Previous Page Next Page 
మొగలిబాకు పేజి 23

   

   "బాగానేవుంది కానీ__రెండో పాయింటే ప్రమాదం బామ్మ ఆస్తి నీ పేరున రాయమని వెంటనే అడిగేసాడనుకో __మీ బామ్మకు అనుమానం రావచ్చు వస్తే ఎలా?"
   
    "ఏం ఫర్వాలేదు__అనుమానం రాదు__కలెక్టరుగదా__"
   
    "మరి తర్వాత్తర్వాత కలెక్టరు కూతుర్ని నువ్వు పెళ్ళి చేసుకోవాలి గదా__" అనుమానాన్ని వ్యక్తం చేశాడు జుత్తుల జిన్నా.
   
    "ఒరేయ్ జిన్నా__ఈ నారాయణరావు తెలివి తేటల్ని నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావ్. అలా వెయ్యడం చాలా పొరపాటు ఒరేయ్" తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్తాను విను.
   
    ఏదో ప్రాబ్లమ్ వల్ల మా బామ్మ చనిపోయిందనుకో__మానకిక ఏ ప్రాబ్లమ్ వుండదు. ఆ యమ ధర్మరాజు పరాకుగా మరిచిపోయి మా బామ్మను యీ భూమ్మీద మరి కొన్నాళ్ళుంచాడనుకో__ఆకస్మాత్తుగా కలెక్టర్ని, కూతుర్ని మనం ఉత్తుత్తి అమెరికా పంపేస్తాం. ఆ విమానం పేలిపోతుందన్న మాట. పాపం కూతురితో సహా సదరు కలెక్టరు విషాదకర పరిస్థితుల్లో చనిపోతాడన్నమాట. అప్పుడు మనకు ఆస్తి వస్తుంది కానీ కలెక్టర్ వుండడన్న మాట.....ఎలా వుంది ఐడియా...." నవ్వుతూ మొత్తం అంతా చెప్పేసిన నారాయణరావువేపు.
   
    విశ్వరూపం సమయంలో శ్రీకృష్ణునివేపు అర్జునుడు చూస్తున్నట్టుగా చూశాడు జిత్తులజిన్నా.
   
    "ఒరేయ్......నారాయణరావ్.....నీ బుర్ర ఇక్కడ వుండాల్సిన బుర్ర  కాదురా..... అమెరికాలోనో, ఆఫ్రికాలోనో వుండాల్సిన బుర్రనీలాంటి జ్ఞానికి సహాయం చెయ్యడం నా విద్యుక్తధర్మంరా .....నీకు నేను అర్జంటుగా హెల్ప్ చేస్తాను.
   
    మన ఫ్రెండ్ కి తెలిసిన యింకో ఫ్రెండ్ వున్నాడు. వాడు సరదాగా రౌడీ అన్నమాట.....కానీ నాటకాలంటే తగని పిచ్చి. ఇలాంటి మేకప్పుల్లేని డ్రామాలంటే ఎంతో సరదా.....నేనివాళే మాట్లాడి ఫైనలైజ్ చేస్తా సరేనా.....?"
   
    "ఫైనలైజ్ చెయ్యడం కాదు.....వాడ్ని తీసికొచ్చెయ్.....ఒక పని అయిపోద్ది....."
   
    "వాడుగనక వప్పుకుంటే వాడికి మనం అడ్వాన్స్ యివ్వాలి.....అయిదు వందల రూపాయలు జాగ్రత్త చెయ్యి.....మిగతా విషయమంతా నేను మానేజ్ చేస్తాను వస్తా....." అని జుత్తుల జిన్నా విజిల్వేసుకుంటూ ముందుకెళ్ళిపోయాడు.
   
    అలా వెళ్ళిపోతున్న జిన్నావేపు, పరమానందభరితుడై చూస్తూ నిలబడిపోయాడు నారాయణరావు.
   
