గ్రౌండు మధ్యకి నడిచింది సితార.
అక్కడ కనబడిన దృశ్యం భరించలేనంత వెగటు కలిగించింది.
అక్కడ చుక్కల్లో చంద్రుడిలా నిలబడి వున్నాడు జెయ్ చెంద్ర.
అతన్ని చుట్టుముట్టి బిలబిల్లాడుతూ వున్నారు ముగ్గురు మూర్ఖిణులు. వాళ్ళు గాక యింకో ముఫైమంది ఆడంగులూ.
సరే - ఆలీబాబా చుట్టూ నలభైమంది దొంగలూ వుండనే వుంటారుగా. అది తప్పనిసరి.
అక్కడున్న ఆడపిల్లలందరికి మొహాల్లో ఆదుర్దా కనబడుతోంది.
గోపికల మధ్య కిష్టయ్యలా మందహాసం చిందిస్తూ నిలబడి వున్నాడు జెయ్ చెంద్ర.
అతని చెయ్యి ముందుకి జాచి వుంది.
ఆ చేతి బొటనవేలు రక్తంతో ఎర్రగా కనబడుతోంది.
"ఏమయ్యింది?" అంది సితార విశేష్ తో జనాంతికంగా.
"క్రికెట్ బాల్ తగిలి దెబ్బ తగిలింది" అన్నాడు విశేష్ ఉరఫ్ శేషు జాతీయ నాయకుడెవరో ఫ్లయిట్ యాక్సిడెంట్ లో గాయపడిన వార్త చెబుతున్నంత ఉద్వేగంగా.
'అయ్యో పాపం' అనుకుంది సితార మనసులో.
'తిక్క తిన్నగా కుదిరింది' అని కూడా అనుకుంది కోపంగా.
ఇంతలో ముగ్గురు మూర్ఖుణులలో నిమ్మీ ముందుకి వాలిపోయి జెయ్ చెంద్ర బొటనవేలిని తన నోట్లో పెట్టుకుని రక్తాన్ని కూల్ డ్రింకులా పీల్చేసింది.
నిమ్మీని బలంగా పక్కకి నెట్టేసింది రచన. ఒక చేత్తో నిమ్మీని నెట్టేస్తూనే, రెండో చేత్తో తన పల్లూని పర్రుమని చింపి, దాంతో దెబ్బతగిలిన వేలుకి అడ్డదిడ్డంగా కట్టు కట్టేసింది.
ఈ లోపల కుయ్యోమంటూ అంబులెన్స్ సైరన్ వినబడింది.
"రండి! రండి! ఇక్కడే" అని అంబులెన్సుకి ఎదురెళ్ళింది షీలా.
ఆపద్భాంధవుల్లా అంబులెన్స్ లో నుంచి అర్జెంటుగా కిందికి దూకారు నలుగురు.
వాళ్ళతోబాటే ఒక స్ట్రెచర్ కూడా కిందికి దిగింది.
"పేషెంటు ఎక్కడా?" అన్నాడు డాక్టర్ ఆదుర్దాగా.
"ఇడిగోనండీ! యితనే" అంది షీలా.
బిత్తరపోయాడు డాక్టరు "ఇతనా? దిట్టంగా నిలబడే వున్నాడుగా" అన్నాడు అయోమయంగా.
"మీకేం తెల్సు? వేలుచితికి పచ్చడైపోయింది" అంది షీలా దుఃఖాన్ని అభినయిస్తూ.
కానీ ఆమె మోహంలో బాధకంటే విజయగర్వమే ఎక్కువ కనబడుతోంది.
ఆఫ్టరాల్ నిమ్మీ!
ఆఫ్టరాల్ రచనా!
జెయ్ పట్ల ప్రేమని ప్రకటించడంలో తను వీళ్ళిద్దరికంటే చాలా ముందు కెళ్ళిపోలేదూ?
ఎవరో అంబులెన్సు తెప్పించెయ్యలేదూ!
తనతో కాంపిటీషనా వీళ్ళకి.
"ఏదీ వేలు చూపించండి" అన్నాడు డాక్టరు యిబ్బందిగా.
"టేకిట్ ఈజీ! ఇట్సాల్ రైట్" అన్నాడు జెయ్ తనే డాక్టర్ కి ధైర్యం చెబుతున్నట్లు.
