శకుంతల నెమ్మదిగా నవ్వింది.
"ఎందుకూ?"
"నాకు శకుంతల కథ గుర్తుకొచ్చింది. దుష్యంతుడు శకుంతలని తపోవనంలో కల్సుకొన్నాడట! నేనేమో ఈ మహారణ్యంలో...."
"ఇదీ తపోవనమే! అయితే యిక్కడ తపస్సు చేస్తున్నది ఋషులు కారు. లక్షలాది గ్రామీణులు, ఆదివాసులు, కొండజాతివారు తమ విముక్తి కోసం తపస్సు చేస్తున్నారు. ఇక్కడ నీకు 'శ్రవణ సుఖంబుగా నామగానంబులు' వినిపించవు. చెవి ఒగ్గివింటే గుండెలుపగలగొట్టే హాహాకారాలు వినిపిస్తాయి. మానవజాతి సిగ్గుపడే మారణహోమాలు కనిపిస్తాయి. లోకాలన్నింటినీ కదిల్చివేయగల ఆర్తనాదాలు సుడులు సుడులుగా పై కెగజిమ్ముతూ విస్వాన్నే ఆవరిస్తున్నాయి."
అతని కంఠంలో శకుంతల అంతకు ముందెన్నడూ వినని ఆవేశం, అంతకు మించిన పదును.
సన్నగా వణికింది శకుంతల. మాట తప్పించాలని హాస్యంగా "ఇతే నువ్విక్కడికి వేటకొచ్చావా?" అంది.
రాజు కంఠంలో హాస్యం లేదు. కాఠిన్యం పెరిగింది.
"అవును-వేటకే వచ్చాను. ఇక్కడి పులుల కోరలు__నరరక్తం పీల్చి పీల్చి తెగబలిసిన పులుల కోరలు వూడబీకి, వాటిచేత లేళ్ళకు సలాం చేయించాలని వచ్చాను. కంటికి కనిపించిన ప్రతిదానినీ స్వాహాచేసే కొండ చిలువ నడుములు విరగగొట్టడానికి వచ్చాను. నిష్కారణంగా యితరులను కాటువేసే కోడెత్రాచుల విషాన్ని పిండేసి, కోరలు పీకేసి, పడగలను చితక్కొట్టడానికి వచ్చాను."
"రాజూ!"
శకుంతల కంఠంలో భయం! శరీరంలో వణుకు! రాజు తగ్గిపోయాడు. అతడి చేయి శకుంతల తల నిమిరింది.
"రాజూ! నువ్వెప్పుడూ ఇలా అరణ్యాల్లో పడుకుంటావా?"
"లేదు ఇవాళ నీకోసం ఇక్కడున్నాను. నీ కోసమే స్లీపింగ్ బేగ్ లో ఉన్నాను. లేకపోతే మిగిలిన అందరితో వుంటాను. అక్కడ స్లీపింగ్ బేగ్స్ అవసరముండదు. ఉంటుందనిపించినా వాడం. అరణ్యాల మధ్యవున్న గ్రామస్తులతో మేము ఒకభాగంగా కలిసిపోయి బ్రతుకుతాం."
రాజు కంఠం శాంతంగానే పలికింది. కానీ శకుంతలలో భయం ఎక్కువయింది. రాజు మాటలు వింటుంటే, తాను విన్నవి, చదివినవి ఏవేవో గుర్తుకు రాసాగాయి.
"మేమూ, అంటే?"
రాజు నవ్వాడు.
"నాలాగ వేటకొచ్చిన రాజులు. మాకు క్రూర మృగాలను చంపాలానే ఉత్సాహమూ, కార్యదీక్ష ఉన్నాయి. కానీ వాటి ఆనుపానులు మాకంటే ఆటవిక గ్రామస్తులకు బాగా తెలుస్తాయి. వాళ్ళ సహకారము లేకుండా మా వేట సాగదు."
'రాజు గూఢంగా మాట్లాడుతున్నాడా?'
రాజూ! నిజం చెప్పు; నాకేదో భయంగా వుంది. నువ్వు ఆపదల్లో చిక్కుకున్నావు కదూ?"
నిట్టూర్పు అణచుకున ధ్వని.
"యూ సిల్లీ! నేను జర్నలిస్టుని కదా! ఇక్కడి ఆదివాసుల మీద ఆర్టికల్ వ్రాయటానికి వచ్చాను."
