Previous Page Next Page 
శతదినోత్సవం పేజి 3

   

    "మీరా, మీ అబ్బాయా?" అడిగింది కిన్నెర.


    ఈ ప్రశ్నకు అర్ధం తోచలేదు కన్నారావుకు.


    "కిన్నెర నచ్చాల్సింది మీకా, మీ అబ్బాయికా అని అడుగుతున్నాను."


    "మాకే" అనేసేవాడే కాని , ఇందాకా అస్తిత్వం , వ్యక్తిత్వం టైపు భావాలున్న అమ్మాయిగా అనిపించడంతో జాగ్రత్తపడుతూ అన్నాడు__"మా కెందుకమ్మా! కాపరం చేయాల్సింది మా అబ్బాయి కాబట్టి వాడికి నచ్చితే చాలు!"


    అమ్మాయి నచ్చింది అనేయాలనుకుంది కన్నారావు తల్లి. సాధ్యమైనంత త్వరగా తెముల్చుకోకపోతే అమ్మాయి నేడుర్కోవడం కష్టమనిపించడంతో."


    "కాపరం వరకూ వెళ్ళాలి అంటే మరి నాకు అబ్బాయి నచ్చాలిగా?"


    "అదెంటమ్మా అలా అంటావ్?" కన్నారావు తల్లి కలుపుగోలుగా అంది- "అబ్బాయికేం తక్కువ? ఎమ్మే చదువుకున్నాడు, కాలోంకర, కన్నోంకరా?"


    "అది తేల్చాల్సింది నేను!" ఖండితంగా అంది కిన్నెర.


    "అవును" వీర్రాజు కాదు. ఇప్పుడు మంగ జోక్యం చేసుకుంది. "ఇప్పుడు అమ్మాయిగారు పది నిమిషాలపాటు అబ్బాయిని ఇంటర్వ్యూ చేస్తారు."


    బిక్కమొహం వేశాడు కన్నారావు. ఇక్కడంతా రివర్స్ లో కొనసాగుతుంది.


    గోపాలరావు దంపతులు మొహాలు చూసుకున్నారు.


    "యూసీ,మిస్టర్ కన్నారావ్! మీరు చదివింది ఏమ్మే కదా!"


    సిగ్గుతో నేలచూపులు చూస్తూ "అవునండి" అన్నాడు బిడియంగా నవ్వుతూ.


    "అలా చదవడం నీచం కాదుగా, అందుచేత సిగ్గుపడకండి."


    అలర్టయిపోయాడు కన్నారావు.


    "మీ సబ్జెక్టు?"


    "మేధామేటిక్స్."

 

    "మేధామేటిక్స్ లో తప్ప మరెందులోనూ మీకు నాలెడ్జి లేదా?"


    తొట్రు పడ్డాడ. "ఎందుకు లేదు? నాకు జనరల్ నాలెడ్జి కూడా విపరితమంటారు మా స్నేహితులంతా."


    "హ్యూమన్ రేస్ లో ఫాస్టెస్ట్ రన్నర్ ఎవరు?" టక్కున అడిగింది.


    "కార్ల్ లూయిస్."


    "కాదు."


    "బెన్ జాన్సన్."


    "కాదు."


    నీరసంగా చూసాడు. "తెలీదు. ఎందుకంటే నాకు స్పోర్ట్స్ లో అంతగా పరిజ్ఞానం లేదు."


    "అది స్పోర్ట్స్ కు సంబంధించిన ప్రశ్న కాదు. కేవలం తెలివికి సంబంధించింది. ఇప్పుడైనా ఆలోచించి చెప్పగలరా?"

 

    "తెలీదు."


    "నే నన్నది హ్యూమన్ రేస్ లో ఫాస్టెస్ట్ రన్నర్ ఎవరు , అవునా? ఎడమ్!" చెప్పింది జవాబు కూడా.


    బిడియంగా చూశాడు.


    "వెల్. మరో ప్రశ్న. ఆరోగ్యవంతుడైన మనిషి రాత్రి నిద్రపోయేటప్పుడు అటూఇటూ ఒత్తిగిల్లె అవకాశముందా?"


