Previous Page Next Page 
అథర్వ వేద సంహిత పేజి 24

                     

                                నాలుగవ సూక్తము - 24
   
వినియోగము :-

   
      1) ధాన్య సమృద్ది కర్మయందు. కౌశిక సూత్రము 3, 4 చూచునది.
   
      2) పిత్రు కార్యమందు శవ దహనము తరువాత మొదటి ఋక్కుచే స్నానము చేయునది.
   
1.    పయస్వతీ రోషధయః - ఓషధులు సారవంతములగును గాక. నా వాక్కు పయస్వతీ అగును గాక. నాయందు సహస్రశః పయస్వతులు చేరును గాక.
   
2.    వేదాహం పయస్వంతం - పయస్వంతులగు దేవతలను నేను ఎరుంగుదును. సంభ్రుత్వ దేవత ధాన్యాదులను వర్ధిల్లచేయునది. మేము ఆ దేవతను ఆహ్వానించుచున్నాము. యజ్ఞము చేయని వారి ఇంటి ధనమును కూర్చి నాకు అందించును గాక.
   
3.    వర్షము కలిగినంత నదులు వస్తువును ఒక చోటునుండి మరొక చోటునకు చేర్చినట్లు పంచ దిశలు, పంచ జనులు ధాన్య సమృద్దిని మా వరకు చేర్చును గాక.
   
4.    నదీ జన్మ స్థానమున నీరు శత, సహస్రధారలుగా పడినను తరగదు. అట్లే ఈ గృహమున గల ధాన్యము వందల, వేల ధారలుగా పోయినను అక్షయ మగును గాక.
   
5.    శతహస్త దేవతలారా! శత హస్తములతో ధనము అందించండి. సహస్ర హస్త దేవతలారా! సహస్ర హస్తములతో ధనము కలిగించండి. చేసిన, చేయనున్న పనులందు సమృద్ది కలిగించండి.
   
6.    గంధర్వులకు సమృద్ది కారకములగు మూడు అంశములు, వారి పత్నులకు సమృద్ది కారకములగు నాలుగు అంశములు కలవు. ధాన్యమా! వాణిలో పరమసమృద్ది అంశముచే నిన్ను తాకుచున్నాను. నీవు సమృద్దిల్లుము.
   
7.    ప్రజాపతీ! ధాన్యమును దరిచేర్చు 'ఉపోహ' దేవత, ధాన్యమును వర్ధిల్లచేయు 'సమూహ' దేవత నీకు రథ సారధులు అగుచున్నారు. ధన ధాన్యములను వర్ధిల్లచేయుటకు అక్షయము చేయుటకు వారిని వెంట తీసికొని రమ్ము.
   
                                         ఐదవ సూక్తము - 25
   
వినియోగము :-

   
         స్త్రీ వశీకరణమునకు ఈ సూక్తమును జపించుచు స్త్రీకి అంగుళితో ప్రేరణ కలిగించునది. నేతితో ముంచిన  21 రేగు ముళ్ళను పెట్టునది. కుష్టమును వెన్నతో కలిపి లేపనము చేసి మూడు సార్లు నిప్పు శగ  పెట్టవలెను. మంచపు క్రింది పట్టెను పట్టుకొని మూడు రాత్రులు శయనించునది. వేడి నీటిని ముక్కాలి         పీట మీద పెట్టి బొటనవ్రేలుచే రుద్దుకొనుచు శయనించునది. చిత్రించిన ప్రతి కృతిని సూత్రోక్త ఇషుచే   కట్టునది.
   
1.    'ఉత్తద' దేవత నిన్ను కామార్తను చేయును గాక. సూదుల వంటి మదన వికారము బాధించు నీకు మంచము సుఖకరము కాకుండును గాక. భయావహమగు కామ బాణమును నీ హృదయమున నాటుచున్నాను.
   
2.    అతని పర్ణము మనసును వేధించుట. రమించు కోరిక అతని మర్మ భేద శల్యము. ఆరాటము కలిగించుట అతని సంకల్పము. అట్టి కామదేవత బాణమును ఎక్కుపెట్టి నీ గుండెలోనికి దూర్చును గాక.
   
