"చెపితే ఏమయిందట! సోలెడు బియ్యం కోసం చెప్పే మాటలన్నీ నిజాలవుతాయని వీళ్ళు దిగులెట్టుకు కూర్చున్నారా?"
"అలా అనకమ్మా! ఆమె పేరంటాలు అపరావతారం అంటారు"
"సింగినాదం అంటారండీ! మీలాంటి వాళ్ళే కదా అనేది! వాళ్ళు దిగులుపడి కూర్చుంటే ఓదార్చటం మర్చిపోయి ఇంకా ఆ మాటలు నిజమవుతాయని వాళ్ళని ఎక్కబొడుస్తున్నారు.
"నలుగురాడవాళ్ళు చేరారంటే ప్రపంచ యుద్ధంలాంటి దేదో రాకమానదు. ఒకరికొకరు అండగా ఉండే పద్దతి ఇదేనా?" అంటూ ముఖం చిన్న బుచ్చుకుని మరీ అడిగింది ఉమ.
వారంతా ముఖముఖాలు చూచుకున్నారు.
"ఇంతకాలం కళ్ళెదుట మనం చూస్తున్నదంతా అబద్దం! నాలుగు ముక్కలు చదివొచ్చి ఈవిడగారు చెప్పేది నిజం. మనకెందుకొచ్చిన గొడవ. వాళ్ళ తిప్పలేదో వాళ్ళేపడతామంటున్నారు.
"వెళ్ళదాం పదండి!" అంది అంతసేపూ ఆసక్తిగా ఉన్న ప్రక్కింటి మహిళ.
అదే మిగిలిన వారందరూ తీర్మానించారు.
ఒకరినొకరు చూపులతో హెచ్చరించుకుని అంతా వెళ్ళిపోయారు.
"ఇలాంటి చాదస్తాలు తలకెక్కించుకోటానికేనా సైన్సులో డిగ్రీలు సంపాదిస్తున్నావు?" తులసిని మందలించింది ఉమ.
"చూడవే! అమ్మ ఇలా ఉందని కాదు కాని నాకు కూడ కొన్ని నిదర్శనాలు కన్పిస్తున్నాయి! విజ్ఞాన శాస్త్రమంటే తెలియని విషయాలను వెతుక్కుంటూ పోవటమే కదా. వాస్తవాలు పుస్తకాల్లోనే కాదే! జీవితాల్లోనే ఉంటాయని మనం తెలుసుకోవాలి ముందు.
పెళ్ళి అయింది. హనీమూన్ కి వెడుతూ ఉండగా ద్రవిడ మాహేస్వరుడి సంఘటనా జరిగిందా? ఈ రోజు రాత్రి కలలో మనమంతా ద్రవిడ మాహేస్వరున్ని వెతుక్కుంటూ స్మశానానికి వెళ్ళావంట.
అక్కడ అతని జటా జూటంలోంచి దిగి వచ్చిన కృష్ణ సర్పం ఏమందో తెలుసా? ఈ నాటి నీ పతి దేవుడే ఆ నాటి నా ప్రియుడు అంది.
చెల్లీ అంటూ నన్ను గాఢంగా కౌగలించుకుంది. తలుచుకుంటే ఇప్పుడు కూడ ఒళ్ళు జలదరిస్తోంది. దాసరాణి కూడ నాకు నాగదోషం సోకిందని చెప్పింది. ఈ మూడు వేరువేరు సంఘటనలయినా వాటి మధ్య ఏదో ఒక లింకు ఉందనిపిస్తోందా? లేదా?" అని ప్రశ్నించింది తులసి!!
6
"కలలు నిజాలవుతాయా? అనేది మనకిప్పుడు చర్చనీయాంశం కాదు. కాని యోగి ఎక్కడున్నాడు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏమిటి?
