హేమ ఆశ్చర్యంగా ఆమె మాటలు వింటూండిపోయింది. సాయంత్రం శ్రీనివాసరావు రాగానే అతనికి 'టీ' అందించింది నాగమణి ఆ తరువాత స్నానానికి నీళ్ళు తోడి అతనిని స్నానానికి పిలిచింది. ఆమెకు తనంటే ఇంకా అంత అభిమానం, గౌరవం ఉన్నందుకు ఆశ్చర్యపోయాడతను. అసలు అయే మనసులో తనంటే ఓ విధమైన వ్యతిరేకభావం ఏర్పడిఉంటుందని ఊహించాడు తను. కానీ ఆమె తన ఆలోచనలకు విరుద్దంగా ప్రవర్తిస్తోంది.
"ఒకవేళ ఉద్యోగం వస్తే కొద్దిరోజులు మీ ఇంటిలోనే ఉంటాను బావా! ఆ తరువాత ఇక్కడెక్కడో లేడీస్ హాస్టల్ ఒకటి ఉందట! అందులో చేరతాను...." అంది శ్రీనివాసరావుతో. "ఎందుకూ అక్కడ చేరడం! మాఇల్లు పెద్దదేగా! ఇక్కడే ఉండవచ్చు" అన్నాడతను.
"నేనూ అదే అనుకుంటున్నాను బాబూ! అసలు దీనికీ ఖర్మ పడుతుందని నేనెప్పుడయినా అనుకున్నానా? వరుసగా అయిదేళ్ళనుంచీ అన్నీ దెబ్బలే తగులుతున్నాయి. అంచేత పెళ్ళిచేసి ఓ ఇంటికి పంపించాలన్న కోరిక అలానే ఉండిపోయింది. ఇక్కడ నువ్వున్నావన్న ఆశతోనే ఈ ఉద్యోగ ప్రయత్నాలకు ఒప్పుకున్నాను! లేకపోతే మా ఇళ్ళల్లో ఎవరయినా ఉద్యోగాలు చేశామా ఏనాడైనా?" బాధగా అన్నాడు ఆమె తండ్రి.
"అందులో మీరింత కృంగిపోవలసినవిషయమేముంది లెండి! ఒకవేళ ఉద్యోగం వస్తే నాగమణి మా ఇంటిలోనే ఉంటుంది" ధీమాగా అన్నాడు శ్రీనివాసరావ్. మర్నాడు తను సెలవుబెట్టి ఆమెను ఇంటర్ వ్యూ జరిగే చోటకి తీసుకెళ్ళాడు శ్రీనివాసరావ్. ఆ రెండురోజులూ మరింత తీరిక లభించింది హేమకు. అటు శ్రీనివాసరావుకి కావలసిన సదుపాయాలన్నీ సమకూర్చడంలోనూ, ఇటు ఆమెకు వంటపనిలో సహాయం చేయడంలోనూ నాగమణి చొరవతీసుకుంది.
ఆమెను చూస్తోంటే శ్రీనివాసరావ్ కి ఆశ్చర్యంగా ఉంది. ఆమె వేషభాషల్లో అంత ఆధునికంగా లేదుగాని ఇటు ఉద్యోగానికి సిద్దపడి అటు ఇంటిలోపనులేకాకుండా తనను కాలుకింద పెట్టనీకుండా అన్నీ సమకూరుస్తూ మసలడం ముచ్చట గొలుపుతోంది. ఇలాంటి నాగమణిని తనెందుకు నిర్లక్ష్యం చేశాడు?' చదువులేనిది' అని తొందరపడి ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు? ఆమెను కాదు పొమ్మని తను చేసిన నిర్వాకమేమిటి? పైపై మెరుగులకు ఆకర్షింపబడి హేమలాంటి మూర్ఖురాలిని వివాహంచేసుకున్నాడు. అందుకు శిక్ష అనుభవిస్తూనే ఉంటాడు.
ఆమెకు ఇంటర్ వ్యూ ముగిసేవరకూ బయటే కూర్చున్నాడు శ్రీనివాసరావ్. "ఎలా వుంది ఇంటర్ వ్యూ?" అడిగాడామె బయటకు రాగానే. "ఏమీలేదు. నేనెవరు? నాకీ ఉద్యోగం ఎందుకూ, ఇంతకు ముందు ఎక్కడయినా ఉద్యోగానికి అప్లయ్ చేశావా అన్నీ ఇలాంటివే అడిగారు. అంతే!" "అంటే ఉద్యోగం దొరకవచ్చా?"
"ఏమో రికమండేషన్ లేనివాళ్ళనియిలాగే ఏదో ఒకటి అడిగి త్వరగా బయటకు తోలేస్తారని మా ఫ్రెండ్ ఒకమ్మాయి చెప్పింది....." నవ్వుతూ అందామె.
