కాన్వెంటు ఉద్యోగం వెట్టి చాకిరే అనుకొంటే ఇప్పుడు కత్తిమీద సాముకూడా అనిపిస్తూంది అపురూపకు.
ఆమె పని చేస్తున్న లిటిల్ బర్డ్స్ స్కూల్ ఈ మధ్య చేతులు మారింది. ఓనరే ఆ స్కూల్ కి ప్రిన్సిపాల్ గా వచ్చాడు. అతడు యువకుడు. పి.జి. చేశాడు. ఇటీవలే పెళ్ళికూడా అయ్యింది. భార్య తెచ్చిన లక్షలకట్నం డబ్బులతోనే ఈ స్కూల్ ని కొనేశాడు. వస్తూనే అతడి కన్ను అపురూప మీద పడింది. సరదాగా ప్రేమాయణం సాగిద్దామని చూశాడు. అది సాగక పోయేసరికి అతడి కళ్ళలోని చిలిపి చూపు పులి చూపుగా మారిపోయింది. 'య'కి 'మ' కి భేదం తెలియకుండా వ్రాసే అతడు అపురూప టీచింగ్ లో పనిగట్టుకొని తప్పులు పట్టసాగాడు. రెండు నిమిషాలు లేటొచ్చినా కసురుకోవడం! ఒక్క పూట సెలవు అడిగితే ఉద్యోగంలోంచి తీసేస్తానని బెదిరించడం.
ఓ రోజు అంత పనీ చేశాడు.
"ఇదిగో! మీకు రావలసిన జీతం! రేపటినుండి మీరు రానక్కరలేదు. మీ ప్లేస్ లో నిన్ననే ట్రైన్ టీచర్ని అపాయింట్ చేసుకొన్నాం!" రావలసిన జీతం అపురూప చేతిలో పెట్టి అన్నాడు.
అపురూప ముఖం పాలిపోగా, "సార్! ఇంత అర్ధాంతరంగా...... ఉద్యోగం నుండి తీసేయడం! నేను చేసిన నేరమేమిటి?" వణికేస్వరంతో అడిగింది.
"ఒకరోజు ఇంటర్వ్యూకు వెడుతున్నానని సెలవు. ఒకరోజు ఏదో పరీక్షకి వెడుతున్నానని సెలవు. మీకు జ్వరం వచ్చిందని రెండురోజులు సెలవు! ఇంట్లో ఇంకెవరికో ఏదో అయిందని రెండురోజులు సెలవు. మీడుమ్మాలకు విసిగిపోయానండీ! ఇది ప్రైవేటు స్కూల్ అని మరచిపోయినట్టున్నారు. టీచర్స్ ఆబ్సెంట్ అయితే స్కూల్ కి ఎంత చెడ్డ పేరొస్తుందో తెలుసా?"
రెండు రోజులుగా అపురూపకి జ్వరం! నిన్నా మొన్నా సెలవు పెట్టి ఈరోజు వచ్చింది.
"నెలకు ఒకటి రెండు రోజులకంటే సెలవు పెట్టినట్టు నాకు గుర్తు లేదు. ట్రైన్డ్ టీచరు దొరికిందని నన్ను తీసేయడం మీకు భావ్యంకాదు. టీచరుగా నాకు అయిదేళ్ళ ఎక్స్ పీరియన్స్ ఉంది, సార్."
"మాకు కావాల్సింది ఎక్స్ పీరియన్స్ కాదు. సిన్సియర్ గా వర్కు చేసే వాళ్ళు కావాలి."
"నేను సిన్సియర్ గానే వర్కు చేశాను. కాని, మీకు కావలసింది అదికాదు. మీకు ప్రైవేటుగా వర్కు చేసేవాళ్ళు కావాలి. మీ బుర్రలో పుట్టిన విషప్పురుగు పని ఇది. మోహపూరితంగా చూసే మీ చూపులకు నేను జవాబివ్వడం లేదు. వారం రోజుల క్రితం మీరు హోటల్ కి పిలిచారు. నేను సై అనలేదు. అదీ అసలు కారణం"
"షటప్! నిన్ను తీసేశానన్న కసితో ఏదేదో పేలుతున్నావు. బోడి! నిన్నెవరు కోరారే?"
