Previous Page Next Page 
ప్రయాణంలో పదనిసలు పేజి 26

    "రైల్వే వారిని అభినందించాలి. ప్రయాణికులకు మంచి నీళ్ళవసరమవుతాయని గ్రహించి- వాటిని కంపార్టుమెంటులో అమ్మిస్తున్నారు...." అన్నాడు రాజారావు గ్లాసుపదిపైసలట. ఇద్దరూ చెరోగ్లాసూ తాగారు. ఈశ్వరరావు వాటర్ బాటిల్ నిండానీళ్ళు పోయించాడు. అరవైపైసలు బిల్లు అయింది. రాజారావు డబ్బులిచ్చేసి- "వాటర్ బాటిల్ జాగ్రత్తండోయ్ అందులోనినీళ్ళిప్పుడు కొనుక్కున్నవి_" అన్నాడు ఈశ్వరరావుతో.
    అయితే ఆ తర్వాత వాళ్ళకు మంచినీళ్ళు తాగవలసిన అవసరం రాలేదు. ఇద్దరికీ మంచి నిద్రపట్టేసింది.
                                              5  
    ప్లాటుఫారంమీద ఇద్దరూ ఒళ్ళు విరుచుకున్నారోసారి.
    "విశాఖ పట్నానికి వాల్తేర్లా- బరోడాకు వడోదరా అన్నది రైల్వే నామ దేయమన్నమాట!" అన్నాడు రాజారావు ఆవులిస్తూ. ఈశ్వరరావు ఏదో అనబోయి ఆవులింత అడ్డువచ్చి ఆగిపోయాడు. అర్దరాత్రి పన్నెండున్నర ప్రాంతం లో లేచారేమో ఇద్దరికీ చాలా బద్దకంగా వుంది. ఆగకుండా ఆవులింతలు వస్తున్నాయి.
    "ఇప్పుడేం చేద్దాం?" అన్నాడు ఈశ్వరరావు.
    "మనం వెళ్లవలసిన ఆఫీసు రేపుదయం తొమ్మిదిదాకా తీయరు. ఈలోపుగా మనకు విశ్రాంతి అవసరం. ఏదైనా హోటల్ కు పోదాం__" అన్నాడు రాజారావు.
    ఈశ్వరరావు ముందుగా కాస్త కాఫీ తాగి వచ్చాడు. తర్వాత ఇద్దరూ ప్లాటుఫారం మీదకు వెళ్ళి రిజర్వేషన్ కౌంటర్లో, రిజర్వేషన్ టయిమింగ్సు, పొజిషన్స్ చూసుకున్నారు. ఇరవైరెండో తేదీన బరోడానుంచి వుదయం 6 గంటలకు రాజధాని ఎక్స్ ప్రెస్ ఎక్కితే పదకొండు కాకుండా బొంబాయి చేరవచ్చు. ఆ తర్వాత ఒంటిగంటా నలభై నిముషాలకు హైదరాబాదు వెళ్ళే ఎక్స్ ప్రెస్ వుంది. అందువల్ల ఆ ట్రయిన్లో దొరికితే ప్రయాణం సౌకర్యంగా జరిగిపోతుంది. అక్కడ రాజధాని ఎక్స్ ప్రెస్ లో పొజిషన్సు సూచించే టైమ్ టేబిల్ వుంది. కాళీ వుంటే బల్బు వెలుగుతూంటుంది. దానిని బట్టి తమకు కాళీ వున్నదని గ్రహించారు వాళ్ళు.   
    "మనలాంటి వాళ్ళను యుద్దరంగంలో ప్రవేశపెట్టాలి. ఎంతసేపూ మనకు తిరుగుముఖం పట్టటం మీదనే దృష్టి!" అన్నాడు రాజారావు.  
