Previous Page Next Page 
హ్యూమరాలజీ-1 పేజి 22


    "హమ్మయ్య! వచ్చేసింది!" అన్నాడు పళ్ళు పీకే అతను, తన చేతిలో కటింగ్ ప్లేరు మధ్యనున్న పంటిని అందరికీ ఉచిత ప్రదర్శన ఇస్తూ! కిందపడున్న వ్యక్తి మూలుగుతూ లేచి తనసంచీ తీసుకు కిందకుదిగాడు. పళ్ళుపీకే వ్యక్తి కూడా ఫ్లాట్ ఫాం మీదదిగి గార్డుకి చేయి ఊపగానే బండి మళ్ళీ స్టార్టయింది.
    అయితే మళ్ళీ పక్క స్టేషన్ లో ఆగిపోయింది.
    "మళ్ళీ ఏమిటీ?" అన్నాడు ఒకతను బయటకు చూస్తూ.
    "మళ్ళీ ఇంకో రైలు క్రాసింగ్!" అరగంట తర్వాత మళ్ళీ బయల్దేరిందిగానీ, కొద్దిదూరం వెళ్ళి మళ్ళీ ఆగిపోయింది.
    మరుక్షణంలొ అన్ని పెట్టెల్లోకి బిలబిలమంటూ ఆర్.పి.ఎఫ్ వాళ్ళు, టి.టి.ఇ.లు ఎక్కేశారు.
    టికెట్, టికెట్" అంటూ నాలుగువేపులున్న తలుపుల దగ్గర అడ్డం నిలబడి అందరి టికెట్లూ చెకింగ్ చేయసాగారు.
    "ఇక్కడ చెక్కింగేమిటి?" అడిగాను పక్కనున్నతనిని.
    "స్క్వాడోళ్ళు వచ్చారండీ! స్పెషల్ చెక్ అన్నమాట!"
    మ్ కారేజ్ లోనే సగంమందికి పైగా టికెట్ లు లేకపోవటం చూసేసరికి నాకు ఆశ్చర్యం కలిగింది.
    అందరినీ పక్క స్టేషన్ లో దింపారు.
    పావుగంట గడిచినా రైలు మళ్ళీ కదలకపోయేసరికి నేనూ మిగతా వాళ్ళూ కిందకు దిగాము.
    స్టేషన్ మాస్టర్ ఆఫీసు బయట టికెట్ లేనివాళ్ళ గుంపు నిలబడి ఉన్నారు. వాళ్ళకెదురుగా టి.టి.ఇ.లు, ఆర్.పి.ఎఫ్ వాళ్ళు నిలబడ్డారు.
    "అవునండీ! మీది స్పెషల్ చెకింగ్ స్క్వాడే! వప్పుకుంటాం. కానీ ముందు పాసింజర్లకు చెప్పకుండా ఇలా హఠాత్తుగా చెకింగ్ కొస్తే ఎలా? ఇప్పుడు చూడండి! ఇంతమందిమి టికెట్లు కొనలేదు." అన్నాడు గుంపులో నుంచి ఒక ప్రయాణీకుడు.
    "మమ్మల్నేం చేయమంటారండీ! మా ఆఫీసరుగారు 'ఎటాక్' చేయమన్నారు." అన్నాడు ఒక టి.టి.ఇ.
    "ఆయన్చెప్తారులేవయ్యా? చెప్తే చేసేయటమేనా? మాకు రెండు స్టేషన్లముందే ఇలా మధ్యలో స్పెషల్ చెకింగ్ జరుగుతోందని తెలియజేస్తే మేము టికెట్ కొనుక్కుంటాం అని ఎన్నిసార్లు చెప్పాలి మీకు?" ఇంకో మీసాలాయన దబాయించాడు.
    "మా ఇన్స్ పెక్టర్ తో మాట్లాడండయ్యా! మాకేం తెలుసు. అక్కడికీ మేం చెప్తూనే వున్నాం! ముందు చెప్పకుండా ఇలా సడెన్ చెకింగ్ చేస్తే పాసింజర్స్ వప్పుకోరు సార్ అని! ఆయన వింటేనా? డి.సి.యస్. ప్రోగ్రాం ఆఖరిక్షణంలో ఇచ్చారు గనుక మనమేం చేయలేము. అన్నారు-" ఒక టి.టి.ఇ.
    "ఏడి మీ ఇన్ స్పెక్టర్ ని పిలు మేమి మాట్లాడతాం." అన్నాడు మీసాలరావు.
    స్టేషన్ మాస్టర్ ఆఫీసులో నిలబడ్డ ఇన్ స్పెక్టర్ బయటికొచ్చాడు.
    "ఇదిగో చూడండి బాబూ. ఈ ఒక్కసారికి పొరపాటు జరిగింది. మీకు మా స్పెషల్ చెక్ గురించి ముందే తెలియజేసేంత టైముకూడా లేకపోయింది." అన్నాడు ఇన్ స్పెక్టర్ వినయంగా.
    "అదేం కుదరదండీ, మీ చెకింగ్ కాన్సిల్ చేసేసుకోండి. కావాలంటే రేపు చెక్ చేసుకోండి వప్పుకుంటాం" అన్నాడు ఇంకోలావుపాటి వ్యక్తి.
    "సర్ ప్రైజ్-చెకింగ్ ఎలా కాన్సిలవుతుంది? కుదరదుకదా" అన్నాడు ఇన్ స్పెక్టర్.
