"సార్! ఆఫీసరు గారు పిలుస్తున్నారు" ఫ్యూన్ తాపీగా వచ్చి చెప్పాడు. వెంటనే ఆయన రూమ్ లోకి పరిగెత్తాడు. ఆయన న్యూస్ పేపర్లో స్పోర్ట్స్ కాలమ్ చదువుతున్నాడు.
"రాక్షస్ అండ్ రాక్షస్ కంపెనీ ఫైలు రెడీ అయిందా?"
"ఇంకా లేదండీ. నాట్ రాస్తున్నాను."
"త్వరగా కానీ! అరె! వెస్టిండీస్ వస్తున్నారే" హుషారుగా అన్నాడతను.
నేను వెనక్కు తిరిగి చూచాను- ఎవరొస్తున్నారా అని.
"ఎవరూలేరు కదండి."
ఆయన చిరాకుగా నావైపు చూశాడు.
"ఏమిటెవరూ లేరు?"
"అదే! ఎవరో వస్తున్నారని అంటున్నారు కదా"
"నేననేది వెస్టిండీస్ సంగతయ్యా! ఇదే! వచ్చేవారం నుంచే టెస్ట్ మొదలవుతుంది."
నాకింకా అయోమయం అయిపోయింది. ఆయన మాటలే మాత్రం అర్ధంకావడంలేదు. అయినా నాకు ఇంకా తెలీనట్లు మాట్లాడితే బావుండదని-
"ఓహో! మీరనేది వెస్టిండీస్ సంగతా! అవునండీ! అవును" అన్నాను తడబడుతూ.
"లాయిడ్ స్టేట్ మెంట్ చూశావా?"
నాకు మళ్ళీ అర్ధంకాలేదు. మా ఆఫీస్ కి సంబంధించిన యాన్యువల్ స్టేట్ మెంట్ మాత్రం నేను తయారు చేస్తుంటాను. కానీమరి ఈ లాయిడ్ స్టేట్ మెంటేమిటో... "స్టేట్ మెంట్ మొన్నే హెడ్డాఫీసు కి పంపించాంకదండీ?"
"నేననేది లాయిడ్ స్టేట్ మెంటయ్యా! లాయిడ్ స్టేట్ మెంటిచ్చాడు"
"ఏమోసార్! నాకు మాత్రం ఇవ్వలేదు. ఒకవేళ హెడ్ క్లర్క్ గారికిచ్చాడేమో కనుక్కుంటాను." ఆయన నన్నోపురుగుని చూసినట్లు చూశాడు-
"యూకెన్ గో! నీకు క్రికెట్ గురించి ఏమీ తెలిసినట్లు లేదు!" అన్నాడాయన- చూపుమార్చి నన్నో వింత జంతువుని చూసినట్లు చూస్తూ నాగుండెల్లో రాయిపడింది! ఎందుకంటే నాకు క్రికెట్ ఆట గురించి అస్సలు తెలీదు. నేను స్కూలు ఫైనల్ వరకూ చదివిన మా కైకలూర్లో ఎవరూ క్రికెట్ ఆడేవారుకాదు. దాన్ని గురించి మాట్లాడేవారు కాదు. క్రికెట్ అంటే అటూ ఇటూ మూడుకర్రలు పాతటం, ఒకడు రాయిలాంటి బంతితో దాన్ని పడగొట్ట బోతుంటే ఇంకొకడు బ్యాటు తీసుకుని, ఆ కర్రల్ని రక్షించడం- అని నా ఉద్దేశ్యం! ఇటీవల పాకిస్తాన్ తో మనవాళ్ళు క్రికెట్ ఆడినప్పుడు మాత్రం నేను నిజంగా నరకం అనుభవించాను. ఆఫీసులోనూ, బయటా ఇంటి చుట్టూ ఎక్కడ చూసినా క్రికెట్ గురించి మాటలే! వాళ్ళందరి మధ్యా నేను "సహారా" ఎడారిలో ఉన్నట్లు ఫీలవుతూండేవాడిని!
అంచేత టెస్ట్ మాచ్ జరిగినన్ని రోజులూ శెలవు పెట్టేసేవాడిని.
"అబ్బ! ఆరుమాచీలు భలే అద్భుతంగా ఎంజాయ్ చేయవచ్చు." అన్నాడు రెడ్డి లంచ్ టైమ్ లో నావంకచూస్తూ.
