ఈశ్వరరావు కాస్త ముందుగానే రాజారావు దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాడు. "బహుశా తిరుగు ప్రయాణం మనకు బాగా నడుస్తుందేమో- ఇది అందుకు సూచన లాగున్నది-" అన్నాడు రాజారావు. అంత దూరం తమతో కలిసి వచ్చిన చౌదరి అలా మాట్లాడడం అతనికి నచ్చక పోయినా అంతవరకూ చేసిన ప్రయాణాన్ని తలచుకుని చౌదరిపైన జాలిపడకుండా ఉండలేకపోయాడు రాజారావు.
చౌదరి వచ్చేక ఫస్టుక్లాసు పొజిషన్ గురించి విచారించారు. డిసెంబర్ రెండో తేదీవరకూ ఏమీ కాళీల్లేవని తెలిసింది. లోకల్ ట్రయిన్సులో వెళ్ళడానికి చౌదరి వాళ్ళకు విధానాలు వివరించి- టికెట్సు కొనుక్కునే క్యూదాకా తీసుకువెళ్ళి- "అదృష్టం బాగుంటే మనం మళ్ళీ కలుద్దాం. వస్తాను." అని వెళ్ళిపోయాడు.
ఈశ్వరరావు క్యూలోనించున్నాక వీళ్ళ సంభాషణ విన్న ఒకాయన ఇంగ్లీషులో- "బొంబాయి సెంట్రల్ కిలోకల్ ట్రయిన్లో వెళ్ళాలంటే- ఇప్పుడు దాదర్ వెళ్ళి అక్కడ ట్రయిన్ మారాలి. ఇక్కణ్ణించి కాస్త అలా వెడితే ఓ లాస్ స్టాపు వస్తుంది. అక్కడ 66 నంబర్ బస్సు ఎక్కారంటే బొంబాయి సెంట్రల్ డైరెక్టుగా చేరతారు-" అని సలహా ఇచ్చాడు.
ఇద్దరూ తమతమ బ్యాగులను ధరించి అక్కణ్ణించి బయటపడి ఓ చిన్న దుకాణంలో దూరారు. అక్కడ ఈశ్వరరావు కాఫీ తాగాడు. రాజారావు కూల్ డ్రింక్ తాగాడు. తర్వాత ఇంకో రెండు, మూడు ఎంక్వయిరీలు చేసి అటూ ఇటూ మారి సలహా ఇచ్చిన ఆయన చెప్పిన ప్రకారం బస్సు ఎక్కి బొంబాయి సెంట్రల్ వస్తే చెప్పమని కండక్టర్ని వచ్చీ రాని హిందీలో బ్రతిమాలి- బస్సు ఆగినప్పుడల్లా ఇది బొంబాయి సెంట్రలా అని అడుగుతూ-ఆఖరికి ఒక చోటదిగారు. "పావలా టికెట్టూ - పావుగంట ప్రయాణం" అన్నాడు ఈస్వరరావు బస్సు దిగేక.
చుట్టూ ఎంత చూసిన వారికి బొంబాయి సెంట్రల్ స్టేషన్ ఎక్కడో తెలియలేదు. బరోడాకు పోయే ట్రయిన్సన్నీ అక్కన్నించే బయల్దేరతాయి. ఎందుకైనా మంచిదని రాజారావు దారినపోయే దానయ్యని పలకరించి- బొంబాయి సెంట్రల్ ఎక్కడో తెలుసుకోగోరాడు. దానయ్య వీళ్ళవంక ఆశ్చర్యంగా చూసి- నవ్వి. చేత్తోనే బిల్డింగు చూపించాడు. అదే బొంబాయి సెంట్రల్. దానిమీద ఆ విషయం రాసి వుంది.
ఈశ్వరరావు రాజారావు ఆత్రుతగా అక్కడ సమాచారం అడిగారు. అప్పటికి టైము మూడు దాటింది. నాలుగు గంటల ప్రాంతాల అక్కణ్ణించి రాజధానీ ఎక్స్ ప్రెస్ బయల్దేరుతుంది. అది బొంబాయి వదిలేక బరోడాలోనే ఆగుతుంది. ఎనిమిదిన్నరకల్లా బరోడా చేరుతుంది. అది ఎయిర్కండిషను ఎక్స్ ప్రెస్ కావడంవల్ల సెకండ్ క్లాసు చైర్ కార్ ధర మామూలు ట్రయిన్సు ఫస్టుక్లాసుకి సమీపంలో వుంటుంది. ఇంత కష్టపడిన మీదట చివరికైనా ఈ ట్రయిన్లో ప్రయాణం చేసి సుఖపడాలని రాజారావూ, ఈశ్వరరావూ అనుకున్నారు. కానీ కౌంటరులో అడిగితే కాళీలు లేవనీ- వెళ్ళి ప్లాట్ ఫారం మీద ప్రయత్నించమనీ సలహా వచ్చింది. ఈశ్వరరావు రకరకాల ప్రశ్నలు వేసి చూశాడు కనీ అతని మాటలనే వినలేదు కౌంటరులో వ్యక్తి. రాజారావు తనుకూడా ప్రయత్నించి ఏమీ లాభంలేదని గ్రహించేక-"పదండి-ప్లాట్ ఫారం మీదకు పోదాం-" అన్నాడు.
