Previous Page Next Page 
హృదయాంజలి పేజి 25

        "నీలాంటి సాహస యువతి మా స్టాఫ్ లో ఉండడం నాకు గర్వకారణమే! కాని, అపహాస్యం పాలుకాకుండా చూచుకోవాల్సిన బాధ్యత నీది! వారంరోజులు ట్రైనింగ్ లాంటిది ఉంటుంది! వారం తరువాత అపాయింటుమెంటు ఇస్తాను!"

                                *    *    *

    వారం రోజుల ట్రైనింగ్ తరువాత ఒక మంచిరోజున అపాయింట్ మెంటు ఆర్డర్ ఇచ్చాడు ఉషోదయం ఎడిటరు పరంజ్యోతి గారు. ఆయనే ఆ పత్రిక వ్యవస్థాపకులు కూడా.

    అతడి గురించి ముందుగా రెండు ముక్కలు చెప్పుకోవాలి! అతడు బ్రాహ్మడు. బ్రాహ్మణాభిమాని. తిధివార నక్షత్రాలు చూసే అలవాటుబాగా వుంది! స్త్రీలపట్ల గౌరవాభిమానాలున్నవాడు. ఎప్పుడూ వాపోతూంటాడు. "ఈ ఆడవాళ్ళు స్వేచ్చా స్వాతంత్ర్యాలంటూ ఘోష పెడుతూ వీధినిబడి ఉద్యోగమంటూ నానా అగచాట్లూ పడుతున్నారే! మరి ఇంట్లో చాకిరీ అయినా తెలివిగా మగవాడి మెడకు చుట్టగలుగుతున్నారా? అదీ లేదు. ప్రసవ దగ్గర నుండి, ఇంట్లో వంటా వార్పు దగ్గరినుండి అంతా తమ పోర్ట్ పోలీయో క్రిందే ఉంచేసుకొన్నారు! ఇదెంత తెలివి తక్కువ తనమో చూడు! నెలంతా శ్రమపడి తెచ్చుకొన్న జీతమైనా తమ ఇష్ట పూర్తిగా ఖర్చుపెట్టుకో గలుగుతుననారా అంటే అదీ లేదు. మగవాడి రాజముద్ర పడందే కనీసం చీరైనా కొనలేని ఆడవాళ్ళెంత మందిలేరు? అందుకే అంటాను, ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం అనవసరమనీ! ఇంటిపట్టు నుండడమే శ్రేయోదాయకమనీ!"

    విని విని విసుగ్గా అంటుంది అపురూప.  "స్వేచ్చా స్వాతంత్ర్యాలంటూ బయటికి వచ్చిన ఆడదాన్ని కాదు, సర్! కేవలం నా వాళ్ళని పోషించుకోవడం కోసమే వచ్చాను. నాకెందుకు చెబుతారు ఈ మాటలన్నీ?"
 
    "ఈ సిద్దాంతం నుండి నిన్ను మినహాయించాను పో!" అంటాడు యమధర్మరాజు సావిత్రికి వరాలిచ్చిన పోజులో.

    అతడిలో స్వోత్కర్ష ఎక్కువ! మాటిమాటికి తనకు ఎంత విలువైన సిద్దాంతాలున్నాయో చెబుతాడు.

    "ఉద్యోగం చేస్తున్న ఆడదీ, చెయ్యని ఆడదీ ఇద్దరూ జైలు జీవితం గడుపుతున్నారని నేనొప్పుకొంటాను,
 సర్! కాని, ఉద్యోగం చేస్తున్న ఆడది జైలు తలుపులకు తనే తాళం వేసుకుని తాళంచెవి తన దగ్గరపెట్టుకోగలుగుతుంది. కావాలనుకొన్నప్పుడు తీసుకోవాలన్నప్పుడు తీసుకొని బయటపడగలుగుతుంది. ఆ తేడా మీరు గుర్తించాలి దయచేసి"
    "ఏమో అనుకొన్నాను! నీకు చాలా తెలుసే!" ప్రశంసగా చూశాడు.

    ఇల్లరికపు అల్లుడిగా చాలా ఆస్తి కలిసి వచ్చింది ఆయనకు. అయినా తనకు డబ్బు పిచ్చిలేదని, సమాజంలో విలువలకోసం పోరాడుతుంటానని చెబుతుంటాడు.

    "అప్పనంగా వచ్చిన ఆస్తికదా? ఆదర్శాలపేరుతో హరీమనిపించక ఏం చేస్తాడు? చెమటోడ్చితే తెలిసేది డబ్బు విలువ!" అని వెటకారం చేస్తుంటారు తెలిసినవాళ్ళు.

    ఏమైనా పరంజ్యోతిగారిది ప్రత్యేకమైన వ్యక్తిగతంగా గుర్తించింది అపురూప. కొన్ని చాదస్తంగా కనిపించినా చాలా విషయాల్లో ఉదారంగా ప్రవర్తించే మనిషి ఆయన.

                              *    *    *

    మొదటిరోజు పత్రిక కాన్వాసింగుకి బయల్దేరుతూ కొంచెం ప్రత్యేకంగా అలంకరించుకొంది అపురూప.

    ఎప్పుడూ నిరాభరణంగా, నిరాడంబరంగా ఉండే ఆమె ఆ రోజు మెళ్ళో ముత్యాలదండ వేసుకొని, ఎర్రని నక్షత్రాల కమ్మలు పెట్టుకొంది. ఉన్నదాంట్లో మంచి చీరకట్టింది. మాచింగు గాజులు, మాచింగు బొట్టు పెట్టుకుంది.

    "అబ్బ! ఎన్నాళ్ళకి నువ్వు అలంకరించుకోవడం చూశాను! ఏమిటి విశేషం?" కనుగీటి అడిగింది అర్పిత.

    "ఈ రోజు నుండి క్రొత్త ఉద్యోగమన్నమాట!"

    "క్రొత్త ఉద్యోగమా?" ఆశ్చర్యంగా అడిగింది.

    "ఉషోదయం పత్రికలో చేరాను! వారం రోజులు ట్రైనింగు తర్వాత ఈరోజు డ్యూటీ ప్రారంభం"

    "ఏం ఉద్యోగం? ఎంత జీతం?"
 
    "పత్రిక రిప్రజంటెటివ్ గా ఇంటింటికీ తిరిగే ఉద్యోగం! జీతం అంతా కలిపి నాలుగంకెలు దాటుతుంది! అంటే వెయ్యి పైనన్నమాట!"

    "నాన్నగారూ! ఇది ఇంటింటికీ తిరిగి పత్రిక పబ్లిసిటీ చేస్తుందట!"

    ఆయన అసహనంగా ముఖం చిట్లించి అన్నాడు "ఆడపిల్ల గడప దాటితేనే ఎన్నో నిందలు! ఇక గడపగడపకీ తిరిగే ఉద్యోగమంటే వద్దమ్మా!ఇంతవరకు మనల్ని దరిద్రం ఒక్కటే పీడిస్తూంది! ఇక అపవాదులు కూడా పీడిస్తే మన బ్రతుకులు మరీ నరకమౌతాయమ్మా!"

 Previous Page Next Page