Previous Page Next Page 
ఈనాటి శకుంతల పేజి 30

    రాత్రి రాజు మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి.    
    'ఒకరోజు రాత్రి నిద్ర ఆపుకోలేని తను తపస్సేం చేస్తుంది'? "దొరసానీ.... దొరసానీ....." శామి గొంతు కొంచెం కంగారుగా స్పీపింగ్ బేగ్ లోంచి కిందకు దిగింది. శకుంతలను సంబరంగా కౌగలించుకొని, "హమ్మయ్య!" అంది శామీ దాని అభిమానం చాలా గమ్మత్తుగా తోచింది ఆమెకి. వింతగా చూసింది.    
    "అదేంటి దొరసానీ! అట సూత్తన్నారు? యింటికి పదండి!" శకుంతల శామీ భుజంమీద చెయ్యివేసింది.    
    "నన్ను 'దొరసానీ!' అని పిలవకు. 'శకుంతలా!' అని పిలువు"    
    "అయ్యో. అదేంటీ!"    
    "పిలువు!"    
    "శకుంతలా! శకుంతలా! శకుంతలా!"    
    తనలో తను మననం చేసుకొంటున్నట్లు అని శకుంతల ముఖం లోకి భయంగా చూసి అక్కడ కనిపించిన భావాలకి ఆనందంతో నవ్వింది. ఆ నవ్వు చూసి మొదటిసారిగా "శామీ యింత అందమైనదా?" అనుకొంది. తనకు తెలిసినప్పటి నుంచీ శామీ ఎప్పుడూ అలా నవ్వలేదు.    
    "పదండి! యిప్పటికే పొద్దెక్కింది. అమ్మమ్మగారు చూసి కంగారుపడతారేమో?"    
    శకుంతల తను వచ్చిన దిక్కుగా నడవబోయింది.    
    "అటు నడవకండి! యిప్పుడా కర్రొంతెన లేదు, రేత్రి విరిగి పోనాది."    
    ఆ మాట్లాడిన వ్యక్తి వేపు చూసింది. ఆటవికుడే కావచ్చు కానీ, పంచె చొక్కాలతో వున్నాడు. మాటలో కూడా ఏస అప్పుడప్పుడు అక్కడక్కడ వినిపిస్తోంది.    
    "నా పేరు శివయ్య- పదండి! మిమ్మల్ని బిడ్జి దాకా దింపొస్తాను"    
    'ఆ పేరు రాత్రి విన్నట్లు గుర్తొచ్చింది చీకట్లో మనిషిని సరిగా చూడలేదు. కర్రవంతెన విరిగిపోయిందా? రాత్రి చీకట్లో రాజు చేసిన సైగ గుర్తుకొచ్చింది. శివయ్యను ఏదేదో అడగాలనిపించినా, అడగకూడదని లోలోపల ఏదో హెచ్చరించింది.' శామీతో బయలుదేరింది. దారిలో ఎవరూ మాట్లాడలేదు. నడక మొదలుపెట్టాక, అక్కడికి రాతి వంతెన చాలా దూరం అని తెలిసొచ్చింది. దారిలో ముళ్ళు, తుప్పలూ ఏవీ లేవు. సన్నని కాలిబాట. ఒఅరి వెనుక మరొకరు నడవవలసి వస్తోంది. ఆ దారి శివయ్యకూ శామీకీ బాగా తెలిసినట్లుంది ముందు శామీ, వెనుక శివయ్యా నడుస్తున్నారు దాదాపు రెండు కి.మీ. నడవవలసి వచ్చింది. శకుంతలకి కాళ్ళు లాగాసాగాయి. ఆ సౌకుమార్యానికి తనమీద తనకు కోపంవచ్చింది.    
    బ్రిడ్జి రాగానే శివయ్య ఆగిపోయి, "ఎల్లొస్తా నమ్మా!" అని వెనుదిరిగి అంతలో కనుమరుగై పోయాడు.    
    శామీ శకుంతల చెయ్యిపట్టుకొని చక చక ముందుకు నడవసాగింది. అడుగుతీసి అడుగు వెయ్యలేకపోయింది శకుంతల.    
    "ఇంకెంతమ్మా__వచ్చేశాం!" అని హుషారిస్తోంది శామీ, భవనం సమీపించారు. రేగిన తల, నలిగిన చీర, వడిలిన ముఖం, దుమ్ము కొట్టుకున్న కాళ్ళు__ శకుంతలని చూసి అదిరిపోయాడు గూర్ఖా అతనికి నోట మాట రాలేదు.     
    శామీ ముందుకు వచ్చి "అనవసరంగా గొడవ చెయ్యకు. అందరి మీదకూ వస్తాది ఏం పెమాదం లేదు. అమ్మగారి చుట్టాలుంటే చూసొచ్చారు!" అని శకుంతల చెయ్యి పట్టుకొని లోపలకు తీసుకు పోయింది. అప్పుడే గేటు తలుపు గట్టిగా వేశాడు గూర్ఖా.    
