దానాయ చోదయ - దానమిచ్చు ప్రేరణ కలిగించుము. వాజినం సవితృ విశేషణమ్.
8. మేము అన్న ఉత్పత్తి కార్యమునకు పూనుకొందుము గాక. ఈ సమస్త భువనములు అన్నోత్పత్తి మీదనే ఆధారపడి ఉన్నవి.
దేవతలు దానము ఇవ్వని వైర్ని సహితము ఇచ్చుటకు ప్రేరణ కలిగింతురు గాక. వారు మాకు ధనము, పుత్ర, పౌత్రాదులను ప్రసాదింతురు గాక.
9. మధ్యదిశ సహితముగా ఐదు దిశలు మాకు ఫలములు ప్రసాదించును గాక. భూమి 'యథాశక్తి' ఫలములను ఇచ్చును గాక. అందువలన మేము మనసునందు కోరిన, హృదయమున సంకల్పించిన కోరికలు ఫలించును గాక.
10. గోవులనిచ్చు వాగ్దేవి మంత్రమును ఉచ్చరించుచున్నాను. ఆ దేవి తన తేజస్సుతో నాయందు ప్రవేశించును గాక. సర్వత్ర సంచరించు వాయువు నాయందు ప్రాణములు నిలుపును గాక. త్వష్ట నా దేహమునకు పుష్టి కలిగించును గాక. అయిదవ అనువాకము మొదటి సూక్తము - 21
వినియోగము :-
1) 1- 7 మంత్రములు రాక్షస దూషిత గృహ, గోష్ఠ, క్షేత్రాదుల శాంతికి అవి 1. సంపాతిత పలాశ వృక్ష మణి బంధనము. 2. ఘ్రుత హోమము 3. మోదుగు పుల్లల నుంచుట 4. పలాశ ఉదంజనముచే జల హోమము 5. పలాశ ఉదపాత్రమున యవలు వేసి జలసహిత యవ హోమము.
2) క్రవ్యాచ్చమన కర్మమున సక్తు జలమున రెండు 'కాంపిల' సమిధలను మధించి దానిని పలాశదర్విచే ఒక్కొక్క మంత్రముచే హోమము చేయునది.
3) వంధ్యత్వ నివారణ కర్మమున గొడ్డుపోతు ఆవును లేక గుర్రమును ఈ సూక్తముచే అభిమంత్రించి బ్రాహ్మణునకు ఇచ్చునది.
4) వప లేక హవిస్సును కుక్క, గుడ్లగూబ, కాకి, లేక మనిషి ఎత్తుకొని పోయినపుడు ప్రాయశ్చిత్తముగా ఈ సూక్తముచే ఘ్రుతాహుతులు ఇచ్చునది.
5) బృహద్గణమున ఏడు ఋక్కుల వినియోగము. గణము వినియోగము గల ప్రతిచోట ఈ సూక్తపు వాడుక.
6) ఆవసథ్యా దానము నందు క్రవ్యాచ్చమనము తరువాత ఇంటిలోనికి వచ్చి 1 - 7 మంత్రములచే ఆహుతులు ఇవ్వవలెను.
7) ఈ కర్మముననే క్రవ్యాదగ్ని శాంతి యందు 8- 10 మంత్రములచే అగ్నియందు సక్తుమంధన హోమము - చేయునది.
8) చాతుర్మా'స్యము యొక్క సాకమేధ కర్మమున అతిథ్యేష్టి తరువాత 7 వ ఋక్కుచే అగ్నియోక్క ఉపస్థానము చేయునది.
1. అగ్ని జలము లందు ఉన్నాడు. మేఘము నందు ఉన్నాడు. మానవులందున్నాడు. రాళ్ళు, రత్నములందు ఉన్నాడు. ఓషధులందు, వనస్పతులందు ప్రవేశించి ఉన్నాడు. అట్టి అగ్నులందరకు ఈ హవిస్సు అందును గాక. అగ్నిభ్యోహుతమస్త్వేతత్.
2. అగ్ని సోమము నందు ఉన్నాడు. గోవులందు ప్రవేశించి ఉన్నాడు. పక్షులందున్నాడు. పశువులందున్నాడు. ద్విపాత్తులందు ప్రవేశించి ఉన్నాడు. చతుష్పాత్తులందు చేరి ఉన్నాడు. అగ్నిభ్యో హుతమస్త్వే తత్.
3. ఏ అగ్ని ఇంద్రుని తోడ ఒకే రథముపై ఆసీనుడు అగుచున్నాడో, ఏ వైశ్వానరాగ్ని విశ్వమునకు తాపము కలిగించుచున్నాడో, ఏ సాంగ్రామిక అగ్నికి నాకు విజయము కలుగుటకు ఆహుతులు ఇచ్చుచున్నానో 'తేభ్యో అగ్నిభ్యో హుతమస్త్వే తత్'
4. అగ్ని సమస్త విశ్వమును భక్షించగలవాడు. అగ్ని సమస్త ఫలములను ఇచ్చువాడనియు తీసికొను వాడనియు చెప్పుచున్నారు. అగ్ని మేధావి. ధీరుడు. శత్రుదమనుడు. అప్రతిహతుడు. 'తేభ్యో అగ్నిభ్యో హుతమస్త్వే తత్'
5. అగ్ని ప్రాణులకు శక్తి అగుచున్నాడు. అతడు సంవత్సరమగుచున్నాడు. పంచజనులు అగుచున్నాడు. వర్చస్సగుచున్నాడు. యశస్సు అగుచున్నాడు. సత్యము అగుచున్నాడు. 'తేభ్యో అగ్నిభ్యో హుతమస్త్వే తత్'
6. అగ్ని వృషభాన్న వంధ్య పశ్వన్న సోమమున వీపు మీద మోయువాడు. విధాత. వైశ్వానరులందు జ్యేష్టుడు. 'తేభ్యో అగ్నిభ్యో హుతమస్త్వే తత్'
7. అగ్నులు దివియందు, భువియందు, ఈ రెంటిమధ్యనున్న అంతరిక్షమందు, విద్యుత్తు నందు సంచరించుచున్నారు. దిశలందు, దిశాంతరములందు ప్రవర్తించుచున్నారు. 'తేభ్యో అగ్నిభ్యో హుతమస్త్వే తత్'
8. హిరణ్యపాణిం సవితారమిన్ద్రం బృహస్పతిం వరుణం మిత్రమగ్నిం విశ్వాన్ దేవాన్ అంగిరస గోత్రజులమగు మేము ఆహ్వానించుచున్నాము. వారు రాక్షసాగ్నిని శాంతింప చేయుదురు గాక.
