Previous Page Next Page 
నల్లంచు-తెల్లచీర పేజి 27

 

     ఇదంతా అతడికి తెలుసు.
   
    అందుకే అతడు ఇప్పుడు చెంచురామయ్య అండ్ కో గురించి ఆలోచించటం లేదు. తన కంపెనీ గురించి ఆలోచిస్తున్నాడు. ఇప్పటివరకూ రవితేజ చీరలు మకుటంలేని మహారాజులు. వాటి స్థానానికి కొద్దిగా కదలిక ఏర్పడే సూచన్లు కనపడుతున్నాయి. ఏదైనా చేయాలి. అవతలివాళ్ళ లాగా బహుమతులు ఇవ్వటం కాదు. మరేదో చెయ్యాలి. నిరంతరం ఈ ఆలోచనలోనే మునిగి తేలుతున్నాడు. ఇప్పుడు అతడి వయసు కూడా ముఫ్ఫై దాటింది. ఆ వయసు వరకూ మనిషి యంత్రంలా పనిచేస్తాడు. ఈ తరువాత పని చేయటానికి ప్రేరణ కావాలి. ఈ ప్రేరణ అనేది చాలా రకాలుగా మనిషికిలభిస్తూ వుంటుంది ఇంట్లో ఆహ్లాద వాతావరణం, తమ విజయం పట్ల కుటుంబ సభ్యుల మొహాల్లో అభినందన, తోటి వ్యాపారస్తుల మధ్య గౌరవం, ఇవన్నీ ఆ ప్రేరణకి మూలాదారాలు దురదృష్టవశాత్తు మొదటి రెండు అతఃడికి లభ్యం కావు. అందుకే చిన్న వయసులోనే అతడు చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నాడు. చాలామంది వ్యాపారస్తులూ, ఉన్నత ఉద్యోగులూ అందుకే ఒక వయసు దాటాక ఇంటి సభ్యులతో గడపటం మానేసి, వారినుంచి మానసికంగా దూరమై, వ్యాపారస్తులైతే డబ్బునీ, ఎగ్జిక్యూటివ్స్ అయితే పనినీ హోదానీ ప్రేమిస్తారు.
   
    ఇప్పుడు అతడు రెంటికీ మధ్య రేవడిలా వున్నాడు.
   
    ప్రియంవద ఇచ్చిన ఫారెన్ చీరాల అమ్మకం సలహా బాగానే వుంటుంది. కానీ, ఒక్కసారిగా అమ్మకాలు పెరగవు. చెంచురామయ్యలాగా ప్రజల బలహీనత మీద క్యాష్ చేసుకోలేడు. ఏదైనా మరింత బలమైనది ఆలోచించాలి.
   
    ప్రియంవద కూడా, పాత సెక్రటరీ లాగానే ఈ వ్యవహారాల పట్ల ఆఫీసు పరంగానే కాకుండా మామూలుగా కూడా ఆసక్తి చూపించటం అతడికి కాస్త రిలీఫ్ గా వుంది. పాత సెక్రటరీ వయసులో మరీ పెద్దది. ప్రియంవద ఫ్రెష్ ఫ్రమ్ కాలేజీ. ఆ అమ్మాయికి రకరకాల ఫాషన్లు తెలుసు. ఎక్కడెక్కడి సమాచారమూ తీసుకొచ్చి చెప్పేది. అతడికి చాలా చిత్రంగా వుండేవి కొన్ని విషయాలు. ఏది ఏమైతేనేం, ఆమె డిక్టేషన్ తీసుకోగానే వెళ్ళిపోయే స్టేజినుంచి, కొంచెంసేపు కూర్చుని మామూలు విషయాలు కూడా మాట్లాడే స్టేజికి వచ్చింది.
   
    "ఒక్కప్రశ్న అడుగుతాను జవాబు చెప్పగలరా?" అని అడిగింది ఒకరోజు.
   
    "ఏమిటి?"
   
