అన్యాయంగా వినిపిస్తున్నాయా నీకు?"
మాధవ తల వాల్చేసుకున్నాడు.
"నన్ను క్షమించు సరళా!"
"నాకు కావలసింది క్షమాపణ కాదు. నువ్వు"
"నేను ఇంకొకరి సోత్తునయిపోయాను"
"అయినా నేను లాక్కుంటాను. ఇంకొకరికి దక్కనివ్వను."
"ఎలా?"
"చెప్పానుగా! విడాకులు......"
"సరళా! మన హిందూ సంఘంలో ఆడదాని స్థితి ఆలోచించే మాట్లాడుతున్నావా? మొగవాడికెలాగైనా పెళ్ళవుతుంది కాని ఒక మగవాడి నుండి విడాకులు తీసుకున్న ఆడదాన్ని ఎవరు పెళ్ళి చేసుకుంటారు? పట్టుమని పాతికేళ్ళు నిండని ఆ జీవితం బుగ్గి కావలసిందేనా?"
"అయితే నువ్వనేదేమిటి?"
:జానకికి విడాకులివ్వలేను"
"మాధవా!" గట్టిగా ఏడ్చింది సరళ. ఎంతోసేపటికి తెప్పరిల్లి పిచ్చిదానిలా మాధవ వంక చూస్తూ "సరే! ఆవిడకు విడాకులివ్వకు. నన్ను పెళ్ళి చేసికోకు. కాని నన్నుంచుకో. నాకు నీతీనియమాలక్కర్లేదు. పరువు ప్రతిష్టలూ అక్కర్లేదు. కాని, నువ్వు ......నువ్వు కావాలి మాధవా!" అంటూ మాధవను గాడంగా కౌగలించు'కుంది.
ఒక ఆడది , అందులోనూ సరళ లాంటి అందమైన ఆడది తనను అంత గాడంగా కౌగలించుకున్నా మాధవలో ఏ సంచలనమూ కలగలేదు. అప్పటికి పూర్తిగా అర్ధమయింది మాధవకు. సరళ తననెంత వెర్రిగా ప్రేమిస్తున్నా, తను మాత్రం సరళను ప్రేమించలేనని. అతి ప్రయత్నం మీద సరళను తననుండి విడదీసి కుర్చీలో కూచోబెట్టాడు మాధవ. "ఇప్పుడు నువ్వు ఉద్రేకంలో ఉన్నావు. ఏం మాట్లాడుతున్నావో నీకేం తెలీటం లేదు. ఇంటికెళ్ళి స్థిమితంగా ఆలోచించుకో!" అన్నాడు.
ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి మరబోమ్మలా తయారయిన సరళను చెయ్యి పట్టుకుని గది లోంచి అవతలకు నడిపించి రిక్షా ఎక్కించి, గదిలో కొచ్చి కుర్చీలో కూలబడ్డాడు మాధవ.
"అన్యాయం, అన్యాయం " అంటూ అతని అంతరాత్మ ఘోషిస్తోంది.
అవును. అన్యాయమే! సరళ నింత క్షోభ పెట్టె అధికారం తనకు లేదు.
ఒక వ్యక్తీ మనసు దోచుకుని ఆమెకు మనసిచ్చాక మరొకరిని ప్రేమించటం ఉత్తమ లక్షణం కాదు. ఇది సూత్రం.
కాని, సజీవంగా స్పందిస్తోన్న తన హృదయం ఈ సూత్రాలనన్నింటిని అధిగమించి జానకి చుట్టూ పరిభ్రమిస్తోంది. దీనికి సంజాయిషీ ఇచ్చుకోలేడు.
తను బలహీనుడు కావచ్చు.
దుర్మార్గుడు కావచ్చు.