1. నేను తేజస్సు కోరువాడను. నాయందు గజము యొక్క తేజస్సు ప్రవేశించును గాక. అదితి దేవాము నుండి అద్భుత తేజము సంభవించుచున్నది. ఆ తేజస్సును విశ్వేదేవతలు, అదితి నాయందు ప్రవేశపెట్టుదురు గాక.
2. మిత్రుడు, వరుణుడు, ఇంద్రుడు, రుద్రుడు నన్ను తమ అనుగ్రహ పాత్రునిగా తలంతురు గాక. విశ్వమును భరించునట్టి దేవతలందరు నాకు తేజస్సు కలిగింతురు గాక.
3. ఏ తేజస్సుచే గజము గజము అయినదో, దేనివలన రాజు మనుష్యులందు తేజస్వి అగుచున్నాడో, ఏ జలములందుండి ప్రాణులు తేజస్వులు అగుచున్నవో సృష్టికి పూర్వము ఏ తేజస్సు వలన ఇంద్రాదులు దేవతలు అయినారో అగ్నిదేవా! అట్టి తేజస్సును నాయందు ప్రవేశపెట్టుము.
4. జాతవేద అగ్నీ! నీయందు ఆహుతుల మహా తేజస్సు ఉన్నది. సూర్యుని యందు, అసురులందు, గజములందు తేజస్సులున్నవి. కమల మాలాలంకృతులగు అశ్వినులు ఆ తేజస్సులను నాయందు ప్రవేశపెట్టెదరు గాక.
5. నాలుగు దిశలు ఎంత వరకు వ్యాపించి ఉన్నవో, ఈ నేత్రము ఎంతవరకు చూడగలుగునో అంతవరకు వ్యాపించిఉన్న ఇంద్రతేజము హస్తి వర్చస్సు నాయందు ప్రవేశించును గాక.
6. అడవి మృగములందు తన బలాధిక్యత వలన ఏనుగు సామ్రాట్టు అయినది. అట్టి భాగ్య రూపమగు తేజస్సుచే నేను అభిషిక్తుడను అగుచున్నాను.
మూడవ సూక్తము - 23
వినియోగము :-
1) పుంసవన కర్మమున ఈ సూక్తముచే బాణమును అభిమంత్రించి ఆడదాని తలమీద పెట్టునది.
2) దీనిచే ఘ్రుతాహుతులిచ్చి 'శరమణి' ని సంపాతన, అభిమంత్రణములు చేసి కట్టునది. చమసమున ఒకే రూపపు దూడగల ఆవుపాలలో ధాన్యము, యవలు చేసి ఆలోడనము చేసి అండముల మీద కట్టునది.
3) పలాశ, బదరీ కందములను కలిపి నూరి ఆడదాని కుడి ముక్కునందు నశ్యము వలె పీల్పించునది.
1. నారీ! నీవు వంధ్యత్వ పాపమున గర్భ ఘాతినివై గొడ్రాలివి అయినావు. ఆ పాపమును నీ నుండి తొలగించుచున్నాను. ఈ గర్భపాత రోగము మరల కలుగకుండునట్లు ఆ రోగమును దూరమునకు విసరుచున్నాను.
2. యువతీ! బాణము పొదిలోనికి దూరినట్లు నీ జననాంగమున పుంస్త్యయుక్త గర్భము ప్రవేశించును గాక. అది నీ గర్భమున పది నెలలుండి, వీర్య సంపన్నమై, ప్రసూతి కాలమున జన్మించును గాక.
3. మహిళా! నీవు పురుష లక్షణ పుత్రుని కనుము. తదుపరి పుత్రులనే కనుము. అవిచ్చిన్నముగ పుత్రులను కని తల్లి వగుము. కననున్న పుత్రులకు నీవు తల్లివి ఆగుము.
4. అబలా! వృషము తన వీర్యమును గోవునందు వత్స రూపమున ప్రవేశపెట్టిన రీతి, అమోఘ వీర్యమున నీవు పుత్రులను కనుము. ఆ విధముగా ధేనువు వలె పుత్ర సహితవై వర్ధిల్లుము. మృత శిశువు కాకుండును గాక.
5. నారీ! నీ యందు ప్రజోత్పత్తి కార్యము చేయుచున్నాను. నీకు గర్భము కలుగును గాక. అప్పుడు నీకు సుఖము నిచ్చునట్టి - నీవు సుఖము నిచ్చునట్టి పుత్రుని కనుము.
6. దివి తండ్రిగను, భువి తల్లిగను, జలము వర్ధిల్ల చేయునవి యగు ఓషధీరూప దేవతలు నీకు పుత్ర లాభము కలిగించి రక్షింతురు గాక.