"చూడండి పాపాయిలూ! మరొకరికయితే చెప్పను. మీరు పోలీసుకుటుంబాలకు సంబంధించినవారే కనుక చెప్తున్నాను.
మా డ్యూటీలు మేం చేసుకుపోవాలి. ఒక కేసుని మేం తీసుకున్న తరువాత ఎవరూ ప్రమేయం కల్పించుకోకూడదు. మరొకరి ప్రమేయం వచ్చాక దాని రూపం అనేక విధాలుగా మారుతుంది. మాకు కూడ పట్టుదల, ఆసక్తి పెరుగుతాయి.
వారు వార్తలు పంపుతూనే ఉన్నారు. వాచింగ్ కోసం పంపిన ఉద్యోగి పరమ భక్తుడు. అతడుకూడ వారికే సహకరించాడు. ఇవన్నీ మేము చెప్పకూడదు. మీరు వినకూడదు" అన్నాడాయన.
చెప్పవలసింది అంతా చెప్పేసి ఉపాయంగా తప్పించుకోవాలని ఆయన చేస్తున్న ప్రయత్నం ఉమకు బాగా నవ్వు తెప్పించింది.
కాని తులసికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి.
తాను కలలో కన్పించిన మిగిలిన దృశ్యాలు కూడ నిజమవుతాయా?
"అయితే ఇప్పుడు వారిని కలుసుకోవాలంటే ఏం చెయ్యాలి?" కళ్యాణి.
"బహుశా సాధ్యపడకపోవచ్చు" సర్కిల్.
"వెళ్ళొస్తామండి!" అని లేచింది ఉమ. ఆయన ఆప్యాయంగా వారిని వాకిలి వరకూ వచ్చి సాగనంపారు.
"ఇంక మనం ఇంటికి వెళ్ళిపోవచ్చా?" అంది కళ్యాణి ఉత్సాహంగా.
"నేను చెప్పలేదూ? నాకు వచ్చిన కలలో సగం నిజమయింది అప్పుడే" అంది తులసి. ఆమె ముఖంలో కాంతి తగ్గిపోవటాన్ని గమనించింది ఉమ.
"ఇది యాదృచ్చికం ఎందుకు కాకూడదు?"
"అయితే వెళ్ళి చూద్దామంటావా?"
కేవలం ఇది నా వ్యక్తిగత సమస్య అనుకోకు తులసీ! జరిగినా సంఘటనలో నమ్మటానికి వీలులేని విచిత్రమయిన అంశాలు కొన్ని ఉన్నాయి. మంత్రాలు చదివితే నాగులు ఆదేశాలను పాటించడం ఏమిటి?
ఈ మంత్రక్షరీ విద్య నిజమా? అబద్దమా?? సర్పాలు సమ్మోహితులవుతాయా? నాగదోషాలుంటాయా?.
"మన పరిశోధనకి పనికి వచ్చే అంశాలే కదా ఇవన్నీ" అంది ఉమ.
"అవునవును మనం ముందుకేవెళ్ళాలి" అంది అయిష్టంగానే బద్దకస్తురాలు కళ్యాణి! తులసి ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో పడిపోయింది.
"గుడ్డిగా దూసుకుపోవటం మంచిదికాదోయ్. దగ్గరకు వెళ్ళే ముందుగా కొన్ని వివరాలు సంపాదించాలి! యోగి గురించి తెలుసుకోవాలంటే ఎవరిదగ్గరకు వెళ్ళాలో ఆ విషయం ఆలోచించాలి ముందు" అంది ఉమ.
"యోగి గురించి తెలుసుకోవాలంటే ఎక్కడకు వెళ్లాలని ప్రశ్నిస్తావేంటి? అతన్ని మనం ఎక్కడ చూచామో అక్కడినించే అన్వేషణ ప్రారంభించాలి!"
"ఐస్ క్రీం షాపుకి వెళ్ళాలనే కదా నీ ఉబలాటం తధాస్తు!"
"యోగి గురించి వివరాలు తెలుస్తే నాకు ఐస్ క్రీమ్ ప్రజంట్ చెయ్యాలి!"
"ఎన్ని కిలోలు తింటావో ముందు చెప్పు! ఆ తరువాతే అగ్రిమెంట్!" వారి మాటలు వింటున్న తులసి ఐస్ క్రీం షాపు ముందు కారు ఆపింది.
"నీవు వస్తున్నావని భయపడి షాపు మూసేశారు" అంది ఉమ విండోలోంచి బయటకు చూస్తూ! ముగ్గురూ క్రిందకిదిగి పరిశీలించారు.
లోపలనుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి.
కొద్దిసేపు ఎదురు చూచాక లోపలనించి ఒక వ్యక్తి తలుపులు తెరుచుకుని వెలుపలకు వచ్చాడు! వారివంక సందేహంగా చూచాడు.
"షాపు యజమాని ఉన్నారా?"
"లేదండి ఆయన నిన్న ఈ షాపు మాకు అమ్మేశారు. రిపేరు చేస్తున్నాం"
"నీ చూపు పడినప్పుడే అనుకున్నాను. అతనికిలాంటి ఖర్మ ఏదో పాడుతుందని" ఎదుటివ్యక్తికి వినిపించకుండా గొణిగింది ఉమ.
"ఎందుకండీ! పాపం ఆయన షాపెందుకు అమ్మేశారు?" అంది కళ్యాణి.
"పాపం అంటారేమండీ! రెండు రోజుల్లో ఆయన లక్షాధికారి అయ్యారు."
ఐస్ ఫ్యాక్టరీనే కొనాలని తిరుగుతున్నారు అవునండి! అంతా అప్పుడే అనుకున్నాను. ద్రవిడ మాహేశ్వరుడు స్వయంగా వచ్చి కూర్చున్నారంటే మాటలా! ఆపూటే ఆయన అదృష్ట రేఖ పొడుగుసాగింది.
"హిందుస్థాన్ కాంటెస్సా కొన్నారు"
ఈ మాటలు విని దిగులుగా చూచింది తులసి!
తాను కలలో చూచినా, ఊహించినా అది అబద్దం కావాలని కోరుకుంటోందామె. కాని విన్నవే కలలో కన్నవే అన్ని వాస్తవాలయి కళ్ళముందు నిలుస్తున్నాయి. క్షణక్షణం భయం పెరుగుతోంది.
"వారిల్లెక్కడ?" ఇంక తెగింపు తెచ్చుకుని అడిగింది తులసి!
"సెహబాప్! ఆ పట్టుదల నీలో రావాలి" అనుకుంది ఉమ.
షాపుని క్రొత్తగా కొన్న యజమాని పాతయజమాని అడ్రస్ టెలిఫోన్ నంబర్ ఒక స్లిప్ మీద వ్రాసి వారికి అందించాడు. తులసి డ్రయివింగ్ లో తడబడటం చూసి ఉమ స్టీరింగ్ అందుకుంది.
ఎంతో చెప్పాలని ఉందామెకు. తులసి మానసిక స్థితి అంతాఅర్ధం చేసుకుంది. కాని యెలా వివరించాలి! ఎక్కువ చెప్పలేకపోయింది.