Previous Page Next Page 
అథర్వ వేద సంహిత పేజి 26

                 

                               యస్య నిఃశ్వసితం వేదా యో వేదేభ్యో2ఖిలం జగత్|
                                నిర్మమే తమహం వన్డే విద్యాతీర్ధ మహేశ్వరమ్ ||
                                         శ్రీ మదాంధ్ర వచన అథర్వ వేద సంహిత
                                                       నాలుగవ కాండ
                                                  మొదటి అనువాకము
                                                   మొదటి సూక్తము - 1

   
    బ్రహ్మ జజ్ఞానం ప్రథమం పురస్తాద్వి సీమతః సురుచో వేన ఆవః |
     స బుధ్న్యా ఉపమా అస్య విష్ఠాః సతశ్చ యోని మసతశ్చ వి వః ||
   
వినియోగము :-


      1. వేద కల్పాది అధ్యయనారంభమున విఘ్నశమనార్ధము. వాద ప్రతివాదములందు విజయమునకు ఈ         సూక్తమును జపించునది.
   
      2. గోపుష్టి కర్మమున గోవుల రోగ శాంతి కొరకు లవణమును ఈ సూక్తముచే మంత్రించి త్రాగించునది.
   
      3. మొదటి ఋక్కు బృహద్గణమందు పాఠమగుచున్నది.
   
      4. వివాహపు చతుర్ధ కర్మయందు మొదటి మంత్రము చదువుచు ఉంగరముతో ప్రజనన ప్రదేశము చూపునది.
   
      5. ఉపాకర్మయందు కూడ మొదటి మంత్రము జపించునది.
   
      6. 1-2 మంత్రములచే ప్రవర్గ్య కర్మయందు నిధీయమాన మహావీరమును అనుమంత్రించునది.
   
      7. అగ్ని చయనము నందు ఉపధీయమాన హిరణ్మయ రుక్మమును మొదటి ఋక్కుచే అభిమంత్రించునది.
   
      8. బ్రహ్మ వర్చస్సు కోరువాని బట్టలు, పడక కాలిపోయినపుడు ఈ సూక్తముచే మహాశాంతి చేయవలెను.
   
      9. తులా పురుష విధిలో ఈ సూక్తముచే ఆహుతులు ఇచ్చునది.
   
1.    సృష్ట్యాది యందు బ్రహ్మ ఆవిర్భవించినాడు. అతడు సూర్యుని యందు ప్రవేశించి తూర్పున ఉదయించినాడు. ప్రభామండలము నుండి అంధకారమును తరిమి సమస్త జగములందు వెలుగులను నింపుచున్నాడు. అతడు తన కాంతిని సదసత్సమస్త జగములందు వ్యాపించుచున్నాడు.
   
2.    ఈ సమస్త సృష్టిని రచించినవాడు ప్రజాపతి. అతడు తండ్రి యగుచున్నాడు. అతని నుండి నాదము ఆవిర్భవించినది. ఆమె వాగ్దేవియై జగముల సమస్త వ్యవహారములకు మహారాజ్ఞి అయినది.
   
    ఆదిత్యుడు ముల్లోకములందు వ్యాపించిఉన్నాడు. అతడు హవిస్సులను అభిలషించువాడు. పుణ్యములు చేసినవారు అతనిని చేరుకొనవచ్చును. అట్టి సూర్య దేవుని కొరకు ఋత్విజులు హవిస్సును దుగ్ధములచే సంస్కరించుచున్నారు.
   
3.    అతడు లోక బంధువు. విద్వాంసుడు. సమస్త దేవతల జన్మములు తెలిసినవాడు. ఇతరులకు తెలియచెప్పగలవాడు.
   
    అతడు బ్రహ్మ అయినాడు. వేదములను పైనుండి, మధ్య నుండి, దిగువ నుండి ఆవిర్భవింపచేసినాడు. ఆ వేదముల వలననే దేవతలు ఆహుతులు అందుకొనుచున్నారు.
   
4.    అతడే స్వర్గమును, పృథ్విని, ఋతస్థ మహా రోదసిని ఏర్పరచినాడు. వాని క్షేమము చూచుచున్నాడు. అతడు ద్యావాపృథ్వులను తన యందు నిలుపుకున్నాడు. వానిని తన వెలుగులతో వెలిగించుచున్నాడు.
   
