"ఆయనకు చేతనయిన విద్య ఇదొక్కటే! ఇంతకంటే ఇంకేం చేయగలరు నన్ను? ఇది కూడా నేనెందుకు ఉపేక్షిస్తున్నానో అర్ధం చేసుకోవడంలేదు. తల్చుకుంటే జైలు కెళ్ళేలా చేయగలను....." బాధను ఓర్చుకుంటూ అంది ఆమె.
నాగమణి తండ్రి ఆ గొడవకు ఆదుర్దాగా బయటనుంచి లోపలికొచ్చాడు.
"వెళ్ళు! ఇంక చూస్తావెందుకు? అలా బెదిరిస్తే భయపడి బ్రతిమాల్తాననుకుంటున్నావేమో! ఆ రోజులికపోయాయి. దేనికయినా కొన్ని హద్దులుంటాయి. నువ్వా హద్దులేనాడో దాటావ్...." ఆమె మాట్లాడకుండాలోపలికెళ్ళి సిద్దంగా ఉన్న సూట్ కేస్ తీసుకుని బయటకొచ్చింది.
"ఏమిటినాయనా ఇది! ఏదో మాటామాటా అనుకున్నంత మాత్రాన ఇలా తెగతెంపులు చేసుకోవడమే! చూడమ్మా! నువ్వుకూడా ఇలా తొందరపడితే ఎలా? ఆడదన్నతరువాత ఎలాగోలా సర్దుకుపోవాలి"
ఆమె ఏమీ మాట్లాడకుండా గేటు దగ్గరకు నడిచిరిక్షాకోసం చూడసాగింది.
నాగమణి ఆమె దగ్గరకు పరుగెత్తింది. "అక్కా! నువ్వు తొందరపడుతున్నావక్కా!" అంది ఆదుర్దాగా.
"కాదమ్మా! ఆలస్యం చేస్తున్నాను! ఈ పని ఎప్పుడో చేయవలసింది. కానీ కొంతవరకయినా అతనికి బుద్ది చెప్పాలని, పశుబలంతో ఆడదాన్ని గెలవడం కష్టసాధ్యమని తెలియజేయాలనీ ఆగాను", ఖాళీగా వున్న రిక్షా వచ్చి ఆగిందక్కక. ఎక్కి కూర్చుంది హేమ. "బస్ స్టాండ్ కి పోనీ!"
"అక్కా నా మాట వినవూ?" బ్రతిమాలుతున్న ధోరణిలో అందినాగమణి.
"నువ్వు చదువుకున్నదానివి నాగమణి! అమ్మమ్మల కాలంనుంచీ బయటకురా! 'మగడు మహారాజు' అనే బూజుపట్టినమాట మర్చిపో! స్వతంత్రంగా ఆలోచించు! ఇన్ని యుగాలుగా మన స్త్రీలు అనుభవిస్తున్న బానిస బ్రతుకుని నువ్వు కూడా ఎదుర్కోవడానికి సంసిద్దమవ్వు! అంతేగాని నాకు నీతి పాఠాలు చెప్పకు! నా విషయం నేను శ్రద్దతీసుకోగలను!" కోపంగా అంది ఆమె.
రిక్షా ముందుకు సాగిపోయింది. నాగమణి తెల్లబోయిచూస్తూండిపోయింది రిక్షా వేపు. ఆమె కెందుకో గిల్టీగా వుంది. తనవల్లే వారిద్దరూ విడిపోయారేమో అనిపిస్తోంది. లోపలికొచ్చి సోఫాలో కూర్చుండి పోయిందామె ఆలోచిస్తూ.
శ్రీనివాసరావ్ అక్కడికొచ్చి లైటు వెలిగించాడు. అతను జరిగిందేమీ గుర్తులేనట్లు ఆమెను పలకరించాడు. "ఏమిటిక్కడ కూర్చున్నావ్? పద! అలా డాబామీద కూర్చుందాం మంచి గాలి వీస్తుంది" అన్నాడు.
