"అర్ధమయింది బాస్!" అన్నాడు చందూ.
"ఏమిటర్ధమయింది?"
"వాడిని మనలో కలుపుకోవాలని మీరు చూస్తున్నారు. కానీ ప్రస్తుతం వాడు అహంకారంలో ఉన్నాడు. మనకంటే అధికుడి ననుకుంటున్నాడు. వాడికి ఆ భ్రమ తొలగించాలి. అంతేకదా-" అన్నాడు చందూ.
"చాలా బాగా అర్ధం చేసుకున్నావు-"
"అయితే నాకు నాలుగురోజులు గడువివ్వండి. అంతవరకూ మీరింక మా ఇద్దరి విషయం పట్టించుకోవద్దు-" చందూ అన్నాడు.
"నీ సామర్ధ్యం మీద నాకు నమ్మకముంది. తెలివిగా కార్యం సాధించుకునిరా-" అన్నాడు నాయుడు.
చందూ అక్కణ్ణించి బయల్దేరి తిన్నగా విశాల ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు.
అప్పుడు ముందుగదిలో ఉన్న గోపీ తలుపుతీశాడు. ఎదురుగాఉన్న చందూని చూసి-"ఎవరుకావాలి?" అన్నాడు.
"నువ్వే-" అన్నాడు చందూ.
"ఎందుకు?"
"లోపలకు రానిస్తే చెబుతాను-" అన్నాడు చందూ.
"చెబితేనే లోపలకు రానిస్తాను-" అన్నాడు గోపీ.
"కావాలనుకుంటే నేను బలవంతంగా రాగలను. కానీ నీతో స్నేహం కోరివచ్చిన వాణ్ణి. ప్లీజ్-నన్ను లోపలకు రానివ్వు-" అన్నాడు చందూ.
"లోపల ఆడవాళ్ళున్నారు-"
"నాకు వాళ్ళతో పనిలేదు-"
"ఈ ఫిరంగిపురంలో అపరిచితులను నమ్మకూడదు-" అన్నాడు గోపీ పట్టుదలగా అతడలా గుమ్మానికి అడ్డంగా నిలబడే ఉన్నాడు.
చందూ రెండడుగులు వెనక్కువేసి- "తలుపులు వేసుకోకు. నేనప్పుడే వెనక్కు వెళ్ళడంలేదు-" అంటూ జేబులో చెయ్యిపెట్టి గుండ్రని టెన్నిస్ బాల్ అంత వస్తువును తీశాడు. దాన్ని తన ఎడమ ముంజేతిపై ఉంచి కుడిచేత్తో గట్టిగా ఆ వస్తువుపై కొట్టాడు. అది సరిగ్గా రెండు ముక్కలై నేలమీద పడగానే ఠంగున శబ్దమయింది.
గోపీ ఆశ్చర్యపడ్డాడు- అంటే అది ఇనుపవస్తువా?
క్రిందపడిన రెండుముక్కలనూ తీసి గోపీవద్దకు వచ్చాడు చందూ "నేను నీ స్నేహితుడిని. వీటిలో ఒకటి నువ్వు నీకు తీసుకో-"అన్నాడు.
గోపీ అప్రయత్నంగా ఓ ముక్క తీసుకున్నాడు. దాని బరువును బట్టి అది ఇనుపముద్ద అనిపిస్తున్నది.
చందూ రెండో ముక్కను తన కుడిచేతి గుప్పిట్లో ఉంచి బలంగా నొక్కాడు. అలా నొక్కినపుడు అతడి చేతి కండరాలు తమాషాగా పొంగాయి. చందూ పిడికిలి తెరిచేసరికి అందులో ఒక ముక్కకు బదులు ఎన్నో ముక్కలున్నాయి.
"ఇది ఇంద్రజాలంకాదు-నాబలం కావాలంటే నువ్వూ ప్రయత్నించవచ్చు-" అన్నాడు చందూ.
గోపీ తన చేతిలోని ఇనుపముక్కను పొడిచేయాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు. చందూ దాన్ని తీసుకుని ఈసారి ఎడమచేతి గుప్పిట్లో పొడిచేశాడు.
"ఎవర్నువ్వు?" అన్నాడు గోపి ఆశ్చర్యంగా.
"నన్ను లోపలకు రానిస్తే అన్నీ వివరంగా చెబుతాను. నేను నీ స్నేహితుణ్ణి-" అన్నాడు చందూ.