                                             *    *    *    *

   
    మర్నాడు డాబా గార్డెన్స్  వెళదామని, సిటీబస్సెక్కిన సంధ్య చేతిలో ఒక కర్రపత్రాన్ని పెట్టి, ఇకిలించాడు సిటీబస్ కండక్టర్ తన చేతిలోని మిగతా కర్రపత్రాలన్నింటినీ, అందరికీ పంచాడు.....పంచి చిన్న ఉపన్యాసం యిచ్చాడు.
   
    "ఇవాళ నేను కండక్టర్ గా వున్నా, ఈ బస్సు ఎవరేక్కినా.....నేను టిక్కెటివ్వనంతే, యీ పాంప్లేట్ ఇస్తాను. ఎందుకో తెలుసా? ప్రేమ కోసం.....మహా ప్రయాణీకులారా.....ఒక్కసారి ఆ కర్రపత్రాన్ని చదవండి___ఒక కాలేజీ అబ్బాయి, అమ్మాయిని కలిపి ప్రపంచంలో ప్రేమ గొప్పదనే సత్యానికి మరోసారి ఊపిరిపోసి, చరిత్రలో ప్రేమ స్థానాన్ని తెలియచెప్పడం కోసం యూనివర్శిటీ స్టూడెంట్స్ అందరూ గొప్ప ఉద్యమాన్ని నడుపుతున్నారు.
   
    అలాంటి ఉద్యమం కావాలని నేనెప్పుడో కలలుగన్నాను.
   
    భారతదేశంలో నాలుగు చెరగులా అలాంటి ఉద్యమం రావాలి-
   
    ఎక్కడ చూసినా, ప్రతీ యిద్దరూ ప్రేమించుకుంటూనేఉండాలి. అందుకే.....ఆ ప్రేమ జంటకు నా మద్దతు తెలుపుతూ ఇవాళంతా, నా బస్సులో ఎక్కే ప్రయాణికుల నుంచి టిక్కెట్ చార్జీలను వసూలు చెయ్యడం లేదు. అదే కాకుండా మహా ప్రయాణికులారా.....ఆ సంధ్య ఆ నారాయణరావు ప్రేమజంట మద్దతుకోసం, ఇప్పుడే నా అధ్యక్షతన ఒక అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేస్తున్నానని తెలియజేస్తున్నాను......" అని ఆవేశంగా చెప్పాడు ఆ బస్ కండక్టర్ పరకాయ మణి. అందరూ తన ఉపన్యాసానికి ఉత్తేజితులయిపోయి చప్పట్లు కొడతారని అనుకున్న పరకాయమణి ఎవరూ చప్పట్లు కొట్టకపోవటంతో కించిత్ విషాదముఖుడైపోయి చిరాకెత్తి-
   
    "అలా దేభ్య మొహాలు పెట్టుకోవటం కాదు- పెద్దలంతా మారాలి___ ప్రేమ జంటల్ని ఆశీర్వదించాలి__ ప్రేమ జిందాబాద్__ మొహబ్బత్ జిందాబాద్__ ఈ భూవలయమంతా ఇష్క్ ఇష్క్ ఇష్క్ నినాదాలతో నిన్దిపోవాలి__ ఈ శుభ సమయంలో అఖిలపక్ష ప్రేమ కమిటీ అధ్యక్షుడిగా నేను తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాను__ ఈ వైజాగ్ జనాన్ని, ఈ రాష్ట్రంలోని జనాన్ని కూడదీసుకుని, అతి త్వరలో నేనొక ర్యాలీని తీయబోతున్నానని ప్రకటిస్తున్నాను....." ఆగి అందరి వేపూ చూశాడు.
   
    అయినా నో రెస్పాన్స్.....
   
    మళ్ళీ చిరాకేసింది పరకాయమణికి.
   
