Previous Page Next Page 
నల్లంచు-తెల్లచీర పేజి 28

 

       రవితేజ తన వాళ్ళతో చర్చిస్తూన్నది ఈ మార్కెట్ లోకి ప్రవేశించటం ఎలా అని....
   
    ప్రియంవద, తొందర తొందరగా డిజైన్లు మార్చే ఆడవారి ప్రసక్తి తీసుకొచ్చినప్పుడు అతడికో ఆలోచన వచ్చింది.
   
    షోరూమ్ ల ద్వారా కాకుండా పోస్ట్ ద్వారా అమ్మకం సాగిస్తే ఎలా వుంటుంది- అని!
   
    ఈ స్కీమ్ గానీ సఫలం అవుతే, ఈ చౌక రకం చీరెలు దేశాన్ని కనీసం నాల్గయిదు సంవత్సరాలపాటు ఊపేస్తాయనటంలో అనుమానం లేదు. మిల్లు ధరకీ అమ్మకం ధరకీ కనీసం నూటికి నలభై రూపాయలు తేడా వుంటుంది. అతడి స్కీము ప్రకారం, రకరకాల చీరెలు కట్టుకున్న ఆడవాళ్ళ బొమ్మలు ప్రకటనలో ఇవ్వాలి. టీ.వీ.ని బాగా ఉపయోగించుకోవాలి. ప్రతీ చీరెకీ ఒక నెంబరు, ప్రతీ రంగుకీ ఒక అక్షరం (A, B, C, D, ల్లాగా) ప్రతీ డిజైనుకి ఒక కోడ్ వుంటుంది. కావల్సిన కస్టమరు, పత్రికలోగానీ, టీ. వీ. లో గానీ తనకి నచ్చిన చీరె చూడగానే, ఆ కోడ్ నెంబర్ వ్రాస్తూ వందరూపాయలు పంపాలి. చీరె పోస్టులో వస్తుంది. వారం వారం కస్టమర్లని ఉక్కిరిబిక్కిరి చేసే డిజైన్లు ఒకదాని తరువాత ఒకటి వచ్చి పడుతుంటాయి. చౌక ధర - మారే ఫాషన్లు - కొత్తదానం - అన్నిటికన్నా ముఖ్యంగా షాపు ఖర్చులు లేకపోవటం - క్విక్ టర్నోవరు - ఇవన్నీ ఈ స్కీమ్ యొక్క ప్రత్యేకతలు చొక్కాల మీద ఎలా "డబుల్ బుల్ సి.డి." అని ముద్ర వుంటుందో, ఈ రకం ప్రతి చీరకీ అలా ఆర్.టి. అని వుంటుంది.
   
    రవి ఈ ఆలోచన చెప్పగానే అధికారుల్లో అన్ని స్థాయిల్లోనూ ఆమోదం లభించింది. ఇక ఈ ప్రతిపాదన డైరెక్టర్లకి వెళ్ళాలి. అక్కడ కొంత వ్యతిరేకథ వస్తుందని అతడికి తెలుసు. ముఖ్యంగా ఈ స్కీమ్ అనుకున్నట్టు విజయవంతం అవుతే, రవితేజ టెక్స్ టైల్స్, వస్త్ర ప్రపంచంలో శిఖరాగ్రం మీద నిలబడటం, ఒక తుఫానులాగా ఈ ఫాషను జనాల్ని వూపీయటం నిజమైతే అవ్వొచ్చేమోకాని, సోల్ డిస్ట్రిబ్యూటర్స్, షాప్స్ కొంతవరకూ దెబ్బతినవచ్చు. దీనివల్ల రవితేజ కంపెనీ ఉనికికే మోసం రావొచ్చు. అదీగాక దూరదర్శన్, పత్రికల్లో చీరెల్ని జనాలకి పరిచయం చేసి, వాటిమీద మోజు కలిగించటానికి లక్షలమీద ఖర్చు కావొచ్చు, స్కీమ్ దెబ్బతింటే ఇంత ఖర్చు పెట్టినదీ వృధా కావొచ్చు.
   
    కానీ ఏదో ఒకటి చెయ్యకపోతే ఎలా? చీరలు ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. చాలామంది వీటిమీద బ్రతుకుతున్నమాట నిజమేగానీ, పోటీ మార్కెట్ లో కొత్తదనం లేకపోతే కష్టం. ప్రతీ ఇంట్లోనూ కనీసం ఒక రవితేజ చీరె వుండాలని అనుకుంటే ధరలు తగ్గించాలి. బాగా 'పరిచయం' చెయ్యాలి.
   
    సమావేశం ముగిసింది.
   
    రవితేజ సంతృప్తుడయ్యాడు. మిగతా డైరెక్టర్లని ఒప్పించటం కొంచెం కష్టమయినా అసాధ్యం కాకపోవచ్చు.
   