    అంత పెద్ద భవంతిలో ఎవరికంటా పడకుండానే తనగాడికి చేరుకో గలిగింది శకుంతల చకచకా కాలకృత్యాలు ముగించుకొని, స్నానంచేసి, బట్టలు మార్చుకొని అప్పుడు రాజవల్లిగారి గదికి బయలుదేరింది.    
    రాజవల్లి బాగా తెల్లవారుజామునే లేస్తుంది. దాసీల సాయంతో స్నానాధులు ముగించుకొని గీతాపారాయణం చేస్తుంది. అప్పుడు పురోహితుడు వచ్చి పూజ చేస్తాడు. పూజలన్నీ అయ్యాక తీర్ధ ప్రసాదాలు పుచ్చుకొని కాని ఆవిడ కాఫీ కూడా తాగదు. శకుంతల వచ్చిన కొత్తలో శకుంతల కూడా పూజలో వుంటే బాగుండునని అనుకొనేది కాని, ఆమె కిష్టంలేదని తెలిసాక, ఏమాత్రం బలవంతం చెయ్యలేదు. శకుంతల కిష్టం లేని ఏ పనీ రాజవల్లి చెయ్యలేదు. మరొకరితో చెయ్యనివ్వదు.  
    శకుంతల రాత్రి బాగా పొద్దుపోయేవరకూ చదువుకుని, ఉదయం పొద్దెక్కి లేవటం కూడా అలవాటే! అలాంటప్పుడు ఆమెను లేపడం రాజవల్లి కిష్టం ఉండేది కాదు. కానీ, శకుంతల వచ్చేవరకూ తాను కాఫీ అయినా తీసుకోకుండా అలా కూచునేది. నీ కాఫీ - ఫలహారాలు నువ్వు తీసుకోమని శకుంతల చెప్పినా కూడా నవ్వేది కాని, తీసుకొనేది కాదు.    
    ఆ రోజు శకుంతల వచ్చేసరికి రాజవల్లి గీత చదువుకొంటూ కూచుంది.    
    "ఏమ్మా! రాత్రి మరీ ఆలస్యంగా నిద్రపోయావా?" అంది లాలనగా.    
    'హమ్మయ్య!' అనుకొంది శకుంతల అంతలో ఏదో 'గిల్టీ' గానూ బాధపడింది.    
    ఏం సమాధానమియ్యకుండా రాజవల్లి దగ్గిరగా వచ్చి, మెడచుట్టూ చేతులువేసి, "నువ్వెందుకు ఫలహారం తీసుకోలేదు అమమ్మా?" అంది.    
    శకుంతల చెక్కిలి మీద ఆప్యాయంగా ముద్దుపెట్టుకొంది రాజవల్లి.    
    "పిచ్చి తల్లీ! ఈ ముసలిదానికి నువ్వు లేకుండా ఏదైనా సహిస్తుందా?"    
    ఇద్దరూ టిఫిన్ తీసుకొంటూ ఉండగా రాజవల్లి- "ఇవాళ నువ్వు ఫ్యాక్టరీ వేపు వెళ్ళకమ్మా! ఇంట్లోనే వుండు. చక్కగా తయారవు!" అంది.    
    ప్రశ్నార్ధకంగా చూసింది శకుంతల, రాజవల్లి ముసి ముసి నవ్వులతో, "ఇవాళ తమర్ని చూసుకోవటానికి పెళ్ళికొడుకుగారు వస్తున్నారు" అంది.    
    అదిరిపడింది శకుంతల. ఈ ఆపద ఆమె ఊహించనిది రాజవల్లిని నొప్పించకుండా ఎలా తప్పించుకోవాలా?' అని ఆలోచించసాగింది.    
    "అమ్మమ్మా! నాకు పెళ్ళివద్దు నిన్నువదలి నేనక్కడికీ వెళ్ళను."    
    రాజవల్లి ముడతలు పడ్డ అందమైన ముఖంలో ఒక్కసారిగా కోటి చందమామలు నవ్వాయి.    
    "పిచ్చితల్లీ! ఈ ముసలిది మాత్రం నిన్ను వాదిలి బ్రతకగలదా? ఇక్కడ ఉండేలా అన్ని విషయాలూ మాట్లాడిన తర్వాతనే చూసుకోవటానికి రమ్మన్నాను. నా బంగారు తల్లివి. వాళ్ళకూ వీళ్ళకూ చూపటానికి నేను వడ్డీదాన్నా? పిల్లవాడు బాగుంటాడనీ, బుద్దిమంతుడనీ, బాగా చదువుకొన్నాడనీ విన్నాను. నువ్వు చూసి నీకు నచ్చితేనే?"    
    ఆ చివరి మాటలతో కొంత స్థిమితపడింది.    
    రాజవల్లి చెప్పిన ప్రతిమాటకూ తల ఆడించింది. కట్టుకో మన్న బెనారస్ చీర కట్టుకుంది. పెట్టుకోమన్న వజ్రాల నెక్లెస్ పెట్టుకుంది. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా తయారయింది.

 Previous Page Next Page