"నేను మాత్రం ఆ పల్లెటూరుకు రాను. నాన్నగారు అడుక్కు వచ్చి మా ఆకల్ని తీరుస్తారేమోగాని యుక్తవయసు వచ్చిన ఆడపిల్లల కుండే ఆశలు, ఆశయాలమాట ఏమిటి? ఇక్కడే ఉంటే ఎన్నో అవకాశాలు. డిగ్రీ పూర్తి చేసి పబ్లిక్ సర్వీస్ కమీషన్ కి, బాంక్ టెస్టులకి అప్పియర్ కావాలని ఉంది. ఎలాగయినా గవర్నమెంటు జాబ్ దొరికించుకు తీరుతాను! అదీ -ఉన్నతమైన పదవినే చేపడతాను! నా భవిష్యత్తు మీద నాకా నమ్మకముంది."
"చెల్లెలి మాటకూడా మరీ అంత తీసేసేది కాదుగా, నాన్నగారూ! ఇంతకాలం ఇన్ని అష్టకష్టాలు పడి చదివింది ఉద్యోగాల కోసమేగా? ఈ ప్రభుత్వం మీద నాకు నమ్మకం పూర్తిగా పోలేదు! యువత తెలివి తేటలను, పడిన శ్రమనూ మరీ అంత ఘోరంగా దగా చేయదు! ఒక అవకాశం చేజారినా మరొకటి అందిపుచ్చుకోగలనన్న నమ్మకం నాకూ వుంది"
"అప్లికేషన్లకీ, ఫోటోలకీ , ఇంటర్వ్యూలకీ సగం జీతం అంకితం చేస్తున్నారుకదమ్మా? దొరికిందా ఉద్యోగం?"
కష్టెఫలే! ఎప్పటికైనా ఫలితం అందుకో గలనన్న నమ్మకం నాకుంది."
"అంతిమ దినాలైనా ప్రశాంతంగా మనూళ్ళో గడపాలన్న నా చివరికోరిక మాట ఏమిటమ్మా?"
"అర్పిత డిగ్రీ పూర్తి చేయనీయండి, నాన్నగారూ! తరువాతదాన్ని తమ్ముడి దగ్గర ఉంచి మనిద్దరం ఊరెళ్ళిపోదాం"
"నేను వాడి దగ్గరుండను!వాడి పెళ్ళానికీ నాకూ క్షణంపడదు."
"అలా గంటే ఎలా? మన పరిస్థితి బాగా లేనప్పుడు ఎలాగో ఒకలా సర్దుకొని ఉండాలి"
"ఎలా సర్దుకొంటాం? మనకోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా విలవిల్లాడిపోయే ఆవిడ నన్నుంచుకొని తిండి పెడుతుందని ఎలా అనుకున్నావు?"
"ఇంకా ఏడాది మాట! ఇప్పటినుండే తగువెందుకు? ఈలోగా నాకు మంచి ఉద్యోగం దొరికితే ఎక్కడికీ వెళ్ళే ప్రశ్నేలేదు. మంచి ఇల్లు తీసుకుని నేను నాన్నగారికి ఏ ఇబ్బందీ కలగకుండా చూచుకొంటాను"
"బ్రతికి వున్నన్నాళ్ళు ఆడపిల్ల కష్టం తింటూ నిశ్చింతగా ఉంటానమ్మా."
"ఆడపిల్ల మగపిల్లాడన్న తేడా లెందుకు, నాన్నగారూ? వాళ్ళని కన్నట్టే మమ్మల్నీ కన్నారు. వాళ్ళని పెంచినట్టే మమ్మల్నీ పెంచారు. ఈ తేడా ఇప్పుడు చూపిస్తున్నారేగానీ మీరు బాగున్నరోజుల్లో నన్నెంత అపురూపంగా చూశారు? చదువులో నా తెలివి తేటల్ని చూసి ఎంత గర్వించేవారు? ఆడపిల్లనన్న తేడాగాని, చిన్న చూపుగాని మీరు చూసినట్టు నాకు గుర్తు లేదు."
తనని తొలిసారిగా తండ్రినిచేసిన అపురూప అంటే ఆయనకి ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఆపిల్ల ఆట పాటల్లో ఎంత చురుకో, చదువులోనూ అంత చురుకు! చిన్నప్పుడు ఎవరి మాటనీ లక్ష్యపెట్టేది కాదు! ఇంట్లో పని పాటలంటే బొత్తిగా శ్రద్ద ఉండేది కాదు!
"దీనికి నోరు చూస్తే ఇంతకంప! పని చూస్తే బొత్తిగారాదు. రేపు పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళేపిల్ల!" అంటూ, తల్లి చదివే దండకాన్ని తను మధ్యలోనే తుంచేవాడు! "దానికి పనిరాలేదని బెంగ పడకమ్మా! చదువులో అది చురకత్తి! లెక్కల్లో దానికి వచ్చే మార్కులెన్నో తెలుసా? నూటికి నూరు! అదీ మేధా సంపత్తి అంటే! దాని తెలివితేటల్ని అంట్లగిన్నెలకి అంకితం ఎంత మాత్రం కానియ్యను. అది ఎంతవరకు చదువుకొంటె అంతవరకు చదివిస్తాను! నా అపురూపను ఒక మణిపూసగా మలుస్తాను!"
ముందు మురిసిన తన పండుగ ఎలా తెల్లవారింది?
సుప్రసన్నాచారి ఒక సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు.
గతమంటే అది ఒక బంగారు కలగా అనిపిస్తూంది.
పాలలో నీళ్ళలా కలిసిపోయిన భార్య, ముత్యాల్లాంటి పిల్లలు, కొడుకుపిల్లల్నీ కోడల్ని చూచుకొని 'నాకింతకంటే ఏం కావాలి?' అని మురిసిపోయే తల్లి. ఆ తల్లికీ, భార్యకూ రోగమొస్తే మందులిప్పించడానికి డబ్బుల్లేక చంపుకొన్న దురదృష్టవంతుడు తను! తన భార్య ఇచ్చిన సంతానాన్నైనా బ్రతికించుకోగలిగాడా? ఒకడిని ఆ దరిద్రానికి ఆహుతి చేశాడు.
మిగతా పిల్లల్నయినా చదివించి ప్రయోజకుల్ని చేయగలిగాడా? ఉహుఁ తనే వాళ్ళమీద ఆధారపడ్డాడు! ఈ సిటీకి వచ్చి ఆ పిల్లలు పడని కష్టంలేదు! చేయని పని లేదు.
అయితే చిత్రమైన విషయం ఏమిటంటే, అపురూప చిన్నప్పుడు ఎంత గంప రాకాసిలా ఉండేదో, పెద్దయితే ఇది అందరినీ ఒక ఆట ఆడిస్తుందని అనుకొన్నారో - ఇప్పుడంత సౌమ్యమూర్తిగా మారిపోయింది. ప్రతి విషయంలోనూ ఎంత సంయమనం చూపిస్తూంది! అవిటివాడైన తండ్రికీ, తనకంటే చిన్న వాళ్లయిన తోబుట్టువులకీ పెద్దదిక్కు కావలసి రావడంతో సహజంగానే పెద్దమనిషి తరహా అబ్బింది.
* * *