    ఆ తరువాత ప్రియంవదతో మాట్లాడుతూ "థాంక్స్ ప్రియంవదా! నీతో మాట్లాడుతూ వుండగా వచ్చిన ఆలోచన మన కంపెనీ భవిష్యత్తుని నిర్ణయించబోతూంది" అన్నాడు.
   
    "మరి ఇంత ఆలోచన వచ్చినందుకు నా ఉద్యోగం పెర్మినెంట్ అవుతుందా?"
   
    "చూద్దాం" నవ్వేడు రవి. "స్కీమ్ సక్సెస్ అవుతే మాత్రం తప్పక చేయిస్తాను."
   
    "తప్పకుండా అవుతుంది సార్. ఒకటి మాత్రం నిజం. మీకు చెప్పగలిగేటంతదాన్ని కాదు కానీ, ఎప్పుడూ లాభాలు కాదు. మనిషికి సంతృప్తి కూడా ముఖ్యం. దేశంలో ఎంతోమంది తక్కువ ఆదాయం గల వాళ్ళున్నారు. వాళ్ళ భార్యలకి నాలుగయిదు చీరెలకన్నా ఎక్కువ వుండవు. అలాటి వారికి కూడా రవితేజ చీరెలు చేరుతున్నాయి- అంటే అంతకన్నా కావలసింది ఏముంది? మన్నికలేని వాటితో మోసపోయేవాళ్ళకి ఈ స్కీమ్ సాయం చేస్తుంది. దానికన్నా ముఖ్యంగా, తన భార్య ఓ పది కొత్త చీరలు కట్టుకుంటే చూడగలిగే అవకాశం లోవర్ ఇన్ కమ్ గ్రూప్ వారికి కలిగిస్తుంది. అది చాలదా?"
   
    "థాంక్స్ ప్రియంవదా! నేనా కోణంలోంచి ఆలోచించలేదు. నువ్వు చెప్పింది నిజమే. "మనస్ఫూర్తిగా అన్నాడు.
   
    "అదేమిటి సార్" అతడి చేతిలో కార్డు చూస్తూ ప్రశ్నించింది.
   
    "రేపు రావల్సింది ఈ రోజు వచ్చింది నా బర్తడే కార్డు" పక్కణ పడేస్తూ అన్నాడు.
   
    "రేపు డైరెక్టర్స్ మీటింగ్ కి నేను వుండాలా? ఆదివారం కదా."

    "అవసరంలేదు. వస్తేరా ఎల్లుండి మాత్రం సాయంత్రం ఎక్కువసేపు వుండాల్సి వుంటుంది."
   
    ఆమె తలూపి, వెళ్ళిపోయింది.
   
    ఆ సాయంత్రం వరకూ అతడు తన స్కీమ్ గురించి ఆలోచిస్తూనే వున్నాడు. సాయంత్రం ఇంటికొచ్చేసరికి మాధవి కొత్త చీర నొకదాన్ని పట్టుకుని ఎదురొచ్చింది. "ఎలా వుంది? రేపు కట్టుకోవటానికి కొన్నాను" అంది నవ్వుతూ.
   
    రవితేజకి ఎందుకో తెలియని సంతోషమేసింది.
   
    "మా కంపెనీ చీరలు ఏవైనా బాగానే వుంటాయి మాధవీ" అన్నాడు తనుకూడా నవ్వుతూ.
   
    "నేను కట్టుకుంటే-"
   
    "బ్రహ్మాండంగా వుంటుంది."
   
    "రేపు చాలామంది వస్తారు. అందుకని ప్రత్యేకంగా కొన్నాను." "చాలామందిని పిలిచావా?"
   
    "ఆ....మీరుకూడా రాకూడదూ?"
   
    ఏదో అనుమానం అతడిలో చిన్నగా ప్రవేశించి "ఎక్కడికి?" అని అడిగాడు.
   
    "కార్తీకమాసం కదా, రాత్రికే వెళ్తున్నాం అందరం. అఫ్ కోర్స్ ఆడవాళ్ళే ఎక్కువ అనుకోండి. కానీ మిమ్మల్ని అడిగినా మీరెలాగూ రారని అడగలేదు. మీకు భార్యకన్నా మీ కంపెనీయే ముఖ్యం కదా-"ఆమె మామూలుగా చెప్పుకుపోయింది.
   
    అతడు మ్లానమైన వదనంతో అక్కన్నుంచి తొలగిపోయాడు.
   
                           *    *    *
   
    రాత్రి పదకొండున్నర దాటింది.
   
    తన బెడ్ రూమ్ లో అతడు పడుకుని వున్నాడు. ఇంట్లో ఎవరూ లేరు. అంతా నిశ్శబ్దంగా వుంది.
   
