Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 3

    "కొంచెం ఆగు, పాపా! కరాటేలాంటి విద్యల్లో శిక్షణపొందినంత మాత్రాన మగాడిని ఎదిరించి నిలువగలదా స్త్రీ?" సాలోచనగా అంది.

    "ఎందుకు నిలువలేదు, ఆంటీ? మగాడు ఆడదాని బలహీనత ఆధారం చేసుకొనేగా ఆమెను దోచుకొంటున్నది?"

    బ్రష్షుమీద పేస్ట్ వేసుకు వచ్చిన అజయ్ అందుకున్నాడు ఉత్సాహంగా, "ఆడవాళ్ళు కరాటే నేర్చుకాగానే మగాడిని చిత్తుగా తనని పాదాలమీద పడవేసుకోగలరనా నీ భ్రమ? కరాటే నేర్చుకాగానే అతడి కొమ్ములు వంచగలరా?" ఆడవాళ్ళపట్ల తనకున్న చులకన భావాన్నంతా ఆ మాటల్లో వ్యక్తం చేశాడు.

    "కొమ్ములు వంచడం కాదు, కొమ్ములు విరిచేయగలరు!" కసిగా అంది ప్రేమీ.

    "ఈ మధ్య నేను చదివిన వార్త ఒకటి చెప్పనా? ఓ ఇంట్లో దొంగ ఉన్నాడని తెలుసుకొన్న ఓ ఆడ పోలీసాఫీసరు తన పోలీసు బలగాన్ని బయట ఉంచి ఆ ఇంట్లోకి గబుక్కున దూరుతుంది. అరగంట తరువాత చిరిగినా పాంట్ తో పీలికలైన షర్టుతో జుట్టు ఊడిపోయి ఏడుస్తూ బయటికి వస్తుంది. ఆ ఇంట్లో ఏం జరిగి ఉంటుందో నేను చెప్పక్కరలేదనుకొంటాను" నవ్వసాగాడు అజయ్.

    ఆ ఆడ పోలీసాఫీసరుకి జరిగినా అవమానమేదో తనకే జరిగినట్టుగా, అజయ్ హేళన చేసేది తనకే జరిగినట్టుగా, అజయ్ హేళన చేసేది తననే అన్నట్టుగా కందిపోయింది ప్రేమీ ముఖం.

    "దేవుడు మీకింక పశుబలం ఎందుకిచ్చాడో అర్ధం కావడంలేదు!" మంటగా అంది.

    "అందుకే మమ్మల్ని మగాళ్ళన్నారు! మీరెంత చేసినా, ఎంత నేర్చినా మగాళ్ళని మించడం కాదు, వాళ్ళను సరితూగను కూడా లేరు!"

    "పశుబలమొక్కటే మీ గొప్పదనమైతే మిమ్మల్ని పశువులతో జమ కట్టెయ్యాలి! 'మగాడు' అనడం కాదు 'మనిషి' అనిపించుకోడానికి కూడా తగడు!"

    "ఆవేశపడకు, పాపా! ఆ లొంగడం, లొంగదీసుకోవడంలోనే ఉంది సృష్టిచిత్రం! అందులోనే ఉందెంతో అందం!"

    "నా పేరు పాపకాదు! ప్రేమికారాణి!" బుసకొట్టినట్టుగా అంది.

    "నీ కొచ్చే మొగుడు పిలుస్తాడులే ఆపేరు! మాకు పాపగానే ఉండు!" తల్లికి తెలియకుండా కన్నుగీటుతూ ద్వందార్ధంగా అన్నాడు.

    ఒళ్ళంతా కారం రాచుకొన్నట్టుగా అయింది ప్రేమీకి. "ఆంటీ! అజయ్ ప్రవర్తన గమనిస్తున్నారా? ఇదేమన్నా మర్యాదగా ఉందా?" సువర్చలమీద విరుచుకుపడింది.

    "చాతనైతే నాతో ఢీకొట్టు! కరాటేనేర్చుకొని మగాళ్ళని ఎదిరించాలని చెప్పే సాహసవనితవి! మమ్మీని ఆసరా చేసుకొంటావేం?" ఎగతాళి చేశాడు. ప్రేమీని రెచ్చగొట్టడంలో అతడికి చిత్రమైన హాయి లభిస్తూంది!

    "నువ్వు ఆంటీ కొడుకువి కాకుండా మరొకడివి అయితే నీ పళ్ళు ఎప్పుడో నాచేతిలో రాలేవి!"