    ఇద్దరూ బయటకు వచ్చారు. ఆ ప్రాంతం చాలా బాగుంది. అందంగా, విశాలంగా వుంది. ఈశ్వరరావు ఒకరిద్దర్ని పలకరించి వచ్చేక- "ఇంగ్లీషులో అడిగితే ఎవరూ మాటాడ్డంలేదు. మీరే ప్రయత్నించండి-" అన్నాడు రాజారావుతో.  
    రాజారావు కిల్ళీకొట్టులో అడిగి ఓ మాదిరిగా చార్జి చేసేహోటళ్ళ గురించి తెలుసుకున్నాడు. ఆ ప్రకారం ఇద్దరూ ఫర్లంగున్నర నడిచి ఒక లాడ్జి చేరారు. అది చాలా నీటుగా వుంది. డబుల్ రూంకి పాతిక రూపాయలు చార్జి. మారుమాటాడకుండా అందులో ప్రవేశించారిద్దరూ.   
    గది చాలా ఇరుకుగావుంది. అందులోనే రెండు మంచాలున్నాయి. ఇద్దరూ నిద్రకు పడ్డారు ఈశ్వరరావుకు గాఢ నిద్రపట్టేసింది. రాజారావుకు ఓ మాదిరిగా మాత్రం నిద్రపట్టింది. ఏడుగంటలకు రాజారావుకు మెలకువ వచ్చేసి లేచి త్వరత్వరగా కాలకృత్యాలు తీర్చుకోసాగాడు. అతను ఎలక్ట్రిక్ షేవరుతో గెడ్డం గీసుకుంటూండగా- ఆ చప్పుడుకీస్వర్రావు లేచాడు. ఇద్దరూ త్వరత్వరగా తెమిలి ఎనిమిదయ్యేసరికి గదిలోంచి బయటపడ్డారు.   
    లాడ్జి యజమానివచ్చి గది తలుపులు తనే స్వయంగా తాళం వేశాడు. తాళం తమకిస్తాడని రాజారావు అనుకున్నాడు. కానీ అతను తనదగ్గరే వుంచుకున్నాడు. రాజారావు దానిగురించి అడగ్గా -"మీ కేమీభయంలేదు. నేను సద్ బ్రహ్మణున్ని. కొన్ని దశాభ్దాలుగా వ్యాపారం చేస్తున్నాను. మీది పూచికపుల్లకూడా పోదు__" అని హామీ ఇచ్చాడు.   
    ఏమి చేయాలో తెలియకపోయినా ఇద్దరూ అక్కడ ఆగలేదు. మనసులో భయంగా వుంటే ధైర్యం చెప్పుకున్నారు. అక్కన్నించి స్టేషన్ కు వెళ్ళేదారిలో సౌత్ ఇండియన్ హోటల్ ఒకటుంది. అక్కడ ఇడ్లీలు భయంకరంగా వున్నాయి. దోసె ఫరవాలేదు. కాఫీకూడా భయంకరంగా ఉన్నదని ఈశ్వరరావన్నాడు.   
    బరోడా అడుగుపెట్టగానే మొత్తంఖర్చు అంతా రాజారావు పెట్టెటట్లూ- చివరలో ఇద్దరూ సమానంగా పంచుకునే టట్టూ అంగీకారమయింది.ఈశ్వర్రావు డబ్బు దొంగలు కొట్టేస్తారని భయం. అతనుకొద్దిగా తనవద్ద వుంచుకని మిగతాదంతా రాజారావువద్ద దాచుకున్నాడు.   
    హోటల్లోంచి బయటపడి స్టేషను చేరుకొని రాజధానీ ఎక్స్ ప్రెస్ లో టికెట్సు బుక్ చేశారు. ఆ పని సులభంగానే అయిపోయింది. వాల్తేర్ వరకూ తిరుగుప్రయాణం పక్కాగా వున్నట్లు లెక్క. ఎందుకంటే బొంబాయిలో ఈశ్వరరావు వాల్తేర్ బోగీలోనే రిజర్వేషన్ చేయించాడు.

 Previous Page Next Page