Previous Page Next Page 
రేపల్లెలో రాధ పేజి 26


    కన్నవాళ్ళు దిగారు.  సారెతో పంపిన వాళ్ళకి పాడెమీదకి ఎక్కి కనపడింది కన్నకూతురు. ఆ ముసలి తల్లి గుండె పగిలేట్లు ఏడుస్తోంది.
    
    "ఎంత పెంకిదైనా ఇంత పెడసరంగా ప్రాణాలు తీసుకుంటుందని అనుకోలేదమ్మా... ఎటువంటి వంశమో తెలుసుకోకుండా పిల్ల చక్కనిదని చేసుకున్నందుకు ఎంతచేటు తలవంపులు తెచ్చి పెట్టిందమ్మా మాకు!" అని చచ్చిన పిల్లని,. ఆమె వంశాన్ని కూడా తిడుతూ శోకాలు పెట్టింది అత్తగారు.
    
    ఆ అమాయకురాలికి దేవుడు ఒక్కసారి నోరిస్తే జరిగిందేమిటో చెప్పి వీళ్ళ బండారం బయటపెట్టేది! అనుకుంది కసిగా రాధ.
    
    "నీకేం.... ఇంకా చిన్నవయసే... పోయిన వాళ్ళతో పోతామా?" ఎవరో ఆడపిల్లల తండ్రి ఆ పిల్ల మొగుడికి అన్యాపదేశంగా 'పెళ్ళికొడుకువి అయ్యావు సుమా!' అని హెచ్చరిస్తున్నాడు.
    
    రాధ మనసు వికలం అయింది. అదే ఆ పిల్లకి బదులు ఇతడు పోయుంటే ఆ పద్దెనిమిదేళ్ళ పిల్లకి ఈపాటికి నానా వికృతాలూ చేసుండేవారు ఈ పెద్ద మనుష్యులు.
    
    "రాధమ్మా.....ఇంటికి పోదాంపద!" అన్నాడు ఆమె దగ్గరకొచ్చి ప్రకాశం.
    
    రాధ చిన్నాన్నతో నడుస్తూ, "ఎందుకు చిన్నాన్నా ఆ అమ్మాయి చచ్చిపోవడం? వాళ్ళని ఎదిరించి భర్తని తీసుకుని దూరంగా పోయి బతకొచ్చుగా" అంది.
    
    "ఔనమ్మా....బాగా చెప్పావు. తొందరపడింది!" బాధగా అన్నాడు ప్రకాశం
    
    రాధ చిన్నాన్న చేతిని గట్టిగా పట్టుకుంది.
    
    "చీకటమ్మా..... చూసి నడు...." అన్నాడు ప్రకాశం. అతనికి రాధంటే పంచప్రాణాలు. చనిపోయిన పిల్ల రాధ ఈడుదే. ఆ అమాయకమైన మొహంలో రాధ కనిపించి అతని మనసు వ్యాకులమవుతోంది.
    
    "ఊళ్ళో ఇంతమందుండీ ఏం చెయ్యలేకపోయాం!" అన్నాడు.
    
    "ఆ పిల్ల నోరు తెరిచి సీతమ్మకి కూడా చెప్పుకున్నట్టు లేదు తన కష్టాలు!" అంది రాధ.
    
    "ఔనమ్మా.... ఆడపిల్లకి నోరు విప్పే ధైర్యం ఉండాలి!" అన్నాడు సాలోచనగా ప్రకాశం.
    
    ఇద్దరూ ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తూ ఇల్లు చేరారు.
    
    
                                                                * * *
    
    ఆ రాత్రి బండికి సుబ్బారాయుడి ప్రయాణం.
    
    పార్వతి శకునం వచ్చింది.
    
    తాయారమ్మ వెనకనుండి జాగ్రత్తలు చెప్తూనే ఉంది.
    
    రాధ తండ్రితో ఏదో చెప్పాలని ఆరాటపడి ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. తండ్రి మాధవ్ ని చూడబోతున్నాడన్న తలపే ఆమెను ఆనందలోకాల్లో విహరించేట్టు చేస్తోంది. గుండె గుప్పెట్లో దాచిపెట్టిన సంపెంగ భావనలు ఆయనచేత ఎలా పంపించాలో అర్ధంకాక ఉక్కిరిబిక్కిరైంది.
    
    ప్రకాశం అన్నగారితో స్టేషన్ కి వెళ్ళాడు.
    
    బండి రావడానికి ఇంకా సమయం ఉంది.
    
    సుబ్బారాయుడు గట్టిగా చుట్ట పొగ పీల్చి వదిలి, "కడుపు తరుక్కుపోతుందిరా ప్రకాశం!" అన్నాడు.
    
    "ఏం?" అడిగాడు ప్రకాశం.
    
    "అదే చలమయ్య కోడల్ని తలుచుకుంటే!" అన్నాడు.
    
    "పాపం..... నోరులేని పిల్ల ..." అన్నాడు  ప్రకాశం.
    
