Previous Page Next Page 
ప్రేమికారాణి పేజి 2

    ప్రేమీ నాలుగు సందులు దాటి ఒక పెద్ద బంగళాలో ప్రవేశించింది. "ఆంటీ లేచారా?" వాకిట్లో కనిపించిన పనిమనిషిని అడిగింది.

    "లేవనట్టున్నారు! రాత్రి అయ్యగారు వచ్చారు ఢిల్లీ నుండి! రాత్రి చాలాసేపు మాట్లాడుకొంటూ కూర్చొన్నారు!"

    ప్రేమీ హాల్లో ఓ సోఫాలో కూర్చొంది. అంకుల్ వచ్చారని తెలియకపోతే పైకి వెళ్ళి ఆంటీని లేపేది! ప్రేమీకి ఆ ఇంట్లో ఎక్కడికి వెళ్ళాలన్నా సంకోచించే స్థలంలేదు. చివరికి ఓరకంటితో వికారమైన భావాలు అందించే అజయ్ గదిలోకి కూడా నిస్సంకోచంగా వెడుతుంది. ఆ ఇంట్లో పనిచేసే అప్పలమ్మ దగ్గరి నుండి ఇంటి యజమాని రఘురామయ్యగారి వరకు చనువుగా, స్నేహంగా ఉంటుంది!

    పది నిమిషాలు గడిచాయి. పై నుండి ఎవరూ దిగిరాలేదు. ప్రేమీకి తీరిక చిక్కినట్టుగా అనిపించి, బాగ్ లోంచి కాగితాలు బయటికి తీసి రాత్రి వ్రాసింది ఒకసారి చదువుకొంది విమర్శగా. నిన్న రాత్రి సాయంకాలం చెప్పింది సువర్చల ఆంటీ. "రేపు మహిళా మండలి వార్షికోత్సవం కదా! ఏదైనా మాట్లాడాలి! స్త్రె సమస్యల మీద ఓ పదినిమిషాలు మాట్లాడేట్టు వ్రాసుకురా! ప్రొద్దున్నే తెచ్చావంటే నాకు చూచుకోడానికి టైముంటుంది! తొమ్మిది దాటితే ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తారు! ఈలోగా అయితే ఎవరూ రారు!"

    సువర్చల ఒక మహిళా మండలికి, ఒక క్లబ్బుకి ప్రెసిడెంట్. ఎప్పుడూ ఏవో సభలూ, సమావేశాలూ అవుతూనే ఉంటాయి! ఆమే ఏదో మాట్లాడవలసి వస్తుంది. సువర్చల మంచి వక్త. కాని, అప్పటికప్పుడు తోచింది మాట్లాడడంకాక ముందుగా ఆ మాట్లాడవలసింది పేపరు మీద ఒక పద్దతిగా వ్రాసుకొని దాని ప్రకారం ప్రిపేరవుతుంది. అలాంటప్పుడు ప్రేమీకి అప్పగిస్తుంది, ఆ మాట్లాడవలసింది పేపరు మీదపెట్టే పని! అయితే సువర్చాలకి ఆయా విషయాల్లో అవగాహన లేదనికాదు! ఈమధ్య ఏదైనా వ్రాసుకోవాలంటే ఓపిక తగ్గిపోయిందంతే! ఆ ఓపిక తగ్గడానికి సగం కారణం ప్రేమీ. ప్రేమీకి వ్రాయడంలో మంచి ఆసక్తి ఉంది! ఏ టాపిక్ మీదైనా చక్కగా వ్రాస్తుంది! కొన్ని కొన్ని భావాలు విప్లవాత్మకంగా ఉన్నా అవి ఈనాటికి సమాజానికి అవసరమే అనిపిస్తాయి! కొన్ని కొన్ని రోగాలకి కడ్డీ కాల్చి వాతలు పెడుతుంటారు వైద్యులు! ఈ సమాజానికి పట్టిన కొన్ని రోగాలకి వాతలు పెట్టినట్టుగా వ్రాస్తుంది ప్రేమీ.

    మెట్లమీద స్లిప్పర్ల శబ్దం వినిపించి ప్రేమీ తలెత్తింది. "గుడ్ మార్నింగ్, ఆంటీ!"

    "వెరీ గుడ్ మార్నింగ్! ఎప్పుడొచ్చావు, పాపా?" సువర్చల దిగివచ్చి ప్రేమీ ప్రక్కన సోఫాలో కూర్చొంది. కొంచెం
ఉబ్బినట్టుగా ఉన్న ముఖం, కళ్ళు నిద్రలేమిని తెలుపుతున్నాయి!

    "పది నిమిషాలు అయింది!"

    "ఇంత ప్రొద్దున్నే స్నానం సంధ్యా ముగించుకు వచ్చావన్నమాట! గుడ్! క్రమశిక్షణ నిన్ను చూసి నేర్చుకోవాలి! వ్రాశావా?"

    "వ్రాశాను. మీరు ముఖం కడుక్కు వస్తే నేను చదువుతాను."

    "ముందు చదువు. తరువాత ముఖం కడుక్కొంటాను!" బద్దకంగా సోఫాలో ఒరిగి కూర్చుంటూ అంది.

