Previous Page Next Page 
ఈనాటి శకుంతల పేజి 28

    కొంతసేపటికి తల ఎత్తింది శకుంతల. "రాజూ!" అంది__ఏదో దివ్యమంత్రం జరిపిస్తున్నట్లు అప్పుడు చూసుకొంది. పైట లేని తన వక్షస్థలాన్ని రాజు తన భుజాల చుట్టూ కప్పిన స్వెట్టర్ తొడుక్కుంది.    
    శామి రాజును చూసి దండం పెట్టి, "మీరా అయ్యా!" అంది.    
    రాజు శకుంతల భుజం చుట్టూ చెయ్యివేసి ముందుకు నడిపిస్తూ, "ఏమిటీ సాహసం? ఎందుకిలా వచ్చావ్? ప్రమాదం కదూ? - సమయానికి నేను చూడబట్టి కాని...." అన్నాడు.    
    "నిన్ను చూడబట్టే వచ్చాను. మేడమీద నుంచి దూరంగా నీనడక గుర్తించాను. నువ్వనుకున్నాను __ వెంటనే వచ్చేసాను."    
    నడుస్తున్న వాడు ఆగిపోయాడు రాజు విభ్రాంతితో చీకట్లో మెరుస్తున్న శకుంతల కళ్ళలోకి చూసి, ఆమె భుజాలు చుట్టిన చేత్తో ఆమెను దగ్గిరగా హత్తుకున్నాడు అతని భుజంమీద తలవాల్చింది.    
    "రాజూ ! నువ్వెందుకు వచ్చావ్ ఇకక్డికి? స్టేషన్ లో నన్ను చూసి గుర్తుపట్టనట్లు వెళ్ళిపోయావేం? నేనిక్కడ ఉన్నానని తెలిసే నన్ను చూడటానికి రాలేదేం? నేనేం తప్పుచేశాను రాజూ?"    
    రాజు ఆ మాటలేవీ వినిపించుకోనట్లు, తనలో తను అనుకుంటున్నట్లు అన్నాడు__"నువ్వింత త్వరగా ఇక్కడకు వచ్చావంటే, నాకంటే త్వరగా వంతెన దాటి వుండాలి! ఓ గాడ్! పొరపాటున లోయలోకి పడితే ... ఓ గాడ్ ! ఓ గాడ్!...."    
    అతడి చేతులు మరింత దగ్గరగా హత్తుకున్నాయి శకుంతలని. ఆ చీకట్లో ఆ అడవి స్వర్గంలా వుంది ఆమెకి. ఆ నిశ్శబ్దంలో తనకు సన్నిహితంగా వేగంగా వినిపిస్తోన్న రాజు నిట్టూర్పుల ధ్వని ఎవరో అదృశ్య దేవతల దివ్యగానంలా వుంది.    
    నడుస్తున్నవాడు ఆగిపోయాడు రాజు. ఎదురుగా మంటలు __ ఆ మంటల చుట్టూ ఆటవికులు. వారి వెనుక వేట కుక్కలు.    
    "శివయ్యా!" అని పిలిచాడు. నాగరికుల లాగే పంచె, చొక్కా, చెప్పులతో వున్నవ్యక్తి ముందుకొచ్చాడు.    
    "అమ్మాయిగారిని ఇంటిదగ్గర దింపేయ్!"    
    "నో! నేను వెళ్ళను" వెంటనే అంది శకుంతల.    
    "శకుంతలా! నా మాటవిను. ఈ అడవిలో ఎంతకాలం వుంటావు?"    
    "నువ్వెంత కాలం వుంటావు?"    
    "యూ సిల్లీ! నేను మరో గంటలో వెళ్ళిపోవాలి!    
    "నేనూ నీతో వస్తాను."    
    "ఇంపాసిబుల్!"    
    "రాజూ!"    
    "శకుంతలా! నా మాట విను. వెనక్కు తిరిగి వెళ్ళిపో! ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం!"    
    "మరి నువ్వెలా వుంటున్నావ్? నీకుమాత్రం ప్రమాదకరంకాదా?"    
    "ఇలా ఎదురు సమాధానాలు చెప్పుతూ వాదించకు వెళ్ళు!" కఠినంగా పలికింది రాజు గొంతు. శకుంతల బిక్కచచ్చిపోయింది. కానీ వెళ్ళటానికి సిద్దంగా లేదు-ఆలోచించింది.    
