1. కోరికలు తీర్చు కొనుటకు చేయు కర్మలందు పదునారవ భాగము పాపము కలుగవచ్చును. అట్టి దానిని యమరాజు సభాసదులు వీక్షించుచుందురు. తెల్లని పాదముల ఈ 'అవి' యముని సభాసదులకు అన్నము అగునుగాక. పితరులకు అన్నము అగునుగాక.
2. ఈ యజ్ఞము సకల దిశల నుండి ఫలములు ప్రసాదించగలది. అభ్యుదయ ప్రదము. అది మా పుత్రులను, పశువులను, సమస్త కోరికలను ఫలింపచేయునుగాక. శ్వేత పాదములు కలిగి నాచే సమర్పించబడిన ఈ 'అవి' క్షీణించకుండునుగాక.
3. తెల్ల పాదములు గలదియు భూమి వలె సమస్త ఫలముల నిచ్చు గొర్రెను దానము చేయువాడు దుఃఖము ఎరుగని స్వర్గలోకమును ఆరోహించుచున్నాడు. ఆ లోకమున బలహీనుడు మరింత పన్ను ఇవ్వనవసరము ఉండదు.
4. నాలుగు పాదములు, నాభి మీద పంచాపూపములు పెట్టుబడినదియు, భూమివలె సకల ఫలములు ఇచ్చునదియు, శ్వేత పాద అజమును దానము చేసిన వాడు, వసు - పిత్రు - సోమ లోకములందు అక్షయ భోగములు అనుభవించుచున్నాడు.
5. నాలుగు పాదములు, నాభి మీద పంచాపూపములు పెట్టబడినదియు భూమి వలె సకల ఫలములు ఇచ్చునదియునగు శ్వేత పాద అజమును దానము చేయువాడు సూర్య చంద్ర లోకములందు అక్షయ భోగములు అనుభవించుచున్నాడు.
6. యజ్ఞమున గొర్రెను దానము చేసిన ఫలము భూమి వలెను, సాగర జలము వలెను క్షీణించదు. విడివడని అశ్వినులవలె క్షీణించదు.
7. ఇది ఏమి? ఎవడు ఇచ్చినాడు? ఇది కోరిక, కోరికయే ఇచ్చినది. కోరికయే ఇచ్చునది. కోరికయే తీసికొనునది. కోరిక సముద్రము వలె ఎల్లలు లేనిది! దానమా! కోరికతోనే నిన్ను గ్రహించుచున్నాను. నీవు సహితము కోరికవే అగుచున్నావు.
8. దానమా! భూమి నిన్ను తీసికొనునుగాక. మహదంతరిక్షము నిన్ను పరిగ్రహించునుగాక. నిన్ను గ్రహించుట వలన నా ప్రాణములు పోకుండునుగాక. నా బిడ్డలు రక్షించబడుదురుగాక.
1. జగడములాడు జనులారా! మీలోని ద్వేషమును తొలిగించి, సహ్రుదయులగునట్లు చేయుటకు 'సాంమానస్య కర్మ'ను చేయుచున్నాను. కావున ఆవు అప్పుడేపుట్టిన తన దూడతో స్నేహము చేసినరీతి కలిసి మెలిసి ఉండండి.
2. పుత్రుడు తండ్రికి అనుకూలముగ ప్రవర్తించునుగాక. తల్లి తన బిడ్డలతో ఏకమనస్య అగునుగాక. భార్య భర్తతో మధుర, సుఖమయ వాక్కులు పలుకునుగాక.
3. సోదరుడు సోదరుని ద్వేషించకుండునుగాక. అక్కచెల్లెండ్రు అన్నదమ్ములను ద్వేషించకుందురుగాక. అన్నదమ్ములు, అక్కచెల్లెండ్రు సమాన మనస్కులై, మంచి కార్యములు చేయుచు మధుర భాషణలు అగుదురుగాక.