"పదా అలా హోటల్లో కాఫీ తీసుకుని వెళదాం" దగ్గరలోనే వున్న హోటల్ వేపు నడుస్తూ అన్నాడతను. మౌనంగా అతన్ననుసరించింది నాగమణి.
ఇద్దరూ హోటల్వేపు కెళ్ళి కూర్చున్నారు. పలహారంచేసి కాఫీ తాగసాగారు. నిశ్శబ్దంగా కూర్చున్న నాగమణివంకేతదేకంగా చూడసాగాడు శ్రీనివాసరావ్. నాగమణి హేమకంటే కూడా ఆకర్షణీయంగా ఉన్నట్లనిపించసాగిందతనికి.
"నాగమణీ?" నెమ్మదిగా పిలిచాడతను.
"ఏమిటి బావా?"
"నేను చాలా పెద్ద తప్పు చేశాను."
ఆమె ఆశ్చర్యంగా అతనివేపు చూసింది. "ఏమిటి బావా అది?"
అతను ఓ క్షణం ఆమె వంక చూసి నెమ్మదిగా అన్నాడు "నిన్ను కాదని హేమను పెళ్ళి చేసుకోవడం!"
నాగమణి కలవరపాటుతో అతనివేపు చూసింది. ఆ మాట అతను నిజంగానే అంటే అంత తీయని మాట మరింక జన్మలో వినబోదు తను! ఇది మాత్రం నిజం!
"నేను ఆనందపడాలని ఆ మాట అంటున్నావు కదూ బావా?" చిరునవ్వుతో అడిగిందామె.
"ఊహు! కాదు నాగమణీ! మనస్ఫూర్తిగానే చెపుతున్నాను".
"కాని బావా! అక్క చాలా మంచిదనే అనిపిస్తోంది నాకు. మరి నువ్వు ఎందుకలా ఆలోచిస్తున్నావో తెలీదు"
"అలాగే కనబడుతుంది! అక్కడే నేను మోసపోయిందికూడా!"
కొద్దిసేపు ఇద్దరూ మాటల్లేకుండా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు గడిపారు. ఇప్పుడే హేమతో తను జరిపిన సంభాషణగుర్తుకి తెచ్చుకుంటోంది నాగమణి జాగ్రత్తగా ఆలోచిస్తే వివాహంవారిరువురికీ కూడా అశాంతినే గలిగిస్తోందని తెలిసిపోతోంది.
ఏదేమయినా బావా ఇప్పుడు ఏం తెలుసుకుని మాత్రం ఏంలాభం? జరిగినదానిని సరిదిద్దేఅవకాశం లేదు కదా! ఇద్దరూ ఇంటికి చేరుకునేసరికి సాయంత్రమయిపోయింది. హేమగదిలో కూర్చొని ఏదో సీరియస్ గా రాసుకోవడం గమనించి ఆశ్చర్యపోయింది నాగమణి. "ఏమిటక్కా రాస్తున్నావ్?" దగ్గరకెళ్ళి కాగితం వేపు చూస్తూ అడిగింది నాగమణి.
ఆమె చిన్నగా నవ్వింది "కథ రాస్తున్నాను".
"నువ్వు కథలు రాస్తావా అక్కా?" ఆశ్చర్యపోతూ అడిగింది.
"ఆఆ! రాస్తుందిలే! మనపక్కింటివాళ్ళకథ, మనకథా.....అన్నీ ఇవే రాస్తుంది. ఎప్పుడో రోజు చెంపదెబ్బలుకూడా తింటుంది....." అని హేళన చేస్తూ అన్నాడు శ్రీనివాసరావ్.
"అవును! నా రాతలు ఎవరికి చురుక్కుమంటేవారికే అనిపిస్తుందలా" కోపం అణచుకుంటూ అంది ఆమె.
"అసలీరాతలెవరికో తెలుసా నాగమణీ? చదువూ సంధ్యాలేని వారికి, ఆలోచించడం చేతకాని ఇలాంటి రకాలే ఆ పిచ్చిరాతలు రాసేది" ఆమెను మరింత అవమానపరచాలన్న ఉద్దేశ్యంతో అన్నాడతను.
"నా గురించి మీరేమీ ఆక్షేపించనక్కరలేదు. నా విధులేమిటో, బాధ్యత లేమిటో నాకు బాగా తెలుసు...." శాంతంగానే అంది ఆమె.
నాగమణికి వారిద్దరూ తన ఎదురుగ్గా అలా కీచులాడుకోవడం ఇబ్బందికరంగా వుంది.
"ఆ! చాలా బాగా తెలుసు. ఇదిగో, ఈ నాగమణిని చూసయినా బుద్దితెచ్చుకో! ఇంట్లో మగాడినెలా చూడాలోకాపరానికొచ్చి ఇంతకాలమయింది. ఏనాడయినా నాగమణిలా నాకు సహాయం చేయగలిగావా? ఆమెలా అన్నీ వేళకుసమకూర్చగలిగేవా?"