"అవునవును! ఒండర్ ఫుల్ గా ఉంటుంది!" అన్నాను.
ఆరోజంతా క్రికెట్ మాచీల గురించిన చర్చలతోనే గడిచిపోయింది. ఈ దారుణమయిన వాతావరణంలొ నేను వట్టి వాజమ్మలా కనిపించకుండా ఉండాలంటే క్రికెట్ గురించి వీలయినంత త్వరగా తెలుసుకుని ఫాలో అయిపోవాలని నిర్ణయించుకున్నాను. వెంటనే రంగంలోకి దూకి న్యూస్ పేపర్లలో క్రికెట్ వార్తలు చదవడం మొదలెట్టాను. క్రికెట్ కామెంటరీ వినడానికి ఓ పాకెట్ ట్రాన్సిష్టరు కూడాకొన్నాను.
"మార్షల్, హోల్డింగ్స్ తుక్కురేపేస్తారీసారి!" అన్నాడెవరో కుర్రాడు బస్ స్టాండ్ లో.
ఆ మాట జాగ్రత్తగా గుర్తు పెట్టుకున్నాను.
ఆ తరువాత వారం టెస్ట్ మాచ్ స్టార్టయింది. ట్రాన్సిష్టర్ చెవి దగ్గర పెట్టుకుని ఆఫీసుకి బయల్దేరాను. ఎంతసేపు విన్నాహోరున జనం గొడవ తప్పించే ఇంకేమీ వినిపించలేదు.
ఒకతను పరుగుతో నా దగ్గరకొచ్చాడు.
"టాస్ ఎవరుగెల్చారు?" అడిగాడు ఆత్రుతగా.
"టాసా?" ఆశ్చర్యంగా అడిగాను.
"అవును!"
ఏదొకటి చెప్పాలి కనుక "వెస్టిండీస్" అన్నాను.
"బాటింగెవరు చేస్తున్నారు?"
నాకు తెలీదు అని చెప్పటం నామోషీ అనిపించి అతన్ని వదిలించుకోవటానికి "వెస్టిండీస్" అన్నాను.
"ఇప్పుడు ఎవరాడుతున్నారు?"
నాకు వెస్టిండీస్ తాలూకూ పేరు ఒక్కటే ఒక్కటి గుర్తుంది. ఆ రోజు బస్ స్టాండ్ దగ్గర విని గుర్తుపెట్టుకున్నాను.
"మార్షల్, హోల్డింగ్స్! తుక్కురేగ్గొట్టేస్తున్నారు?" అన్నాను.
"అప్పుడే వాళ్ళ వరకూ అవుటయిపోయారా! నమ్మలేనట్లుగా అడిగాడతను.
ఎక్కడో ఏదో తప్పు చేసి ఉంటానని అనుమానం కలిగింది గానీ, ఇప్పుడిక చేయగలిగిందేమీ లేదు. ముందుకు దూసుకుపోవడమే.
"అవును!" అన్నాను.
"స్కోరెంత?"
"ముఫ్ఫై ఆరు!" అతను అదిరిపడ్డాడు.
"ఎన్ని వికెట్లుపడినయ్?"
"పద్నాలుగు?"
అతను ఉలిక్కిపడి నెమ్మదిగా కాసేపు వెనక్కునడిచి, అక్కడి నుంచి హఠాత్తుగా రాకెట్ లా దూసుకుపోయాడు.
ఆఫీసులో కూర్చుని ట్రాన్సిస్టర్ టేబుల్ మీదే ఉంచి వాల్యూమ్ తగ్గించాను. విమల ఆశ్చర్యంగా నావేపు చూస్తోంది.
అంతకుముందు పాకిస్తాన్ తో మనవాళ్ళు ఆడేప్పుడు ఒకటి రెండుసార్లు క్రికెట్ గురించినాతో మాట్లాడి-నాకేమీ తెలీదని తెల్చుకుని- నన్ను అడవిమనిషిలా ట్రీట్ చేయడం మొదలుపెట్టింది.
హఠాత్తుగా ట్రాన్సిస్టరులో పెద్ద ఎత్తున కేకలు గొడవెక్కువయిపోయినయ్.