"అయితే సెకండ్ క్లాసు టికెట్సు తీద్దాం. రాజధానికి గానీ మరే యితర ట్రయిన్ కిగానీ అవసరాన్నిబట్టి ఎక్స్ ట్రా పేచేద్దాం. రైల్వేవాళ్ళ దగ్గర రిఫండ్ కష్టంకానీ-ఎక్స్ ట్రా ఇవ్వడం సులభం ఆ విధంగా ప్లాట్ ఫారం టికెట్సు కూడా కొనక్కర్లేదు-" అన్నాడు ఈశ్వరరావు.
టైము మూడున్నర అవుతూండగా రాజధానీ ఎక్స్ ప్రెస్ ప్లాటుఫారం మీదకు వచ్చింది. ఈశ్వర్రావు నో కప్పు కాఫీతాగి - సామానుకు రాజారావుని కాపలాపెట్టి ప్రతికంపార్టుమెంటువద్ద అడిగి చూశాడు. ఎవ్వరూ లేదన్నారు. ఎలాగో అలా సాయపడలేరా అని రిక్వెస్టు చేశాడు ఈశ్వరరావు.
ఒక కంపార్టుమెంటువద్ద- "ఇది ఎయిర్ కండిషన్దు ఎక్స్ ప్రెస్. టికెట్టు చాలా ఎక్కువ- తెలుసా?" ని ఒకతనంటే ఈశ్వరరావు దెబ్బతిన్నాడు. అతనికి హటాత్తుగా తను రెండు రోజులుగా గెడ్డంగీయడంలేదనీ, తన బట్టలు ప్రయాణంలో పూర్తిగా మాసిపోయాయనీ స్ఫురించింది. ఆ దృష్టితో చూడగా అతనికి రాజధానిలో ఎక్కడానికి వచ్చినవారందరూ తళతళలాడుతూ మిలమిల మెరుస్తూ కనబడ్డారు.
ఒక్క నిముషం చిన్నబుచ్చుకున్నా ఈశ్వరరావు తన ప్రయత్నాలు మానలేదు. ఈ ట్రయిన్లో సీటు కావాలంటే కఫూర్ అనే అతనున్నాడనీ అతనివల్ల తప్ప మరెవరికీ సాధ్యపడదనీ కొంతమందిచెప్పారు. కఫూర్ కోసం ఈశ్వరరావు తెగగాలించాడు. ఇక్కడని కొందరూ అక్కడని కొందరూ చెప్పారు. మధ్యలో అతను రాజారావుని కలుసుకుని పరిస్థితి వివరించి- "కఫూర్ కనపడితే మన సమస్య పరిష్కారమై పోతుంది...." అన్నాడు. అతనలాగన్న రెండు నిముషాలకు కఫూర్ దొరికాడతనికి. రాజధానిలో ఇంజన్ వద్ద ఉన్న కంపార్టుమెంటు ఎంట్రెన్సు దగ్గర నిలబడి వున్నాడు కఫూర్. అమెరికన్ పద్దతిలో ఇంగ్లీషును వుచ్చరిస్తూ- "వాటే కెనై డూఫర్ యూ..." అన్నాడు కఫూర్. ఆ మనిషినీ, మాట్లాడిన తీరునీ చూసి ఈశ్వరరావు మాట్లాడడానికి భయపడ్డాడు. అందులోనూ తన వాటంకూడా ఊహించుకున్నాడు. "డాక్టర్ ఈస్వరరవూ- నీకేగతి పట్టింది? అని మనసులో అనుకొని తన పరిస్థితి వివరించాడు. సమస్యలను పరిష్కరించటంలో కడుసమర్దుడులా వున్నాడు కఫూర్ - "తరువాతిబండి నాలుగున్నర కుంది. జనతా ఎక్స్ ప్రెస్. అందులో ప్రయత్నించు-" అని ఇంగ్లీషులో చెప్పాడు.