    "చాలా సింపుల్ ప్రశ్న".
   
    "ఏమిటది?"
   
    "ఆడవాళ్ళు ఎందుకు ఎక్కువ చీరెలపట్ల మోజు కలిగి వుంటారు?"
   
    అతడు తెల్లబోయి చూశాడు. ఏదో సమాధానం వెంటనే చెప్పటానికి ప్రయత్నించాడుగానీ తనకే సంతృప్తికరంగా అనిపించలేదు. ఎంతో చిన్న ప్రశ్నగా కనిపించినా సమాధానం వెంటనే దొరకలేదు. అవును రేడియో, టీ.వీ., బ్యాంకు బాలెన్స్, విహారయాత్ర, స్థిరాస్తులూ-వీటిమీద లేని ఉత్సాహం స్త్రీ చీరెల మీద ఎందుకు చూపిస్తుంది? బంగారం, చీరెలు...ఇవే ఎందుకు స్త్రీని ఉత్తేజపరుస్తాయి?
   
    ఇంటికి వెళ్ళిన తరువాత కూడా ఇదే ప్రశ్న అతడిని వెంటాడింది. ప్రియంవద వూరికనే అడిగిందో, లేక తనూ ఆలోచించి సమాధానం చేతకాక అడిగిందో తెలీదుకానీ అతడిని మాత్రం ఆలోచనలో పడేసింది.
   
    మరుసటిరోజు ఆఫీసులో ఆమెతో అన్నాడు. "నిన్న నువ్వడిగిన ప్రశ్నకి కొంతవరకూ సమాధానం దొరికింది."
   
    "ఏమిటి?" నవ్వుతూ అడిగింది.
   
    "మొదటి కారణం ఆడవాళ్ళు అలంకార ప్రియులు అలంకరణలో మొదటిది చీరకట్టు. మొగవాడు సౌఖ్యాలకీ, స్నేహితులకీ, వ్యసనాలకీ ప్రాముఖ్యత ఇస్తాడు. స్త్రీ అలాకాదు. ఆమె ప్రపంచం చాలా చిన్నది. కొత్త చీరవల్ల ఆనందం ఇనుమడిస్తుందని చాలామంది అనుకుంటారు. నిజంకాదు. కానీ నిశ్చయంగా కొత్త చీరె కట్టుకోవడంవల్ల స్త్రీ కొత్తగా కనపడుతుంది. అది చూసి మొగవాడి కళ్ళల్లో మెచ్చుకోలు కనబడుతుంది. ఇది మొదటి కారణం.
   
    మొగవాడి సెన్స్ ఆఫ్  అఛీవ్ మెంట్స్ చాలా వుంటాయి. చివరికి పేకాటలో డబ్బు ఒకరోజు గెలవటం కూడా అతడు అచీవ్ మెంట్ గానే భావిస్తాడు. స్త్రీ తోటి స్త్రీల దగ్గిర తన గెలుపుని బంగారం, చీరెల ద్వారా చూపించి సంతృప్తిపడుతుంది. చీరెల గురించి ఆలోచించటం, చీరెల గురించి మాట్లాడటం, చీరెల విషయంలో పోట్లాడటం, చీరకోసం డబ్బు దాచుకోవటం, సినిమాకి వెళ్ళినా పుస్తకాలు చదువుతున్నా అందులో వచ్చే చీర ప్రసక్తిని ఆసక్తితో గమనించటం, చీరెల కోసం భర్తని వేధించటం, తోటి ఆడవాళ్ళు ఏం చీర కట్టుకున్నారా అని గమనించటం ఇదంతా మామూలు ఆడవాళ్ళ దినచర్యలో ఒక భాగం.
   
