సమస్య పరిష్కారమైనా ఆశ చావక ఈస్వరరావు ట్రయిన్ కదిలేవరకూ అక్కడే తచ్చాడాడు. ట్రయిన్ కదిలివెళ్లిపోతుంటే బెంగగా చూశాడు. ఆ తర్వాత రాజారావు దగ్గరకు వచ్చాడు. అప్పుడే ప్లాటుఫారంపై అటు పక్కగా జనతా ఎక్స్ ప్రెస్ వచ్చి ఆగింది. ప్లాటుఫారంపై అటు పక్కగా జనతా ఎక్స్ ప్రెస్ వచ్చి ఆగింది. ప్లాటు ఫారంమీద ఓ కౌంటరు ఓపెన్ చేయబడింది. ఈ పర్యాయం క్యూలో రాజారావు నిలబడ్డాడు. ఈశ్వరరావు ఇతర ట్రయిన్సు గురించి వాకబుకు వెళ్ళాడు. రాజారావు క్యూలో పదినిముషాలు నిలబడ్డాక కౌంటర్ వ్యక్తి చావు కబురు చల్లగా చెప్పాడు. బరోడాకు సీట్లుకానీ, బెర్తు కానీ ఏమీ కాళీ లేవట.
రాజారవుకీ కబురు తెలిసే సమయానికి ఈశ్వర్రావు అక్కడికి వచ్చి- "ఈ ట్రయిన్ నాలుగూనలభై అయిదుకి కదుల్తుందిట. బరోడా పన్నెండున్నర దాటేక చేరుతుంది..." అన్నాడు.
"రిజర్వేషన్ లేదు..." అన్నాడు రాజారావు నీరసంగా.
ఆ సమయంలో ఓ కూలీ వచ్చి - "సీటు కావాలా, బెర్తు కావాలా?" అనడిగాడు రాజారావుని.
"ఇందులో?" అన్నాడు ఈశ్వరరావు.
"టూ టయిర్లో__"
"ఎంత?"
"సీటుకి అయిదు. బెర్తుకి పది__త్వరగా చెప్పాలి. ఎన్నో కాళీల్లేవు..." అన్నాడు కూలీ.
"బెర్తు కావాలి__" అన్నాడు రాజారావు. తక్షణం మేను వాల్చితేకానీ లాభంలేదనుకున్నాడతను. ఇద్దరూ తమ బ్యాగులతో కూలీ ననుసరించారు.
వారు చేసిన కంపార్టుమెంటుమీద టూ టయిర్ అని రాసి ఉన్న మాట నిజమే కానీ- వాటిని సుద్దకొట్టివేసి కిందగా అన్ రిజర్వ్ డ్ కంపార్టు మెంటు అని రాసి వుండడం గమనించారు ఇద్దరూ. దానిమీద ప్రశ్నించగా- "మీకేమీ భయం లేదు. అంతా గ్యారంటీ..." అన్నాడు కూలీ.
ఇది అక్కడ మామూలేనట. రష్ ఎక్కువగా వుందని కొత్తబోగీ తగిలిస్తారుట. జనాలను కన్ ఫ్యూజ్ చేయడానికి టూ టయిర్ అని రాసి ఉన్న బోగీ తగిలిస్తారుట. దానిమీద సుద్దతో కొట్టివేసి అన్ రిజర్వ్డ్ అనిరాసినా కూలీలకు డబ్బివ్వకుండా అందులో ఎవ్వరూ కాలు మోపలేరట.
ఈ కధ వినడమయ్యేక రాజారావు, ఈశ్వరరావు లోపలకు నడిచారు. ఎదురెదురుగా వున్నా రెండు బెర్తులు చూపించాడు కూలీ. టూ టయిర్ బెర్తులు కాబట్టి అవి మెత్తటి కుషన్తో వున్నాయి. ఈశ్వరరావు కూలీకి ఇరవై రూఅపాయలు ఇచ్చాడు. ఇద్దరూ చెరోబెర్తూ ఎక్కి నడుం వాల్చారు.
"అబ్బ ప్రాణం ఎంత సుఖంగా వుందోచెప్పలేను__" అన్నాడు ఈశ్వరరావు. ఆ సుఖమేమిటో అర్ధం చేసుకోగల వాడు రాజారావోక్కడే. బాగా అలసిపోయి వున్నప్పటికీ ఇద్దరికీకూడా నిద్రరావడం లేదు. అంతవరకూ జరిగిన ప్రయాణపు విశేషాలను కాసేపు ముచ్చటించారుకానీ ఇద్దరికీమాట్లాడే ఓపికలేదు.
ఈశ్వరరావు వెతికి రైల్వేగైడు తీశాడు. అది పాతది. అయినా అందులో చూసి జనతా బొంబాయినుంచి బరోడాకు చేరడానికి ఎంతసేపు పడుతుందో చూశాడు. ఎనిమిది గంటలని తేలింది. ఆ ప్రకారం టయిం అంచనావేసి- "మనం ఎనిమిదిగంటలు హాయిగా నిద్రపోవచ్చు...." అన్నాడు. నిద్రపట్టినా పట్టకపోయినా రాజారావుకు ప్రాణం సుఖంగా వుంది. బెర్తులు తీసుకోవడం మంచిపనే అయింది. కింద జనం బాగా ఎక్కువగా వున్నారు. బెర్తులజోలికి అదృష్టవశాత్తూ ఎవరూ రావడంలేదు.
కంపార్టుమెంటులోని జనమంతా పరిశుభ్రంగా ఉన్నారు. ఒక్కరి మొహంలోనూ పేదరికపు లక్షణాలు లేవు. ఇది రాజారావని బాగా ఆశ్చర్యపరచింది. ఏదైనా పుస్తకం చదివితే నిద్రపడుతుందేమోనని అతను భావించి- బ్యాగులోంచి వసుంధర తన కోసం పెట్టిన కొత్త పత్రిక్ తీశాడు- అతను చదవడం మొదలు పెట్టేసరికి ట్రయిన్ కదిలింది.
ప్లాటుఫారంమీద వుండగానే ఈశ్వర్రావు కొద్దిగా అరటిపళ్ళు కొన్నాడు. బోగీలోకి బొండాలూ, సమోసాలూ అమ్మొచ్చాయి. చాలాసేపు ఆలోచించి రాజారావు ఓ రూపాయి సరుకు కొన్నాడు. వాటిలో నంచుకునేందుకు ఊరవేసిన పచ్చి మిరపకాయ ఇవ్వడం అతనికి చాలా ఆనందాన్ని కలిగించింది. కారం చూస్తే అతనికి ప్రాణం లేచి వస్తుంది.
పదార్ధాలు బాగా రుచిగా వున్నాయి. రాజారావు చెప్పగా ఈశ్వరరావుకూడా అవి తిని చూశాడు. అతనికి బొండాలు కరం అనిపించినా సమోసాలు బాగున్నాయి. ఇద్దరూ అవే కడుపునిండా తిన్నారు. వాటర్ బాటిల్లో నీళ్ళు తాగడానికి సరిపోతాయో సరిపోవా అని భయపడుతూండగా కంపార్టుమెంటులోకి మంచినీళ్ళు అమ్మొచ్చాయి.