పార్వతమ్మ అందుకుని, "ఇంతకాలానికి వాళ్ళ ఇంటికి వెళ్తూ.... పైగా ఆడపిల్లనిస్తామని.... అడుగబోతూ ఉట్టి చేతుల్తోవెళ్తే మన పరువు ఏంగాను? దాని మాటలు పట్టించుకోబోకండి" అంది.
సుబ్బారాయుడికి ఆమె అలా ధాటిగా నిర్ణయాలు చేసినప్పుడల్లా 'కార్యేషు దాసీ కంటే కరణేషు మంత్రీనే ఆమెకు బాగా సరిపోతుంది అనిపిస్తుంది.
"పార్వతీ.... నువ్వూ వస్తే బావుండేది" అన్నాడు మళ్ళీ.
"పార్వతి దగ్గరకొచ్చి "ఎలారాను చెప్పండి? జానకి కూతురు పెద్ద మనిషైందట. బంతినాటికి పట్టు పరికిణీ కుట్టించి మొదటి పేరంటం మనమే చెయ్యాలి. సూరమ్మ వదినకి నిన్నటినుండీ ఒంట్లో సలపరంగా వుంటోంది అంటోంది. మంగమ్మగారింట్లో పెళ్ళిపనులు..... అప్పడాలొత్తాలి."
"ఆఁ..... ఆఁ..... ఇంకా ఆపు అడిగితే చాలు, విప్పుతావు దండకం" విసుక్కున్నాడు సుబ్బారాయుడు.
"అందుకే అడగవద్దనేది!" ఆమె లోపలికి వెళ్ళిపోయింది.
సుబ్బారాయుడు కూతుర్ని పక్కన కూర్చోపెట్టుకుని, "ఇంతకీ మాధవ్ నీకు నచ్చాడా తల్లీ?" అని ప్రేమగా అడిగాడు.
'నచ్చడం ఏమిటి నాన్నా? నేనే తనూ.... తనే నేనూ అయి నిలువెల్లా నిండిపోయాడు' అనుకుని, పైకి మాత్రం ఒద్దికగా "నీ యిష్టమే నా ఇష్టం నాన్నా" అంది.
"నా తల్లి .... నాకు తెలుసమ్మా, నా ఇష్టమే నీ ఇష్టమని" సుబ్బారాయుడు ఆనందంగా దగ్గరకి తీసుకుని అన్నాడు.
"కారులూ, మేడలూ, షికార్లతో ఓ మహారాణిలా గడపాలమ్మా నువ్వు! మీ అమ్మలా పేడెత్తుకుంటూ, పిండి దంచుకుంటూ కాదు!"
'ఎక్కడున్నానూ అనేది ముఖ్యం కాదు నాన్నా ఎవరితో ఉన్నానూ అనేదే ముఖ్యం!' మాధవ్ తలపులతో మధురభావాలు మనసంతా నిండి పారవశ్యంగా అనుకుంది రాధ.
"రాత్రికి బయలుదేరుతున్నాను. ఏమైనా చెప్పమంటావా?" నవ్వుతూ అడిగాడు!
"అత్తయ్యనీ, మావయ్యనీ అడిగానని చెప్పండి" అంది.
"ఏం అడిగానని చెప్పనూ?" ఆటపట్టిస్తూ అడిగాడు.
"వాద్యాలూ, చోద్యాలూ, నైవేద్యాలూ..." చెప్పి తుర్రుమంది రాధ.
"అంటే?" ఆలోచనలో పడ్డాడు సుబ్బారాయుడు.
ఆమె మనసులో వేయి సన్నాయి వాద్యాలు మంగళకరంగా మోగుతున్నాయి.
ఎన్నడూ చూడని చోద్యాల్లా మాధవ్ చిలిపిచేష్టలు కళ్ళల్లో మెదులుతున్నాయి.
రేకువిప్పిన కన్నె సొగసుని అరిటాకులో పెట్టి నైవేద్యంగా పెట్టి అందిస్తున్న తరుణం మదిలో మెదిలి తనువు సిగ్గు చింతాకయింది.
* * *
సన్నగా గిటార్ తీగల్ని మీటినట్లుగా సన్నజాజి ఉండుండీ ఊగుతూ సుగంధాలు వీస్తోంది.
వసారాలో నీడలు పొడుగై రోజు తరిగిపోతోంది.
కారు దిగి డోర్ బలంగా వేసి సన్నగా విజిల్ వేస్తూ లోపలికి వస్తున్న మాధవ్ కి స్తంభం చాటున నిలబడి ఎదురు చూస్తున్న పురంధర కనిపించింది.
"ఏవిటి పిన్నీ ఒక్కదానివీ నిలబడ్డావ్?" అని అడిగాడు.
