"ఇంటికొచ్చిపోయే బంధువులకి వండి స్వయంగా వడ్డించడం వచ్చినదై ఉండాలా?" ఇంకా కోపంగా అరిచాడు.
"ముమ్మాటికీ!" తగ్గకుండా అంది.
"పదహారణాల తెలుగింటి విరిబోణీ అయి ఉండాలా?" టేబుల్ మీద గ్లాసుతో గట్టిగా కొట్టి అడిగాడు.
"అక్షరాలా!" నొక్కి చెప్పింది యశోద.
"అయితే దొరికింది పో!" తల్లి రెండు భుజాలమీద చేతులేసి నవ్వుతూ అన్నాడు.
"ఆఁ! ఆమె ఆశ్చర్యంగా చూసింది.
"ఏమిట్రా ఈ డ్రామా?" కేశవరావు అడిగాడు.
"నీ కొడుకు హరివిల్లు ఎక్కుపెట్టే వచ్చాడు. ఆ అపరంజిబొమ్మని చేసుకోవటానికి మిమ్మల్నిద్దర్నీ ఒప్పించడానికి ఇంత నాటకం ఆడాడు!" తాపీగా చెప్పాడు సీతారామయ్య.
"కన్నవాళ్ళతోనే నాటకాలా?" చిరుకోపంగా అడిగాడు కేశవరావు.
"అమ్మా నాన్నల దగ్గర అబద్దాలాడి నాటకాలాడటానికి నువ్వెళ్ళేవాడివి కాదూ .... ఆ పోలికలే వచ్చాయి మరి!" అన్నాడు సీతారామయ్య.
యశోద అప్పటికి తేరుకుని, "మరి ఆ లిజీ సంగతేమిటి?" అంది.
"ఫాస్ట్ ఫుడ్స్ కడుపు నింపవమ్మా! నాకు షడ్రుచులతో అచ్చమైన ఆంధ్రా భోజనమే కావాలి?" నవ్వుతూ అన్నాడు.
"మాటలు నేర్చావు కానీ..... ఇంతకీ అమ్మాయి ఎవరూ?" అడిగింది నవ్వుతూ యశోద.
"చెప్తే మీ ఆయన ఎగిరి గంతేస్తాడు!" ఊరిస్తూ అన్నాడు సీతారామయ్య.
"ఓహో ... విశ్వామిత్రులవారే వెంటబెట్టుకెళ్ళిన స్వయంవరం అన్నమాట! ఎవరేమిటి!" అడిగాడు ఆసక్తిగా కేశవరావు.
"సుబ్బారాయుడు బావగారి కుమార్తె చిరంజీవి రాధ!" అన్నాడు సీతారామయ్య.
"మా... మా సుబ్బుగాడి కూతురా?"
కేశవరావు మోహంలో చిన్నప్పుడు తిరునాళ్ళలో లాటరీ తగిలినప్పుడు కలిగినంత ఆనందం కనిపించింది.
"పిల్ల బాగుంటుందా?" అడిగింది యశోద.
"ఛందస్సులా ఉంటుంది!" అన్నాడు మాధవ్!
"అంటే?" అడిగింది యశోద.
"అడుగులు ఆటవెలదులు, మాటలు మత్తేభవిక్రీడితాలు, అభిమానంలో శార్దూలం, వినయ విధేయతలు సీసం - తేటగీతుల్లా ఒకదాని వెనుకే ఇంకొకటి ఉంటాయి. సొగసు చంపకమాల .... వయసు ఉత్పలమాల .... ఆ అందం డెందాన్ని మెలిపెట్టే కందం! ఒక్క మాటలో తేటతెలుగు తెలి వెన్నెల!" అన్నాడు.
"గ్లామర్ కన్నా గ్రామర్ ఎక్కువా? అడిగాడు కేశవరావు.
"బాగుంది, రేపు కోడలయ్యాక కంచంలో పద్యం పెడుతుందా, పథ్యం పెడుతుందా?" అడిగింది యశోద.
"భలే చురక వేశావమ్మా!" అన్నాడు నారాయణమూర్తి.
"నువ్వు మాకు పెడుతున్నదే పెడుతుందమ్మా, మరదలా!" మాటకి మాట అందించింది విశాలాక్షి.
అత్తయ్యవైపు అభినందనంగా చూశాడు మాధవ్. అతనికి అస్తమిస్తున్న సూర్యుడు 'ఈ ముఖాన పూసుకున్న గోధూళి నీ ప్రియురాలి వూరిదే సుమా!" అన్నట్టుగా తోచింది.