    అజయ్ చెయ్యి పైకి లేచింది.

    "ఆ చెయ్యి మర్యాదగా దించు!" నిప్పులు చెరుగుతున్నట్టుగా అంది ప్రేమీ.

    "అజయ్! నువ్వు వెళ్ళిక్కడనుండి!" సువర్చల గొంతు ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది.

    "ఏమిటి, మమ్మీ ఈవిడ గొప్ప?"

    "నిన్ను వెళ్ళమన్నానా?"

    అయిష్టంగానే కదిలాడు అజయ్.

    "పాపా అంటే కోపమా?" సువర్చల ప్రేమీకేసి తిరిగింది.

    "మీరు పిలిస్తే నాకేం కోపంలేదు! మీరు ఇవాళ క్రొత్తగా పిలవడం లేదు, పాపా అని. చిన్నప్పటినుండి నన్ను మీరు అలాగే పిలుస్తున్నారు! కాని, అజయ్ 'పాపా' అనిపిలిస్తే అసహ్యంగా ఉంటుంది నాకు!"

    "చిన్నప్పటినుండి అజయ్ కి కూడా నిన్ను 'పాపా' అని పిలవడమే అలవాటు. "నవ్వుతూ చూసింది. "నువ్వు ఇంత పెద్దదానివి ఎప్పుడైపోయావా అని అప్పుడప్పుడూ నాకు ఆశ్చర్యమేస్తూ ఉంటుంది! చిన్నప్పుడు రామచంద్రతో, అజయ్ తో ఆడుకొన్న ఆ పాపవేనా అనుకొంటాను. చిన్నప్పుడు 'ఎత్తుకో' అంటూ అజయ్ కేసి, రామచంద్రకేసి  చేతులు చాచేదానివి! వాళ్ళు ఎత్తుకొంటే చెప్పలేనంత సంతోషం వేసేది నీకు! కేరంతలు కొట్టేదానివి వాళ్ళ చంకలో కూర్చొని! నీకు జ్ఞాపకముందా?"

    "ఒంటిమీద బట్ట ఉన్నా లేకపోయినా సిగ్గుపడని ఆవయసు జ్ఞాపకముండకపోవడమే మనిషిని లజ్జనుండి కాపాడుతుంది, ఆంటీ!"

    "అజయ్ నీకంటే ఎనిమిదేళ్ళు పెద్ద! వాడికళ్ళముందు పెరిగావునువ్వు! వాడికంటికి నువ్వు పాపగా కనిపిస్తే వాడితప్పు కాదు. అజయ్ ని అవవసరంగా అపార్ధం చేసుకోవద్దు!"

    "ఆంటీ, మీకు నేనంటే ఎంతప్రేమున్నా అది మీ కొడుకు తరువాతేనని తెలుసు!" తలొంచుకుని, అభిమానంగా అంది ప్రేమీ.

    "అబ్బా! ఎంత ఉక్రోషం తల్లీ?" సువర్చల గారం చేస్తున్నట్టుగా ప్రేమీచుట్టు చేతులువేసి దగ్గరికి తీసుకొంది "పోనీ, ఆ సంగతి! ఇందాకటి విషయానికి వద్దాం! స్త్రీ కరాటే కత్తిసాములు నేర్చుకొని మగాడినుండి తనను రక్షించుకోవాలని కదా నువ్వు చెప్పేది? తనచుట్టూ క్రూరజంతువులు తిరుగుతూంటే ఏ ప్రాణి అయినా ఎంతవరకు అప్రమత్తంగా ఉంటుంది? ఎంత వరకు తనను రక్షించుకొంటుంది? మనిషికి నిశ్చింత చాలా అవసరం పాపా! ప్రతిక్షణం పోరాడే మనిషికి నిశ్చింత ఉంటుందా? నిశ్చింత లేకపోతే మనిషి ఒక్కడుగుకూడా ముందుకు వేయలేడు? ఎదిరించే దృక్పధం మంచిదికాదు! పురుషుడి పశుప్రవృత్తిని నాశనం చేసేందుకు ప్రయత్నించాలి! అతడిలో సహృదయతకు దోహదం చేయాలి! పురుషుడితో శత్రుత్వంకంటే స్నేహమే ఎక్కువ లాభిస్తుంది స్త్రీకి!"

 Previous Page Next Page