బేగ్ మీదనుంచి ఏదో జరజరా ప్రాకినట్లయింది.
"రాజూ!"
"హుష్! అది పాము. తాడుమీదుగా వచ్చిందంటే చిన్నపాము అయి వుండాలి. భయంలేదు.... మననేం చేయదు. పెద్ద పాములిలా రాలేవు పడుకో"
"ఇక్కడ నిద్రెలా పడుతుంది."
"అందుకే నిన్ను వెళ్ళిపొమ్మన్నాను." రాజు కంఠంలో కాఠిన్యము.
"ఐమీన్, ఇలా నీ దగ్గర పడుకొంటే__"
అతని గుండెలమీద తలవాల్చింది. శకుంతల మాట నర్ధించని అతనికి అర్ధమయ్యింది. ఆప్యాయంగా ఆమె తల నిమిరి, "టేక్ రెస్టు, లెట్ మి టేక్ రెస్టు. నేను రేపు చాలా దూరం వెళ్ళాలి." అని అన్న వెంటనే నాలుక కరుచుకున్నాడు.
అతని హృదయం మీది శకుంతల కదిలింది. ఆ చీకట్లో ఆమెకళ్ళు అతని కళ్ళలో చూడటానికి ప్రయత్నించాయి.
"నేనూ నీతో తపస్సు చేస్తాను. నీఅంతదీక్షగా నేనూ వుంటాను"
"ఆల్ రైట్! కానీతపస్సు చెయ్యటానికి అరణ్యాలలోకి రానక్కరలేదు. గర్ల్ గైడ్స్ వినను రాజవల్లినగర్ లో దింపింది. నువ్వు తపస్సుచేయగలవో లేదో చూడటానికే"
ఉలికి పడింది శకుంతల. ఆ ఉలికిపాటు రాజుకి అర్ధమైంది! అనునయంగా భుజం తట్టాడు,
గర్ల్ గైడ్స్....రాజు__రాజవల్లి గారు__
ఆమెకెన్నో అర్ధమవుతున్నాయి, మరెన్నో అర్ధంకావటంలేదు.
"రాజూ!"
"యస్"
"నేను తపస్సు ఎలా చేయగలనో చెప్పు!"
"నీకే తెలుస్తుంది! చెయ్యాలని గట్టిగా సంకల్పించుకుంటే, ఈ తపస్సును భంగపరిచేది రంభ, ఊర్వశి, మేనకా, తీలోత్తమలు కారు. పాలరాతి భవనాలు, జీప్ లు రవ్వల నెక్లిసులూ వగైరా, ప్రయత్నించు ఏమాత్రం సాధించగలవో."
శకుంతల ఆలోచనలోపడింది. కొద్దిసేపట్లోనే రాజు గుర్రు వినిపించింది. అతడలా నిద్రపోవటం శకుంతలకు నచ్చలేదు కానీ, అతడిని లేప లేకపోయింది. "నేను రేపు బాగా దూరం వెళ్ళాలి" అనేమాటలు గుర్తొచ్చాయి. ఆమె ఆలోచనలు ఒక్కసారిగా మేల్కొన్నాయి. కానీ ఒక ఆకృతిని పొందలేకపోతున్నాయి. అల్లరి చేసే ఆలోచనల మధ్య ఎప్పుడో తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది.
19
పక్షుల కలకలారావాల మధ్య కళ్ళు తెరిచింది శకుంతల. ఏదో నూతన చైతన్యంతో అనేక రకాల పక్షులు ఒక్కసారిగా చేస్తున్న కలకలధ్వనులు ఏదో నూతన సందేశాన్ని అందిస్తున్నట్లుగా, ఏదో వినిపిస్తున్నట్లుగా ఉన్నాయి.
"దొరసానీ! దొరసానీ!" కిందనుంచి శామీ గొంతు. అప్పటికి గాని శకుంతలకు రాత్రి ఏం జరిగిందో? తానెక్కడుందో గుర్తుకిరాలేదు. గుర్తు రాగానే ముందు రాజుకోసం చూసింది రాజు లేడు. 'ఎప్పుడు వెళ్ళి పోయాడో? తనను నిద్రపుచ్చి, అతను నిద్రపోకుండా వెళ్ళిపోయాడా? తన కంత మొద్దునిద్ర ఎలా వచ్చిందో?'