3.    కామదేవత విడిచిన బాణము హృదయమందు ప్రవేశించి 'ప్లీహము' ను శుష్కింప చేయును గాక. సూటిగా వెళ్ళి మంటలు మండించు బాణమును ప్రేయసీ! నీ గుండెలో గుచ్చుచున్నాను.
   
4.    ప్రేయసీ! నీకు దాహము కలిగించు శరము తాకినది. నీ గొంతు ఆరి, మాట పెకలని దానవై నావద్దకు రమ్ము. మృదు భాషిణివి అగుము. ప్రియవాదినివై కేవలము నాదానవగుము.
   
5.    కామినీ! నిన్ను నా దానిని చేయుటకు 'కశ'ను వాడగలను. నీ తల్లితండ్రుల వద్ద నుంచి గుంజి తేగలను. నీవు నా పనులకు, నా మనసుకు అనుకూలవు అగుము.
   
6.    మిత్రావరుణులారా! ఈమెకు ఆలోచనలు రానీయకండి. కార్యాకార్య విచక్షణ రహితను చేయండి. మమైవ కృణుతం వశే - నా వశవర్తినియై ఉండునట్లు చేయండి.
   
                                       ఆరవ అనువాకము   
                                       మొదటి సూక్తము - 26

   
వినియోగము :-


       1. 1,2 సూక్తములచే పెన్ను ఉత్సాహ పరచుటకు ఒక్కొక్క మంత్రముచే ఒక్కొక్క దిశకు ఉపస్థానము  చేయునది.
   
       2. ఈ రెండు సూక్తములచే ఘ్రుత పలాశాది పదమూడు ద్రవ్యములను ఆహుతి ఇచ్చునది. వీటితోనే  హుతశేషమును ఒక్కొక్క దిశ యందు బలిహరణము/ఉపస్థానము చేయునది.
   
       3. పాము, తెలు మున్నగు వాని భయ నివారణమునకు దుమ్మును అభిమంత్రించు ఇల్లు, పొలము మున్నగు చోట్ల చల్లునది. తృణమాలను సంపాతనము చేసి నగర ద్వారము లేక గృహ ద్వారమునకు కట్టునది. పేడను అభిమంత్రించి ఇంటిలో వేయునది. ద్వారము వద్ద పాతునది. అగ్నిలో హోమము         చేయునది.
    అపామార్గ మఙ్జరీం గుడీచీంవా అభిమంత్ర్య పూర్వము వలెనే గృహాదులందు వేయునది.
   
       4. త్రింశన్మహా శాంతి తంత్రభూత శాంతియందు ఒక్కొక్క ఋక్కుచే ఒక్కొక్క దిశయందు హోమము   చేయవలెను. ఉపస్థానము చేయవలెను.
   
1.    ప్రాచీ దిశయందున్న 'హేతయు'లను దేవతల శరములు అగ్ని సమములు.
    "తేనో మృడత తేనోధి బ్రూత తేభ్యో వో నమస్తే భ్యో వః స్వాహా" ఆ దేవతలు మమ్ము రక్షింతురుగాక. మమ్ము తమ వారిని చెప్పుదురుగాక. ఆ దేవతలకు సమస్కరించుచున్నాము. వారికి స్వాహా.
   
2.    దక్షిణ దిశయందున్న 'అవస్యు' లను దేవతల శరములు మమ్ము రక్షించగోరునవి.
    'తేనో మృడత తేనోధిబ్రూత తేభ్యో వో నమస్తేభ్యో వః స్వాహా'
   
3.    ప్రతీచ దిశయందున్న వైరాజ, నామక దేవతల శరములు జలపూరములు.
    తేనో మృడత తేనోధి బ్రూత తేభ్యో వో నమస్తే భ్యో వః స్వాహా"
   
4.    ఉత్తర దిశయందున్న ప్రవిఘ్న నామ దేవతల శరములు వాయుమయములు.
    "తేనో మృడత తేనోధి బ్రూత తేభ్యో వో నమస్తే భ్యో వః స్వాహా"
   