4. ఏ మంత్రము వలన దేవతలు విమనస్కులు కాకున్నారో, పరస్పరము ద్వేషించకున్నారో అట్టి మంత్ర జ్ఞానమును గృహమునందున్న వారి కొరకు ప్రవేశపెట్టుచున్నాను. మీరు కలిసిమెలిసి ఉండండి.
5. మీరు చిన్నాపెద్దను గుర్తించి మాట్లాడండి. సమాన మనస్కులై, సత్కార్యములు చేయుచు విడిపోకుండ ఉండండి. మీరందరు మధుర భాషణములు చేయుచు రండి. మానవులారా! నేను సహితము మిమ్ము ఉమ్మడిగా కార్యములు నిర్వహించుటకు నియమించుచున్నాను.
6. సాంమానస్యాభిలాషులారా! మీకు ఒకే జలశాల అగునుగాక. ఒకేచోట మీరు భుజింతురుగాక. ఆకుల చక్రమును ఆశ్రయించి ఉన్నట్లు మీరు ఒకే ఫలమును ఆశించుచు అగ్నిని యజించండి.
7. నేను మిమ్ము కలసి మెలసి ఒకే కార్యము చేయువారిని కలసి మెలసి భుజించువారిని చేయుచున్నాను. ఈ వశీకరణ కర్మచే మిమ్ము వశము నందుంచు కొనుచున్నాను. స్వర్గమున దేవతలు ఒక్కరుగా అమృతమును రక్షించుచు సుమనస్కులై ఉంటున్నారు. అదే విధముగ మీ మనసులు రాత్రింబవళ్ళు కళ్యాణ కరములు అగునుగాక. ఆరవ సూక్తము - 31
వినియోగము :-
1. ఉపనయనము తరువాత ఆయుష్యము కొరకు వటువును శిరసు తాకి గురువు ఈ సూక్తముచే అభిమంత్రించునది.
2. పిత్రు మేధమున దహనము తరువాత నీటి వద్ద 'బ్రహ్మ' దీనిని జపించవలెను.
3. ఆగ్రహాయణీ కర్మయందు 10,11 మంత్రములు చదివి లేచునది.
4. సోమక్రయణి తరువాత 'బ్రహ్మ' పదవ మంత్రము చదివి లేచునది.
1. అశ్వినులారా! ఈ వటువును వార్ధక్యము చేరకుండచేయండి. అగ్నీ! నీవు ఇతనిని దానహీనత, అమిత్రత నుంచి దూరముగా ఉంచుము. నేను ఇతనిని దుఃఖములు కలిగించు పాపములనుండి, వ్యాధుల నుండి విముక్తి కలిగించుచున్నాను. అతనిని దీర్ఘాయుష్కుని చేయుచున్నాను. "వ్య2హం సర్వేణ పాప్మనా వియక్ష్మేణ సమాయుషా"
2. సర్వత్ర సంచరించు వాయువు ఇతనిని వ్యాధుల నుండి విముక్తుని చేయునుగాక. సర్వ సమర్దుడగు ఇంద్రుడు ఇతనిని పాపములనుంచి వేరు చేయునుగాక.
"వ్య2హం సర్వేణ పాప్మనా వియక్ష్మేణ సమాయుషా"
3. గ్రామ జంతువులు వన్య మృగములనుండి స్వభావతః వేరుగా ఉన్నట్లుగా - నీరు లేని చోట దాహము కలిగినట్లును.
"వ్య2హం సర్వేణ పాప్మనా వియక్ష్మేణ సమాయుషా"
4. ద్యావాపృథ్వులు స్వభావ సిద్దముగ విడివడి ఉండును. వేరు వేరు చోట్లకు వెళ్ళు బాటలు విడివడి ఉండును. అట్లే "వ్య2హం సర్వేణ పాప్మనా వియక్ష్మేణ సమాయుషా"
5. త్వష్ట తన కూతురు పెళ్ళిలో కానుక లిచ్చినాడు. వానిని పంపుటకు పృథివ్యంతరిక్షములను విడగొట్టినాడు. అట్లే "వ్య2హం సర్వేణ పాప్మనా వియక్ష్మేణ సమాయుషా"