నాగమణి అతన్ని అనుసరించింది. అప్పటికే వెన్నెల అలుముకుంది. ఇద్దరూ మధ్యలో ఉన్న చాపమీద కూర్చున్నారు.
"ఏమిటి నాగమణి ఆలోచిస్తున్నావ్?" అడిగాడతను నవ్వుతూ.
"అక్కవెళ్ళిపోయినందుకు నీకేమీ బాధగా లేదాబావా?" అడిగింది నాగమణి. "బాధా?" నవ్వాడతను. "ఎంతో ఆనందంగా వుంది"
నాగమణికేం మాట్లాడాలో తోచలేదు.
"చూస్తూండు నాగమణీ! కొద్దిరోజులు గడువిస్తాను దానికి. అప్పటికీ దాని పొగరు తగ్గి కాళ్ళబేరానికి రాకపోతే విడాకులిచ్చి పారేస్తాను" కఠినంగా అన్నాడతను.
"మీఇద్దరూ తొందరపాటు మనుషులే బావా" నెమ్మదిగా అందామె.
"అవును! నీ కలాగే కనిపిస్తుంది నిజానికి నేనెంత ఓర్పు చూపించానో, ఎప్పటికప్పుడు అదే తన తప్పు తెలుసుకొని ప్రవర్తనమార్చుకుంటుందని ఎదురుచూస్తూ వచ్చానోనీకు తెలీదు నాగమణీ!"
చాలాసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు.
"మేము రేపు ఉదయమే వెళ్ళిపోతున్నాంబావా?" అంది ఆమె లేచినిలబడుతూ. "అంతతొందరేమిటి? మరో రెండ్రోజులుండండి!"
"ఎందుకు ఉద్యోగం వస్తే ఎలాగూ ఇక్కడ వుండాల్సిందేకదా" నవ్వుతూ అందామె. "సరే నీ ఇష్టం?" ఇద్దరూ కిందకుదిగసాగారు. మరునాడు ఉదయమే నాగమణి, ఆమె తండ్రి వెళ్ళిపోయారు.
హేమ హఠాత్తుగా ఉత్తరంకూడా లేకుండా వచ్చేసరికి ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఏదయినా గొడవ జరిగిందేమోనని అనుమానం కూడా కలగకపోలేదువారికి.
"ఇంత సడెన్ గా వచ్చేశావేమిటి?" అడిగాడు రామరాజు."
అవును డాడీ! అక్కడ వుండాలనిపించలేదు! అందుకే వచ్చేశాను......రిక్షా వాడికి డబ్బులిచ్చిపంపించివేస్తూ అందామె.
"ఏం జరిగిందమ్మా?" ఆదుర్దాగా అడిగాడతను. ఆమె వెనకే ఇంట్లోకి నడుస్తూ.
తర్వాత చెప్తాన్లే డాడీ! ఇది ఈ ఒక్కరోజు కథకాదు. పెళ్ళయిన మర్నాడినుంచే మొదలయింది."
రామరాజు ఇంకేమీ మాట్లాడలేదు. ఆమె స్థిమిత పడ్డాక అన్ని విషయాలూ తెలుసుకోవచ్చని వూరుకున్నాడు. సౌభాగ్యమ్మ కూడా అసలా విషయమే మాట్లాడలేదు. హేమ ఏం చేసినా ఆలోచించే చేస్తుందని ఆమె నమ్మకం.