5.    ధ్రువమగు భూమి దిశయందున్న 'నిలిమ్ప' నామక దేవతల శరములు ఓషధీ పూర్ణములు.
    'తేనో మృడత తేనోధి బ్రూత తేభ్యో వో నమస్తే భ్యో వః స్వాహా'
   
6.    ఊర్ధ్వ దిశయందున్న 'అపవస్వన్త' నామక దేవత శరములు బృహస్పతులు.
    "తేనో మృడత తేనోధి బ్రూత తేభ్యో వో నమస్తే భ్యో వః స్వాహా"
   
    (బృహతాం దేవానాం మంత్రాణాం వా పతిః బృహస్పతిర్దేవః అని సాయణాచార్యులు.)
   
                                             రెండవ సూక్తము - 27
   
1.    ప్రాగ్దిశ మమ్ము అనుగ్రహించునుగాక. ఆ దిశకు అధిష్టాత అగ్ని. అసిత సర్పము రక్షకుడు. ఆదిత్యులు బాణములు.
   
   
    "తేభ్యో నమో2ధిపతిభ్యో నమో రక్షిత్రుభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు'
   
    అట్టి అధిపతులకు నమస్కారము. రక్షకులకు నమస్కారము. బాణములకు నమస్కారము. వారందరు మాకు ప్రియము కలిగింతురుగాక.
   
    "యో2స్మాన్ ద్వేష్టి యం వయం ద్విష్మస్తం వోజమ్బే దధ్మః" మమ్ము ద్వేషించు వారిని మేము ద్వేషించువారలను మీ కోరలందు పెట్టుచున్నాము.
   
    (దంత విశేషో జంభః అని సాయణవ్యాఖ్య.)
   
2.    దక్షిణ దిశ మమ్ము అనుగ్రహించునుగాక. ఆ దిశకు అధిపతి ఇంద్రుడు. తిరశ్చిరాజీ సర్పము రక్షకుడు. పితరులు బాణములు.
   
    'తేభ్యో నమో2ధిపతిభ్యో నమో రక్షిత్రుభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు|
     యో2స్మాన్ ద్వేష్టి యంవయం ద్విష్మస్తం వోజమ్బే దధ్మః||

   
3.    పశ్చిమ దిశమమ్ము అనుగ్రహించునుగాక. ఆ దిశకు వరుణుడు అధిపతి. 'పృదాకు' సర్పము రక్షకుడు. అన్నము బాణములు.
       
    "తేభ్యో నమో2ధిపతిభ్యో నమో రక్షిత్రుభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు|
     యో2స్మాన్ ద్వేష్టి యంవయం ద్విష్మస్తం వోజమ్బే దధ్మః||"

   
4.    ఉత్తర దిశ మమ్ము అనుగ్రహించునుగాక. ఆ దిశకు  అధిపతి సోముడు. 'స్వజ' సర్పము రక్షకుడు. ఆశని బాణములు.       
   
     తేభ్యో నమో2ధిపతిభ్యో నమో రక్షిత్రుభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు|
     యో2స్మాన్ ద్వేష్టి యంవయం ద్విష్మస్తం వోజమ్బే దధ్మః||

   
5.    అధో దిశ మమ్ము అనుగ్రహించునుగాక. ఆ దిశకు  అధిపతి విష్ణువు. కల్మాష గ్రీవ సర్పము రక్షకుడు. బాణములు దుష్టనిబర్హణ ఆయుధములు / బాధలు తీర్చు ఓషధులు.
       
     "తేభ్యో నమో2ధిపతిభ్యో నమో రక్షిత్రుభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు|
        యో2స్మాన్ ద్వేష్టి యంవయం ద్విష్మస్తం వోజమ్బే దధ్మః||

   
6.    ఊర్ధ్వ దిశ మమ్ము అనుగ్రహించునుగాక. ఆ దిశకు  బృహస్పతి అధిపతి. శివత్ర సర్పము రక్షకుడు. బాణములు వర్షములు.
   