    సుబ్బారాయుడు కాసేపు ఊరుకుని తర్వాత దిగులుగా "మన రాధ కూడా నోరులేనిదిరా ప్రకాశం! లోకం అంతా అమ్మా నాన్నలంతా ప్రేమగా, పిన్ని అంత మంచిగా, చిన్నాన్నంత స్వచ్చంగా, అత్తలంత ఆప్యాయంగా ఉంటుంది అనుకుంటుందిరా!" అన్నాడు.
    
    "ఆ పిల్లకీ, రాధకీ పోలికెందుకు అన్నయ్యా, మాధవ్ వజ్రంలాంటివాడు!" అన్నాడు ప్రకాశం.
    
    "మాధవ్ వజ్రమే, కేశవుడూ బంగారమే... కానీ మిగతావాళ్ళ సంగతేమిటో?" అన్నాడు సుబ్బారాయుడు.
    
    "కొత్తగా మాట్లాడుతున్నావేంటి అన్నయ్యా? రాధని ఇలాంటి పెద్దకుటుంబంలో ఇవ్వడంలేదుకదా అత్తామామా తప్ప ఎవరున్నారనీ?" అన్నాడు ప్రకాశం.
    
    "వాళ్ళు మాత్రం ఎందుకురా? అమ్మాయీ, అబ్బాయీ చిలకా గోరింకల్లా ఉండకుండా అడ్డు" అన్నాడు సుబ్బారాయుడు.
    
    "పోనీ ఆ కుర్రాన్ని ఇల్లరికం తెచ్చుకుందామా?" అడిగాడు ఆశగా ప్రకాశం.
    
    సుబ్బారాయుడు చిరాగ్గా చూసి, "ఈ సంతలో అదీ, అల్లుడూకూడా కనీసపు స్వేచ్చ లేకుండా పడిఉండాలనా నీ ఉద్దేశం? మీ వదినకి పూలు ముడవాలంటే సిగ్గు. రెండో జామువరకూ గదిలోకి రావాలంటే సిగ్గు. అంతెందుకూ.....శాంతని.....ఒంటరిగా తీసుకెళ్ళి నువ్వు ఏదైనా సినిమా చూడగలిగావా?" అన్నాడు.
    
    "నిజమే!" ఒప్పుకున్నాడు ప్రకాశం.
    
    రైలు వస్తున్న కూత విని చెప్పాడు తమ్ముడితో, "నువ్వూతోడొస్తే బావుండేదిరా!"
    
    ఊళ్ళో ఎవరినైనా గడగడలాడించే అన్నగారికి కూడా ఆడపిల్ల తండ్రిగా సంబంధం విషయం అడగడానికి వెళ్లేందుకు దడగా ఉంది. ఎవరు పెట్టిన ఆచారమో..... ఎందుకొచ్చిన సంప్రదాయమో! అనుకున్నాడు ప్రకాశం.
    
    "జానకీవాళ్ళ ఊరికి ఆడవాళ్ళని మాత్రమే ఎలా పంపుతానూ? పైగా మేనమామల్లో ఒక్కళ్ళైనా వెళ్ళకపోతే దానికి అత్తవారిముందు తలవంపులు కాదూ!" అన్నాడు ప్రకాశం చెల్లెల్ని తలుచుకుని ఆపేక్షగా.
    
    పొలంవైపు వెళ్తూ వుండు. ఈ నాలుగు రోజులూ ఇల్లు జాగ్రత్త! మీ వదినకి తలనొప్పి వస్తే ఆచారిగారిని పిలిపించు. అమ్మ వేళకి అన్నం తింటుందో లేదో కనుక్కుంటూ ఉండు. లక్ష్మికి లేత గడ్డిపరకలు వేస్తున్నారో లేదో కనుక్కో ఆ గణపతిగాడిని ఓ కంట కనిపెట్టి ఉండు..... ఇంట్లో విత్తనాలు కొనడానికి పెట్టిన డబ్బుంది. రాధని ఒంటరిగా ఎక్కడికి పంపకు. చంటాడ్ని కొట్టకండి..... వార్తల తాతయ్య దగ్గు తగ్గకపోతే ఇంగ్లీషుమందు తెప్పిందు!" అని రైలెక్కేదాకా సుబ్బారాయుడు జాగ్రత్తలు చెపుతూనే ఉన్నాడు.
    
    అతని శరీరం ప్రయాణమైనది కానీ మనసు ఆ మట్టినీ, గాలినీ వదిలి రానని మొండికేస్తోంది అని ప్రకాశానికి అర్ధమైంది.
    
    "అన్నీ నే చూసుకుంటాగానీ.... నువ్వు కులాసాగా వెళ్ళి శుభంగా తిరిగిరా! కేశవుడ్నీ, చెల్లమ్మనీ అడిగానని చెప్పు" అన్నాడు ట్రైన్ వెంట పరిగెత్తుతూ ప్రకాశం.
    
    "అలాగే...... జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు!" తల బయటికి పెడుతూ చివరిసారిగా హెచ్చరించాడు సుబ్బారాయుడు.
    
                                                             * * *
    
    "నా కుడి కన్ను అదురుతోందేమిటి నానమ్మా?" అంది రుక్మిణీ కళ్యాణం పుస్తకం మూసిపెడుతూ రాధ.

 Previous Page Next Page