కుర్చీలోంచి గబుక్కున లేచి నుంచుంది సరళ.
"నువ్వు వెళ్ళొద్దు. ఎంతయినా తాళి కట్టిన మొగుడివి. మరోకడిని చేసుకుంటానని నీతో ఆవిడ అనలేకపోవచ్చు. నే వెళ్ళి అన్ని సంగతులూ చెప్పి ఆవిడను ఒప్పిస్తాను."
పాలిపోయిన ముఖంతో ఏం మాట్లాడలేక కూచున్నాడు మాధవ.
"వస్తాం" అని సరళతో వెళ్ళిపోయాడు మోహన్.
* * *
కుసుమ ముఖం కొంచెం వడిలి ఉండటం గమనించి "అలా ఉన్నావేం?" అన్నాడు శ్యామ్.
"న్యాయంగా సంతోషించవలసిన సంగతే. కాని విచారించవలసి వస్తోంది పరిస్థితులను బట్టి."
"వివరంగా అర్ధమయ్యేలా చెప్పు."
"మనమింక తొందరగా పెళ్ళి చేసుకోవాలి"
"అకస్మాత్తుగా ఎందుకంత తొందర? మీ తమ్ముడి చదువుకి నువ్వే ఆధారమని, అతని చదువు పూర్తయ్యేవరకూ పెళ్ళి చేసుకోననీ అనేదానివిగా"
"అన్నాను. అది నిజం కూడా. కాని అంతవరకూ ఆగడానికి వీల్లేని పరిస్థితి వచ్చేసింది." తల బాగా కిందికి దించుకుంది కుసుమ.
శ్యామ్ కు అర్ధమయిపోయింది.
"ఓ గాడ్!" అన్నాడు ఒక్కసారి కుర్చీలోంచి లేచి నుంచుని.
కొన్ని క్షణాలు ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు.
"ఏమిటాలోచిస్తున్నావు శ్యామ్?" బెంగగా అడిగింది కుసుమ.
"నేనా! నేనేం ఆలోచిస్తాను? నువ్వే ఆలోచించాలి"
"ఆలోచించడానికేం లేదు. వెంటనే పెళ్ళి చేసేసుకోవాలి"
"అది వీల్లేదు."
"ఏమిటీ?"
"సారీ కుసుమా! నీకు ఎలా చదువుకోవలసిన తమ్ముడి బాధ్యత ఉందొ, నాకూ అలానే పెళ్ళి కావలసిన చెల్లెలి బాధ్యత ఉంది. నాకున్నవి రెండే మార్గాలు. ఒకటి - దాని కట్నానికి డబ్బు పోగు చెయ్యగలిగేటంత వరకూ పెళ్ళి చేసుకోకుండా ఉండటం , రెండు - దాని క్కూడా కట్నమిచ్చి పెళ్ళి చెయ్యగలిగేటంత ఐశ్వర్యం తెచ్చిపెట్టే అమ్మాయిని చేసుకోవటం"
"శ్యామ్! ఇంత నిర్ధాక్షిణ్యంగా మాట్లాడతావా?"
"ఉన్న సంగతి చెప్తున్నాను."
"ఇదంతా ముందే ఎందుకు ఆలోచించుకోలేదు?"
"ఈ ప్రశ్న నన్నా అడుగుతున్నావు?" నవ్వాడు శ్యామ్. కుసుమకు ఆపాదమస్తకం భగ్గున మండింది. అయినా ఆ మాటలలో నిజం ఆమెను తలెత్తనియ్యలేదు.
"ఇప్పుడిక ఈ తర్కవితర్కలన్నీ అనవసరం శ్యామ్. నువ్వు వెంటనే నన్ను పెళ్ళి చేసుకోకపోతే."
"ఇది సరికొత్త పాతకధ కుసుమా. ఏదైనా ఉపాయం ఆలోచించు. నువ్వు కనీసం నాలుగు వేలయినా ఇవ్వగలిగితే రేపే తాళి కడతాను. నిజానికి నిన్ను వదులుకోవడం నాకు యిష్టం లేదు. లేదా నేను మా చెల్లెలి పెళ్ళి చెయ్యగలిగే వరకూ అగు. కాదూ కూడదంటావా , మీ అమ్మకు చెప్పేసి ఏ అమాయకుడిచేతో ముడి పెట్టించేసుకో! ఇంతకంటే ఏం చెప్పగలను?"
ఏ వికారమూ లేకుండా చిరునవ్వుతో చెపుతున్న శ్యామ్ ను చూసి భగ్గుమంది కుసుమ మనసు. కాని, తనిప్పుడు అసహాయురాలు. ఏదీ చెయ్యలేని స్థితిలో ఉంది.
"సరికొత్త పాతకధ" ఇదే కుసుమ హృదయంలో గింగురుమంటోంది. అవును ఎన్ని సంవత్సరాలుగానో, ఎన్నెన్ని యుగాలుగానో పునరావృత్తమావుతోన్న కధ. ప్రకృతి స్త్రీకి విధించిన శాపం! ఆలోచనాశక్తి , విచక్షణజ్ఞానము ఉన్న తను కూడా ప్రకృతి ఉరిలో బిగుసుకుపోయింది. ఇప్పుడు కర్తవ్యం ఆలోచించాలి.