    "ఏం ఎందుక్కుదరదు? పెద్ద పెద్ద విజిలిన్స్ చెక్ లే కాన్సిల్ చేయించాం. మీ చెకింగో పెద్ద లెక్కేమిటి?" ఇంకెవరో అరిచారు.
    "అవును! కాన్సిలు చేసి మీరు వెళ్ళిపోవలసిందే." అన్నాడు ఇంకో కుర్రాడు. ఇన్ స్పెక్టరూ టి.టి.ఇ. లూ మొఖమొఖాలు చూసుకున్నారు.
    "మేము ముందే చెప్పాం కద్సార్. తెల్లారిలేస్తే మొఖమొఖాలు చూసుకోవాలి. చెప్పకుండా చెకింగ్ చేయడం బాగుండదని" గొణిగాడు ఒక టి.టి.ఇ.
    "సరే! పదండి! రేపు చేద్దాం చెకింగ్ ఇక్కడ" అన్నాడు ఇన్ స్పెక్టర్. ప్రయాణికులంతా ఆనందంగా మళ్ళీ రైలెక్కేశారు.
    ఇక టి.టి.ఇ అందరి దగ్గరకొచ్చి గట్టిగా చెప్పసాగాడు.
    "ఇదిగో, రేపు ఇదే బండికి స్పెషల్ చెక్ చేస్తున్నారు. ఇక్కడే ఈ స్టేషన్ దగ్గరే. కనుక మళ్ళీ చెప్పలేదనకండి."
    రైలు కదిలింది. కానీ మళ్ళీ ఫ్లాట్ ఫారం దాటగానే మళ్ళీ ఆగిపోయింది. బటానీలవాడు బండి ఎక్కడం మిస్ అయ్యాడట.
    "అబ్బా, ఇప్పటికే రెండు గంటలులేటయిపోయింది బండి." అన్నాన్నేను. దిగులుగా, నా పక్కనున్నవాళ్ళు నావంక ఆశ్చర్యంగా చూశారు.
    "లేటేమిటి?"
    "అదే-ఆలస్యం-" అన్నాను.
    "ఈ బందరు-బెజవాడ లైనులో అలాంటివేమీ ఎవ్వరూ అడగరు" అన్నాడు ఒకతను. "బండి ఎప్పుడెళ్ళినా రైట్ టైమ్ అనే అనే రాసేసుకుంటారు!"
    ఈసారి రైలు బయలుదేరి స్టేషన్ రాకుండానే ఆగిపోయింది.
    "మళ్ళీ ఏమయింది?" అడిగాను చిరాగ్గా.
    అందరూ కిటికీలోనుంచి చూశారు.
    కొద్దినిమిషాల తర్వాత డ్రైవర్ నడుస్తూ గార్డు పెట్టివేపు వెళ్ళసాగాడు.
    "ఏమయిందిగురూ?" ఎవరో పాసింజర్ అడిగాడు డ్రైవర్ని.
    "ఎవరో గొలుసులాగారు-" అంటూ వెళ్ళి మళ్ళీ పది నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు.
    "ఎవరు లాగారు?" అడిగాడు పాసింజరు మళ్ళీ.
    "గార్డు వాక్యూమ్ వేశాడు" అంటూనే వెళ్ళిపోసాగాడతను.
    "ఎందుకు?"
    డ్రైవరు జవాబు చెప్పలేదు.
    మరో రెండు నిమిషాల్లో బండి స్టార్టయింది. గానీ మళ్ళీ వెంటనే ఆగిపోయింది.
    "మళ్ళీ ఏమయింది?" అడిగాడు ఇంకో పాసింజరు వళ్ళు మండిపోతుంటే అందరూ కిందకుదిగి డ్రైవరుతోపాటు చివరివరకూ నడిచివెళ్ళారు.
    పదినిమిషాల తర్వాత తిరిగి వచ్చారు.
    "ఏం జరిగింది?" అడిగాను.
    "గార్డు మందుకొట్టేశాడు. అందుకని మాట్లాడితే వ్యాక్యూమ్ వేస్తున్నాడు" అన్నాడు ఒకతను.
    "అదేమిటి! మందుకొట్టినా ఎందుకలా బండి ఆపటం?"
    "ఆ గార్డంతే సార్! మందుకొడితే చాలు- వాక్యూమ్ వేసేస్తుంటాడు."
    "అసలు డ్యూటీలో మందుకొట్టడమేమిటి?" ఆశ్చర్యంగా అడిగాను.
    "ఛ ఛ! ఆయన మంచాడు సార్! ఎప్పుడూ కొట్టడు. ఇవాళ వాళ్ళ పండగట! అందుకని కొట్టేస్తున్నాడు."
    రైలు మళ్ళీ బయలుదేరి పక్క స్టేషన్ లో ఆగిపోయింది.
    ఓ ముసలాడు కోతితోసహా మా కారేజ్ ఎదురుగా ఫ్లాట్ ఫారం మీద దుకాణం పెట్టాడు.
    "అయ్యగార్లకు దణ్ణం పెట్టు" అన్నాడు. కోతి స్టేషన్ మాస్టరుకీ, బఠానీల వాడికీ నమస్కారం పెట్టింది.
    అదిచూసి ప్రయాణికులు చాలామంది రైలుదిగి దాని చుట్టూ మూగారు.
    "డ్రైవర్ సాబ్ కి సలాంపెట్టు!"

 Previous Page Next Page