    పైకి విసుక్కున్నట్టు కనిపిస్తారు కానీ, ఆడవాళ్ళ తాలూకు ఈ మనస్తత్వాన్ని మొగవాళ్ళు బాగా ఆనందిస్తారనిపిస్తుంది. ఎంతోమంది మగవాళ్ళు ఆడవాళ్ళకి చీరలు నగలు కొనిపెట్టటంలో గర్వాన్ని పొందుతూ వుంటారంటే అబద్దం కాదు. పైకి వెక్కిరించినా, భార్యకి చీరెలు, నగలు కొనిపెట్టటం తన మొగతనానికి చిహ్నంగా భావిస్తాడు భర్త. ఈ రకంగా చీర మనుష్యుల జీవితంలో ఒక భాగం అయిపోయింది కాబట్టి చీరెలపట్ల అంత మోజు చూపిస్తారు వాళ్ళు."
   
    ఆమె అతడివైపు విప్పారిన కళ్ళతో చూసింది ఆ చూపు నిండా అభినందన వుంది. అప్పుడేమీ మాట్లాడలేదు గానీ ఐదు నిముషాల తరువాత వచ్చినప్పుడు ఒక కార్డు తీసుకొచ్చి ఇచ్చింది.
   
    చేత్తో వేసిన బొమ్మ అది. ఒక పురుషుడికి అందమైన అమ్మాయి గులాబి అందిస్తున్నట్టు వుంది.
   
    "ఏమిటిది ప్రియంవదా?"
   
    "అభినందన కార్డు సర్!"
   
    "ఈ బొమ్మ-"
   
    "నేనే వేశాను."
   
    "నువ్వింత బాగా వేస్తావని నాకు తెలీదే - థాంక్స్"
   
    ఆమె నవ్వేసి, అక్కన్నుంచి వెళ్ళిపోయిద్న్హి. అతడు కార్డు మధ్యకి విప్పాడు. లోపల నాలుగు వాక్యాలున్నాయి.
   
    "పదహారేళ్ళ అమ్మాయి- మాటకారి అబ్బాయంటే ముచ్చట  పడుతుంది.
   
    ఇరవై రెండేళ్ళ అమ్మాయి-ఆస్థి అంతస్తువైపు కూడా ఓరగా చూస్తుంది.
   
    ఇరవై ఎనిమిదొచ్చిన అమ్మాయి- కాస్త స్నేహంగా మాట్లాడితే చాలనుకుంటుంది.
   
    నిజమైన అమ్మాయెప్పుడూ తెలివితేటలకే పడిపోతుంది-"
   
    అతఃడికి మతిపోయింది. ముందర్ధం కాలేదు. రెండోసారి చదివితే నిజమే ననిపించింది. మూడోసారి నవ్వొచ్చింది. నాలుగోసారి మళ్ళీ నిజమేననిపించింది. ఇరవై అయిదోసారి ఎందుకో కాస్త గర్వంగా అనిపించింది. దేశం మొత్తాన్ని తన చీరెల డిజైనుతో పిచ్చెక్కిస్తూన్న ఆ ఎగ్జిక్యూటివ్, ఆ క్షణం ఆ నాలుగులైన్లూ చిన్న పిల్లవాడిలా అన్నిసార్లు చదువుకున్నాడంటే ఒకటే కారణం-
   
    అవధిలేని ఆత్మానుభూతికి మూలాధారాలు ఎంతో గొప్పవి. పెద్దవి అయివుండనవసరంలేదు.
   
    సరీగ్గా ఆ సమయంలోనే అతడికి ఫ్లాష్ లాటి ఆలోచన వచ్చింది. అయిదు నిముషాల్లో అది ఒక రూపుదిద్దుకుంది. అదికాని సరీగ్గా అమలు జరిగి విజయవంతమైతే, భారతదేశంలో వస్త్ర వ్యాపారం ఒక సరికొత్త మలుపు తిరగబోతుంది. రవితేజ టెక్స్ టైల్స్ ఒక అనూహ్యమైన విజయం సాధిస్తుంది.
   