* * *
"గంగరాజు సంబంధం.... లింగరాజు సంబంధం ఎందుకు కాదన్నానో నీకు ఇప్పటికైనా తెలిసిందా? మన అమ్మాయా మహార్జాతకురాలు, అమెరికాలోనో.....కాకపోతే కనీసం బొంబాయిలోనో.... కలకత్తాలోనో.... అదీ కాకపోతే అధమం హైదరాబాదులోనో ఉండాలి కానీ, అద్దంకిలోనో, ఆముదాలవలసలోనో కాదు!" సుబ్బారాయుడు పార్వతమ్మతో గర్వంగా చెప్పాడు.
ఆకులకి సున్నం రాస్తున్న పార్వతమ్మ ఆలోచనగా "అసలు ఆ కేశవరావుగారూ, యశోదమ్మా ఈ పెళ్ళికి ఒప్పుకుంటారంటారా?" అంది.
"ఎగిరి గంతేసి ఒప్పుకుంటారే! మా స్నేహం సంగతి నీకు తెలియదు!" నమ్మకంగా అన్నాడు.
"వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు. విడి కాపురానికి ఎందుకు ఒప్పుకుంటారండీ మీ పిచ్చి కాకపోతేనూ?" అంది తమలపాకులు మడిచి చిలకలు వేళ్ళకి పెట్టుకుని భర్తకి అందిస్తూ.
వాటిని నోటితో అందుకుని చెప్పాడు. "మా కేశవుడు ఆ రోజుల్లోనే ఉమ్మడి కుటుంబం పల్లేరుగండ అని పెళ్ళాన్ని తీసుకుని రివ్వున ఎగిరిపోయి విడిగా ఉన్నవాడు. ఈవేళ కొడుకుని ఎందుకు విడికాపురం పెట్టనివ్వడూ? నీదంతా చాదస్తం!"
"అదేం మాటండీ!" అంది పార్వతమ్మ.
అత్తలకీ, ఆడబిడ్డలకీ అరవ చాకిరీ చేస్తూ ఉమ్మడిపొత్తులో పడుండాల్సి వస్తే, నా కూతురికి అసలు పెళ్ళే చేయను!" శపథంలా చెప్పాడు సుబ్బారాయుడు.
"ఎందుకా అపభ్రంశపు మాటలు? హైదరాబాదు వెళ్లి సంబంధం విషయం కనుక్కురండి, అబ్బాయిని చూస్తే స్వయంవరానికొచ్చిన అర్జునుడిలా ఉన్నాడు!" అంది పార్వతమ్మ.
"ఔను, మన సుభద్రని అతనికిచ్చేలోపే పట్నంలోనే ఏ ఉలూచో, చిత్రాంగదో ఎత్తుకుపోతుందేమో!" అన్నాడు నవ్వుతూ సుబ్బారాయుడు.
"హాస్యాలకేం గానీ, ముందు ఆ విషయం చూడండి! మొన్న పేరంటంలో కరణంగారి భార్య కూడా అడిగింది!" అంది.
"పారూ..... నువ్వూ నాతో రాకూడదూ!" అడిగాడు సుబ్బారాయుడు.
"వచ్చేదాన్నే కానీ, రాజేశ్వరీ వాళ్ళూ వస్తామని కబురు పంపారండీ! తెలిసీ వదిన వెళ్ళిపోయింది అనుకుంటే బావుండదు!" ఆమె నచ్చచెప్తున్న ధోరణిలో అంది.
"హు! పెళ్ళయిన ఏడాది నుండీ నిన్ను తీసుకుని పట్నం వెళ్ళాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. అసలా కోరిక తీరుతుందో లేదో!" బుంగమూతి పెట్టి అంటున్న భర్తని చూసి నవ్వుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది పార్వతమ్మ.
ఆమె దృష్టిలో ఇంటికి పెద్ద కోడలంటే వేసవిలో చలివేంద్రంలాంటిది. వచ్చేపోయే బాటసారుల దాహార్తిని తీర్చడమే కానీ, వట్టిచెయ్యి చూడపం ఆమెకి రాదు.
* * *
"ఆయన మా పెద్దనాన్నగారు..... ఆ పక్కనున్నది చిన్నాన్న..... ముందు వరుసలో మా అమ్మ పక్కన కూర్చున్నావిడ పెద్దమ్మగారు..... ఇదిగో, ఈ క్రింద పొట్టి గౌనుతో కూర్చున్న రెండు జడల పిల్ల మీ పెద్దత్తయ్య. ఆ చివర మా అమ్మ ఒడిలో చీమిడిముక్కుతో ఉన్నవాడు మీనాన్న!" సీతారామయ్య ఉత్సాహంగా చెప్తున్నాడు. ఆయన చేతిలో ఎరుపురంగుకి తిరుగుతున్న పాతకాలం ఫోటో ఉంది.