"-కాని అది మోసం."
"అప్పటికి మనమేమీ మోసం చెయ్యనట్టు..... నిజానికి వాటికన్నా మన చీరలే మంచివి. ఈ విషయం వాళ్ళకి తెలీదు కాబట్టి ఆ పేరుమీద మనమే అమ్ముతాం వీటిని కూడా".
రవితేజకి ఈ ఆలోచన బావున్నట్టు అనిపించింది.
ఎవరికైనా బంధువులుగానీ, దగ్గర స్నేహితులుగానీ విదేశాల్లో వుంటే అక్కడినుంచి చీరెలు తెప్పించుకోవటం సాధారణంగా అందరూ చేసేపని. అలాటి వాళ్ళెవరూ లేరే అని కొందరు నిరాశ చెందుతూ వుంటారు. బ్రోకర్లద్వారా, ముఖ్యంగా ముస్లిందేశాలనుంచి అన్ని వస్తువులతోపాటు వీటి స్మగ్లింగ్ జరుగుతుంది. స్మగుల్డు అనగానే సాధారణంగా మోజు ఎక్కువ. ఎంత ఖరీదైనా ఇచ్చి కొంటూ వుంటారు. ఖరీదు కేవలం 'క్రేజ్' మీద ఆధారపడి వుంటుంది. ఫారిన్ చీరల రంగు ఆకర్షణీయంగా వుంటుంది. బట్ట మన్నిక నాజూగ్గా వుంటుంది. అది కాదనలేని విషయం. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. 'కొత్త' తప్ప ఇందులో ఏ ప్రత్యేకథా లేదు. వాళ్ళ రంగులు మనకి ఎలా ఆకర్షణీయంగా వుంటాయో మన పట్టుచీరల రంగులు కూడా విదేశీయులకి ఆ విధంగానే ఆకర్షణీయంగా వుంటాయి. చలిదేశాల్లో వాళ్ళ శరీరతత్వాలకి సరిపోయేటట్టు తయారుచేసిన ఈ బట్టలు ఒకసారి మనకి సూట్ కావు కూడా. మనదేశపు ఉష్ణోగ్రతకి ఈ మెటీరియల్ అప్పుడప్పుడు సరిపోదు. అక్కడ 'చీరలు' అందరూ కట్టుకునేవికావు కాబట్టి. అక్కడి బట్టని మనవాళ్ళు గజాల లెక్కన కొనుక్కుని వచ్చి ఇక్కడ చీరెలుగా చింపి అమ్ముతారు. అందుకే ఎక్కువ బోర్డరు అవీ వుండవు. వాటికి సరిపోయే బ్లౌజు పీసులు దొరకటం కూడా కష్టమే. మన్నిక, రంగు, డిజైన్ విషయాల్లో మంచి స్థాయిలో వుంటాయి. కాబట్టి ఆడవాళ్ళు ముచ్చటపడడం సహజమే. కానీ అవి దొరికే వీలు లేనప్పుడు ఎక్కువ ధర ఇచ్చి కొండం అవివేకం. తెల్లటి శరీరం వుండే విదేశీయుల కోసం తయారుచేసిన ఈ చీరెలు ఒక్కోసారి మనకి నప్పవు. కస్టమ్స్ అధికారులు రెయిడ్ చేసి పట్టుకున్న వస్తువులతోపాటు ఈ చీరెల్ని కూడా కొన్ని ప్రత్యేకమైన షాపుల్లో వుంచి అమ్ముతారు. కొన్నిటికి మాత్రమే 'డ్యూటీ' కట్టి చాలా వాటిని వాటితో కలిపి అమ్మేస్తూ వుంటారు.
రవితేజ టెక్స్ టైల్స్ కూడా ఆ పంథాలోనే చెయ్యాలా? ఈమె చెప్పినట్టు వ్యాపారంలో రోజురోజుకీ విలువలు తగ్గిపోతున్నాయా?
"నువ్వు చెప్పినదాన్ని గురించి ఆలోచిస్తాను" అన్నాడు రవి ఆమె మొహం విప్పారింది. "థాంక్స్ సర్" అంది లేస్తూ.
"ఇంట్లో కూడా నువ్వు కంపెనీ వ్యవహారాల గురించే ఆలోచిస్తున్నావంటే నీకీ కంపెనీలో పర్మెనెంటు అయ్యే అవకాశాలూ, ఆలోచన్లు వున్నాయన్నమాట."
"పర్మెనెంటు చేస్తే సంతోషమే సార్! కానీ నిజం చెప్పమంటారా? నేను ఇంటికి వెళ్ళి కంపెనీ గురించి ఆలోచించను."
