పత్రిక పబ్లిసిటీకోసం రిప్రజెంటు కావలెనన్న ఉషోదయం పత్రిక ఇచ్చిన ప్రకటన అది! అభ్యర్ధికి కావలసిన అర్హతలూ, వయస్సు వగైరా ఇచ్చి వాళ్ళిచ్చే జీతభత్యాలుకూడా ప్రకటించారు. నాలుగంకెల్లో ఉంది జీతం ఎన్నడూ మూడంకెలు మించి చేయలేదు తను. ఆడపిల్ల ఒక పత్రికకు పబ్లిసిటీ ఇచ్చి సేల్స్ పెంచడమనేది కొంచెం కష్టతరమైన విషయమే! ఐతే అది తను చేయలేని పనిమాత్రం కాదు. కాన్వెంటులో టీచరుగా చేయకముందు ఇంటింటికీ వెళ్ళి సబ్బులూ, పౌడర్లూ, అగరొత్తులూ అమ్మిన అనుభవం ఉంది తనకు. అదేకాదు తమ్ముడికి ఇంటింటికి వెళ్ళి పేపరు వేసే పని ఉండేది. జ్వరంవచ్చి మరే అనివార్య మైన కారణంచేతో ఒకరోజు వెళ్ళకపోయినా వాళ్ళఏజంటు పనిలోంచి తీసేసేవాడు. వాడు వెళ్ళలేక పోయినప్పుడు సైకిల్ మీద తను వెళ్ళి వచ్చేది. కాస్త చీకటి చీకటిగా ఉండగానే పేపరు గుమ్మంలోంచో, కిటికి లోంచో పడేసి వచ్చేది కాబట్టి ఎవరి వింత చూపులూ ఎదుర్కోవలసి వచ్చేది కాదు!
ముసలాయన వెళ్ళాల్సిన బస్సు వచ్చినట్టుంది, పేపరు ఆదరాబాదరా మడిచి పరిగెత్తబోయాడు.
"ఒక్క నిమిషం తాతగారూ! కొంచెం ఈ అడ్రసు నోటు చేసుకొంటాను"
"భలేదానివమ్మా! ఒక నిమిషం ఆగితే నా బస్సు తుర్రుమంటుంది. మళ్ళీ బస్సుకోసం పడిగాపులు ఎంతసేపు పడాలో" ఆగకుండా అన్నాడాయన.
"అరనిమిషం తాతగారూ!"
"తాతగారట తాతగారు! తెల్ల జుట్టు వచ్చినంతమాత్రాన తాత గారిలా కనిపించానా నీకు?" ఆయన చురచుర లాడిపోయాడు.
"పొరపాటైపోయింది బాబాయిగారూ!"
"నీకు కావలసింది పత్రికేకదా? తీసుకో! ఈ దేశంలో న్యూస్ పేపర్స్ బెగ్గర్స్ కి కొరతేమీ లేదుకదా? అందుకే ఈ దేశం ఇలా తగలబడింది!"
క్రిందపడిన పేపరు అందుకొని, వివర్ణమైన ముఖాన్ని పైకెత్తి చూసేసరికి కదిలిన బస్సుకు వ్రేలాడుతూ కనిపించాడాయన!
ముసలాడిని ముసలాడంటే ఎంతకోపం వచ్చింది? ఎంతమాటన్నాడు! పత్రికలో అడ్రసు నోటు చేసుకొంటానని వెంటపడితే బెగ్గర్ గా కనిపించానా వీడికళ్ళకి? వీడిమొహం మండా! ఎక్కడైనా కాస్త నల్ల జుట్టుంటే అదికూడా తెల్లబడిపోనూ! టక్కున వీడినడుంఒంగిపోయి కర్రసాయం రానూ!
ఉద్యోగం పోయిన బాధ నుండి తప్పించుకోవడానికి తనే జోక్ వేసుకుని నవ్వుకొంది అపురూప.
ఉద్యోగం పోయిందని ఇంట్లో చెప్పలేదు.
మరునాడు ఉదయం స్కూలుకు వెళ్ళే టైంకే ఇంటినుండి బయల్దేరి తను పుస్తకాలు తెచ్చుకొనే పబ్లిక్ లైబ్రరీకి వెళ్లి కూర్చొని, అప్లికేషన్ వ్రాసి ఉషోదయంపత్రిక్కి పోస్టు చేసి లైబ్రరీమూసే సమయానికి బయటికి వచ్చి, దగ్గరేవున్న పార్కులో కూర్చొని, లైబ్రరీ నుండి తెచ్చుకున్న పుస్తకం తెరిచింది.
రోజూ స్కూలునుండి వచ్చే సమయానికి ఇల్లు చేరుకోవడం.
నాలుగురోజులు గడిచాక పత్రికాఫీసునుండి కాల్ లెటర్ వచ్చింది.
* * *
ఇంటర్వ్యూకు వచ్చిన అభ్యర్దులు ఐదారుగురికి మించి లేరు వాళ్ళంతా మగవాళ్లే! తనొక్కటే ఆడపిల్ల. కొంచెం గుబులుగా అనిపించినా మనసుకు ధైర్యం చెప్పుకొంది.
ముందు మగవాళ్ళ ఇంటర్వ్యూ ఐపోయింది. చివరగా అపురూప.
గదిలో అడుగు పెట్టగానే ఎడిటరుగారి కళ్ళలో ఆశ్చర్యం కదలాడింది.
మగవాళ్ళు మాత్రమే చేయగలిగిన పనులకు సైతం ఆడపిల్లలు తయారై ముందుకు వస్తున్నమాట నిజమే! పోలీసు ఉద్యోగాలకైతే నేమి, కండక్టరు ఉద్యోగాలకైతేనేమి, చివరికి పైలెట్ టాక్సీ డ్రైవర్లుగా నైతేనేమి -కాని సందుసందునా, గడపగడపకీ తిరిగే ఉద్యోగాలకి ఆడపిల్లలు తయారు కావడమన్నది అరుదైన విషయమనిపించింది ఆయనకి
అపురూపను ముందున్న సీట్లో కూర్చోమనిచెప్పి ఆమె అప్లికేషన్ పైకే చదవసాగాడు. "సి.అపురూప. బి,కామ్, ఫస్టుక్లాసు.... గుడ్... సి అంటే ఏమిటమ్మా?"
"సింగారం అండీ!"
"పత్రిక సేల్సు పెంచడానికి సింగారంవాళ్ళు అక్కరలేదుకదా? వర్క్ చేసేవాళ్ళు కావాలి!" ఆయన అదో జోక్ గా అన్నాడు. మనిషి నడివయసులో ఉంటాడు. లావుపాటి అద్దాల వెనుక విజ్ఞానం వెదజల్లు తున్నట్టుగా ఉండే కళ్ళు తెల్లటి లాల్చీ పంచెకట్టులో ఎడిటరు అన్న సీటుకు చక్కగా అమరినట్లుగా ఉన్నాడు.
"మా ఇంటిపేరు సింగారమే ఐనా నేను కష్టపడి పనిచేసేదాన్నే నండి!"
"ఇంటిపేరేమో సింగారం, నీపేరేమో అపురూప. ఇదేమో కష్టమైనపని. అంటే అందం చందంతో పనిలేనిపని అన్నమాట!