అతడి మాటలకు సోము ఉలిక్కిపడ్డాడు. వీడు చాలా మొండివాడు అని మనసులో అనుకున్నాడు- "నీ కబుర్లు నన్ను వెనక్కులాగవు. సిద్దంగా ఉండు-" అని "ముందు నీ పిస్టల్ ని పరీక్షించుతాను-" అంటూ దూరంగా ఉన్న ఓ చెట్టుకు గురిచూసి పేల్చాడు. చెట్టుమీంచి ఓ పండు రాలింది.
"చేతులు కదపొచ్చా?" అన్నాడు గోపీ వెంటనే.
"ఎందుకు?"
"చప్పట్లు కొట్టాలని వుంది. నీ గురి అద్భుతం-"
సోము గంభీరంగా-"నా గురిచూసి మెచ్చుకుని చప్పట్లు కొట్టాలని సరదాగా వుంటే ముందు నీ చేతుల్ని కాక కాళ్ళను పేల్చుతాను. చప్పట్లకు సిద్దంగా ఉండు-" అన్నాడు.
గోపీ అలాగే నిలబడివుండగా పిస్టల్ పేలింది. అతడు మనిషి కదలలేదు. వెకిలిగా ఇహిహి అని నవ్వి-నోట్లోంచి ఒక తూటాతీసి సోము వైపు విసిరాడు. ఆ దృశ్యం చూడగానే సోముకు వళ్ళు జలదరించింది. అతడు అనుమానంగా గోపీ వైపు చూశాడు-వీడు మనిషేనా అని!
సోము మరోసారి పిస్టల్ పేల్చాడు. గోపీ మళ్ళీ అలాగే పళ్ళమధ్యనుంచి తూటాతీసి తన వెనుకవైపున మనుషులమీదికి విసిరాడు.
ఆ విధంగా సోము పిస్టల్ పేల్చడమూ గోపీ నోట్లోంచి తూటాతీసి విసరడమూ- మొత్తం అయిదుసార్లు జరిగాయి.
ఉన్నట్లుండి సోముకు చేతులు వణికాయి. తను పేల్చిన గుండును నోటితో తీయడమన్నది మానవ మాత్రుడికి సాధ్యంకాదు. అతడి చేతిలోంచి పిస్టల్ జారిపోయింది. అతడు వెర్రిగా ఓ కేకపెట్టి-చటుక్కున వెనక్కు తిరిగాడు.
కన్నుమూసి తెరిచేలోగా సోము, అతడి మనుషులు అక్కణ్ణించి పారిపోయారు. గోపీ వాళ్ళను చూస్తూ ఆగకుండా అదేపనిగా నవ్వసాగాడు.
అతడికి కాస్తదూరంగా ఉన్న విశాలకుకూడా అతడిని చూస్తే భయంగానే ఉన్నది. గోపీ మనిషికాదా అన్న అనుమానం ఆమెకువచ్చింది. కానీ ఎలాగో ధైర్యంచేసి అతడిని సమీపించి- "ఎందుకలా నవ్వుతావు?" అన్నది.
"నవ్వడం తప్పా?"
"ఇది మనిషి నవ్వులా లేదు...."
"భయంగా ఉందా-" అన్నాడు గోపీ నవ్వుతూ. విశాల భయం భయంగా తల ఊపింది. గోపీ కాస్త ముందుకు వెళ్ళి తన పిస్టల్ తీసుకుని దాన్ని మళ్ళీ లోడ్ చేశాడు-"నేను ఇంద్రజాలికుణ్ణి ఇది తీసుకుని నన్ను పేల్చు. తమాషా చూద్దువుగాని...."
"అమ్మబాబోయ్-నిన్ను పేల్చేయడమే-సోము, మనుషులు నిన్ను చుట్టుముట్టగానే నువ్వింక నాకు దక్కవనే అనుకున్నాను. నా అదృష్టాన్ని నేను వదులుకోను. నిన్ను పేల్చలేను...."
గోపీ అరచేతిని నుదుటిమీద వ్రాసుకుంటూ- "కర్మ-" అనుకున్నాడు.
"ఏమయింది?"
"ఇలాంటి అవమానం నా జీవితంలో ఎరుగను-"
"అవమానమా?" అన్నది విశాల ఆశ్చర్యంగా.