"మరి?"
"మీ గురించి ఆలోచిస్తాను."
ఎవరో కొట్టినట్లు అతడు తలెత్తాడు. ఆమె మాత్రం తన ధోరణిలో చెప్పుకుపోతుంది.
"నిజంసార్! ఈ కంపెనీలో చేరకముందు ఇలాంటి కంపెనీల గురించి పెద్ద పెద్ద డైరెక్టర్ల గురించి ఏమేమో ఊహించుకునేదాన్ని ఎప్పుడూ డిన్నర్లు, ఎయిర్ కండిషన్లు కార్లు - ఇవే అనుకునేదాన్ని కానీ ఇక్కడ చేరాక మీ ప్రొబ్లెమ్సూ, రోజూ టెన్షన్లూ చూస్తూంటే... మీమీద ఇంకా గౌరవం పెరిగింది. సినిమాలు చూడటంవల్ల, నవలలు చదవటంవల్ల వచ్చిన తప్పు అభిప్రాయం సార్ అది. అందులో హీరోల సమస్యలు అన్నీ కేవలం ప్రేమల వల్లే వస్తాయి సార్. కానీ అప్పుడు తెలుస్తూంది నిజ జీవితంలో హీరో అవటం ఎంత కష్టమో ప్రతిరోజూ సాయంత్రం మా ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నాక మేము ఏం మాట్లాడతామో తెలుసా సార్..... ఉహు వద్దు. ఆఫీసు సీక్రెట్స్ అన్నీ బయట చెపుతున్నావా అని తిడతారు మీరు. అభిమానం అనేది ఎప్పుడు ఎందుకు ప్రారంభం అవుతుందో చెప్పటం కష్టం సార్. ఇది ఆటోగ్రాఫ్ ల అభిమానం కాదు. దీన్ని మాత్రం నమ్మాలి మీరు అంతవరకూ ఎందుకు? మొన్న మీరు "నీ చీరె బావుంది" అనగానే ఇక ఆ రాత్రంతా దానిగురించే ఆలోచించాను-" ఆమె ఆగింది.
మతిపోవటానికి కాస్త అటు ఇటూగా వున్న స్థితిలో అతడు అవాక్కయి ఆమెవైపే చూస్తూ వుండిపోయాడు. ఆమె చిన్నపిల్లో పెద్దదో కూడా అర్ధంకావటంలేదు. ఒక మానేజింగ్ డైరెక్టర్ దగ్గిర సెక్రటరీ అలా మాట్లాడకూడదని కూడా ఆమెకు చెప్పాలో లేదో తెలియని స్థితి. చెప్పినా వినిపించుకోదు.....చెప్పలేడు. అది వేరే సంగతి. "ఏమి ఆలోచించావు?" అని అడిగాడు.
అప్పటివరకూ లొడలొడా వాగుతున్నదల్లా అతడి ప్రశ్నకి సిగ్గుపడి, "మీరు నవ్వుతారు, నన్ను తిడతారు" అంది గోళ్ళరంగుకేసి చూసుకుంటూ.
"నవ్వుతే నవ్వుతానేమో గానీ, తిట్టన్లే చెప్పు."
ఆమె చెప్పబోయి ఆగి, తటపటాయించి, "ఆ రాత్రి వరుసగా పాయింట్లు వ్రాశాను" అంది. తలా తోకాలేని ఆ సమాధానానికి అతడు అర్ధంకాక 'పాయింట్లేమిటి?" అన్నాడు.
ఆమె హాండ్ బ్యాగ్ లోంచి కాగితంతీసి అతడి ముందుకు తోస్తూ "తిట్టద్దేం" అంది. అతడు కాగితం అందుకుని చూశాడు. అందులో ఇలా వుంది.
"మొగవాళ్ళు ఆడవాళ్ళని ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో చీరె పునాదిగా ఉపయోగపడే పలు రకాల డైలాగులు:
- మీరు కట్టుకున్న చీర చాలా బావుంది.
- మీరీ చీరలో చాలా బావున్నారు.
- ఈ చీర రంగు మీకు సరీగ్గా సరిపోయింది. మీ చర్మం రంగులో కలిసిపోయింది.
- చీరలు కొంతమందికి అందాన్ని తెస్తాయి. మీ వల్ల చీరకి అందం వచ్చింది.
- మీరే చీర కట్టుకున్నా బావుంటారు.
- మీలా తెల్లగా వున్నవాళ్ళకి ముదురు రంగుచీరెలు బావుంటాయి.
- ఈ రంగు చాలామందికి సూట్ కాదు. కానీ మీకు సరీగ్గా సరిపోయింది.
