Previous Page Next Page 
మంత్రముగ్ధ పేజి 25

    "నువ్వేమంటావే తులసీ!" అని ప్రశ్నించింది.

    "నాకోసం మీరు ప్రమాదాల్లోకి దిగుతున్నారు" అంది తులసి ఆర్ద్రంగా!

    వెంటనే ఉమ కరిగిపోయినట్లు చూచింది. భుజంమీద చేయివేసి బుజ్జగించింది.

    "పిచ్చిదానా! స్నేహమంటే అంతేనా నువ్వు అర్ధం చేసుకుంది? ఒకరికోసం ఒకరు ప్రాణం యిచ్చుకోవాలి! మన శరీరాలు వేరయినా ప్రాణాలు ఒక్కటే! నీ సమస్యలు మావికావా? ఒకవేళ నువ్వు వెనకడుగు వేసినా నేను మాత్రం ఈ మిష్టరీని తెమల్చుకోకుండా వదలి పెట్టను" అంది ఉమ.

    తల్లిని జాగ్రత్తగా చూచుకోమని పనిమనిషికి చెప్పి బయలుదేరింది తులసి.

    కారు గేటు దాటగానే కట్టెమోపు ఎదురొచ్చింది. మరికొంతదూరం పోయాక ఒంటి బ్రాహ్మణుడు ఎదురొచ్చాడు.

    "రేపు వెడదామే ఈ రోజు శకునాలు సరిగాలేవు" అంది తులసి;

    "నిన్ను ఎక్కడ తంతానో నాకే తెలియదు. సైన్సులో డిగ్రీలు వెలిగిస్తున్నావు. ఇంకా శకునాలు, చింతకాయలంటావేమిటే తెలివి తక్కువదానా? ఎప్పటికి బాగుపడతావోకాని నీతో ఎ.ఎస్.పి. గారికి చాల బాధలున్నాయి!" అంటూ త్రిప్పికొట్టింది ఉమ! ముందుగా కంట్రోల్ రూంకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు.

    ముగ్గురూ దిగి లోనికి వచహరు. "ఎ.ఎస్.పి. గారు లేరు మేడమ్!"

    "వారికోసం రాలేదు. వేరే పనిమీద వచ్చాం!"

    "అయ్యగారిని కలవండి!" సర్కిల్ ఉన్న గదివైపు చూపించాడు.

    సర్కిల్ గారు వారిని సాదరంగా ఆహ్వానించాడు. డ్రింక్స్ ఇచ్చి వివరాలు అడిగాడు.

    సార్! ఈ రోజు పత్రికలలో యోగి గురించినవార్తలు రాలేదు" అడిగింది ఉమ.

    "అవునమ్మా! అతని గురించినవార్తలు ఎక్కువగా ప్రచారం కావటమువల్ల కొన్ని క్రొత్తసమస్యలు తలెత్తుతున్నాయి. అందువల్ల వార్తలు విశేషంగా ప్రచురించటాన్ని నిలువుచేయాలని మేమే పత్రికల వాళ్ళని కోరాం."

    "సమస్యలేముంటాయి. రాజీ కుదిరిపోయింది కదా!"

    "ఇది పబ్లిక్ ఇంటరెష్టేడ్ ఇష్యూ అని నేను ముందే చెప్పాను. ఎ.ఎస్.పి.గారు వినలేదు. ముక్కుసూటిగా పోతే ముఖం పగిలిపోయే రోజులు కదమ్మా ఇవి.

    ఒక వి.ఐ.పి. కల్పించుకోవటంతో పరిస్థితి మారింది.

    అయినా అటువాళ్ళని ప్రజలకే వదిలెయ్యాలి. నామట్టుకు నేను ఓ నమస్కారంపెట్టి అంతటితో నా పని తీర్చుకున్నాను."

    "ఎ.ఎస్.పి. గారికి అంతకోసం ఎందుకొచ్చిందో నాకు యిప్పటికీ అర్ధం కాలేదు" అంటూ తులసివంక చూశాడు సర్కిల్.