మధ్యాహ్నం భోజనం చేసి విప్లవ నారీసమితి ఆఫీసుకి బయల్దేరిందామె. తీరా అక్కడికి చేరుకునేసరికి ఆఫీసుకి తాళం వుంది. ఉషాదేవి విప్లవ నారీసమితి నుంచి రాజీనామా చేసిందట. అందులో రాజకీయాలు ప్రవేశించినయ్. ఎమ్మెల్యేగారి భార్యదానికి సెక్రటరీ! ఆమె సెక్రటరీ అయాక ఆ సమితి కార్యక్రమాలు కూడా మారిపోయినయ్. అదివరలా ఇప్పుడు స్త్రీల హక్కులకోసం పోరాడడమే ఏకైక లక్ష్యంకాదు. మరెన్నో సహాయకార్యక్రమాలు చేపట్టాలన్నఉద్దేశంతో వాటికినిధులు సమకూర్చడంకోసం చందాలకి బయల్దేరడం కూడా ప్రారంభమయింది.
ఇది కొంత నిరుత్సాహం కలుగజేసింది హేమకు. తను పూర్తిగా సమితి కార్యక్రమాల్లో మునిగిపోవాలనీ, వీలయినన్ని రోజులు ఎలాంటి ఆలోచనలూ లేకుండా ప్రశాంతంగా తన ఆశయాలను సాధించుకోడానికి వినియోగించుకోవాలనీ ఆశించింది ఆమె.
కొద్దిరోజుల పాటు ఎక్కడయినా టూర్ వేస్తే బావుండుననిపించిందామెకి తన స్నేహితురాలు వసుంధరనూ, బావ సుధీర్ నూ కూడా ఓసారి చూడాలనిపిస్తోంది. సుధీర్ కి కొద్ది నెలలక్రితమే వివాహం అయింది. ఆ అమ్మాయిది మద్రాసు! పెళ్ళి అక్కడే జరిగింది. అప్పటికే తనకూ, శ్రీనివాసరావుకీ గొడవలు జరుగుతూండడంవల్ల ఆ వివాహానికి వెళ్ళడం పడలేదు.
సుధీర్ అంటే నిజానికి తనకసలుకోపమే లేదు. అతను మనసులో వున్న విషయాలు స్పష్టంగా చెప్పాడు. శ్రీనివాసరావులాంటి కుటిలుడు కాడతను. అందుకే శ్రీనివాసరావు నిజస్వరూపం గమనించాక సుధీర్ మీద అభిమానం మరింత పెరిగింది. నెమ్మదిగా ఆమె శ్రీనివాసరావు ప్రవర్తన అంతా తల్లిదండ్రులకు వివరంగా చెప్పేసింది.
రామరాజుకి శ్రీనివాసరావు మీద విపరీతమయిన కోపం కలిగింది. అన్ని రోజులు అతని దుశ్చర్యలను సహించినందుకు హేమనే నిందించాడతను.
"ప్రేమించాననీ, నిన్నే పెళ్ళి చేసుకుంటాననీ చేప్పి బ్రతిమాలి చేసుకున్న తరువాత ఇదా వాడు చేసేపని! అసలింకవాడి దగ్గర కెళ్ళవద్దు. నిన్ను పోషించుకోవడం నాకేం కష్టంకాదు! నాకు మాత్రం ఎవరున్నారని ఇంకా! ఉన్నకొద్దిపాటి ఆస్థి నీజీవితం గడిచిపోడానికి చాలు? కావాలంటే ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దువుగాని-మరో ఆలోచన లేకుండా ఉంటుంది...."అన్నాడు రామరాజు. సౌభాగ్యమ్మ కూడా హేమను పూర్తిగా బలపరిచింది. "ఆ విషయమే మేము చూసుకుంటాము. ఇంక నువ్వేమీ మనసులో పెట్టుకోకు!" అందామె తల్లడిల్లిపోతూ.