    "ఉపన్యాసం చెప్పి ఎవరయినా ఎందుకు ఆగుతారో తెలుసా? చప్పట్లు కొట్టడానికి___ చప్పట్లు కొట్టండి__ నన్ను ఉత్తేజితుడ్ని చేయండి_ బాగా ఉత్తేజితుడ్ని చేయండి__" ఆనందోత్సాహంతో అరుస్తున్నా__
   
    అతగాడి బాధ పడలేక అందరూ పెద్ద ఎత్తున ఎత్తేజితులై పోయి చప్పట్లు కొట్టటం ప్రారంభించారు.
   
    డానికి పరకాయమణి చాలా ఆనందించాడు.
   
    కండక్టర్ తో పాటు డ్రయివర్ కూడా ఉత్తేజితుడయిపోయాడు. దాంతో బస్సు రెగ్యులర్ స్టాపుల్లో ఆగకుండా వెళ్ళిపోవటం ప్రారంభించింది.
   
    ఆయా స్టాపుల్లో దిగాల్సినవాళ్ళు బస్సును ఆపమని గొడవచేయటం ప్రారంభించారు. కానీ అటు కండక్టర్ గానీ, ఇటు డ్రయివర్ కాని ఇద్దరూ పట్టించుకోలేదు.
   
    బస్సు లీలామహల్ చౌరస్తా దగ్గర కెళ్ళింది. ఆ మలుపు తిరుగుతున్న సమయంలోనే కండక్టర్ పరకాయమణి దృష్టి ఈ గొడవనంతా చీదర చూపులలో చూస్తూ, ఎప్పుడు బస్సులో నుంచి దిగిపోదామా అని ఎదురు చూస్తున్న సంధ్యను చూసి గబ గబా ఆమె దగ్గరకు వెళ్ళాడు.
   
    "చూడమ్మాయ్___ బస్సులో ప్రతి ఒక్కరూ కాలేజీ ప్రేమ జంటకు మద్దతు తెలుపుతుండగా నువ్వలా వుండడం బాగోలేదు__ఇప్పుడు నా మాటను గౌరవించి నువ్వేం చేస్తావంటే ఈ కరపత్రంలో వున్న ప్రేమ జంట సంధ్య, నారాయణరావుల లవ్ ఫలించాలని కోరుతూ నువ్వు కూడా ప్రేమ ప్రతిజ్ఞ చేయాలి__ ప్రేమ ప్రతిజ్ఞను చూసి మేమంతా ఉత్తేజితులమైపోవాలి......" గారపళ్ళతో నవ్వుతూ అన్నాడు పరకాయమణి.
   
    బస్సు మళ్ళీ కదిలింది.
   
    అసలే కోపంతో ఊగిపోతున్న సంధ్య, పరకాయమణి అసందర్భ డైలాగులతో అరికాలి మంట నెత్తి కెక్కింది. సీరియస్ గా అతని కళ్ళలోకి చూసింది.
   
    "కాసేపు బస్సు ఆపుతారా....మీకో విషయం చెప్పాలి" నెమ్మదిగా అంది.
   
    "ఏం బస్సు నడుస్తుంటే చెప్తే బాగోదా?"
   
    "చచ్చినా బాగోదు"
   
    అని సంధ్య చెప్పగానే, పరకాయమణి ఆలోచనలు యింకో విధంగా అయిపోయాయి. ఈ పిల్ల కరపత్రాన్ని చూసి బస్సులో తన ప్రేమ ఉపన్యాసాన్ని విని ఉత్తేజితురాలయిపోయి తనను గానీ ప్రేమిస్తుందని అంటుందేమో అని ఆశ పడినవాడయి వెంటనే విజిల్ వేశాడు.
   
    బస్సు వెంటనే విచిత్రమయిన శబ్దం చేసుకుంటూ ఆగింది. పరకాయమణి చాలా ఆశగా సంధ్య దగ్గరకొచ్చి-

 Previous Page Next Page