"మాటలు జాగ్రత్తగా రానీ! బోడీ గీడీ అన్నావంటే చెప్పిడిచి కొడతాను! స్కూలు పెట్టి నలుగురికి ఉద్యోగాలిచ్చినంత మాత్రాన నువ్వేం రారాజువి కాలేవు. నీ స్కూల్లో పనిచేసే పంతులమ్మలంతా నీకు ఉంపుడు గత్తెలుకారు."
"పెళ్ళి పెటాకులులేని నీలాంటి కన్యామణులంతా తమవెంట మగవాళ్ళంతా పడుతున్నారని భ్రాంతి పడతారు. అది నీ తప్పుకాని, నా తప్పు కాదు. ఇంట్లో నాకు రంభలాంటి భార్య ఉండగా నీకోసం అర్రులు చాచాల్సిన ఖర్మేం పట్టలేదు నాకు"
"ఇంట్లో రంభలాంటి భార్యున్నా రుచులకోసం అర్రులుచాచే నీచబుద్దిరా నీది! ఇన్నాళ్ళు నీ దగ్గర నేను పనిచేశానంటే నా దరిద్రంచేయించింది. నువ్వు తీసేయడం నా మంచికేనని ఇప్పుడనుకొంటున్నాను. నీ పంజానుండి విముక్తి దొరికింది" విసవిసా బయటికి నడిచి బస్ స్టాప్ కేసి నడిచింది అపురూప.
భవిష్యత్తు పెద్ద భూతంలా ఎదురు నిలబడ్డట్టుగా అయింది. మళ్ళీ ఉద్యోగం కోసం ఎంతమంది చుట్టు తిరగాలో ఎన్ని రోజులు ఖాళీగా వుండాల్సి వస్తుందో! పది పన్నెండు గురిదాకా పిల్లలు సాయంత్రం ట్యూషన్ కి వచ్చేవాళ్ళు స్కూలు పిల్లలే. స్కూల్లో ఉద్యోగం పోవడంతో ఆ ట్యూషన్లు పోయినట్టే, తమ స్కూల్లో క్లాసు తీసుకునే టీచర్ల దగ్గరే ఆ పిల్లలు చదువుతారు. పరీక్షల్లో బాగా మార్కులు పడతాయన్న ఆశ వాళ్ళని అలా చదివిస్తుంది.
ఉద్యోగం పోయింది! ట్యూషన్లూ పోయినట్టే!
ఉద్యోగం పోగొట్టుకుని ఇంటికి వెళ్ళాలంటే మనసులో ఏమిటో అపరాధభావం నిండిపోతూంది. నిరుద్యోగమన్న కనిపించని గుదిబండ మెడకు పడ్డట్టుగా మహా ఇబ్బందిగా ఉంది. ఉద్యోగం వూడిపోయిందని ఇంట్లో చెప్పకముందే తనో ఉద్యోగం సంపాదించుకోగలిగితే బావుణ్ను! అది ఎంత చిన్నదైనా సరే! ఉద్యోగమన్న పేరు పెట్టగలిగితేచాలు!
ప్రక్కన సిమెంటు బెంచీమీద ఒక ముసలాయన పేపర్ చదువుతున్నాడు.
బస్సుకోసం చూడడం విసుగనిపించి కొద్దిగా మెడ వంచి పేపరు లోకి దృష్టి సారించింది అపురూప.
"కన్న కూతురిని కామించిన ఓ కామాంధుడు!
"చితిలో ఓ సీత!"
"రెండు బస్సులకు నక్సల్స్ నిప్పు"
హెడ్ లైన్స్ మీద ఆమె చూపులు పరుగుతీస్తూ ఒకచోట టక్కున ఆగిపోయాయి.