5.    అతడు సృష్టికి మొదట పుట్టినవాడు. అతడు క్రింది నుంచి మీది వరకు అంతట వ్యాపించి ఉన్నవాడు. ఆవిధముగ ఏర్పడిన సృష్టికి బృహస్పతి సామ్రాట్టు అయినాడు. జగములందు సూర్యుని కాంతులు ప్రసరించినపుడు విప్రులు దేవతలకు హవిస్సులు అర్పింతురుగాక.
   
6.    ఈ యజ్ఞము ఋత్విక్సంబంధము. ఇది తేజోమండల రూప సూర్యుని ఉదయాచలమున కంపును. ఇతనికి తూర్పుదిక్కుతో సంబంధము. అతడు హవిరూప అన్నమును ఆశించి తొందర పడి ఉదయించుచున్నాడు.
   
7.    బృహస్పతి జగత్పిత. దేవబంధువు. ప్రజాపతి. అతనికి నమస్కరించుచున్నాము. స్వీకరించునుగాక. నీవు సకల చరాచర ప్రకృతికి సృష్టికర్తవు. దేవతవు. విద్వాంసుడవు. హవిస్సులు అందుకొనుము. హింసించకుము. అనుగ్రహించుము.
   
                                      రెండవ సూక్తము   
   

వినియోగము :-

   
      1. వశాశమన కర్మపు శాంత్యుదకమున దీనిని అనుయోజనము చేయునది.
   
      2. వశ గర్భము దాల్చినచో గర్భమును దోసిట పట్టి ఈ సూక్తముచే ఆహుతి ఇచ్చునది.
   
      3. వశా శమన కర్మపు చారు హోమమందును, అవదాన హోమమందును ఈ సూక్తమును చదువునది.
   
      4. చాతుర్మాస్యమున జరుగు వరుణ ప్రఘాస కర్మమున తొలిమంత్రముచే ఏక కపాల హవిని  అనుమంత్రించునది.
   
      5. అగ్ని చయనమున ప్రాజాపత్య పశువు అవదానాను మంత్రణమున ఈ సూక్తము వినియోగము.
   
      6. హిరణ్య పురుషుని ఉపధాన సమయమున 7వ ఋక్కు చదువ బడును.
   
1.    ఎవడు ప్రాణములు ఇచ్చువాడో, ఎవడు శక్తిని ఇచ్చువాడో, ఎవనిని సమస్త దేవతలు ఉపాసింతురో, ఎవని ఆదేశములను సమస్త జగత్తులు తలదాల్చునో, ఎవడు ద్విపాత్తులను, చతుష్పాత్తులను శాసించుచున్నాడో "కస్మైదేవాయ హవిషావిధేమ" అట్టి దేవతకు హవిస్సులు అర్పించుచున్నాము.
   
2.    ఎవడు తన మహిమ వలన గాలిపీల్చు వారికి, రెప్పవాల్చు వారికి, జంగమములకు అధిపతి అగుచున్నాడో, అమృతము ఎవని నీడయగుచున్నదో. మృత్యువు ఎవని అధీనమందున్నదో "కస్మై దేవాయ హవిషా విధేమ"
   
3.    ఎవని వలన లోకములు కేకలు పెట్టుచున్నవో, ఎవరి ప్రభావమున ద్యావాపృథ్వులు కూలకుండ నిలిచి ఉన్నవో, ఎవని ద్యులోకమార్గము వృష్టి కారకమగుచున్నదో "కస్మై దేవాయ హవిషా విధేమ"
   
4.    ఎవని మహిమ వలన ద్యులోకము విస్తృతమైనదో, పృథివి గొప్పగా విస్తరించినదో అంతరిక్షము ఎల్లలెరుగని దైనదో, సూర్యుడు ఆకసమున వెలుగొందుచున్నాడో ""కస్మై దేవాయ హవిషా విధేమ"
   
