"పోనీ ఈ పూటకి ఇక్కడే పడుకుండిపో" అని ఓ పరిష్కారాన్ని చెప్పింది సరస్వతి.
"అమ్మ తిడుతుంది."
"మరెలాగా? మీ చిన్నాన్న గాఢనిద్రలో వున్నాడు. లేపితే విసుక్కుంటాడు" అని సరస్వతి ఆలోచనలో పడింది.
అపుడే సినిమా అయిపోవడంతో స్విచ్ లన్నీ ఆపి బయటికి వచ్చాడు భరణి. సరస్వతి ఇంటికి ఎదురుగానే చిత్ర ఇల్లు.
"భరణి కాబోలు. ఉండు. అతన్ని తోడుగా పంపిస్తాను" అని సరస్వతి అతన్ని రమ్మన్నట్టు పిలిచింది.
అతనొచ్చాడు.
"ఈమె ఇందుమతి- మా అక్కకూతురు. చూసేవుంటావ్. ఇంటి వరకు తోడుగా వెళ్ళి దిగబెట్టిరావా" అంది వేడుకుంటున్నట్టు.
"అలానే" ఇద్దరూ బయల్దేరారు.
ఆ నిశ్శబ్దంలో ఆ చీకట్లో ఓ అమ్మాయితో నడుస్తుంటే అతనికి తన యవ్వనానికి అందంతో హారతి పడుతున్నట్లుంది.
ఆమెకీ ఏదోగా వుంది. ఓ అబ్బాయి పక్కన అంత రాత్రిపూట పక్కపక్కన నడుస్తుంటే గమ్మత్తుగా అనిపించే మాస్కులైన్ ప్రాగ్రన్స్ తనను చుట్టేస్తున్నట్టు తోస్తోంది. శరీరం కొత్త పులకరింతను నేర్చుకుంటోంది.
ఆమె అప్పుడప్పుడు కనుపాపల్ని మాత్రమే పక్కకు తిప్పి అతన్ని చూస్తోంది. అతను మాత్రం అప్పుడప్పుడు ఆమెవైపునుంచి దృష్టి మరల్చుకుని పక్కకి చూస్తున్నాడు. చిట్టచీకట్లో అయినా వెలిగిపోతున్న ఆమె అందాన్ని చూసి అతను ఎగ్జెయిట్ అయి, ఆ అనుభూతినంతా గుండెల్లో భద్రంగా దాచుకుంటున్నాడు. ఎగిసిపడే సముద్రాన్ని కన్రెప్పల మధ్య బిగించినట్టు పుక్కళింతలౌతున్న ఆమె అందాన్ని ప్రశాంతంగా చూస్తున్నాడు.
అంతలో ఇల్లు వచ్చేసింది. ఆమె లోపలికెళ్ళబోతూ ఆగి, తల తిప్పి "థాంక్స్" అంది.
తన చెవుల్లో ఎవరో మాటల అమృతాన్ని పోసినట్టు ఫీలయిన అతను "వెల్ కమ్" అన్నాడు ఆమె లోపలికి వెళ్ళిపోయింది. అంతవరకు ఆమె అందాల్ని చూడడానికి సాగిన తన కంటి రెటీనాను మళ్ళీ కుదించుకుని అతను వెనక్కి తిరిగాడు.
అలా వాళ్ళిద్దరి పరిచయాన్ని అద్భుతంగా మలిచిన గొప్పతనమంతా ఆ రాత్రిదే. కాటుక నలుపుతో తనను తాను సాక్షాత్కరించుకున్న జీకటిదే.
ఇంటికి వెళ్ళడానికి ప్రాబ్లమ్ లేకపోవడంతో ఆమె తరచూ సినిమాలు చూస్తూ నిలిచిపోయేది. సినిమా అయిపోయాక ఆమెను తన ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చేసేవాడు భరణి.
ఓ రోజు రాత్రి యథాప్రకారం వాళ్ళిద్దరూ వెళ్తుండగా ఆమె కుక్కమీద పడబోతూ ఆయంతో చిన్న జర్క్ ఇచ్చింది. ఆ భయంలో ఏం చేస్తుందో తెలియని స్థితిలో ఇందుమతి అతని చేతిని గట్టిగా పట్టుకుంది.
జీవితంలో మొదటి పురుష స్పర్శ. అతని చేతిని వెంటనే వదిలేసింది గానీ ఆ స్పర్శ తాలూకు అనుభూతి ప్రతి జీవకణంలోనూ కొత్త అనుభూతిని నింపింది.
శరీరమంతా సుఖంతో మొద్దుబారిపోయినట్లనిపించింది. గుండెకు అదే పనిగా కొట్టుకోవడమే కాదు. అద్భుతంగా వెచ్చటి ఆవిర్లను ఒంటికంతా ప్రవహించజేసే టెక్నిక్ కూడా తెలుసునని మొదటిసారిగా బోధపడింది. అంతవరకు అలంకారప్రాయంగా తోచే ఎద ఆ సమయంలో ఎక్కడెక్కడో చిచ్చుపెట్టే పూల స్విచ్ ల్లా అనిపించాయి.
పూల బరువుకి తాళలేక చిన్నగారి సోకగానే తనను తాను విదిల్చుకున్న పొదరిల్లులా వక్షస్థలం అనిపిస్తుంటే ఆమె సిగ్గునంతా బుగ్గల్లో దాచుకుంది. నడుం అయితే మరీ నంగనాచిలా ఏమీ తెలియనిదానిలా వెర్రి వేషాలు వేసినా పాపం నటించడానికి తెలియని బొడ్డు మాత్రం ఆ అనుభూతికి గజ్జెల డప్పులా మోగినట్టు అనిపించింది. మిగిలిన అవయవాలు కూడా తమ శక్తి మేరకు ప్రకంపనాలకు గురైనా వాటిని పదాల్లోకి అనువదించుకోవడానికి ఆమె ఆడతనం అనుమతివ్వలేదు.
అతని పరిస్థితి అంతే.
పాతికేళ్ళ వయసు పాలపీక తీసేసిన పసిపిల్లాడికి మల్లే అల్లరి చేస్తుంటే అతను ఆమె చేయి మళ్ళీ తగులుతుందేమోనని తడిమాడు. భుజాల్ని మరికాస్త జరిపాడు. మనిషంతా ఆమెవైపు జరిగాడు.
కానీ ఆమె మూడు అడుగుల దూరంలో పన్నీటి జలపాతంలా కదిలిపోతుంటే చూస్తుండడం మినహా ఏమీ చేయలేకపోయాడు.