"మీకు కావలసింది భార్య అనుకుని వివాహం చేసుకున్నాను కానీ మీక్కావలసింది నిజానికి పనిమనిషి అనుకుని ఉంటే నాగమణినే చేసుకోమని సలహా ఇచ్చేదానిని!" తనూ అతని మాటలకు తగ్గట్టుగానే జవాబు చెప్పిందామె.
నాగమణికి ఆమె మాటలు బాధకలిగించినయ్. కానీ ఆ పరిస్థితిలో తను మాట్లాడటం సమంజసంకాదనిపించింది.
"నాగమణిని పనిమనిషి అంటావా? కానీ ఆమె పక్కన నిలబడేందుకు కూడా అర్హత లేదునీకు. అంత తేడా వుంది మీ ఇద్దరకూ".
"అది మీ దృష్టి లోపం...." నాగమణి ముందు హేమ అలా బరితెగించిమాట్లాడడం తనను అంతగా అవమానపర్చడం భరించలేకపోయాడు శ్రీనివాసరావ్.
ఆమె పొగరు మోతు తనాన్ని సహించి ఊరుకుంటే నాగమణి ముందు తన చులకన అయిపోవడం ఖాయం.
"ఇంక నోరు మూరుకుని పో ఇక్కడినుంచి. నీ మొఖం చూడటమే అసహ్యం" కోపంగా అన్నాడతను.
"మీతో మాట్లాడడం నాకూ అసహ్యమే. నేను పోతానంటే బ్రతిమాలి ఆపడం ఎందుకూ మళ్ళీ ఈ అర్ధంలేని మాటలెందుకూ?" ఏ మాత్రం చలించకుండా అంది ఆమె.
నాగమణి భయపడిపోయింది. వీరిద్దరి నడుమాసంబంధాలు ఇంతగాచెడిపోయాయని తనకు తెలీదు. అయినా హేమ ఆడదయిఉండి అలా భర్తను ఎంతేసి మాటలంటోందో? ఆమెకెంత ధైర్యం? ఇదే తమ పల్లెటూళ్ళల్లో అయితే ఆమెను సజీవసమాధిచేసేస్తారు.
తమ ఊళ్ళో బాగా ధనవంతులయిన రామచంద్రయ్యగారి కోడలు గతేమయింది? ఇలాగే భర్తకూ అత్తమామలకూ ఎదురు తిరిగి పుట్టింటికి పారిపోయింది. ఇరుపక్షాల వారికీ పట్టుదలలు పెరిగిపోయినయ్. ఆమె విడాకుల కోసం అర్జీ పెట్టింది అలా జరిగితే తమపరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోతాయని భయపడి వెంటనే వెళ్ళి తమది తప్పయిపోయిందని బ్రతిమాలి ఆమెను మళ్ళీ ఇంటికి తీసుకువచ్చారు. కొద్దిరోజులు తర్వాత ఆమెను ఓ రాత్రిపూట చంపేసి తమ తోటల్లో ఎక్కడో పాతి పెట్టి కనిపించడంలేదని ఉదయం పోలీసు రిపోర్టిచ్చారు. ఆమె తల్లిదండ్రులు ఇందులో ఏదో మోసం ఉందని ఎంత గొడవ చేసినా ప్రయోజనం ఏముంది?
శ్రీనివాసరావ్ కి హేమమాటలు మరింత అవమానకరంగా తోచినయ్ తన అసమర్థతనువేలెత్తి చూపుతోందామె. ఇంక తను ఉపేక్షించడం అనవసరం. ఆమె కొద్దిరోజులు పుట్టింట్లో ఉంటే తనకూ ప్రశాంతంగానే ఉంటుంది. ఎలాగూ తననుకాదని వెళుతోంది కనుక తగిన శాస్తి చేసిపంపుతేనే బావుంటుంది.
"నాతో మాట్లాడడం అసహ్యమా? నా మాటలు అర్ధంలేనివా? ఊరుకొంటూంటే నోటికొచ్చినట్లు కూస్తున్నావ్! ఇడియట్! వెళ్ళు- ఇప్పుడే పో మీ ఇంటికి! వెళ్ళవే" ఆమె దగ్గరకు నడిచిబలంగా గడపవేపు తోశాడతను.
ఆ వేగానికి తూలి గడపమీద పడింది హేమ. "అమ్మా!" అంది బాధతో నడుముపట్టుకుంటూ.
నాగమణి పరుగుతో ఆమె దగ్గరకు చేరుకుంది.
"ఏమిటి బావా అది! వెనుక ముందూ చూచుకోనవసరంలేదూ!" హేమను లేవనెత్తడానికి సహాయం చేస్తూ అంది నాగమణి.