ఎన్నడూ రాని వాడు ఈ ప్రాంతాలకి వచ్చి జనానికి వెర్రెత్తి పోయేలాగ మంత్రాలు మహిమలు చూపు కుంటూ తిరగటానికి కారణం ఏమిటి? అతని వెనుక ఉన్నవి ఐపి ఈ విషయంలో ఇంత ఎక్కువగా ఎందుకు కల్పించుకుంటున్నాడు అనే విషయాల గురించి తెలుసుకోవలసిన అవసరముంది" అని తీర్మానించింది ఉమ. కళ్యాణి ఆ అభిప్రాయంతో ఏకీభవించింది.
తల్లి క్రింద గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంది. ఆమె మనసులో రగులుతున్న అగ్నిపర్వతాలేమిటో, చిమ్ముతూన్న లావా ఏమిటో ఆ భగవంతుడికే తెలియాలి.
స్నేహ బృందం ముగ్గురూ టెర్రస్ మీద కేన్ కుర్చీల్లో కూర్చున్నారు.
జరుగుతున్న సంఘటనలకి అర్ధాన్ని వెతకాలని పరిష్కారాన్ని తెలుసుకోవాలనే ముగ్గురూ అనుకుంటున్నారు వీటన్నిటికి వెనుక ఎవరో కుట్రదారులున్నారని పోలీసులాగానే భావిస్తోంది ఉమ.
తులసి, కళ్యాణి దైవఘటనలు జరుగుతున్నాయని, నాగదోషంనిజమే అని విధి ప్రతికూలంగా ఉందని గాఢంగా నమ్ముతున్నారు.
రెండు పక్షాల నించి ప్రాణాలను తెగించి అయినా సరే విషయాన్ని పరిశోధించి తీరాలని మాత్రం తీర్మానించారు.
"ఈ విషయాన్ని పోలీసులు పరిశోధిస్తున్నారు. అంత కన్నా ఎక్కువ మనం ఏం చేయగలం?" అంటూ తన నిరుత్సాహాన్ని ప్రకటించింది కళ్యాణి.
"ఏం చేయగలమా? కప్పు వెనుక కప్పు ఐస్ క్రీం లాగించగలం" అంది ఉమ వ్యాఖ్యానంగా! కళ్యాణికి పౌరుషం వచ్చింది.
"అవసరమయితే ఏ సాహసానికయినా నీ కన్నాముందు నేను ఉంటానే ఉమా! మరీ అంత పప్పుసుద్దక్రింద జమకట్టి మాట్లాడకు" అంది రోషంగా.
"వెరిగుడ్! ఇప్పుడు సరిఅయినదారికొచ్చావు. అందుకే రెచ్చగొట్టాను. ఇప్పుడు కరెక్టు టెంపరేచర్ లోకి వచ్చావు." అంటూ ముందుగా తాను లేచింది ఉమ.
"తెలియని విషయాల్లో తలదూర్చి ప్రమాదాలు నెత్తికి తెచ్చుకోవటం మంచిది కాదేమోనే! మొదటే అమ్మకు ఒంట్లో బాగుండలేదు" అంది తులసి.
"ప్రమాదాల సంగతి అంటావా? శాస్త్రవిజ్ఞానంలో పరిశోధనలు చేయటంలో ఎందరు మహాపురుషులయిన శాస్త్రవేత్తలు ప్రాణాలు బలి ఇవ్వలేదు. మనం వారికన్నా గొప్పవాళ్ళంగాదు."
ఈ జరిగేదంతా స్వార్ధపరులయిన మనుష్యుల కుట్ర అని నేను అంటున్నాను.
దైవ మహిమలూ, వంకాయలూ, చింతకాయలూ అని మీరు అంటున్నారు.
మూర్ఖంగా వాదించుకోవటంకాదు. పరిశోధించాలని నేను అంటున్నారు. దీనికి మీరేమంటారు? అని ప్రశ్నించింది ఉమ.
"నీ మాత్రం దమ్ముచాలని వాళ్ళు ఇక్కడెవరూలేరంటాను" అంది కళ్యాణి.