    అతడి మనసు కూడా ఆ గడిలాగే స్థబ్దంగా వుంది. ఏమీ ఆలోచన్లు లేవు. నిద్రకూడా పట్టటంలేదు.
   
    సరిగ్గా 12-01 గంటలకి ఫోన్ మ్రోగింది. అతడు రిసీవర్ ఎత్తి- 'హల్లో' అన్నాడు.
   
    "సారీ సర్. నేనూ ప్రియంవదని రిటర్న్స్ ఆఫ్ ది డే...."
   
    అంత అర్దరాత్రి అలా ఊహించని రీతిలో వచ్చిన ఫోను అతడిని కొంచెంసేపుపాటు ఆలోచనారహితుడ్ని చేసింది.
   
    ".....ఈ రోజు మీ బర్త్ డే అని చెప్పారుగా అందరికన్నా ముందు నేనే విష్ చెయ్యాలని సరీగ్గా పన్నెండు దాటగానే ఫోన్ చేశాను! మీ నిద్ర డిస్టర్బ్ చేస్తే సారీ సర్".
   
    అతడు కదిలిపోయాడు. అతడి అన్నేళ్ళ జీవితంలో ఆ విధమైన అనుభూతి అదే మొదటిసారి.
   
    "ఎక్కడనుంచి చేస్తున్నావు ప్రియంవదా?"
   
    "మా ఇంటికి ఎదురుగా ఇరానీ హోటల్ వుంది సార్. అక్కన్నుంచి కాల్ కి రూపాయన్నమాట. అందరూ నావైపే చిత్రంగా చూస్తున్నారు సార్. అర్దరాత్రి ఇలా వచ్చి చేస్తున్నందుకు... వుంటాను సార్. మెనీమెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే....." ఫోన్ పెట్టేసింది.
   
    అతడూ రిసీవర్ పెట్టేసి - మంచంమీద పైకప్పుకేసి చూస్తూ వెల్లకిలా పడుకున్నాడు.
   
    గుండెల్లో చిలికినట్టు వుంది.
   
    ఆ రాత్రంతా అతడు నిద్రపోలేదు. ఏవేవో ఆలోచనల్తో గడిపాడు. అతడి ఆలోచనల్లో మిస్ విజయవాడ కూడా చోటుచేసుకుంది. ఆమెమీద ఒక రకమైన విజయం సాధించినట్టుగా వుంది అతడికి! తనని రెచ్చగొట్టి, అవమానం చేసిన ఆమెకి, తనంటే అభిమానం పెంచుకుంటూన్న ఆమె ద్వారా, తను సమాధానం చెపుతున్నట్టు భావించాడు.
   
    ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మామూలు బలహీనతలకి అతడు అతీతుడేమీ కాదు. ఆప్యాయత పట్ల నిద్రాణమై వున్న దాహం మొదట ఒక స్త్రీ చేత మేల్కొలపబడింది. మరొక స్త్రీ చేత ఉరకలు వేయిస్తూంది. అది పూర్తిగా సెక్స్ కూడా కాదు. స్త్రీ పురుషులకి అవతలివారి దగ్గిర దొరికే ఓదార్పు, గుర్తింపు అంతే.
   
    ఆ మరుసటిరోజు అతడు తన డైరెక్టర్స్ ఈ పథకం వివరాలు చెప్పాడు. ఒకరిద్దరు డైరెక్టర్సు తప్ప మిగతా అందరూ వెంటనే హర్షామోదాలు తెలియజేసారు. అంత సపోర్టు వారినుంచి లభిస్తుందని అతడు అనుకోలేదు. వారు కూడా అతడిలాగే "ఏదో ఒకటి చెయ్యకపోతే లాభంలేదు" అన్న ఆలోచనలో వున్నారు.
   
    ఈ పథకాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకొని ఇద్దరు డైరెక్టర్లలో శర్మ కూడా ఒకరు.
   
    "ఇప్పుడు బాగానే వుంది కంపెనీ! లాభాలు కూడా బాగానే వస్తున్నాయి. ఎందుకింత రిస్కు తీసుకోవటం?" అని వాదించాడా పెద్దాయన. "ఇప్పుడు ఈ కొత్త పద్దతిలో కోటి రూపాయలదాకా ఖర్చుపెట్టాలి. రెండు మూడు సంవత్సరాల దాకా డివిడెండ్స్ ఉండవు. ఇంత చేశాక మన ప్రయత్నం విఫలమవుతే అంతా వృధా నా కెందుకో ఆడవాళ్ళు చీరల్ని షాపుల్లో కొంటానికే ఇష్టపడతారు తప్ప ప్రకటనలు చూసి కొనరు-"

 Previous Page Next Page