    "ఛ...ఛ!" టక్కున అన్నాడు కన్నారావు. "ఆరోగ్యవంతుడు అన్నారుగా వాడి కేదో కండరాల జబ్బు, లెదూ మానసికమైన అశాంతి ఉంటే తప్ప అటూ ఇటూ ఒత్తిగిల్లె ప్రసక్తే రాదు."


    "రాంగ్...." ఖండిస్తున్నట్టుగా అంది కిన్నెర. "మనిషి శరీరంలోని కండరాలు ఏ పద్దతిలో అమరి ఉన్నాయీ అంటే కదలకుండా ఎక్కువసేపు విశ్రాంతి తీసుకునే అవకాశం లేదు. అంటే ఏ మనిషి రాత్రి నిద్రలో ఒకే పద్దతిలో ఎక్కువసేపు పడుకోలేడు. వైద్య శాస్తం ప్రకారం ఓ రాత్రిలో సగటున ముప్పై అయిదుసార్లు తన పొజిషన్ మారుస్తాడు ఏ వ్యక్తయినా...."


    కన్నారావుకు ముచ్చెమటలు పోస్తున్నాయి.


    "ఓ.కె......మీ సబ్జెక్టు మేధామేటిక్స్ గురించి అడుగుతాను. నాలుగు 'ఒకట్ల'తో రాయగల పెద్ద నంబరు చెప్పండి."


    "ఒక వెయ్యి నూట పదకొండు" అన్నాడు టక్కున.


    "మీరు కంగారులో చెబుతున్నారో, అసలు మీరు మాథ్స్ పోస్టు గ్రాడ్యుయేట్ అవునో , కాదో అర్ధం చేసుకోలేకపోతున్నాను. నాలుగు ఒకట్లతో రాసే పెద్ద నంబర్ ఒక వెయ్యి నూట పదకొండు కాదు. 285311670611."


    "అదెలా?" అదిరిపడినట్టుగా చూశాడు కన్నారావ్.


    "నేను నాలుగు ఒకట్లతో రాయగల పెద్ద సంఖ్య గురించి అడిగాను. ఇప్పుడు నేను చెప్పింది లెవన్ టు ది పవరాఫ్ లెవన్"


    కన్నారావు దేభ్యం మొహం వేసుకుని చూశాడు.


    బంగారం లాంటి సంబంధం చెడిపోవడం మాత్రమే కాదు, బాహాటంగా కొడుకును బడుద్దాయిగా నిరూపిస్తుంది కొన్నేర. "నీ మొహం మండ! ఆలోచించి చెప్పరా!" నెత్తిమీద మొట్టబోయింది గాని, చాలా నిగ్రహించుకుంది కన్నారావు తల్లి.


    "చూడు మిస్టర్ కన్నారావ్! కంగారుపడకుండా జవాబు చెప్పాలి. ఒక లీటరు సీసా తీసుకున్నాం. దాని కొలతల్ని ఖచ్చితంగా రెట్టింపు చేశాం. చెప్పండి. ఆ కొత్త సీసాలో ఎన్ని లీటర్ల పాలు పోయగలం? ఆ సీసా క్యూబ్ రూపంలో ఉంది పైగా."


    "సింపుల్!" ఇంత సేపటికి ఓ ప్రశ్నకు సరైన జవాబు చెప్పగలుగుతున్నందుకు అనందం.....


    "రెండు లీటర్లు."    


    "ఏడ్చినట్టుంది!" కిన్నెర కంఠంలో వ్యంగ్యం మాత్రమే కాదు, కోపం కూడా ధన్వించింది. "ఎనిమిది లీటర్లు అన్నది కరెక్ట్ జవాబు. ఎందుకంటే మన పరిమాణానికి మూడు కొలతలు ఉంటాయి. రెట్టింపు అంటే 2x2x2 అనగా ఎనిమిది లీటర్లు.'

 Previous Page Next Page