Previous Page Next Page 
హృదయాంజలి పేజి 20

   
    "బ్రాహ్మడికి యాచన తప్పులేదమ్మా! జోలెపట్టి ఊళ్ళో అడుక్కు వచ్చి మీకు పెడతాను. మిమ్మల్ని ఆకలికి చంపను"

    "తిండికోసమే బ్రతికి ఉన్నామనుకొంటే ఈ కష్టాలు, అవమానాలు పడలేక ఏనాడో గుక్కెడు విషం మింగి చచ్చేవాళ్ళం. బ్రతికి ఏదైనా సాధించాలి! జయమో, అపజయమో, చచ్చేవరకు ఈ పోరాటం సాగించాలి"
 
    "ఏం సాధించావమ్మా ఇక్కడికి వచ్చి? వంద రెండొందల జీతం కోసం ప్రొద్దున లేచి తినీ తినకా పరుగులు. చీకటి పడుతూంటే పీక్కుపోయిన ముఖంతో వడలిపోయి ఇంటికి రావడం. మళ్ళీ వంటా మార్పు రాత్రికి ఏ కలత నిద్రపోతావో! సూర్యుడు మేలుకొన్న వేళకి నువ్వూ మేలుకొని మళ్ళీ పొట్ట తిప్పలుకి పరుగులు. ఈ పరుగుల్లో నీ ఆరోగ్యాన్నీ యవ్వనాన్నీ కరిగించుకొంటూంటే నువ్వు నా విస్తరిలో పెట్టే కూడు నీ రక్తంతో కలిపి పెట్టినట్టుగా ఉంటుందమ్మా! ఆ కూడు మనస్పూర్తిగా తినలేక ఏభై ఏళ్ళకే బ్రతికిన శవంలా అయ్యాను. పదమ్మా!నువ్వీ వెట్టిచాకిరీ చెయొద్దు! మన ఊరెళ్ళితే, మనఊరి రైతులు మనల్ని చంపరు. ఇంటికి పట్టెడు గింజలు పెట్టినా మన కడుపులు నిండుతాయి. తిన్నది ఒంటికి అంటితేనే నేను బాగవుతాను. నాకు కాళ్ళు లేకపోతేనేం? కూర్చొని పిల్లలకి పాఠాలు చెప్పగలను. పదో పాతికో వస్తాయి. ఎవరైనా అడిగితే తాటి ఆకులు ఇస్తారు. మన ఇల్లు గుడిసెలా కప్పుకొందాం. వెళ్ళిపోదాం పదమ్మా!"

    జీవితంలో బాగా బ్రతికి దెబ్బతిన్న తండ్రికి తను ఆడపిల్ల ఐనా కష్టపడి సంపాదించి పట్టెడన్నం పెట్టగలుగుతున్నానన్న ఆత్మతృప్తి తండ్రి గుండెలు బద్దలైనట్టుగా వెలువడిన మాటలతో నామరూపాల్లేకుండా నాశనమైపోగా అసలే గాయపడిన అపురూప విలవిల్లాడుతూ విహ్వలంగా చూసింది తండ్రికేసి.
 
    తండ్రి ఆక్రోశంలో అర్ధముంది.

    ఆయన ఒకనాడు విలక్షణంగా బ్రతికిన మనిషి.

    పాడి పంటలతో కలకలలాడే ఓ అందమైన పల్లెటూరు తమ స్వస్థలం.

    పది పన్నెండేళ్ళ క్రితం -

    అక్కడ తమకో అందమైన లోగిలి వుండేది.

    కొరత లేని సుఖశాంతులుండేవి.

    ఇప్పుడు తలుచుకొంటే ఏదో గత జన్మ స్మృతిలా అనిపిస్తూంది.
    ఆనందంగా సాగిపోతున్న నావ ఒకనాడు హఠాత్తుగా పల్టీ కొట్టింది!

