మోహన్ చిరంజీవి రాకకోసం ఎదురు చూస్తున్నాడు.
చిరంజీవి చాకులాటి కుర్రవాడు. చెప్పిన పని చక్కగా నిర్వహించుకొస్తున్నాడు. హోటల్ లోటస్ లో చిరంజీవిపైన ఎవరికీ ఎలాటి అనుమానము లేదు. ఆకారణంగా మోహన్ కు మరింత ఉపయోగంగా ఉంది. సాంబశివం గదిలో టేబుల్ మీధ అలారం టైంపీస్ ఒకటుంది- చిరంజీవి సహకారంతో సరిగ్గా అలాంటి టైంపీస్ తెప్పించగలిగాడు. మోహన్ తెప్పించిన టైంపీస్ లో టేప్ రికార్డర్ ఫిక్స్ అయిఉంది.
పేపర్లు అన్ని గదులలో ఇస్తూ చనువుగా తిరిగే చిరంజీవి అనుకూలం చూసుకొని ఆ టైంపీస్ లు మార్చి మోహన్ కు సహాయం చేస్తున్నాడు. ఇదివరలో శేఖర్ సాంబశివంల సంభాషణ మోహన్ రికార్డు చెయ్యగలిగింది ఈవిధంగానే!
చిరంజీవి ఉత్సాహంగా వచ్చాడు. టైంపీస్ తీసి మోహన్ ముందు ఉంచి "ఇదుగో సార్!" అన్నాడు - - మోహన్ "థేంక్యూ!" అని జేబులోంచి వంద రూపాయలు తీసి చిరంజీవి కిచ్చాడు.
చిరంజీవి సంతోషంథొఇ తీసుకుని "ఒక్క సూటు కుట్టించుకోవాలని డబ్బు పోగుచేసుకుంటున్నాను సార్! ఇంకొక వంద పోగుచేస్తే చాలు - -" అన్నాడు.
"సూట్ దేనికి?"
"నేను ప్రెసిడెంట్ ను అయ్యాక మా వాళ్ళంతా నాకు పార్టీ ఇస్తామంటున్నారు సార్! ఆ పార్టీకి సరదాగా సూటు వేసుకోవాలని ఉంది__"
పసితనపు అమాయకత్వంతో వింతగా వెలుగుతోంది చిరంజీవి ముఖం___
"పోని, నేనిస్తాను ఆ వంద తీసుకో!__"
"వద్దు సార్! మీకు సుఖంగానే ఉంటుంది. కానీ దానంగా తీసుకోవడం ఇష్టం ఉండదు- సాధారణ ఋణాలు ఎలాగైనా తీర్చుకోవచ్చు, కాని ఈ దయాఋణాలనుండి బయట పడడం కష్టం- ముందు ముందు దీనికి చెప్పించుకొవలసిన మూల్యం ఎలా ఉంటుందో ఊహించుకోలేము__"
ఉలికి పడినట్లయ్యాడు మోహన్- చిత్రంగా చిరంజీవి ఏం మాట్లాడినా తనకు తాకుతోంది.
"వస్తాను సార్! ప్రసూనగారిని కూలిపేటకు తీసుకెళ్తానన్నాను___"
"ప్రసూన రోజూ కూలిపేటకు వస్తూందా!"
"వస్తున్నారు సార్! పరమేశ్వరిగారితో సమంగా పనిచేస్తున్నారు. ఆవిడ చాలా మంచిది సార్!"
మోహన్ నవ్వాడు.
"ఇవాళ నేనూ వస్తాను పద!" అన్నాడు.
వచ్చీ రాణి వయసులో ఉన్న చిరంజీవికి ఏదో అర్ధం కాసాగింది__ అల్లరిగా "నన్ను రావద్దంటారా సార్! ప్రసూనగారిని మీరే తీసుకెళ్తారా?" అన్నాడు.
మోహన్ ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసి అంతలో తనూ నవ్వేశాడు.
"అబ్బే! అదేం లాభంలేదు. నువ్వూ ఉండవలసిందే! ఉండక్కరలేని రోజు వస్తే నేనే రావద్దని చెప్తాను."
పకపక నవ్వాడు చిరంజీవి.
మోహన్ తను కారులో బయట కూర్చుని చిరంజీవిని లోపలకు పంపించాడు ప్రసూనకోసం___
చిరంజీవికి చాలా హుషారుగా ఉంది.
"ప్రసూనగారూ! బయట మీకోసం ఎవరు ఎదురు చూస్తున్నారో చూడండి!" అన్నాడు.
"ఎవరూ" అంది ఆశ్చర్యంగా __
"నేను చెప్పను. మీరే వచ్చి చూడండి."
"నా కెవర్నీ చూడాలని లేదు మరొకళ్ళని ఎందుకు తీసుకొచ్చావ్? చేస్తున్న ఈ కాస్త పనికే పబ్లిసిటీ కావాలా ఏం?" అంది విసుగ్గా కనుబొమ్మలు చిట్లించి____
"ఇంత విసుక్కుంటున్నారు కాని బయటి కొచ్చి చూస్తే నాకు థేంక్సు చెపుతారు."
"ఎవరబ్బా అంతటి మహానుభావులు" అంటూ బయటి కొచ్చిన ప్రసూన మోహన్ ను చూసి నిలబడి పోయింది.
కారు ఫ్రంట్ డోర్ తెరిచి "రండి!" అన్నాడు మోహన్ అతి మామూలుగా___
"రాను." అనలేకపోయింది ప్రసూన- వెళ్ళి కూర్చుంది. చిరంజీవి ప్రసూనను మోహన్ ను కుతూహలంగా గమనిస్తూ మాట్లాడకుండా కూర్చున్నాడు__
"నిన్న రేఖతో మాట్లాడారా?" అతి మామూలుగా అడగాలని అనుకునా అక్కను దాగలేదు. ప్రసూన కంఠంలో__
"ఆ! మీకు తెలుసుగా! ఇంతాచేసి ఆమె అన్నదేమిటో తెలుసునా?"
"నా కెలా తెలుస్తుందీ?"