    "తేభ్యో నమో2ధిపతిభ్యో నమో రక్షిత్రుభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు|
        యో2స్మాన్ ద్వేష్టి యంవయం ద్విష్మస్తం వోజమ్బే దధ్మః||

   
                                       మూడవ సూక్తము - 28
   

వినియోగము :-

   
    గోవు, గుర్రము, గాడిద, మానవ స్త్రీకి కవలలు కలిగినపుడు శాంతికి. ఈ సూక్తముచే ఘ్రుతాహుతులిచ్చి తల్లిబిడ్డల తలల మీద సంపాతించునది. నీరు నిండిన పాత్రలో ఉత్తర సంపాతము చేయునది. ఆ జలముతో ఆచమన ప్రోక్షణములు చేయునది.
   
1.    'భ్రుతకృత్' నామ ఋషులు భూతములను సృష్టించినారు. వారు ఒక వ్యక్తి నుండి ఒకరిని, వివిధ వర్ణముల గోవులను సృష్టించినారు. విధాతయే ఇట్లు ఒక్కొక్కరిని సృష్టించినాడు. ఇది సృష్టి ఆది నుండి వచ్చుచున్న పద్దతి. ఇందుకు విపరీతముగా గోవు జంట దూడలను ఈనినపుడు అది యజమాని పశువులకు హాని కలిగించుచున్నది. పశుక్షయము కలిగించుచున్నది.
   
2.    ఆ విధముగా జంటను కన్న ఆవు మాంస భక్షి, పశువులను క్షీణింపచేయునది అగుచున్నది. అట్టి ఆపదను నివారించుటకు 'ఉతైనాం బ్రహ్మణోదద్యాత్' దానిని బ్రాహ్మణునకు దానము చేయునది. అప్పుడు అది సుఖ, శాంతికరము అగుచున్నది.
   
3.    జంటను కన్న గోవు మానవులకు శుభము గోవులకు, అశ్వములకు శుభములు కలిగించునుగాక. క్షేత్రములకు శుభములు. సర్వములకు సుఖ శాంతులు కలిగించునుగాక.
   
4.    ఈ ఇంట గోవులు మున్నగు సకల ధనములు వర్ధిల్లునుగాక. పాడి మున్నగు రసములు పరిఢవిల్లునుగాక. వేనవేల వృద్ది కలుగునుగాక. కావాలా పశువులు పోషింపబడునుగాక.
   
5.    ఏ లోకమున జనులు సహ్రుదయులగుదురో, ఎచటివారు శుభకర్మములు చేయుదురో, ఎచట జ్వరాది వ్యాధులు లేక ప్రసన్నులగుదురో కవల పిల్లల గోవు అట్టి లోకమునకు అభిముఖమైనది. "సానో మా హింసీత్ పురుషాన్ పశూంశ్చ' అది మా ప్రజను, పశువులను హింసించకుండునుగాక.
   
6.    ఏ లోకమున సహ్రుదయులు, శోభన జ్ఞానవంతులు, సుకర్ములు, అగ్నికి ఆహుతులు అర్పించువారు ఉందురో అట్టి లోకమునకు ఈ కవల పిల్లల గోవు అభిముఖమైనది. "సానో మా హింసీత్ పురుషాన్ పశూంశ్చ"
   
                                       నాలుగవ సూక్తము - 29
   
వినియోగము :-

   
    ఈ సూక్తమునందలి 1-5 ఋక్కులచే ఓదనసవ కర్మమున పశువు అవయవములందు 5 అపూపముల నుంచి నిరుప్త హవి యొక్క అభిమర్సనాదులు చేయునది.
   
    దుష్టుని నుంచి, అదుష్టుని నుంచి గ్రహించు దానము యొక్క శాంతికి 6,7 ఋక్కులచే అభిమంత్రించి     గ్రహించునది.
   
    8వ మంత్రముచే భూమిని గ్రహించునది.
   
    "గ్రహయజ్ఞే యద్ రాజానః" ఇత్యనేన బుధస్య హవిరాజ్య యెర్హోమం సమిదాధానం ఉపస్థానంచ కుర్యాత్"

 Previous Page Next Page