    ప్రవాహంలో పడికొట్టుకుపోతూ ఎలాగో ఒడ్డుకు చేరినట్టుగా ఈ సిటీకి వచ్చి పడ్డారు. చదువుకోవాలన్న ఆశయమైతే నెరవేరింది. కాని, పిల్లలైన తాము ఎటువంటి బ్రతుకు పోరాటం సాగించారో తండ్రి సాక్షి కాబట్టే ఆయనకా హృదయవేదన.

    "అర్పిత చదువు పూర్తి అయితే అలాగే వెళ్ళిపోదాం, నాన్నగారూ! మనం ఇప్పుడు వెళ్ళిపోతే దాని చదువు అర్ధాంతరంగా ఆగిపోతుంది" ఆయన మాట కాదని ఆయన్నింకా బాధపెట్టడం ఇష్టం లేక అనునయంగా అంది అపురూప.
 
    "చదువు పూర్తిచేసి మీరుచేసే ఉద్యోగాలేమిటమ్మా? ఆ కాన్వెంటు ఉద్యోగాలేగా? వీధి వీధికో కాన్వెంటు పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చి మీ లాంటి డిగ్రీ హోల్డర్లని పెట్టి మనుషులుగా తయారు చేస్తూంది! రెండు మూడు వందల కోసం మీ రక్త మాంసాలు కరిగిస్తారు కదమ్మా?"

    నదులన్నీ సముద్రంలో చేరినట్టుగా పల్లెలో పని దొరకక కడుపు మాడిన వాళ్ళంతా పట్నాలు చేరుతున్నారు. ఇక్కడ కష్టం చేసే వాళ్ళకు పని వుంది. కాస్త కాస్త చదువున్న వాళ్ళయినా, అసలేమీ చదువుకోక పోయినా మట్టిపనో, ఫ్యాక్టరీల్లో పనో -ఏదో ఒకటి దొరుకుతుంది. ఫ్యాక్టరీల్లో పని చేసో, కాన్వెంట్లలో చదువు చెప్పో మూడొందలు తెచ్చుకొనే ఆడపిల్ల సైతం చక్కగా తయారై భుజానికి హాండ్ బాగ్ తగిలించుకొని ఏ ఆఫీసరు ఉద్యోగమో చేస్తున్నంత దర్జాగా బస్సుల్లో వెడుతుంది. వచ్చేది మూడొందలే అయినా  'నేనూ చేస్తున్నాను ఉద్యోగం! నాకూ ఉంది ఆర్ధిక స్వాతంత్ర్యం!' అన్న ఆత్మ విశ్వాసంతో బ్రతుకుతుంది. వాళ్ళు పని చేయించుకొని ఇచ్చే మూడొందలు చాలా తక్కువే కావచ్చు! వెట్టి చాకిరే కావచ్చు! కాని, ఆర్ధిక స్వాతంత్ర్యం మాత్రం కాస్త చదువు కొన్న ఆడపిల్లలకు ఈ పట్నం ఇవ్వగలుగుతుంది.

    "వదరలో కొట్టుకు పోయే వాళ్ళకు గడ్డిపోచే గొప్ప ఆధారం కద, నాన్నగారూ?"
 
    "ఆధారంగా కనిపిస్తుందేగాని నిజంగా ఆధారం కాలేదు కదమ్మా??"
 
    ఈనాడు అస్థి పంజరంలా మంచానికి అంటుకుపోయిన తండ్రి ఒకనాడు మంచి పండితుడిగా గుర్తింపు పొందిన వాడు. చక్కని పాటలు, పద్యాలతో, హరికథలతో ఊరి జనాల్ని ఎంతగానో అలరించినవాడు.
 
    ఓడలు బళ్ళు అయినట్టుగా తారుమారైన తండ్రి పరిస్థితి తలుచుకొంటే అపురూప కళ్ళలో నీళ్ళు చివ్వున ఊరుతాయి! గుండె భారమైపోతుంది.

 Previous Page Next Page