రేఖ......మోహన్ ని కలుసుకోవటం..... ప్రసూన మనసు మెలిపడసాగింది.
"నే నెందుకు? నువ్వే ఫోన్ చెయ్యరాదూ?"
"నాకు భయం! ఆయన దగ్గిర నీకున్నంత చనువు నాకులేదు"
రేఖ "నాకు భయం" అన్నందుకు ప్రసూన ఆశ్చర్య పడలేదు. ఎదుటి వ్యక్తులలో అవ్యక్తమైన భయాన్ని కలిగించే లక్షణమేదో మోహన్ వ్యక్తిత్వంలో ఉంది.
"అలాగే చేస్తాను........." అంది.
రేఖకోసం మోహన్ కి ఫోన్ చెయ్యటం ప్రసూనకు ఆనందం కలిగించే విషయమేమీ కాదు. కానీ ఆవేదనకు మించిన కుతూహలం- మోహన్ సమాధానం తెలుసుకోవాలని- మోహన్ కి ఫోన్ చేసింది.
"రేఖ మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటుంది- అపాయింట్ మెంట్ ఇయ్యగలరా?"
"అలాగే! ఇవాళ సాయంత్రమేవస్తాను. మీ హోటల్ లోనే ఒక రూం బుక్ చెయ్యమనండి- నేను పే చేస్తాను."
"థేంక్స్!" అని పెట్టేసింది-
ఒక్క క్షణం నవనాడులూ క్రుంగిపోయాయి ప్రసూనకు-
"ఛ నేను రేఖను కలుసుకోలేను-" అనలేదు మోహన్ పైగా రూం కూడా బుక్ చెయ్యమన్నాడు.
"ఏమన్నాడు?" అని కుతూహలంగా అడిగిన రేఖకు సాధ్యమయినంత నిగ్రహంతో మోహన్ మాటలు చెప్పింది.
పైకి ఎంత నిర్లిప్తంగా ఉన్నా ప్రసూన మనసులో చెలరేగే ప్రళయాలు రేఖకు అర్ధంకాక పోలేదు. లోలోపల కలిగే ఆనందాన్ని అణచుకుంటూ నిట్టూర్చి "ఇవాళనుండీ ఇదొక నాటకం" అనుకుంటూ లేచింది.
జరిగిన సంగతులన్నీ సాంబశివానికి తెలిశాయి. చాల ఆనందించాడు ఆ ఆనందంలో రేఖను పిలిచి "కంగ్రాట్యు లేషన్స్" కూడా చెప్పాడు.
రోజూ సాయంత్రం నాలుగవగానే ప్రసూన వెళ్ళి పోతుంది. ఒక్కొక్కరోజు అంతకంటే ముందు కూడా వెళ్ళి పోతుంది. ప్రసూన ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు వచ్చినా అడిగేవాడు లేడు. ఆ రోజు అయిదు దాటినా ప్రసూన కదలలేదు. సాంబశివం ప్రసూన దగ్గిరకొచ్చి "ఇంకా వెళ్ళలేదేం?" అని అడిగాడు.
"ఊరికేనే!" అంది ప్రసూన.
ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు సాంబశివం.
ఆ రోజు శేఖర్ కూడా ఉండిపోయాడు. సుశీల తమ ఇంటికి వస్తానంది. తనేమో ఇక్కడ చిక్కుబడి పోయాడు, ప్రసూనను కనిపెట్టి చూడమనీ, ప్రసూన వెళ్ళాక కాని, హోటల్ నుండి కదలవద్దనీ, సాంబశివం ఆర్డర్.
ఒక్కడికీ ఏం తోచక ప్రసూన దగ్గరకు వచ్చాడు శేఖర్. శేఖర్ ను చూడగానే అనాలోచితంగా తన మనసును మదిస్తోన్న ప్రశ్న అడిగేసింది ప్రసూన.
"దొంగనోట్ల మారకానికి సంబంధించిన రికార్డు మీరు నా దగ్గర ఉంచారా?"
మెరుపు దెబ్బ కొట్టినవాడిలా త్రుళ్ళిపడ్డాడు శేఖర్......ప్రసూనను ఆశ్చర్యంగా చూస్తూ అలా నిలబడిపోయాడు....
ప్రసూనకు తన పొరపాటు తెలిసి వచ్చింది- ఇవన్నీ రహస్యాలు! ఈ విషయం తనకెలా తెల్సిందని శేఖర్ అడిగితే తనేం చెప్పాలి?
కొంతసేపటికి తేరుకున్న శేఖర్ "ఏమిటి అడిగారు?" అన్నాడు ప్రసూనను పరిశీలనగా చూస్తూ.
ప్రసూన తడబడి "ఏం లేదు" అంది.
శేఖర్ మరేమీ ప్రశ్నించలేదు. ఏదో ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు.
క్షణమొక యుగంగా ఎదురుచూస్తూ కూచుంది ప్రసూన మోహన్ వచ్చాడు. ధోవతి కట్టుకొని లాల్చీ వేసుకున్నాడు. ఎప్పటికంటే ఆకర్షణీయంగా కనిపించాడు. ప్రసూనను చూసి చిరునవ్వు నవ్వి "మీరు ఇప్పటివరకు ఉన్నారే!" అన్నాడు.
ప్రసూన మాట్లాడలేకపోతోంది. నోరు విప్పితే ఎక్కడ దొరికిపోతానో అని భయపడుతూ పెదిమలు బిగించుకుని కూచుంది.
ప్రసూన ఎదురుగా కుర్చీలో కూచున్నాడు- అప్పుడే స్నానంచేసి వచ్చినట్లున్నాడు- ఏదో సుకుమారమైన పరిమళాలు అతని శరీరం మీధనుండి తేలి వస్తున్నాయి.
మోహన్ వచ్చాడని తెలుసుకున్న రేఖ వెంటనే అక్కడికి వచ్చింది- ఎప్పటికంటే విలాసంగా అలంకరించుకుంది రేఖ..... వద్దు వద్దు అనుకుంటోనే రేఖను పరిశీలనగా చూడకుండా ఉండలేకపోయింది ప్రసూన...... రేఖ అందమైనది- సందేహం లేదు తీర్చిదిద్దినట్లున్న కనుముక్కు తీరు...... అంతకంటే తీర్చి దిద్దినట్లున్న అంగసౌష్టవం.....కానీ, ఎక్కడో, ఏదో లోపించినట్లు వుంది.....లేక, తన మనసులో వున్న అక్కసు కొద్దీ అలా కనిపిస్తోందా?
అకస్మాత్తుగా ప్రసూన చూపులు మోహన్ చూపులతో కలుసుకున్నాయి. ఆ చూపులలో కొంటెగా మెరుస్తున్న రేఖల్నిబట్టి అతడు తన మనస్సులో ప్రతి సంచలనమూ తన ముఖంలో చదువుకుంటున్నాడని అర్ధమయింది. కందిపోయిన ముఖాన్ని పక్కకు తిప్పుకుంది.
"రూం బుక్ చేశాను, వస్తారా" అంది రేఖ......
అప్పటికప్పుడు అతని కాళ్ళమీధ పడి వెళ్ళవద్దని బ్రతిమాలుకోవాలనిపించింది ప్రసూనకి......
"వస్తాను." అని రేఖతో వెళ్ళిపోయాడు మోహన్.
అల్లరిగా నవ్వుతూ గదితలుపులు వెయ్యబోయింది రేఖ.
వెలుతురుగా లేదు తెరిచే వుంచండి."