అప్పుడే ఓ స్త్రీల మాస పత్రిక నవలల పోటీ ప్రకటించడం చూసింది హేమ. ఆ పోటీకి నవలరాయాలని నిశ్చయించుకుందామె. కానీ అందుకు తగ్గ కథేమీ తట్టటం లేదు. ఆలోచించి ఆలోచించి చివరకు శ్రీనివాసరావుపాత్రనే తీసుకుని, అది మరింత క్రూరంగా చిత్రించి- ఈనాటిసమాజంలో కూడా మగాడు స్త్రీ విషయంలో జరుపుతున్న దౌర్జన్యం, అరాచకం అందరికీచూపి, కొంతయినా చైతన్యంస్త్రీలలో కలిగించాలని నిశ్చయించుకుంది ఆమె.
అనుకున్న మరుక్షణంనుంచే పట్టుదలతో రాయడం ప్రారంభించిందామె. శ్రీనివాసరావుని దృష్టిలో పెట్టుకురాయడంతో సులభంగానే రాయగలుగుతోంది ఆమె. తన మనసులో ఏనాటినుంచో పేరుకుంటున్న ఆలోచనలన్నీ కాగితం మీద పెట్టడమే తను చేస్తున్నపని! అందువల్ల కథగమనానికి ఏమయినా ఇబ్బందికలుగుతుందేమో, అని అనుమానం కలిగినా అదెలా అధిగమించాలో తెలీలేదామెకి. నెల రోజులపాటురాత్రింబవళ్ళు శ్రమపడి నవలపూర్తి చేసిందామె. అదంతా మళ్ళీ ఫెయిర్ చేయడానికి మరి కొన్ని రోజులుపట్టింది.
దానినిపోటీకి పంపించాక ఎంతోఘనవిజయం సాధించినంత ఆనంద కలిగిందామెకి. నవల రాశానన్నసంతోషమే కాదు. తనమనసులోని భావాలు ఎంతోమందికి తెలిసేందుకు అది అవకాశం కల్పిస్తుందన్నవిషయం ఆమెకు ఎంతో సంతృప్తికలిగించింది. ఆ నవల ప్రచురించబడితే అది చదివిన స్త్రీ పురుషులందరిలోనూ ఎంతో కొంత సంచలనంతప్పక కలిగి తీరుతుందని నమ్మకం ఏర్పడింది. ఆ రోజు రాత్రి తెల్లార్లూ ఆ నవల గురించి ఆలోచిస్తూనే గడిపివేసింది హేమ. తెల్లారుతుండగా నిద్ర పట్టిందామెకి.
తిరిగి మెలకువ వచ్చేసరికి టైము పదయిపోయింది. అప్పటివరకూ ఆమెనిద్ర లేవకపోవడం గమనించి సౌభాగ్యమ్మే ఆమెను మేల్కొలిపింది. లేచి ముఖం కడుక్కుంటూండగా ఆమెకుకళ్ళు తిరిగినట్లనిపించి దబ్బున గోడకానుకుని నిలబడిపోయింది. కొద్దిసేపటికి తిరిగి మామూలు మనిషి కాలేకపోయింది. త్వరత్వరగా మొఖం కడుక్కుని గదిలోకి నడిచిమంచంమీద కూర్చుండిపోయిందామె.
"ఏమిటలావున్నావ్?" అడిగింది సౌభాగ్యమ్మ.
"బాత్ రూమ్ లో మొఖం కడుక్కుంటోంటే కళ్ళు తిరిగాయమ్మా. ఎప్పుడూ అలా లేదింతవరకూ..." భయంగా చెప్పిందామె.
సౌభాగ్యమ్మకు అనుమానం వచ్చేసింది. "అలాగయితే మనం డాక్టరు దగ్గరకెళ్ళి వద్దాం పద! త్వరగా రడీ అవ్! అంది హడావుడిగా.
"ఈమాత్రం దానికి డాక్టరు దగ్గరకెందుకమ్మా!" తల్లి హడావుడికి నవ్వుతూ అంది హేమ.
కానీ సౌభాగ్యమ్మ వినిపించుకోలేదు. మరి కాసేపు తర్వాత ఇద్దరూ డాక్టరు దగ్గరకు చేరుకున్నారు.