Previous Page Next Page 
హ్యూమరాలజీ-1 పేజి 24

                                 


    "ఆ! అది! బూష్!"
    "సరే తిడతాంలెండి! జెండా చూపించండి!"
    "నేను షూపించను-"
    "అదేవిటి? వెంకట్రావ్ ని మేము తిడతామన్నాంగా?"
    "వాడిని నేనే తిట్టాలి."
    ఈలోగా మీసాలాయన దిగివచ్చాడు. "ఒరేయ్ ఇక లాభంలేదుగానీ బఠానీల వాడిని పిలవండి" అన్నాడు పరిస్థితి ఆకళింపు చేసుకుని.
    "బఠానీల వాడెందుకు?" అడిగాను ఆశ్చర్యంగా.
    "వాడొక్కడికే గార్డు ఉద్యోగం, ఇంజన్ డ్రైవ్ చేయటం తెలుసు. ఇంకెవ్వరికీ తెలీదు!"
    కొంతమంది వెళ్ళి బఠానీల వాడిని పట్టుకొచ్చారు.
    "ఒరేయ్ సోమిగా! ఈ గార్డుని మేము పక్కపెట్లోకి తీసుకెళ్తాంగానీ, కొంచెం గార్డు ఉద్యోగం చేయ్, బండిలేటయిపోతోంది" అన్నాడు మీసాలాయన.
    రైలు ఈసారి హాయిగా రామవరప్పాడువరకూ శుభ్రంగా నడిచింది.
    టైము చూచుకున్నాను.
    ఒంటి గంట! బడి పావుగంటయినా కదలకపోయేసరికి మళ్ళీ అందరం బఠానీలవాడి దగ్గరకెళ్ళాం.
    ఇంక మధ్యాహ్నం ఆఫీస్ కెళ్ళాలంటే సరిగ్గా అరగంట టైముంది.
    "ఏమయింది?" అనడిగారువాడిని.
    "ఇంజన్లో ఎవరో సేఫ్టీ ఆఫీసరొచ్చారంట సార్! నేను జెండా చూపించకూడదని పట్టుబడుతున్నారు." అందరూ మళ్ళీ ఇంజన్ దగ్గరకెళ్ళి సేఫ్టీ ఆఫీసర్ని-డ్రైవర్ని బ్రతిమాలారు. "మీ ఇన్ స్పెక్టర్ రిపోర్ట్ లో గార్డు పనిచేస్తున్నట్లే రాసుకోండిసార్! మాకిప్పటికే ఆలస్యం అయిపోయింది" సేఫ్టీ ససేమిరా ఒప్పుకోలేదు గానీ పాలవాళ్ళు పదిరూపాయలిచ్చాక ఒప్పుకున్నాడు.
    మళ్ళీ కదిలింది రైలు.
    స్టేషన్ వచ్చేసింది.
    అయిదు నిమిషాలు గడిచింది. ఆ తరువాత పదినిమిషాలు, పావుగంటకూడా అయిపోయింది. బండికదలటం లేదు.
    మళ్ళీ అందరం దిగి స్టేషన్ దగ్గరకు వెళ్ళాం.
    టికెట్ కలెక్టరూ, బుకింగ్ క్లర్కూ కలిసి ఓ గుంపుతో పోట్లాడుతున్నారు.
    "వీల్లేదయ్యా! బస్తాకి రెండ్రూపాయలు ఇయ్యాల్సిందే. లేకపోతే మిమ్మల్ని వదిలేది లేదు-"
    "బియ్యం మేమిక్కడదింపటం లేదు సార్. బెజవాడ తీసుకెళ్తున్నాం ఇంక మీకెందుకు మామూలివ్వాలి?" బియ్యం బస్తాలవాళ్ళడిగారు.
    "ఇంతకాలం ఇక్కడ దింపి- ఇవాల్టినుంచి బెజవాడ తీసుకెళతారా? వీల్లేదు. ఇక్కడ దింపాల్సిందే." పట్టుపట్టారు బుకింగ్ క్లర్క్, టి.సి.లు.