పురంధర జవాబు చెప్పడానికే సిగ్గుపడినట్లు తల వంచుకుంది. ఆ నల్లని రాత్రికన్నా చీకటిగా అనిపించింది ఆమె అంతరంగంలో బాధ.
"బాబాయ్ ఇంకా ఇంటికి రాలేదా?" అడిగాడు.
ఆమె తల వంచుకునే సన్నగా వెక్కిళ్ళు పెట్టింది.
మాధవ్ చప్పున కదిలి ఆమె భుజం మీద చెయ్యివేసి, నువ్వు వెళ్ళిపడుకో పిన్నీ... నేను తీసుకువస్తాగా!" అన్నాడు.
ఆ మాత్రం స్వాంతనకే ఆమె చలించిపోయి "మాధవ్! డాక్టర్ కచ్చితంగా చెప్పేశాడు. ఇంకా తాగుడు ఆపకపోతే ఆయన రెండు మూడు నెలలకి మించి మనకి దక్కరని!" అంటూ అతని చేతిమీద తల ఆన్చి భోరుమంది.
మాధవ్ ఆమె తల నిమిరి, "బాబాయ్ ఆరోగ్యం బాగుపడేటట్లు నేను చూస్తాగా... ఇక ఆ బాధ్యతలన్నీ నా చేతుల్లో పెట్టి నువ్వు నిశ్చింతగా ఉండు. ముందు లోపలికి పద!" అన్నాడు.
ఆమె కళ్ళలో ఆశ రెపరెపలాడింది. "నువ్వు నిజంగానే అంటున్నావా?" అంది.
"ఉట్టి మాటలు ఈ మాధవ్ కి చేతకావు పిన్నీ .... పద!" అని ఆమెను లోపలికి పంపించి, తను మళ్ళీ కారువైపు నడిచాడు మాధవ్.
గోవిందరావు బాబాయ్ దయవల్ల ఒక్కొక్క బారే దర్శించాల్సిన పని తగిలింది! అనుకుని నవ్వుకున్నాడు.
* * *
గుడినుంచి ఇంటికి వచ్చిన రాధకి చిన్నాన్నా, తండ్రి ఎక్కడికో కంగారుగా చెప్పులు తొడుక్కుని వెళ్ళడం కనిపించింది. ఎక్కడికి అని అడగడం ఇష్టంలేక లోపలికి వెళ్ళి పిన్నిని అడగాలనుకుంది.
లోపల సన్నగా ఏదో చెప్పుకుంటున్న పార్వతమ్మా, శాంతా రాధని చూసి మాటలాపేశారు.
ఆమెకి ఏదో అసహజంగా అనిపించింది.
పిల్లవాడిని ఎత్తుకుని వసారాలో భయంగా చూస్తూ నిలబడ్డ ప్రమీల దగ్గరికి వచ్చి "ఏమైందత్తా?" అనడిగింది.
"ఇంకో కొత్తకోడలు ఏటిపాలైంది!" ఉస్సూరని నిట్టూరుస్తూ చెప్పింది ప్రమీల.
రాధ భయంగా "ఎవరూ?" అని అడిగింది.
"చలమయ్యగారి కోడలు అంది ప్రమీల.
"అయ్యో!" రాధ హృదయం ఆక్రోశించింది. ఇంకా నిన్నా మొన్నా వంచిన తలెత్తకుండా అత్తగారి వెనకాల పేరంటానికి వచ్చినట్లే ఉంది. అంతలోనే ఆమె బతులు తెల్లవారిపోయిందా!
శాంత రహస్యంగా అంటోంది. "కట్నం బాకీ తెస్తేనే కార్యం అని అత్తగారు భర్తతోనైనా పలకనిచ్చేది కాదట! పుట్టింట తండ్రి నీడలేక, అత్తింటి ఆరళ్ళు భరించలేక ఎంతగా అల్లల్లాడిపోయిందోనమ్మా బిడ్డ!"
"కోడి కూయగానే లేచి ఒక్కతే ఇంటిపనంతా చక్కపెట్టేది. చిదిమి దీపం పెట్టుకోవచ్చు! అలాంటిది ఏడాది తిరగకుండా కొరివిపెట్టారు!" కళ్ళొత్తుకుంటూ బాధగా అంది పార్వతమ్మ.
రాధ ఆగలేనట్లు ప్రమీల వారిస్తున్నా వినకుండా పరుగు అందుకుంది.
అప్పటికే చలమయ్య ఇంటి దగ్గర చాలామంది గుమికూడారు.
పోయిన ఆ అమ్మాయి కాలి పారాణి ఇంకా ఎర్రగా మెరుస్తోంది. అక్కడున్న ఊరెడు జనం అది చూసి సిగ్గుతో తల దించుకున్నట్లుగా నిలబడ్డారు.