కేశవరావు కూడా వచ్చి అన్నగారి పక్కన కూర్చుని, "సన్నగా పొడుగ్గా ఉండి బెదురుగా చూస్తున్న ఈ పదేళ్ళ కుర్రాడు ఎవరో చెప్పరా, మాధవా!" అన్నాడు.
"పెద్దనాన్న!" అన్నాడు మాధవ్.
"భలే కనిపెట్టావురా!" అన్నాడు సీతారామయ్య.
"నీ పోలికలు వాడిలో చాలా ఉన్నాయి అన్నయ్యా!" అంది విశాలాక్షి.
మాధవ్ ఆలోచనగా, "నాన్నా.... మన ఫామిలీ ఫోటో లేదేమిటీ? అన్నాడు.
"ఇదిగో, ఆ టీ.వీ. స్టాండ్ మీద ఉందిగా!" అంది యశోద. అందులో కేశవరావూ, యశోదా, మాధవ్ ఉన్నారు.
మాధవ్ కళ్ళు చిట్లించి, "ఈ ఫోటోలో చిన్న తాతయ్యా, పెద్ద తాతయ్యా, బామ్మలూ, వాళ్ళ పిల్లలూ ఉన్నట్లు మనింట్లో కూడా పెద్ద నాన్నా, బాబాయ్, అత్తయ్యలూ, వాళ్ళ పిల్లలూ మనతో ఉండే ఫోటో ఉండాలిగా!" అన్నాడు.
ఆ ప్రశ్నకి యశోదే కాదు, ఎవరూ జవాబు చెప్పలేక మౌనం దాల్చారు.
ఒకప్పుడు ప్రతి ఇంట్లో గోడలకి పటం కట్టిన ఫోటోలుండేవి. ఆ ఫోటోల్లో మధ్యవరుసలో పెద్దలూ మగవాళ్ళూ, వారి వెనక నిలబడ్డ వారి భార్యలూ, పాదాల దగ్గర క్రింద కూర్చున్న పిల్లలూ వెరసి ఓ పాతిక మంది ఉండేవారు. పిల్లలూ, వృద్దులతో లేక పిందెలూ పూవులతో ఉన్న గుమ్మడి పాదులా గుంభనంగా ఉండేది ప్రతి ఇల్లూ ఒక్కో చెట్టుకి బోలెడు శాఖలూ..... వాటికి ఉపశాఖలూ వ్యాపించిన మర్రిచెట్లలాంటి వంశవృక్షాలు కూడా పేర్లు రాసి గోడలకి వేలాడదీసుకునేవారు.
పండక్కని ముందే వచ్చిన కూతుళ్ళ కళ్ళు భర్తకోసం ఎదురుచూస్తూ అరుగుమీద దీపాలయ్యేవి.
కొత్త కోడళ్ళు హడావుడిగా పరిగెడ్తూ జార్చిన సిగపూలు ఇంటిని తీర్చిదిద్దే రంగవల్లులయ్యేవి! మావయ్యల మీసాలు తూగుటుయ్యాలైతే, అత్తయ్యల చివాట్లు తలనిండా పడిన అక్షింతలయ్యేవి! కడుపునిండా తిని, ;కడుపు చల్లగా' ఉండాలని దీబించే చాకళ్ళూ, భక్ష్యాలూ తిని లక్షలు సంపాదించాలని కోరే పాలేళ్ళతో ఇల్లు తిరునాళ్ళయి ఇంటి ఇల్లాలు జాతరలో అమ్మవారిలా తోచేది. గోరెడు పసుపు కుంకుమలకోసం పుట్టింటికి పరుగులు పెడ్తూ వచ్చేవాళ్ళూ ఆడపిల్లలు. అమ్మపెట్టిన చలిమిడితో, నాన్న కురిపించే చల్లని దీవెనలతో, అన్నా వదినలు చుట్టబెట్టిన ఆప్యాయతలాంటి చీరతో అనుబంధం అనే సారెతో, ఒడిబియ్యం మూట బరువుతో..... మది నిండిన కన్నీటి ఊటతో పుట్టింటి గడపదాటి అత్తారింటికీ అనురాగపు అమృతపు తేటని పంచివ్వడానికి సాగిపోయేవారు!
హరికథలొచ్చి పురాణ శ్రవణాల్నీ, నాటకాలొచ్చి హరికథల్నీ, రికార్డింగ్ డాన్స్ లొచ్చి నాటకాల్నీ, సినిమాలొచ్చి డాన్సుల్నీ, టీవీ లొచ్చి సినిమాల్నీ మింగేసినట్లే..... కార్లు పెరిగి కాలాన్నీ, ఫోన్లు పెరిగి దూరాన్ని ఆదరాన్నీ మింగేస్తున్నాయి. ఒకరింటికి ఒకరు కళ్ళారా చూసుకోవడానికి వెళ్ళక్కర్లేదు. నెంబర్లు నొక్కితే చాలు..... 'మంచినీళ్ళు కావాలా?' అనే ఆదరపూర్వకమైన పలకరింపుకి తావేలేదు.
గ్రూప్ ఫోటోలోంచి ఒక్కొక్కళ్ళే జారిపోయి..... చివరికి అమ్మా, నాన్నా, ఒక్కపిల్లాడూ లేక పిల్లా మిగుల్తున్నారు! ఫలితంగా దేవేంద్ర భవనాల్లాంటి ఇళ్ళలలో అరిటాకులు పరిచే వంటింటి వసారాలే కరువవుతున్నాయి.