    "ఇంతకు ముందేగా క్రమశిక్షణ నన్ను చూసి నేర్చుకోవాలంది? ముఖం కడుక్కు రండి, ఆంటీ! హార్లిక్స్ కలిపి ఇస్తాను! త్రాగుతూ విందురుగాని!"

    "రాత్రి సరిగా నిద్రలేదు. సుస్తీగా ఉంది, పాపా!"

    "కొత్త పెళ్ళికొడుకులా అంకుల్ మిమ్మల్ని నిద్రపోనివ్వలేదా, ఆంటీ?" కొంటెగా అడిగింది ప్రేమీ.
    "గడుగ్గాయి!" సువర్చల ముద్దుగా ప్రేమీ నెత్తిన చిన్న దెబ్బవేసింది. "పెళ్ళికాని పిల్లవి! కొత్త పెళ్ళికొడుకులు నిద్రపోనివ్వరని నీకెలా తెలుసు?"

    "పెళ్ళి కానంత మాత్రాన ఈనాటి ఆడపిల్లలకి తెలియని విషయాలేమున్నాయి? ఈనాడు వస్తూన్న సినిమాలు, పుస్తకాలు మనకి ఎన్నో తెలిసేలా చేస్తున్నాయి! సినిమాలో తప్పని సరిగా ఓ శోభనం సెట్టింగ్ ఉంటుంది! శోభనం లేకపోతే ఓ రేప్ సీన్ అయినా ఉంచుతారు. కథలో లేకపోయినా అది కల దృశ్యమైనా అవుతుంది. శోభనాలు, రేపులూ తమకి కనకవర్షం కురిపిస్తాయని సినిమా వాళ్ళ గట్టి నమ్మకం కావాలి!"

    "ఆడవాళ్ళకి ఓ చిట్కా! భర్త కొత్త పెళ్ళికొడుకులా ప్రవర్తించాలంటే గృహిణి అతడిని విరహంలో కాల్చి తరువాత దగ్గరవ్వాలి! విరహం తరువాత ఏర్పడే సమాగమం శోభనరాత్రికి మించిపోతుంది!"

    "గృహిణులకి చిట్కాలంటూ పేపరుకు పంపించండి!"

    సువర్చల విచారంగా ముఖంపెట్టి అంది! "అవును. భర్తలు ప్రేమగా చూడాలంటే, ముఖ సౌందర్యం పెంచుకోవాలంటే, పాదాలు అందంగా ఉంచుకోవాలంటే - ఈ చిట్కాల దగ్గర ఉన్నాం గనుకే మన అభివృద్ది ఇలా ఏడ్చింది, పాపా! ఏం వ్రాశావో చదువు!"

    "అనాదిగా ఈ సమాజంలో స్త్రీ ఏదో ఒక బాధకు గురి అవుతూనే ఉంది! కొన్నేళ్ళ క్రితం నాలుగు గోడలమధ్య బందీగా, పురుషుడి దయా దాక్షిణ్యాలమీదే పూర్తిగా ఆధారపడి ఉండేది! అవిద్యలో, అస్వతంత్రంలో కొన్ని తరాలుగా మ్రగ్గిపోయిన స్త్రీ ఎందరో మహానుభావుల త్యాగఫలితంగా ఈరోజు తనకంటూ ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకొంది. కాని, గడపదాటిన స్త్రీని ఎన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి? అందరూ ఒక ఎత్తు, అగస్త్యు డొక ఎత్తు అన్నట్టుగా అన్ని సమస్యలూ ఒక ఎత్తు, ఇవాళ స్త్రీలపై జరుగుతూన్న అత్యాచారాలు ఒకెత్తు! పేపరు తెరిస్తే చాలు మానభంగాలు! సామూహిక మానభంగం! పేపరు కెక్కని మానభంగం లెన్నో!

    "ఈనాడు దేశాన్ని ఒక్క ఊపు ఊపివేస్తున్నది అతివలపై జరుగుతూన్న ఈ అత్యాచారం! మగాడినుండి తనను రక్షిందుకోలేదంటే స్త్రీ పొందిన స్వేచ్ఛ, సాధించిన ప్రగతి వ్యర్ధ మనిపిస్తూంది! బయటికి వచ్చి స్వేచ్ఛకు అలవాటు పడిన స్త్రీ తిరిగి నాలుగుగోడల మధ్యకు వెళ్ళి బ్రతకలేదు! సంపాదించుకొన్న స్వేచ్ఛణు వదులుకోలేదు! అలాగని తన సౌశీల్యాన్ని కామాంధులు దోచుకొంటుంటే నిస్సహాయంగా చూస్తూ ఊరు కోవాల్సిందేనా? ఇది స్త్రీకి ఎంత అవమానకరమైన సంగతి? స్త్రీలు కత్తి సాముల్లో అతితేరి ధీరోదాత్తంగా పరిపాలన సాగించిన దేశం మనది! కత్తిసాములు నేర్చుకాకపోయినా కరాటేలాంటి విద్యల్లో శిక్షణపొంది తనను రక్షించుకోవాల్సిన సమయమిది!..."
   

 Previous Page Next Page