    "మీరు బస్తాకి రెండు రూపాయలు అడుగుతోంటే ఇక్కడెందుకు దించాలండీ."
    "బెజవాడలో ఎంత ఇస్తున్నారు?"
    "రైల్వే పోలీస్ కి రూపాయ్ మిగతా స్టాఫ్ కి అర్ధరూపాయి."
    "ఓహో! అర్ధరూపాయి లాభం కొడుతున్నారన్నమాట. అందుకని మా నోట్లో మొత్తానికే మన్నుకొడతారా?"
    "మీరు మరి రూపాయిన్నరకు వప్పుకోకపోతే మేమేం చేయంసార్?"
    "మీసాలాయన మళ్ళీ కల్పించుకున్నాడు.
    "ఇదిగో బాబూ! బండి ఆపేసి లావాదేవీలేమిటయ్యా! మాకు అవతల లేటవుతోంది."
    "లేకపోతే చూడండి సార్! బియ్యం బస్తాలన్నీ బెజవాడ తీసుకెళతామంటున్నారు. రోజూ వచ్చే మామూలు మాకిదొక్కటే గద్సార్. ఇది కూడా లేకపోతే మేమేం తినాలి?"
    మీసాలాయన బియ్యం వాళ్ళను కోపడ్డాడు.
    "ఇదిగో రంగనాయకులూ! నువ్వు కూడా తొందరపడితే ఎట్టా? ఆ టి.సి. గారు, బుకింగ్ క్లర్క్ గారు పరాయి వాళ్ళేంకాదుగదా? ఏదో రెండు డబ్బులు అటూ ఇటయినా ఇక్కడే దించుకోండి" ఈలోగా స్టేషన్ పోర్టర్ ఓ ముసలాడినీ రెండు మేకల్ని పట్టుకొచ్చాడు.
    "సార్! ఈ మేకల్ని పాసింజర్ కంపార్ట్ మెంట్ లో తీసుకెళ్తున్నాడు సార్."
    "ఏరా! వాటిని బుక్ చేసి గార్డు పెట్టెలో తీసుకెళ్ళాలి కదా?" అన్నాడు బుకింగ్ క్లర్క్.
    "పొరపాటయిపోయిందండీ."
    నేను ఇంక లాభం లేదని అక్కడే దిగిపోయి రిక్షాలో ఆఫీస్ చేరుకున్నాను.
    "ఏమిట్రా! ఇప్పుడొచ్చావ్?" భగవాన్ అడిగాడు.
    "చాలామంది బందరు వాళ్ళు రోజూ పొద్దున్న బెజవాడకు రైల్లో వచ్చి ఉద్యోగం చేసి మళ్ళీ సాయంత్రం బందరు వెళ్ళిపోతారని చెప్పావ్ గదా! అ రైలు ఇప్పటికి చేర్చిందిక్కడికి." అన్నాను కోపంగా.
    "కొత్తలో ఇలాగే ఉంటుందిలే. రాన్రాను అలవాటయిపోతుంది" అన్నాడు భగవాన్.
    "కాని బస్ లో గంటన్నర ప్రయాణం- రైల్లో ఇన్ని గంటలా?"
    "తప్పదు మరి. పైసా ఖర్చులేకుండా బెజవాడ రావాలంటే అదొక్కటే మార్గం."
    "పైసా ఖర్చులేకుండానా అదేమిటి? సీజన్ టికెట్ ఉందికదా!"
    "అద్గదీ! అందుకే నీకింత చిరాకనిపించింది" నవ్వుతూ అన్నాడు భగవాన్ "ఈ రైల్లో ఎవడూ టికెట్ కొనడు-".
                       

     

                                            *    *    *

 Previous Page Next Page