దీపావళి రెండు ప్రమిదలూ, ఒక కాకరపువ్వొత్తితో ముగుస్తోంది!
సంక్రాంతికి గుమ్మానికి బంతిపూల తోరణం కట్టే ఆడపిల్లలుంటే, గాలిపటం ఎగురవేసే పిల్లాడు ఉండటం లేదు. గాలిపటం ఎగురవేసే పిల్లాడుంటే, తోరణం కట్టే పిల్ల ఉండటం లేదు.
"తామర పువ్వంటీ తమ్ముడ్నివ్వవే.....చేమంతి పువ్వంటీ చెల్లెల్ని ఇవ్వవే....." అనడం అనాగరికం.... అవుట్ డేటెడ్ ధాట్ అయిపోయింది.
మాధవ్ లేచి బాల్కనీలోకి వెళ్ళాడు. ఆ ఉషోదయంలో అతని కళ్ళల్లో ఓ అపురూప దృశ్యం కదలాడింది.
రాధ, తనూ దీపతోరణాల మధ్యన వెలిగిపోతూ నిలబడితే, చుట్టూతా చిట్టి మరదళ్ళూ, పొట్టి బావమరుదులతో ఇంటికి నోరోచ్చినంత గలగల! ఆనందం అర్ణవమైతే .... అనురాగం అంబరమైతే.... అందరూ ఒక్కటై..... వసుదైక కుటుంబమై..... రోజూ ఓ పండుగ.
* * *
"కాదు... ఇల్లు కాదు సంత! ఒక ముచ్చటాలేదు! ముద్దూ లేదూ! రాజేశ్వరి మొగుడి ఉబ్బసం గురించీ, జానకి కూతురు సమర్త గురించీ తప్ప కబుర్లు చెప్పవు. నేనూ, నువ్వూ, మన అమ్మాయీ ముచ్చటగా ముగ్గురమే ఒక ఊరు వెళ్దామన్నా లేదు కర్మ! ఛీ.... ఛీ... జీవితమంటే రోత పుట్టుకొస్తోంది. ఈ పల్లెటూళ్ళో ఉమ్మడి కుటుంబంలో పుట్టకూడదు! పుట్టినా ఇంటికి పెద్దకొడుకై అస్సలు పుట్టకూడదు. పెద్దకొడుకై పుట్టినా పలకా బలపం పట్టవలసిన చేతుల్తో అరకా, మన్నూ మశానం అస్సలు పట్టకూడదు! ఒకవేళ పుట్టినా పెద్దరికపు బాధ్యతలన్నీ మీద వేసుకునే ముదినాపసాని పెళ్ళాన్ని అస్సలు కట్టుకోకూడదు!" సుబ్బారాయుడు రుసరుసలాడుతూ చెప్పాడు.
"హుష్..... ప్రమీల వింటే బావుండదు చిన్నగా మాట్లాడండి" మందలింపుగా అంది పార్వతమ్మ.
"ఈ పరిస్థితి మాత్రం నా చిట్టితల్లికి చచ్చినా రానివ్వను. రాత్రిబండికే హైదరాబాదు వెళుతున్నాను. బట్టలు సర్దు!" అరిచాడు సుబ్బారాయుడు.
"శుభం! వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకండి. బట్టల గురవయ్యకి కబురెట్టి అన్నయ్యకి, వదినకీ బట్టలు తీసుకెళ్ళండి. యశోద వదినకి ఉప్పాడ జరీ చీర అయితే బావుంటుంది" అంది పార్వతమ్మ.
"ఆఁ.... తాటి తాండ్రా, రెండు గంపలలో మన తోటలో మామిడి పండ్లూ, ఒక పనసకాయా కూడా సర్దు" అన్నాడు.
అలాగే పూతరేకులూ, అరిసెలూ, సున్నుండలూ కూడా పట్టుకెళ్ళండి" అంది.
"చక్కెరకేళీలు కేశవుడికి యిష్టం...... అవీ ఓ గెల కోయించు" అన్నాడు.
"నాన్నా! మావయ్యకి మన ఊరి కాలువలో ఈదడం అంటే కూడా చాలా ఇష్టంట! దాన్ని పట్టుకెళ్ళకూడదూ" వెనకనుండి తండ్రి మెడచుట్టూ చేతులేస్తూ అంది రాధ.
"ఔను.... పార్వతీ! అమ్మాయి చెప్పినట్లూ..... అని పార్వతమ్మ పైట చాటుచేసుకుని నవ్వడం చూసి ఆగిపోయి, "ఓసినీ.... అప్పుడే కాబోయే అత్తారిని ఆటపట్టిస్తున్నావా?" గడుగ్గాయీ!" అని రాధని మురిపెంగా చూసుకున్నాడు.
"లేకపోతే ఏమిటి నాన్నా....! ఇంటికి చక్రాలు పట్టించి తీసుకెళ్ళినట్లు ఇంత సామానా? వాళ్ళు నవ్వరూ!" అంది రాధ.
సుబ్బారాయుడు ఆలోచనలో పడ్డట్టు తల గోక్కున్నాడు.