అలా అంటూనే సితార వైపు ఓరగా చూశాడతను.
వెంటనే అతని మనసు ఆర్క్ లైట్ లా వెలిగిపోయింది.
"సితారా! నా సితారా!" అనుకున్నాయి అతని పెదవులు కలుసుకోకుండానే.
అతని మనసులోని వెలుగు అతని కళ్ళలో రిఫ్లెక్ట్ కావడం కేవలం సితార కళ్ళకి మాత్రమే కనబడింది.
వెంటనే 'పరమ పోకిరీ! పోరంబోకు! పొగరుబోతు! పిచ్చోడు! పాడుమనిషి!' అని 'ప' గుణింతంవల్లె వేసింది సితార మనసు.
"దేవత, దివ్యస్వరూపిణి, దీనబంధు, దయాళువు" అని 'ద' గుణింతం చదివేసింది జెయ్ చెంద్ర మనసు.
"పనీపంగు లేని మనిషి, పంతగొండి, పశుప్రాయుడు" అని 'ప' గుణింతం పొడిగించబోయి, సగంలో మానేసి గిరుక్కున వెనక్కి తిరిగింది సితార.
అలా తిరగడంలో ఆమె తాలూకు బారెడు జడ పదతాడిత భుజంగంలా (అంటే తోక తొక్కిన తాచు అని జెయ్ చెందర్ వాళ్ళకి చెబితేగానీ అర్ధంగాదు) పొడుఘ్ఘా, నల్ లఘా కనబడింది.
"ఏమందం! ఏమందం!" అనుకున్నాడు జెయ్ చెంద్ర.
విసవిసా నడుస్తూ యింటిదారిపట్టింది సితార.
ఆమె ఎప్పుడూ నడిచే యింటికి వెళ్తుందని తెలుసు అతనికి.
పైసా ఖర్చు పెట్టాలంటే ప్రాణం ఒప్పదు సితారకి.
ఆ సంగతి అతనికి బాగా తెలుసు.
అతనికి తెల్సిన ఇంకో సంగతేమిటంటే, సితారని పట్టుకుని అన్ని విషయాలూ అడిగెయ్యటానికి ఇవాళే మంచిదని.
పంచమి పూటా మంచిదనీ ఇవాళే యిందుకు ముహూర్తం పెట్టేశాడు తను. పైగా వర్జం లేదు. రాహుకాలం అడ్డంరావట్లేదు. యమగండం కూడా లేదని సర్టిఫై చేశాడు శేషు - అదే విశేష్ ఇవాళ ముహూర్తం మంచిదేగానీ తనచుట్టూ ఎప్పుడూ తంబ వుంటుంది. వద్దన్నా వదలరు తనని.
వెంటనే చిటికెన వేలు చూపించాడు అతను అక్కడున్న వాళ్ళకి.
"అదేమిటి? ఇందాక బొటనవేలుకికదా దెబ్బతగిలిందీ?" అన్నారు అందరూ విస్తుబోయే.
"అబ్బే! దెబ్బకాదు. ఈ వేలుకి అర్ధం యింకోటి వుంది" అని రయ్ మని టాయ్ లెట్స్ వైపు పరిగెత్తి వెళ్ళిపోయాడు జెయ్ చెంద్ర.
అతను టాయ్ లెట్స్ వైపు వెళ్ళాడుగానీ టాయ్ లెట్ లోకి వెళ్ళలేదు.
వెళ్ళీ వెళ్ళగానే అక్కడున్న గోడ మీదికి ఉడుంలాగా పాకేశాడు.
టార్జాన్ లాగా అవతలి వైపుకి దూకేశాడు.
షార్ట్ కట్ కొట్టేశాడు.
రెండునిమిషాల తర్వాత సితార జడ అతనికి కనబడింది.
ఆమెని అందుకోవడానికి పరుగులాంటి నడక మొదలెట్టాడు.
అతగాడు తన వెనకే వచ్చేస్తున్నాడని తెలుసు సితారకి.
'హు! మగబుద్ది' అనుకుంది మనసులో.
ఆడపిల్ల కనబడితే చాలు ఆంబోతుల్లా అయిపోతారు.
ఛీ ఛీ!
ఛీ ఛీ ఛీ ఛీ!