Previous Page Next Page 
ట్రిక్ ... ట్రిక్ ... ట్రిక్ పేజి 24


    "ఒకవేళ వాడు తన రివాల్వర్ తో నిన్ను పేల్చి ఉంటే ఏం చేసే వాడివి?"
    "ప్రతి ప్రమాదానికీ నా దగ్గరో ఉపాయముంది. వాటిని వాడి చూడడమే తప్ప ముందుగా ఎవరికీ చెప్పను. దగ్గర్లో గోడలు లేకపోయినా గోడలకుండే చెవులు దూరాన్నుంచికూడా వినే ప్రమాదమున్నది ఈ రోజుకీ ఆటచాలు-పద-పోదాం!" అన్నాడు గోపి.
    "నాకు నీ అండ లభించడం పెద్ద అదృష్టం. ఈ ఫిరంగిపురంలో నాకింకా ఏ బెంగా ఉండదనుకుంటున్నాను-" అన్నది విశాల.
    "నాకు మాత్రం బెంగ పెరిగింది-" అన్నాడు గోపి.
    "ఎందుకని?"
    "ఇంతకాలం ఎదుటివాళ్ళను రక్షించడంకోసం నేనేమైపోయినా ఫరవాలేదనుకునేవాణ్ణి. ఇప్పుడు నీ బాధ్యత తీసుకోవడంవల్ల నాపట్లకూడా నా బాధ్యతపెరిగింది. నన్ను నేను రక్షించుకొంటూ నిన్ను రక్షించాలంటే కష్టమైన పనే!"
    "నాహీరోకు కష్టమైన పని అంటూ ఏదీలేదు-"అన్నది విశాల.
    గోపి ఆమెకు దూరంగా జరిగి- "నీకు దగ్గరగా ఉంటే నిగ్రహించుకొనడం కష్టమైన పనే అని నాకిప్పుడనిపిస్తున్నది-" అన్నాడు.
    విశాల లేచి నిలబడింది.
    ఇద్దరూ బుల్లెట్ మీద ఇల్లు చేరుకున్నారు.
    