"నేను మా ఊరెళ్ళి మావాళ్ళతో ఆలోచిస్తాను. నాలుగువేలు ఇవ్వలేరేమో!"
"పోనీ మూడువేలన్నా చూడు! నీకోసం....." ఉదారం ప్రకటించాడు శ్యామ్.
మనసులో పొంగి పోర్లుతోన్న కోపాన్ని బలవంతాన నిగ్రహించుకుని లేచిపోయింది కుసుమ. ఎప్పటిలా వెళ్ళబోయే ముందు ఆమెను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకునేందుకు సాహసించలేకపోయాడు శ్యామ్.
* * *
అకస్మాత్తుగా వచ్చిన కుసుమను చూసి ఆశ్చర్యపోయారు శ్రీనివాసూ, అలమేలు.
కుసుమ ద్వారా సంగతి విన్న అలమేలు నిర్ఘాంతపోయింది.
"ఓసీ పాపిష్టిదానా! ఎంత పని చేశావే!" అని తలబాదుకుంది.
కుసుమకి అందరిమీదా కసిగా ఉంది.
"తరువాత తలబాదుకుందువు గాని .....మూడు వేలు సర్ధగలవా?"
"మూడువేలా? ఎక్కడతేనూ?"
"రెండేళ్ళ నుండి నేను నెలనెలా పంపిస్తున్నదంతా ఏమయింది?"
"ఏమవుతుంది? ఖర్చయిపోతుంది. అయినా నువ్విలాంటి పాడుపని చేసి మా పీకల మీదికి తెస్తావని కలగంటామా?"
"అమ్మా! నాకేన్నేళ్ళూ?"
"అదెందుకూ! పాతిక ఉంటాయేమో?"
"పాతిక కాదు ఇరవై ఎనిమిది నిండి ఇరవై తొమ్మిది వచ్చాయి. నీకేన్నో ఏట పెళ్ళయింది."
"అబ్బో! ఆ కాలం వేరు. ఇప్పట్లా ఇన్నేసేళ్ళు వరకూ ఉంచేవాళ్ళా? నా పదహారో ఏటే పెళ్ళయిపోయింది.
"అవున్లే! పదహారోఏట పెళ్ళి చేసుకుని, పద్దెనిమిదో ఏట నుంచీ పిల్లల్ని కంటున్న నీకు ఇరవై ఎనిమిది నిండినా పెళ్ళి కాని కూతురి మనసు అర్ధం కాకపోవతంలో ఆశ్చర్యం లేదు. అందుకే తేలిగ్గా "పాపిష్టిదానా' అని తిట్టగలిగావు"
"ఏమిటే నువ్వనేది?"
"ఆడదానివైనా ఆడదాని మనసు అర్ధం చేసుకోలేకపోయావంటూన్నాను. నేను చేసింది పొరపాటే. కాని, నువ్వు తిట్టడం కాదు, జాలిపడాలి. ఇంత వయసొచ్చినా కూతురికి పెళ్ళి చెయ్యలేకపోయినందుకు బాధపడాలి."
"హవ్వ! ఎంత బరితెగించావే!"
"తల్లిదండ్రులు బాధ్యతలు మరిచిపోయినప్పుడు కూతుళ్ళు బరితెగించల్సిందే! నెల నెలా పంపుతున్న నా జీతం అందుకోవడమే తప్ప నా పెళ్ళి గురించి ఆలోచనే రాలేదా మీకు?"
అంతవరకూ ఒకగదిలో ఉండి తల్లీ కూతుళ్ళ సంభాషణ వింటున్న శ్రీనివాసు ఇంక సహించలేకపోయాడు. చటుక్కున అక్కడికి వచ్చాడు. తండ్రిని చూడగానే కుసుమ ముఖం పాలిపోయింది. అలమేలు "చూడండి దాని ఆగడం" అంది రోషంగా.
"కుసుమా! నీకు పెళ్ళి కానందుకు ఎంత క్షోభపడుతున్నావో , నీ పెళ్ళి కోసం ఎలా ప్రయత్నిస్తున్నానో సాక్ష్యాలతో సహా నీకు వివరించి సంజాయిషీ ఇచ్చుకోలేను. ఎంతైనా నన్ను నేను అంత అవమానం చేసుకోలేను. కాని, నువ్వు పంపిన డబ్బు వడ్డీతో సహా తీర్చుకోగలను. అది తీసుకుని మమ్మల్ని క్షమిస్తావా?' తండ్రి గంభీర కంఠస్వరం వింటుంటే కుసుమ గొంతు పోడారిపోయింది. ఏం ,మాట్లాడలేకపోయింది.
"అంత డబ్బు ఇప్పుడెలా ఇస్తారండీ?" అంది అలమేలు.
"ఇల్లమ్మి....."
'అయ్యయ్యో ! ఇదేదో ప్రయోజకురాలయి వాడిని ప్రయోజకుణ్ణి చేస్తుందని ఆశలు పెట్టుకుంటే అదేదీ లేకపోగా చివరకు మనకున్న ఈ కాస్త కొంపా తెగనమ్ముతారా"