    "ఇంత రాత్రివేళ నేను వెళ్ళితే గొడవ జరుగుతుంది. మా ఘూర్ఖా బయటవాళ్ళు లోపలికి వెళుతుంటే, అనేక విధాల ప్రశ్నించిగాని, లోపలి రానివ్వడు. ఇప్పుడు నేను వెళ్ళానంటే, ఎక్కడికీ, ఎందుకూ, అని ఆరాలు తీస్తాడు. తెల్లవారాకైతే, పనిమనిషిలాగ శామితో వెళ్ళిపోతాను."    
    ఈ మాటలతో రాజు కొంచెం జంకినట్లు కనిపించాడు. అక్కడి మిగిలిన వాళ్ళంతా రాజు సమాధానం కోసం ప్రతీక్షిస్తున్నట్లు అతడినే చూస్తున్నారు.    
    రాజు అందరినీ చూశాడు.    
    "శివయ్యా! మీరంతా 'మన ఇంటికి' వెళ్ళిపొండి! మీలో ఒకరు శామిని తన ఇంటిదగ్గర దింపెయ్యండి. శామీ! నువ్వు పొద్దున్నే ఆరుగంటలు కాకుండా రా! నేను ఈ అమ్మాయితో ఇక్కడే వుంటాను."    
    కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. ప్రకృతే ఊపిరి బిగించి నట్లున్న నిశ్శబ్దం.    
    ఒకడు మాత్రం సాహసించి ముందుకు వచ్చాడు.    
    "బ్రదర్! ఇది చాలా సాహసం! అంతగా అయితే, ఆమెను కూడా....."    
    "నో!...." అని ఆగి ఆ చీకట్లో అతనికేదో సైగచేశాడు. ముందు చేతులు వెడల్పుగా సాచాడు. తరువాత ఒక చెయ్యి పైకెత్తి అరచేతిని నిలువుగా వంచి క్రిందకు దింపాడు. అతడు వెళ్ళిపోయాడు. మిగిలినవాళ్ళూ వెళ్ళిపోతుండగా - "మంటలు ఆర్పెయ్యండి! కుక్కల్ని వదలండి!" అన్నాడు రాజు.    
    వాళ్ళలో ఒకడితో శామి వెళ్ళిపోయింది.    
    నిశ్శబ్దం-చీకటి ఆ అంధకారంలో గడగడ వణుకుతూ రాజుకు దగ్గరగా జరిగి నిలబడింది శకుంతల. ఎంత ఆనందంగా వుందో, అంత భయంగా వుంది.    
    రాజు ఒక నిలువెత్తు ప్లాస్టిక్ కవర్ తీసి, "ఇందులో పడుకో!" అన్నాడు శకుంతలని.    
    "ఏమిటిది?"    
    "స్లీపింగ్ బాగ్!"    
    "ఈ సంచిలో దూరి పడుకోవాలా?"    
    "అంతే మరి! ఈ క్లాత్ చాలా 'పోరస్' గా వుంటుంది. గాలి వస్తుందిగానీ సూక్ష్మజీవులు రావు. ఈ అడవిలో ఇదే రక్షణ."    
    "మరి నువ్వు?"    
    "నేను బయట తిరుగుతుంటాను."    
    "నేనూ నీతో తిరుగుతాను."    
    "శకుంతలా!" మందలింపుగా అన్నాడు.    
    "రాజూ!- గారాబంగా అంది.    
    రాజు నవ్వాడు.    
    "అయితే రా! ఇద్దరం స్లీపింగ్ బాగ్ లోనే పడుకుందాం. ఇద్దరికీ సరిపోతుంది కాని కాస్త ఇరుకుగా వుంటుంది."    
    శకుంతల మనసు ఉత్సాహంతో పొంగింది.    
    "థాంక్యూ!"    
    టార్చిలైటు వెలుగుతో స్లీపింగ్ బాగ్ ని రెండు దృఢమైన కొమ్మల మధ్య తాడుతో కట్టాడు రాజు. ముందుగా శకుంతలని అందులో ఎక్కించి, తరువాత తను ఎక్కి లోపలినుంచి జిప్ లాగేశాడు.    
    ఉయ్యాలలా వున్న ఆ స్లీపింగ్ బాగ్ లో రాజుకి అతి దగ్గరగా.....శకుంతల అణువణువూ పులకించింది.    
    "రాజూ!"    
    "హుష్! పడుకో!"    
    కొద్దిసేపు మౌనం. కీచురాళ్ళ సన్నని అరుపులు. అతి దగ్గరలో పులి గాండ్రింపు. శకుంతల అరవకుండా ఆమె నోటిమీద చెయ్యివేశాడు రాజు. భయంతో అతనికి హత్తుకుపోయింది. కొద్దిసేపట్లో నిశ్శబ్దం.

 Previous Page Next Page