    "సార్! వారికి కోపంరావడం ఈ దాడికి కారణంకాదు. అలా ఆయన వ్యక్తిగత కోపాన్ని అధికారంతో తీర్చుకునే తరహా మనిషి కారు" అంటూ భర్తను సమర్ధించుకుంది తులసి.

    "మరయితే ఎందుకు అంత సెన్సిటివ్ గా తీసుకున్నారు?"

    "యోగి భిక్ష అర్ధించేందుకు వచ్చారు. అందుకేవచ్చారో మరెందుకువచ్చారో తెలియదు. కాని వచ్చి ఆయన అడిగింది భిక్ష మాత్రమే. ఆ తరువాత నాకు అనుమానంవచ్చింది. వారాల తరబడి భోజనంతో నిమిత్తం లేని మనిషికి భిక్షతో పనేమిటి?

    భిక్ష అర్ధించటం తప్పుకాదు. ఆ తరువాత జరిగినా సంఘటనే ఈ పరిస్థితులన్నీఏర్పడటానికి కారణం. యోగి ఒక సామాన్య సన్యాసిని కాదని శక్తివంతుడయిన మహానుభావుడని అని నిరూపించుకోవాలని ప్రయత్నించారు. దాన్ని బెదిరింపుగా అర్ధం చేసుకున్నారు ఎ.ఎస్.పి. గారు.

    అంతే జరిగింది" అంటూ వివరించింది తులసి.

    "ఆయన దగ్గర శక్తులున్నాయో లేదో! అలాగని జనం నమ్ముతున్నారు. వాస్తవ పరిస్థితుల్ని ఫాలో కావటం మా విధి.
    ఏమయినా ఈ పరిస్థితి సుఖాంతం కావటం నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది." అంటూ తృప్తిగా నవ్వాడు సర్కిల్.

    "సుఖాంతమయిందా! ఆయన గురించి వార్తలు వస్తున్నాయా?"

    "ఇంకా పనిలేదమ్మా! ఇది పబ్లిక్ ఇంటరెస్టెడ్ ఇష్యూ అంటూ వందలాది దరఖాస్తులు కోర్టు పరిశీలనకి వచ్చాయి అందువల్ల జడ్జిగారు కేసుని కొట్టిపారేశారు ఎ.ఎస్.పి. గారు ఈ కేసులో ఒక్క మెమో అయినా తింటారనుకున్నాను. కాని అలాంటిదేమీ జరగలేదు.

    క్రొత్తగా రిక్రూట్ అయ్యారు. ఉడుకు రక్తం కదా! కాస్తంత తొందరపడ్డారు. ఇలాంటివి చూచిచూచి మాకు తల పండంది" అంటూ తన అనుభవం గురించి సుదీర్ఘ సంభాషణకి ఉపక్రమించాడు.

    "అయితే యోగి ఇప్పుడెక్కడున్నారో మీకు తెలియదా?" ఉమ కట్ చేసింది.

    "లేదమ్మా! ఇక తెలుసుకోవలసిన అవసరము కూడా మాకు లేదు"

    ముగ్గురూ ఆలోచనలో పడిపోయారు. ఉత్సాహం నీరు కారింది.

    "మీకు చివరి వార్తలు అందేసరికి ఆయన ఎక్కడున్నారు" అంది ఉమ.

    "పోలీసుల ఎంక్వయిరీ ప్రశ్నల్లా ఉన్నాయి మీ ప్రశ్నలు"

    "అవునండీ! అది డి.ఎస్.పి గారమ్మాయి" అంది కళ్యాణి.

    "అలాగా సంతోషం! మాకు చివరి వార్తలు అందే సమయానికి ఆయన ఊరిబయట స్మశానంలో ఉన్నారు" సర్కిల్ వివరించారు.

    తులసి గుండెలు ఝల్లుమన్నాయి. తన కల జ్ఞాపకం వచ్చింది.

    అది నిజమవుతుందా? గుండెలు దడదడలాడాయి.

    "అదెలా సాధ్యం? వారు అదుపులో ఉంచుకుని ప్రతి అయిదు నిముషాలకు వార్త పంపుతామన్నారు. అది కదా రాజీ!" అందామె ఆశ్చర్యంగా.
 

 Previous Page Next Page