గోపి చందూని లోపలకు రానిచ్చాడు. తలుపులు చందూయే వేశాడు.
"నీ బలం అద్భుతం-" అన్నాడు గోపి.
"ఏం లాభం? ఇంత బలం ఉండీ నేను స్వతంత్రుడినికాదు. నాకొక బాస్ ఉన్నాడు. పేరు నాయుడు. అయిదేళ్లుగా అతడిని సేవిస్తూ విసిగిపోయాను. నా మనసు మార్పును కోరుతున్నది. ఈరోజు నాయుడివద్ద నీ గురించి విని నీతో స్నేహాన్నాశించి ఇలా వచ్చాను-" అన్నాడు చందూ.
"నావల్ల ఏమిటి నీకు ప్రయోజనం-?"
"నీశక్తి సామర్ధ్యాలను స్వయంగా పరీక్షించాలనుకుంటున్నాను. నీవు నాకంటే సమర్దుడివైతేనే నాయుడి నెదిరించి బ్రతికి బట్టగలుగుతావు! అప్పుడు నేనూ నీతో చేతులుకలుపుతాను. నీ సామర్ధ్యం నాముందు చాలని దైతే నీవుకూడా నాకులాగే నాయుడి పక్షంలో చేరిపోవడం మంచిది. అదే నీ ప్రాణాలకురక్షణ. నాయుడి దగ్గర చేరాక నీ బుద్ధివికసిస్తే అప్పుడు మనం నాయుడినుంచి విడిపోవచ్చు-"
గోపీ సాలోచనగా-" అంటే ప్రస్తుతానికి నీవు నా ప్రత్యర్ధివన్న మాట-కానీ ఈ ఫిరంగిపురంలో ఎక్కడ చూసినా నాయుడు మనుషులే ఉంటారు. వాళ్ళందరినుంచీ నన్ను రక్షించుకుంటూ నీతో బలాబలాలను పరీక్షించుకుని నేను నెగ్గలేను-" అన్నాడు.
"ఆ విషయం నాకు తెలుసు నాలుగు రోజులు గడువిస్తున్నాను నీకు. ఎత్తులుకానీ జిత్తులు కానీ అవి మనఇద్దరిమధ్యనే నడుస్తాయి. ఈ నాలుగు రోజులూ ఎవ్వరూ నీజోలికి రారుసరిగదా-నీకేదైనా ప్రమాదం ఏర్పడితే రక్షిస్తారుకూడా! ఈ నాలుగురోజులపాటు నీకు నాయుడి రక్షణ ఉంటుంది. ప్రమాదం నా ఒక్కడినుంచే ఉంటుంది-" అన్నాడు చందూ.
"నువ్వు చెప్పింది చాలా బాగుంది. అయితే మనం మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం. మనం బలాబలాలనెలా పరీక్షించుకునేదీ నేనూ ఈ రాత్రంతా ఆలోచిస్తాను-" అన్నాడు.
చందూ చాలాసంతోషంగా-"థాంక్యూ డియర్ ఫ్రెండ్-" అన్నాడు.
"మెన్షన్ నాట్-" అన్నాడు గోపి.
చందూ వెళ్ళగానే విశాల చటుక్కున ఆగదిలోకివచ్చి- "వచ్చినదెవరు?" అనడిగింది.
గోపి ఆమెకు వివరంగా జరిగినది చెప్పి- "నాలుగురోజులపాటు మనం ఫిరంగిపురంలో సినిమా హీరో హీరోయిన్సులా రొమాంటిక్ సాంగ్స్ పాడుకుందాం. మనకు నాయుడి రక్షణ ఉన్నది-" అన్నాడు.
"నిన్ను చూస్తూంటే నాకాశ్చర్యంగా ఉంది. ఆ చందూగురించి నీకేంభయంగాలేదా?" అన్నదివిశాల.
"చందూగురించి భయపడడమెందుకు? నాలుగు రోజులపటు మనం సరదాగా ఈ ఊళ్ళోగడిపే ఏర్పాట్లు చేయడానికి వచ్చిన దేవదూత వాడు...." అన్నాడు గోపి.
"ఊళ్ళో సంగతి ఏమోకానీ ఇంట్లోమాత్రం - నువ్వాగదిలో-నేనీ గదిలో-" అని విశాల పక్కగదిలోనికి వెళ్ళిపోయింది.