Previous Page Next Page 
హృదయాంజలి పేజి 24

   
    "మీ అభిప్రాయం పూర్తిగా పొరబాటు సర్! ఒక పత్రికనైనా, ఒక వస్తువునైనా కొనిపించాలంటే ఎదుటివ్యక్తిని ఆకట్టుకోవడమనేది ముఖ్యమైన టెక్నిక్. ఆ ఆకట్టుకోవడంలో అందం ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. చూడ్డం లేదా సార్! వ్యాపార ప్రకటనల్లో అందమైన లలనామణుల్ని ఎలా ఉపయోగించుకుంటున్నది!"

     "మనలో దిగజారిన సంస్కృతికి నిదర్శనమది! అందమైన అమ్మాయిలను ఎరగా చూపి మా పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవాలనుకోవడం లేదు నేను. మా పత్రిక విలువలు ప్రజలకు తెలియజెప్పడానికి మాకు అందమైన యువతులు అక్కరలేదు" ఆయన సీరియస్ గా అన్నాడు.

    "నా అభిప్రాయం అదికాదుసార్! మీరు పూర్తిగా పొరబాటుగా అర్ధం చేసుకున్నారు. ఒక ఇంటి తలుపులు తెరిపించి, ఆ ఇంటి గృహిణికి మనం చెప్పే రెండు మాటలు వినిపించడానికి, రెండు నిమిషాలు కూర్చోబెట్టడానికయినా కొంచెం ఆకర్షణీయమయిన ముఖం వుండాలంటే అందులో మీకు కనిపించిన దిగజారుడుతనం ఏమిటో నాకు అర్ధంకావడంలేదు"

    "అవన్నీ చీప్ ట్రిక్స్ అని నా అభిప్రాయం"
 
    "మీ పత్రికకు అష్టావక్రులు, కుబ్జలుకావాలని ప్రకటించి ఉంటే బాగుండేది! నాకు ఇంతదూరం వచ్చే శ్రమ తప్పేది!" చిన్నబుచ్చుకొన్న ముఖంతో లేచింది.
 
    "మాకు ముఖ్యంగా కావాల్సింది వాక్చాతుర్యం! అది నీ దగ్గరుంది! కూర్చో!" అతడు ముఖంలోకి కొద్దిగా నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు.  "చూడమ్మాయ్! పత్రిక పెట్టడమన్నది వ్యాపారమే,. అయినా నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయ్! ఎట్టి పరిస్థితిలోనూ వాటికి భిన్నంగా నడుచుకోను! నా ఎడిటోరియల్స్ చదివితో నేనేమిటో నీకు అర్ధమవుతాను!"
 
    "ఇప్పుడు మీరు నాకు అర్ధం కావడం కాదు, సార్! నేను మీకు అర్ధంకావాలి! ఎందుకంటే ఉద్యోగం కోసం వచ్చింది నేను కాబట్టి! పొట్ట చేతబట్టుకొని పట్నం వచ్చినవాళ్ళం! కష్టపడి చదువుకొన్నాను! ఇంట్లో బెడ్ మీదున్న కుంటి తండ్రి, ఇంకా చదువు పూర్తికావలసిన చెల్లి......నా తండ్రి మందులు లేకుండా మృత్యువుకు అప్పగించ కూడ దనుకొన్నా, నా చెల్లికి చదువు ఆగిపోకుండా చూడాలన్నా నాకు తక్షణం ఉద్యోగం కావాలి?"
 
    ఆయన కొంచెం హర్ట్ అయినట్టుగా చూశాడు.

    "ఇంతవరకు నువ్వుచేసిన ఉద్యోగాలేమిటి?"
 
    "ఎన్నని చెప్పను? పన్నెండేళ్ళ పిల్లగా బ్రతుకుదెరువుకోసం పోరాటం మొదలుపెట్టాను. ఇంటింటికి వెళ్ళి సోపులమ్మాను. పాలపాకెట్లిచ్చాను! బట్టలుకుట్టాను! ఇరుగు పొరుగులకు బజారు పనులు చేసి పెట్టాను! ఇంటర్ పాసయ్యాక కాన్వెంట్లలో టీచరుగా చేశాను!"
 
    "మరి ఆ ఉద్యోగం ఎందుకుపోయింది?"
 
    "ఆ కాన్వెంటు నడిపే ప్రిన్సిపాల్ ఒక మగవాడు! ఆడపిచ్చున్న మగవాడు. అతడి చేష్టలకు సై అనలేదు నేను. ఏవో కుంటిసాకులు చెప్పి నన్ను ఉద్యోగంనుండి తీసేశాడు."
 
    "ఆడపిచ్చున్న మగవాడు అతడొక్కడేకాదు! ఈ ప్రపంచంలో ఇంకా చాలా మందున్నారు! ఆడవారి అభివృద్ది నిరోధకుడివని నువ్వన్నా సరే! ఎంతో అవసరమైతే తప్ప ఆడవారు ఉద్యోగాలకు ఎగబడకపోవడమే మంచిదంటాను. ఏం? ఆడది ఇల్లు, వంటవార్పు చూచుకోవడం గౌరవం కాదా? జీతం భత్యంలేని బానిస చాకిరి అని మీ ఆడవాళ్ళ ఆర్గ్యుమెంట్ కావచ్చుగాని, ఇల్లు తనదే అయినప్పుడు ఎవరికి బానిస? ఆఫీసుల్లో స్కూళ్ళలో ఎవరి చేతిక్రిందో పనిచేయడం చాకిరీకాదుగాని తన ఇంట్లో చేసేది చాకిరీ ఎలా అవుతుంది? ఇక ఆర్ధిక స్వాతంత్ర్యమని మీరు ముద్దు ముద్దుగా పేరు పెట్టారే! చీరలకి, నగలకి షికార్లకి - విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికే కదా మీ ఆర్ధిక స్వాతంత్ర్యం?"
 
    "సర్! నేనిదంతా ఆలోచించే స్థితిలోలేను! నా వాళ్ళకింత తిండి పెట్టి నేను బ్రతకడానికే నాకు ఉద్యోగం కావాలి! కాని, మీరు కోప్పడనంటే ఒక మాటంటాను. ఈ దేశంలో చాలామంది స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు ప్రభుత్వంలోనో, ప్రైవేటుగానో!  ఈ మండేధరలకీ, పెరిగిన అవసరాలకీ సంసార నావలు పల్టీకొట్టకుండా తనూ తెడ్డందుకొంటూంది గాని విచ్చలవిడిగా తనసరదాలు తీర్చుకోవడానికి ఉద్యోగం చేసే ఆడవారి సంఖ్య బహు స్వల్పమని నా ఉద్దేశ్యం!"

    "స్వజాతి అభిమానం దండీగానే ఉందన్నమాట! గుడ్! జాతీయాభిమానాన్ని నేను గౌరవిస్తాను!" అని చిన్నగా నవ్వాడు.

    "అయితే ఇప్పుడు నీకు ఉద్యోగం అత్యవసరమన్న మాట. ఆడపిల్లలు ఇలాంటి ఉద్యోగాలు చేయడం నాకిష్టం లేకపోయినా నీ అవసరాన్ని బట్టి ఇస్తాను. ఎదురయ్యే సమస్యలేమైనా పూర్తి బాధ్యత వహించాలిసింది నువ్వే!"

    "అలాగే, సర్! నేను చేసే ఉద్యోగంలో సమస్యలు ఎదురైతే ఎదురుకావచ్చు! వాటిని అధిగమించగలనన్న ధైర్యం నాకుంది!"

 Previous Page Next Page