5.    ఎవని మహిమ వలన హిమాలయాదులు పుట్టినవో, సముద్రములు నదులు కలిగినవో, ప్రధాన దిశలు ఎవని బాహువులయ్యున్నవో, "కస్మై దేవాయ హవిషా విధేమ"
   
6.    జలములే సృష్ట్యాదియందు విశ్వమును రక్షించినవి. అమృతమును, ఋతమును గర్భమున దాల్చినవి. ఏ జలదేవేరులందు దేవతలు నిలిచి ఉన్నారో "కస్మై దేవాయ హవిషా విధేమ"
   
7.    హిరణ్య గర్భః సమవర్తతాగ్రే భూతస్యజాతః పతిరేక ఆసీత్
    సదాధార పృథివీముత ద్యాం కస్మై దేవాయ హవిషా విధేమ.

   
8.    తొలుత జలము ఈశ్వరుని వీర్యమును గర్భమున దాల్చినది. అట్లు ఆవిర్భవించనున్నవాని దేహము హిరణ్మయమై ఉండెను - "కస్మై దేవాయ హవిషా విధేమ"
   
                                           మూడవ సూక్తము - 3
   
వినియోగము :-

   
       1) గోవులకు చోర, వ్యాఘ్రాదిభయ నివారణమునకు 'ఖాదిర' గుంజలను సంపాతన, అభిమంత్రణ చేసి         గోసంచార భూమి మీద రాపుచు గోవుల వెంట వెళ్ళునది.
   
       2) నీరు నిండిన కుండను ఈ సూక్తముచే అభిమంత్రించి ఆవులు తిరుగు చోటునకు చేర్చునది. అక్కడి         దుమ్మును కుప్పచేసి దానిలో సగమును చేతితో చల్లవలెను.
   
       3) ఈ సూక్తముచే సారూపవత్స ఓదనమును ఇంద్రునకు మూడు ఆహుతులు ఇచ్చునది.
   
1.    వృకములు, వ్యాఘ్రములు, చోరులు ఈ చోటు విడిచి పోవుదురు గాక. అంతర్హితములై ప్రవహించు నదులవలె అవి అంతర్హితములగును గాక. వనస్పతులందు దేవతలున్నట్లు అవి కనిపించకుండును గాక. వాటి శత్రువులు వైర్ని అంతర్ధానులను చేయుదురు గాక.
   
2.    తోడేలు మా మార్గము నుండి తోలుగును గాక. దొంగలు తొలగుదురు గాక. సర్పములు తొలగునుగాక. ఆయుధములు మున్నగునవి తొలగును గాక.
   
3.    వ్యాఘ్రమా! నీ కనులను ముఖమును చెడగొట్టుచున్నాను. నీ నాలుగు కాళ్ళకున్న ఇరువది గోళ్ళను పీకి వేయుచున్నాము.
   
4.    కోరలుగల హింసక మృగముల కన్నా ముందు వ్యాఘ్రములను నష్టపరచుచున్నాము. దొంగలను నష్టపరచుచున్నాము. తదనంతరమే పాములను, రక్కసులను, తోడేళ్ళను ధ్వంసము చేయుచున్నాము.
   
5.    మా మీదకు వచ్చు దొంగలను మేము చితక బాదుదుము గాక. వారు పారిపోవుదురు గాక. వారి మార్గములు కఠినములగును గాక. పారిపోవు దొంగలను ఇంద్రుడు వజ్రాయుధమున హతమార్చును గాక.
   
6.    వ్యాఘ్రాదుల దంతములు మొండిబారును గాక. వాటి కొమ్ములు పదను లేనివి అగును గాక. వాటి ప్రక్కటెముకలు మొద్దు బారును గాక.
   
    బాటసారీ! 'గోధ' నీ కంట పడకుండును గాక. నిద్రించు మృగము సహితము నీ దారికి రాకుండును గాక.
   
7.    ఇంద్రుని నుంచి, సోముని నుంచి పుట్టిన వ్యాఘ్రాదులు వారి అధీనమున ఉన్నవి.  అవి అదుపు తప్పవు. యజ్ఞకార్యమా! నీవు అథర్వుని దర్శించిన దానవు. వ్యాఘ్రాది దుష్ట మృగములను హతమార్తువు.

 Previous Page Next Page