"కాక-మరేమిటి? పదహారుగురు గూండాలు తుపాకీలతో వచ్చి నన్నేమీ చేయలేక పారిపోయారు. ఒక ఆడపిల్ల ఇప్పుడు పిస్టల్ తో పేల్చి చంపగలననుకుంటున్నది-ఇంతకంటే అవమానముందా?" అన్నాడు గోపీ.
"నిన్నవమానించడం నా ఉద్దేశ్యం కాదు-"
విశాల ఇంకా ఏదో అనబోతూండగా- "అయితే వెళ్ళి పేల్చు..." అన్నాడు గోపి కాస్త కఠినంగా.
విశాల అయిష్టంగానే ఒప్పుకున్నది. గోపి ఆమెకు పిస్టల్ ఎలా పేల్చాలో చూపించాడు. విశాల ప్సితల్ తీసుకుని నాలుగడుగులు వెనక్కు వేసి గోపికి గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కింది. ఢాంమని శబ్దమైంది.
"అమ్మా!" అని పెద్దగా కేకపెట్టి గోపి నేలమీద పడిపోయాడు.
విశాల కంగారుగా అతడివద్దకు పరుగెత్తింది.
గోపి గుండెలనుంచీ రక్తం ఎర్రగా కారుతున్నది. అతడిలో చలనంలేదు. విశాల అతడిని కుదుపుతూ- 'ఏదో తమాషా అన్నావు ఇదేనా?" అన్నది.
గోపి కదలలేదు.
విశాల కనులలోనికి నీరు వచ్చింది. ఆమె అతడి ముక్కువద్ద చేయిపెట్టింది. శ్వాస ఆడడంలేదు. చేయిపట్టుకుని చూసింది. నాడి అందడం లేదు. చెవిని అతడి ఛాతీపై ఆనించింది. గుండె చప్పుడు వినబడలేదు.
విశాలకు ఏడుపు వచ్చేసింది- "ఇలా జరిగిందేమిటి-నా చేతుల్తోనే నిన్ను చంపుకున్నాను. నువ్వులేకుండా నేను బ్రతకలేను. ఇలా ఎందుకు చేశావు?" అని ఏడుస్తూ అతడి ముఖాన్ని తనవైపు తీసుకోబోయి ఆగిపోయింది.
గోపి నోరు కొద్దిగా తెరుచుకుంది. నాలికతో ఒక తూటాముందుకు తీయబడింది. అది వళ్ళపైన నిలబడగానే రెండు దవడలూ దగ్గరగా వచ్చాయి.
విశాలల తూటా తీసి-"యూ-సిల్లీ-"అన్నది. ఆమె సంతోషంతో ఇంకా ఏడుపు కలిసి ఉన్నది.
గోపి చటుక్కున లేచి కూర్చుని-కళ్ళు నులుముకుని-"నేనిప్పుడు ఎక్కడున్నాను?" అన్నాడు.
"చేతులారా చంపుకున్నానని భ్రమపడ్డాను. నువ్వు బ్రతికేవున్నావు. నాకోసం ఎప్పుడూ బ్రతికే ఉంటావు. కానీ ఇంకెప్పుడూ ఇలా నాటకమాడకు. బాధతో, దిగులుతో-నాగుండె ఆగినా ఆగిపోవచ్చు-" అన్నది విశాల.
గోపి చటుక్కున ఆమెను కౌగలించుకుని-"నేను బ్రతికుండాలని ఇంత గాఢంగా వాంఛించే వారుంటే-నన్ను చంపాలని ఎంత గాఢంగా అనుకున్నా వారి ప్రయత్నాలు ఫలించవు-" అన్నాడు.
"నువ్వు-ఆ సోమునుంచి ఎలా తప్పించుకున్నావు?" అన్నది విశాల.
"చిన్న ఇంద్రజాలం. అది పిట్టల్ని గొట్టే పిస్టల్. శబ్దం హడావుడిగా చేస్తుంది. మనిషిని బాధించదు. కాస్త దిట్టంగా డ్రస్ చేసుకుంటే ఆ గుళ్ళవల్ల బాధ ఉండదు. నా దగ్గర కొన్ని అదనపు తూటాలుంచుకుని నోట్లోంచి తీసివాళ్ళను బెదరగొట్టాను. తీరుబడిగా ఆలోచిస్తే ఇందులో మోసముంటుందని ఎవరికైనా తోచవచ్చును. కానీ ఆ క్షణంలా వాళ్ళబుర్ర పనిచేయలేదు. నా గుండె నిబ్బరంచూసి ఆ సోము భయపడ్డాడు-"