                                         13
    
    సోమునూ, అతడి అనుచరుల్నీ చూసి- "ఎవ్వరూ మాట్లాడరేం? ఎక్కడైనా దెయ్యాన్ని చూసొచ్చారా?" అన్నాడు నాయుడు.
    అందరూ ఒక్కసారిగా తల లూపారు.
    నాయుడు ఆశ్చర్యంగా-"ఏమిటి-నిజంగానే దెయ్యాన్ని చూసొచ్చారా?" అన్నాడు.
    అప్పుడు సోము జరిగినదంతా నాయుడికి వివరంగా చెప్పాడు.
    "ఫూల్!" అన్నాడు నాయుడు చిరాగ్గా-వాడేదో చిన్న ట్రిక్ చేస్తే వెర్రివెధవల్లా పారిపోయొచ్చారా? మీరు పదహారుగురు వాడు ఒక్కడు. అయినా మీకు దెయ్యాలంటే భయం ఎప్పట్నించి ప్రారంభమయింది?"
    "ఏమిటో బాస్-వాడలా నోట్లోంచి తూటాలు తీసి విసురుతూంటే నాకు బుర్రపని చేయలేదు. ఎప్పుడూ వేయని భయంవేసింది." అన్నాడు సోము.
    నాయుడు ఆప్యాయంగా సోమును పలకరించి - "సోమూ-నీగుండె ధైర్యం గురించి నాకు తెలుసు. నువ్వు అంతలా ఎందుకు భయపడ్డావో నాకు తెలియడంలేదు. అసలక్కడ ఇంకా ఏమైనా జరిగిందా?" అన్నాడు.
    "లేదు బాస్! నలువైపులానుంచీ మేము చుట్టుముట్టామని తెలిసినా వాడి గుండెధైర్యం అణుమాత్రం తగ్గలేదు. వాడి ముఖంలో చిరునవ్వు తగ్గలేదు. మనిషి ఉత్సాహంగా కూడా ఉన్నాడు-దాంతో నా గుండెధైర్యం తగ్గిపోయింది. హోటల్లో వెనుకనుంచి నేను కత్తి విసిరితే ఎలా చూడగలిగాడో నాకు ఇప్పటికీ తెలియడంలేదు. నేను విసిరిన చాకు ఇలా నా చేయిదాటి అలా నాభుజంలో నాటింది. ఇలాంటి మనిషిని నేనెప్పుడూ చూడలేదు. వాడిని తలచుకుంటేనే నా బుర్ర పనిచేయడంలేదు-" అన్నాడు సోము.
    నాయుడు సోమును సమీపించి ఆప్యాయంగా భుజంతట్టి- "నీవంటి సమర్దుడినింతగా కలవర పరిచాడంటే వాడు సామాన్యుడు కాదు. వాడసలీ ఊళ్ళో ఎందుకు అడుగుపెట్టాడో-బహుశా నేనే ఇందులో కలగజేసుకోవాలి-" అన్నాడు.
    అదే నాయుడిలోని విశేషం. తన అనుచరులేవిషయంలోనైనా విజయం సాధించలేకపోతే అతడు అందుకు వారిని తప్పుపట్టడు. విషయాన్ని కూలంకషంగా అర్ధంచేసుకుని పొరపాటు ఎక్కడున్నదీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. అందువల్లనే అతడి అనుచరులు అతడికోసం ప్రాణం పెడతారు.
    "వీడి విషయంలో ఏం చేద్దామనుకుంటున్నారు బాస్!" అన్నాడు సోము.
    "వాడిని మనింటికి తీసుకుని రావడంకుదుర్తుందా?"
    "ఎందుకు?"
    "ఏముంది? బల్ల కటూ యిటూ కూర్చుని కబుర్లాడుకుంటే ఎటువంటి సమస్యలైనా చిటికెలో పరిష్కారమైపోతాయి-" అన్నాడు నాయుడు.
    "వాడు రాడేమో బాస్-ఇప్పటికే వాడికి మనం తనకోసం వలపన్నుతున్నట్లు తెలిసిపోయుంటుంది-" అన్నాడు సోము.
    "వాణ్ణి మనం వెళ్ళి బొట్టుపెట్టి పిలిచి తీసుకుని వస్తామా? ఏదో ట్రిక్ చేయాలి. అదంతా నేను చూసుకుంటాన్లే-మీరింక వెళ్ళండి-" అన్నాడు నాయుడు.
    సోము, బృందం అక్కణ్ణించి వెళ్ళిపోయారు.
    నాయుడు సోఫాలో కూర్చుని ఆలోచనలోపడ్డాడు. గోపీ విషయం ఏం చేయాలా అని! అతడి ఆటలనిలాగే కొనసాగిస్తే తన అనుచరుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోతుంది. అతణ్ణి తన పార్ట్నర్ గా స్వీకరిద్దామా అంటే అతడి బలాబలాలు తెలియవు. ఇలాంటి వ్యవహారాల్లో తన కంటే బలవంతుడైన వ్యక్తిని భాగస్వామిగా ఉండనివ్వరాదు. అవతలి వ్యక్తి తనకు పనికి వస్తాడనుకుంటే ముందు తన శక్తినైనా పెంపొందించుకోవాలి లేదా అతడి శక్తినైనా తగ్గించాలి.
    నాయుడు బాగా ఆలోచించి చందూని పిలిచాడు.
    చందూ తెలివైనవాడు. చురుకైనవాడు. యుద్దవిద్యల్లో ఆరితేరినవాడు.
    నాయుడు చందూకి గోపీ గురించి చెప్పాడు.
    "వాన్నేం చేయమంటారు?" అన్నాడు చందూ.
    "నా దగ్గరకు తీసుకునిరా-ప్రాణాలతో-"
    చందూ నవ్వి- "ఎప్పుడు తీసుకురమ్మంటారు?" అన్నాడు.
    "ఇప్పుడే కావాలంటే ఇప్పుడే తీసుకుని రాగలవా?"
    "ఎస్ బాస్!"    
    "చందూ-" అన్నాడు నాయుడు- "మనిషికి స్వశక్తిమీద నమ్మకముండడం మంచిదే-కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు-"
    బదులుగా చందూ నవ్వి ఊరుకున్నాడు.
    "వాడిని తీసుకుని రావడానికి కొన్ని షరతులు పాటించాలి నువ్వు వాడిని గాయపర్చకూడదు. వాడి మనసును బాధపెట్టకూడదు. వాడికి నీ శక్తి తెలియజెప్పి మంచిమాటలతో లొంగదీసుకోవాలి. వాడికంటే నీవు అధికుడినని రుజువు చేసుకోవాలి. అప్పుడు వాడితో స్నేహ పూర్వకంగా మాట్లాడి మర్యాదగా నా దగ్గరకు తీసుకునిరా-" అన్నాడు.

 Previous Page Next Page