కోతి డ్రైవరుకి సలాం చేసింది.
"ఆఫీసర్లు లంచం ఎలా తీసుకుంటారు?"
కోతి వీపు వెనుక చేయి చాచింది.
అందరూ ఘొల్లుమన్నారు.
"జయమాలిని డాన్స్ చేస్తుంటే ఎలా చూస్తావ్?"
కోతి నాలుక బయటపెట్టి గుడ్లు మిటకరించింది. ఎగురుతూ యాక్షన్ చేసింది.
"ఆ టైమ్ లో హఠాత్తుగా మీ ఆవిడవస్తే ఎలా చూస్తావ్?"
కోతికళ్ళు మూసుకుని నీరసంగా కూలబడింది.
గార్డుతూలుతూ వచ్చాడక్కడికి.
"గార్డు సాబ్ కి సలాంపెట్టు!"
కోతి గార్డు కి సలాం చేసింది.
"భార్యకు తెలీకుండా సెకండ్ షో కెళ్ళి ఇల్లు ఎలా చేరుకుంటావ్?
కోతి దొంగలా నక్కి నక్కి నడిచింది.
నేను స్టేషన్ మాస్టరు దగ్గరకెళ్ళాను.
"ఆ కోతి ఆట అయ్యేవరకూ రైలు కదలదాసార్?"
"ఏమోమరి! వాడు కోతిని చాలా రోజుల్తర్వాత తీసుకొచ్చాడు సెక్షన్ లోకి" అన్నాడాయన కోతిని ఆనందంగా చూస్తూ.
"నేనడిగేది రైలు సంగతి!"
"నేననేది కోతి సంగతి! వండర్ ఫుల్ ఫీట్స్ చేస్తోంది చూశారా?"
"ఈ రైలు ఇంక బయలుదేరదా?" కోపంగా అరిచాను.
"ఎందుకు బయలుదేరదు?"
"బయలుదేరుతుందని తెలుసండీ! ఏ తారీఖు?" ఆయన కాలెండర్ చూశాడు.
ఇవాళే- ఇప్పుడే"
"మరి కదలదేం?"
"గార్డూ, డ్రైవరూ టీ తాగి ఇప్పుడేగా వెళ్తోంది?"
నేను గార్డు, డ్రైవర్లకోసం చూశాను.
అప్పుడే బయలుదేరివెళ్తున్నారు వాళ్ళు.
మరో అయిదు నిమిషాల తర్వాత రైలు కదిలింది.
అయితే ఫ్లాట్పారం దాటకుండానే మళ్ళీ ఆగిపోయింది. నేను, నా పక్కనున్నవారూ దిగి కారణమేమిటా అని చూశాము.
డ్రైవరు దిగి వస్తూ కనిపించాడు.
"ఏమయింది!" అడిగాను.
"ఇంకేముంది! గార్డు మళ్ళీ వాక్యూమ్ వేశాడు."
అందరం కలిసి గార్డు దగ్గరకెళ్ళాం.
"అరె! వద్దంటే వాక్యూమ్ వేస్తావెందుకయ్యా?" అడిగాడు డ్రైవర్ కోపంగా.
"సారీ! అయామ్ సారీ"
"ఇదిగో గార్డుగారూ! ఇప్పటికే బోలెడాలీశెం అయిపోయిందయ్యా! ఇంక బండి ఆపకు. పాలు పాడయిపోతాయి" అన్నారు పాలవాళ్ళు.
"నేనాపను. ఆపమన్నా ఆపరు. కావాలంటే షూడండి- ఆపణు" అందరం మళ్ళీ రైలెక్కాం.
రైలు కదిలింది.
"ఇంకెన్ని స్టేషన్లున్నాయ్" దిగులుగా అడిగాను.
"ఇంకెన్నండీ, రెండే."
"హమ్మయ్యా" అనుకున్నాను. కనీసం ఆఫీసుకి మధ్యాహ్నం నుంచయినా వెళ్ళవచ్చు.
కారేజ్ లో మరో గిరజాల జుట్టు ఎక్కింది.
"ఎవరికండీ మాష్టారూ- చెవిలో గుబులులాగేస్తాం? కేవలం రెండుచెవుల్లో గుబులుకి అర్ధరూపాయ్ మాత్రమే చార్జీ అండీ! గుబుల్ గుబుల్ గా గుండెలు దడగా- ఎవరకండీ మాష్టారూ గుబులూ- నలుగురు కలసి గుబులు తీయించుకుంటే కీచైన్ ఉచితం సార్."
అప్పటికప్పుడే రెండు కేసులు దొరికాయి అతనికి. వాళ్ళిద్దరిచుట్టూ జనం మూగిపోయారు.
తీరా రైలు రెండు ఫర్లాంగులు వెళ్లిందోలేదో మళ్ళీ ఆగిపోయింది.
"సందేహంలేదు గార్డుపనే మళ్ళీ" అన్నారు మా బోగీలో ఉన్నవాళ్ళు. అందరం కలసి గార్డు దగ్గరకెళ్ళాం.
"ఏమిటయ్యా గార్డుగారూ ఇది? అవతల పదకొండయిపోతోంది. మా పాలు పాడయిపోతాయి అని చెప్తుంటే వినకుండా బండి ఆపేస్తావేమిటి?"
గార్డు నవ్వాడు.
"లేపోతే ఆ వెంకట్రావ్ నాకేం పవర్లేదంటాడా?? రాస్కెల్! నా ఫవరేంటో ఇవాళ షూపిస్తా! అడుగడుక్కీబండి ఆపేష్తా"
"బాబోయ్! వద్దయ్యా స్వామీ నీకు దణ్ణం పెడతాం! బండి ఆపకు." పాలవాళ్ళు బ్రతిమాలారు.
"అయితే మరి వెంకట్రావ్ ఆకూత ఎందుక్కూషాడు-"
"ఆ వెంకట్రావ్ పని మేము చెప్తాం కదా! తమరు బండి ఆపకండి"
"షరే!"
రైలు మళ్ళీ కదిలి మరికాస్త దూరం నడిచి ఆగిపోయింది.
అందరం మళ్ళా గార్డు దగ్గరకెళ్ళాం.
"మళ్ళీ ఏమొచ్చిందయ్యా మగడా!"
"వెంకట్రావుగాడు లేడూ? ఆడు నన్ను 'బూష్' అని తిట్టాడు" రెండు చేతుల్తో తలపట్టుకుని దిగాలుగా అన్నాడు గార్డు.
"ఆడిపని మేము చూస్తాంలేవయ్యా! బండి ఆపకు."
"నిజంగా ఆడి భరతం పడతారా?"
"పడతాం సార్!"
"మరి వాడిని కూడా బుష్ అని తిడతారా?"
"తప్పకుండా తిడతాం!"
"ఏమని తిడతారు?"
"బూష్ అనే తిడతాం!"
"బూష్ కాదు? బూష్ అని తిట్టాలి"
"బూష్ అనే తిడతాం లేవయ్యా బండి పోనీ! జండా చూపించు!"
"బూష్ కాదని షెప్తుంటే వినరేం?"
"మరేమని తిట్టాలి?"
"బూష్!"
"సరే! అలాగే తిడతాంలే నాయనా!"
"ఏమని తిడతారు?"
"అదే బూష్ అని చెప్పావుగా?"
"బూష్ కాదు."
"మరి"
"బూష్-బూష్-"
"బూష్ బూష్" అన్నాడు పాలవాడు.
"బూష్ కాదహా!"
నేను కల్పించుకున్నాను.
"బ్రూట్ అని తిట్టాలి! అంతేగదా?"