- మీది మంచి సెలెక్షన్. అసలు మీ సెలెక్షన్ మీ మనస్తత్వాన్ని తెలియజేస్తూంది.
పి.యస్ : "నల్లరంగు చీరె కట్టుకున్నప్పుడు పైనుంచి మూడో డైలాగు వాడరాదు."
అతడికి ఒకవైపు నవ్వు, ఒకవైపు కోపం వచ్చాయి. నవ్వు కనపడకుండా "రాత్రిళ్ళు నువ్వు చేస్తున్నది యిలా చీరలమీద రీసెర్చా" అని అడిగాడు.
"చీరలమీద కాద్సార్! మీ మాటలమీద.."
"నేనా వుద్దేశ్యంతో మాట్లాడలేదు."
"ఈ మాటల గురించే ఆలోచిస్తున్నాను. ప్రక్కనే కాగితం కలం వున్నాయి వ్రాసాను.... ఏం తప్పా?" డబాయించింది. ఇది కాలేజీ కాదు ఆఫీసు అని అందామనుకున్నాడు. కానీ ఆ మాట ఇప్పటికే యాభైసార్లు చెప్పాడు. అందువల్ల ఇక అది లాభంలేదు. అనుకుని 'సర్లే, వెళ్ళిరా' అన్నాడు. ఆమె వెళ్ళబోయి ఆగి -
"సార్ రేపు మా క్లాస్ మేట్స్ నలుగురు వస్తామన్నారు. తీసుకురానా?" అని అడిగింది.
"దేనికి?"
"మీతో సరదాగా మాట్లాడటానికి అలాగే, వాళ్ళకే చీరెలు మ్యాచ్ అవుతాయో చెప్పి-"
"వాడ్డూయూ మీన్.... నేను..."
కోపంతో ఎర్రబడ్డ అతడి మొహంచూసి ఆమె బెదిరిపోయి, 'సారీ సర్' అని బయటకు వచ్చేసింది. అయితే, బయటకు రాగానే, లోపలున్నంతసేపూ వున్న భయం పోయి, ఆ స్థానే నవ్వు చోటు చేసుకుంది.
తన సీట్లోకి వెళ్ళబోతూ, సూపర్నెంటు దగ్గిర ఆగి, "మన పాత సెక్రటరీ ఎప్పుడు చేరుతున్నారు సార్" అని అడిగింది.
"ఇంకో నెలలో ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అవుతుందట."
ఆమె మనసులో అనుకుంది. 'మైగాడ్ టైమ్ చాలా తక్కువుందే-'
16
మరో రోజు గడిచింది.
ఈ మధ్య రవితేజ మూడీగా వుండటం ఎక్కువైంది. తన జీవితంలోకి చిన్న సంఘటనలా ప్రవేశించి వెళ్ళిపోయిన స్త్రీ తాలూకు ఆలోచన్లూ ఆమె ఎలా వుంటుందో చూడాలన్న కోర్కెవల్ల కలిగిన విసుగూ, ఇంట్లో ఒంటరితనం!
...... వీటన్నిటికన్నా తన పోటీదార్లు అతడికి ఎక్కువ మనస్తాపం కలిగిస్తున్నారు. పోటీ ఎప్పుడూ మంచిదే. అవతలివారి కన్నా తాను 'మంచి సరుకు' ఎలా ఇవ్వాలా అన్న పోటీ అయితే అది ప్రగతికి సూచన. అలా కాకుండా తను మంచి సరుకు గురించి ఆలోచించటం మానేసి, తన పోటీదార్ల గురించి ఆలోచించటం మొదలుపెడితే, ఇక పతనమే. ఆ స్టేజి వచ్చాక మనిషి తన అభివృద్ధి గురించి ఆలోచించటం మానేసి, పోటీదార్ల ఉన్నతి గురించి రోధించటం మొదలు పెడతాడు. ఎప్పుడూ, వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళు చేసినదాన్లో తప్పేమిటి? పైకి వాళ్ళు అంత గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ అదంతా కృత్రిమమయిన అభివృద్దే అని నలుగుర్నీ పోగేసి చెప్పటం చేస్తూ వుంటాడు - అతడి మనసుకి మాత్రం తన పతనం, పక్కవాడి అభివృద్ధి నిజమని తెలుస్తూ వుంటే ఇంతవరకూ వచ్చాక ఇక అతడిలో క్రమక్రమంగా క్రియేటివిటీ తగ్గిపోతుంది. కేవలం ఒక సినికల్ క్రిటిక్ గా మిగిలిపోతాడు. ఏ రంగంలోనైనా జరిగేది ఇదే.