    అరగంట తరువాత అతడి క్యాబిన్ లో ఆ కంపెనీ తాలూకు అన్ని డిపార్టుమెంట్ల ముఖ్యాధికారులూ సమావేశమయ్యారు. ఒకరిద్దరు డైరెక్టర్లు కూడా కూర్చొని వున్నారు. రవితేజ తన ఆలోచనని వారికి వివరించసాగాడు. ఆ గదిలో సూదిపడితే వినపడేంత నిశ్శబ్దం ఆవరించుకుని వుంది. అతడు చెప్పేదాన్ని అందరూ విస్మయంగా వింటున్నారు.
   
    సరిగ్గా అదే సమయానికి ప్రియంవద బయట ఎవరికో ఫోన్ చేస్తూంది.
   
    రవితేజ తన అధికారులతో సమావేశాన్ని మొదలుపెట్టాడు. "బోంబేడయింగ్ వెరైటీకన్నా ఈ అమ్మకాలే ఎక్కువుంటాయి. ఉదాహరణకి కోటీ, బడీ చౌడీ ప్రాంతాల్లో ఈ చిన్న చీరల వ్యాపారం పెద్ద పెద్ద షాపుల వాళ్ళ అమ్మకాల్ని కూడా దెబ్బతీస్తూంది. దీనికి కారణం- 'తక్కువ ధరలో మూడు నెలల కొకసారి ఫాషన్ మారుస్తూ ఇక్కడ చీరలు అమ్మటం', కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు, ఆఫీసులకెళ్ళే ఆడవాళ్ళు ఇక్కడ చీరల్ని ఎక్కువకొంటూ వుంటారు. చీర వంద రూపాయిలలోపే వుంటుంది. చీరెల మీద చమ్కీలు, అద్దకాలు కూడా కుట్టి అమ్ముతారు. బట్ట ఎక్కువ మన్నిక వుండదు. గంజిపెట్టి ఇస్త్రీ చేయాలి. అందరూ దీన్ని ఇష్టపడటానికి కారణం మూడు నెలలకొకసారి మారే డిజైన్లు - కేవలం వంద రూపాయలకి దొరకటం పదిసార్లు కట్టి పడెయ్యటానికి వీలుగా.
   
    గత ఐదు సంవత్సరాల్లో ఈ వ్యాపారం నాలుగింతలుగా పెరిగింది. ఒకోసారి మోసం కూడా జరగొచ్చు. ఒక్క ఉతుక్కే చీర పాడయిపోవటం జరగవచ్చు. అయినా ఈ వ్యాపారానికి నష్టం వుండటంలేదు. 1957లో దీన్ని ప్రారంభించారు. అప్పుడు 'మల్లు' అనే బట్ట పాపులర్ గా వుండేది. చీరెబట్ట మొత్తం 7 రూపాయలకి వచ్చేది. దానిమీద ప్రింటువేసి 11 రూపాయలకి అమ్మేవారు. అప్పుడు వంద రూపాయలు వుండే రంగు ధర ఇప్పుడు 800 అయింది. అప్పటి హాండ్ ప్రింటింగ్ మానేసి, ఇప్పుడు స్క్రీన్ ప్రింటింగ్ వాడుతున్నారు. ఫ్యూర్ సిల్క్ మీద కూడా ఈ ప్రింటింగ్ కావచ్చు. విదేశాల్లో దీనికి విపరీతమైన డిమాండు వుంది. కానీ ఇది ఆశించినంతగా ఎగుమతి కాకపోవటానికి లంచాలు కారణం. 50, 000 కన్ సైన్ మెంట్ కి 5 నుంచి 10 వేల వరకూ లంచం ఇవ్వాల్సి వుంటుంది. డబ్బివ్వకపోతే ఏదో ఒక వంకన వెనక్కి తిరగ్గొట్టేస్తారు. ఈ ఆఫీసర్లు పెట్టె ఇబ్బందుల్ని చిన్న వ్యాపారస్తులు తట్టుకోలేరు."

 Previous Page Next Page