కుర్చీలో కూర్చుంటూ అన్నాడు మోహన్.
రేఖ కొంచెం ఆశ్చర్యంగా చూసింది.
"కొంచెంసేపు స్థిమితంగా కూచుని మాట్లాడాలని రూం బుక్ చెయ్యమన్నాను. అంతే?"
"మీ ఇంటికే వచ్చేదాన్నిగా........."
"నా ఇంటికి నా ఫ్రెండ్స్ ఎవరయినా వస్తూ వుంటారు......"
తనలాటిది ఇంటికి రావటం మోహన్ కి అవమానం, మండింది రేఖకు. అక్కసు అణచుకొని నవ్వుతూ__
"ప్రసూన రాలేదా?" అంది.......
రేఖ ఆశించినట్లే ఆవిడ ప్రయోగించిన బాణం మోహన్ మనసులోని సున్నితమైన భాగాన్ని గాయపరిచింది. కానీ వెంటనే కోలుకొని "నాతో ఏం మాట్లాడాలని రమ్మన్నారు?" అన్నాడు.
రేఖ వాలుగా చూసి సిగ్గు పడింది.
"మీరు రాకముందు ఎన్నెన్నో చెప్పాలనుకున్నాను. మిమ్మల్ని చూడగానే అన్నీ మరిచిపొయాను."
"గుర్తు చేసుకోండి?"
సిగరెట్టు వెలిగించుకుని రేఖను పరిశీలనగా చూస్తూ అన్నాడు.
ఆ చూపులకు రేఖలాంటిది కూడా ఇబ్బందితో కదిలింది. వాటిల్లో లాలస లేదు. అవి పరీక్షిస్తున్నాయి. శరీరాన్ని అధిగమించి అంతరంగాన్ని శోధిస్తున్నాయి.
"అహ! లాభంలేదు. మీముందు నాకు మతిపోతోంది!" నవ్వింది రేఖ.
"అయితే వెళ్ళిరానా?"
లేచాడు మోహన్.
"అప్పుడే....."
మోహన్ భుజాలు పట్టుకుని కూర్చోబెట్టబోయింది. విదిలించాడు మోహన్. రేఖ సహించలేక పోయింది. తనకు సహజమయిన నటన మరచిపోయి నిజంగా బయట పడిపోయింది.
"మీ కెందుకు నేనంటే చికాకు? ఎవడో వెధవతో తన్నులు తింటూ ఏ గుడిసెలోనో జీవచ్చవంలానో పడివుంటే పతివ్రతనని మన్నించేవారా? నా ఖర్మాన నేను సుఖంగా బ్రతుకుతున్నందుకు యీసడిస్తున్నారా!"
"నాకు ఎవరిమీదా ఎలాంటి చిరాకు లేదు మరొకరి వ్యక్తిగత గుణగణాలు నాకు అనవసరం నేను మిమ్మల్ని యీసడించటం లేదు. యీసడించను."
"మరి..........?"
"నా జాగ్రత్తలో నేనుంటున్నాను......"
అదిరిపోయింది రేఖ. ఆ 'జాగ్రత్త' అనే మాటకు ఎన్ని అర్దాలైనా వున్నాయి.
మళ్ళీ వెనుకటి బాణమే ప్రయోగించబోయింది.
"అయితే ప్రసూన విషయంలో కూడా ఇలాంటి జాగ్రత్తలోనే వుంటున్నారా?"
ఈసారి సహించలేకపోయాడు.
"ప్లీజ్! ప్రసూన పేరు ఎత్తకండి?"
"ఏం?"
"మీనోట ఆవిడ పేరు వినలేను!"
ఆపాదమస్తకమూ భగ్గుమంది రేఖకు.
చిలిపిగా నవ్వుతూ "సరేలెండి! మీ మాట కాదనను. నామీద కోపం లేదుగా!" అంది.
"లేదు. కోపం తెచ్చుకునేంత సాన్నిహిత్యం మన మధ్య ఎందుకుంటుంది!"
"భలేవారండీ! ఇందు కేనేమో, నాకు మీరంటే అంత ఇష్టం."
"ఇంతకు మించి మాట్లాడేదేమీ లేదా?"
"వుంది!"
"చెప్పండి!"
"మిమ్మల్ని చూడకుండా నేను బ్రతకలేను. కనీసం రెండు రోజుల కొకసారైనా నాకు కనపడండి!"
మోహన్ రేఖ ముఖంలోకి చూస్తూ నవ్వాడు.
"అలాగే! తప్పకుండా! వస్తాను"
మోహన్ లేచి బయటకు వస్తూ ఒక్కసారి ప్రసూన గదిలోకి చూశాడు. టేబిల్ మీధ తల ఆనించి ఏడుస్తోన్న ప్రసూనను చూడగానే అతని కాళ్ళు ఆగిపోయాయి. ఒక్క అడుగు ముందుకు పడింది. అంతలోనే అడుగు వెనక్కు తీసుకుని గబగబ వెళ్ళిపోయాడు.
ఏడుస్తోన్న ప్రసూనను చూస్తే శేఖర్ కూ జాలికలిగింది. అన్ని సంగతులూ ఎప్పటికప్పుడు తెలుసుకోగలిగిన శేఖర్ కు ప్రసూన అంతగా కుమిలిపోవలసిన అవసరం లేదని తెలుసు. కానీ ఆ సంగతి ప్రసూనతో చెప్పలేకపోయాడు చెప్పటానికి సాంబశివం అనుజ్ఞ లేదు!