కాని, జానకికి విడాకులు మాత్రం ఇవ్వలేడు. సరళను స్వీకరించగలిగే శక్తి తనలో హరించుకుపోయింది. ఒకనాడు ఈ వ్యక్తిని ప్రేమించాడు అనుకోవటానికీ మనసొప్పటం లేదు. తనలో తను మధనపడుతూ సాయంత్రం వరకూ అలాగే అశాంతితో గడిపాడు మాధవ. సరళ ఆ దెబ్బ నుండి కోలుకుని ఎవరినైనా పెళ్ళి చేసుకోగలిగితే ఫరవాలేదు. కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పగలుగుతుంది. మాధవ ఇలా ఆలోచిస్తుండగా మోహన్ సరళలు వచ్చారు.
వాళ్ళిద్దరూ కలిసి వచ్చినందుకు ఆశ్చర్యపోతూ కుర్చేలు చూపించాడు మాధవ.
బాగా ఏడ్చినందువల్ల సరళ ముఖం ఉబ్బింది. కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి. రేగిన జుట్టును కూడా సవరించుకోలేని అయోమయవస్థలో ఉంది ఆమె.
మోహన్ ముఖం గంభీరంగా ఉంది.
"సరళ నాకంతా చెప్పింది" ఏ ఉపోద్ఘాతాలు లేకుండా తిన్నగా విషయంలోకి వచ్చేశాడు మోహన్.
గుండెలు దడదడలడుతుండగా ఊపిరి బిగపట్టి కూచున్నాడు మోహన్.
"సరళకు వాగ్ధానమిచ్చాక మీరు ఇంకొకరిని చేసుకోవటం అన్యాయం. కొన్ని విచిత్ర పరిస్థితుల్లో అలా చేసుకున్నానని సరళకు చెప్పారట! నిజమేనా?"
"నిజమే!"
"అంటే మీరా పెళ్ళి చేసుకోవటం సరళ మీద ప్రేమ లేకపోవటం వల్ల కాదన్నమాట!"
"కాదు"
"సరే! అయిందేదో అయింది. పవిత్రమైన మాంగల్యబంధం అంటూ కూచోటానికి మనలో ఎవరూ చాదస్తులు లేరు. ఇలాంటి తప్పనిసరి వివాహాలు కావాలనుకుంటే విడాకుల ద్వారా రద్దుచేసుకోవచ్చు. కాని, ఇందుకు మీరు ఒప్పుకోవటంలేదని సరళ చెప్పింది."
".........."
"విడాకులు పొందిన స్త్రీని మన సమాజంలో ఎవరూ స్వీకరించరనీ, ఆ కారణం చేత ఆమెను నిరాశ్రయురాలీని చెయ్యవలసి వస్తుందనీ విడాకులివ్వలేక పోతున్నారనీ సరళ చెప్పింది."
'అవును"
"అదేనా కారణం? అంతకంటే ఇంకేం లేదుగా?"
సరళకు అన్నగా, తన సహాధ్యాపకుడిగా , గంభీరంగా అడుగుతోన్న మోహన్ ను చూస్తోంటే పెదవులు వణికాయి మాధవకు.
"అదే! ఇంకేం లేదు."
"అయితే ఆవిడను నేను పెళ్ళి చేసుకుంటాను. ఆవిడ భవిష్యత్తును గురించి చింత వదిలి మా సరళను చేసుకోండి."
గుండెల్లో పిడుగు పడినట్లు అదిరిపడ్డాడు మాధవ. పిచ్చివాడిలా మోహన్ వంక చూస్తూ "మీరా? మీరు జానకిని చేసుకుంటారా?" అన్నాడు.
తిరస్కారంగా నవ్వాడు మోహన్.
"ఒకరి భార్యని పెళ్ళి చేసుకోవాలని నాకేం సరదా లేదు. కాని మా చెల్లెలి క్షోభ చూడలేక ఈ నిర్ణయానికి వచ్చాను. చేసుకున్నాక ఆవిడను ఏవిధంగాను కష్ట పెట్టను."
చాలాసేపు మతిపోయిన వాడిలా కూచున్న మాధవకు మెరుపులా ఒక ఆలోచన వచ్చింది.
"కాని జానకి.....జానకి ఒప్పుకోవద్దూ? నేను వెళ్ళి తనతో మాట్లాడి ...."