Previous Page Next Page 
బొమ్మా - బొరుసూ పేజి 23

   
    డాక్టరు హేమను పరీక్షించి వెంటనే తేల్చివేసింది. "తల్లికాబోతున్నావ్!" అంది నవ్వేస్తూ. హేమ మొఖం పాలిపోయింది. తను తల్లికాబోతూందా! ఇంత త్వరగానా? ఛీ! ఇంత చదువూ చదివింది ఎంత తెలివితక్కువగా ప్రవర్తించిందితను? కనీసం అయిదేళ్ళవరకయినా పిల్లలు కలగకూడదని తన ఉద్దేశ్యం. కానీ సరయిన జాగ్రత్తలు తీసుకోకపోయేసరికి ఇప్పుడుకొంపమీద కొచ్చింది. ఇప్పుడెలా? ఏమిటిచేయడం? ఇంతత్వరగా, అందులో ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో తల్లి అవడం తనకేమాత్రం ఇష్టంలేదు.
    "డాక్టరుగారూ! నెమ్మదిగా మాట్లాడింది హేమ.
    "ఏమిటి?" అడిగింది డాక్టరు.
    "ఇప్పుడే తల్లినవడంనాకిష్టం లేదు!"
    "ఆ విషయం తల్లి అయాక అనుకొని ఏం లాభం?"
    "దయచేసినాకు సహాయం చేయండి! నాకు ఈ వార్త ఆనందానికి బదులు విచారం కలుగజేస్తోంది!"
    "ఏం చేయమంటావ్?"
    "అబార్షన్ చేసేయండి!"
    "సారీ! అది నావల్లకాదు!" ఖండితంగా చెప్పిందామె. హేమ దీనంగా ఆమెవేపు చూసింది.
    "చూడమ్మా? నీకు పెళ్ళయి చాలారోజులయింది. ఇదేమొదటి గర్భం! ఏ కాంప్లికేషనూ ఉండదు. మొదట పుట్టినపాపలు ఎంతో తెలివిగలవాళ్ళవుతారని అంటారు. అలాంటప్పుడు నువ్వు ఎందుకింత అప్సెట్ అవుతున్నావో నాకు తెలీదు. కావాలంటేమరో పాప వెంటనే కలుగకుండా ఫామిలీ ప్లానింగ్ పద్దతులు అబ్జర్వ్ చేయండి! అంతేగాని మరెక్కడా అబార్షన్ కి ప్రయత్నించకండి!" సలహా యిచ్చిందామె.     హేమ ఇంక మాట్లాడలేకపోయింది.
    తల్లితోపాటు యింటికి చేరుకుందామె. తనుగర్భవతి కావడం తన కెంత అసంతృప్తి కలిగించిన తనతల్లిదండ్రులిద్దరికీ ఎంతో అనందాన్ని కలిగించిందన్న విషయం ఆమెకు తెలిసిపోయింది. వారిద్దరూ కూడా అబార్షన్ కి వ్యతిరేకత చూపారు.
    "నీకేం పదిమంది పిల్లలున్నారా ఇప్పుడే అలాంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకోడానికి?" కోప్పడింది తల్లి.
    "అదికాదమ్మా! ఓ పక్క నా సంసారంగతి అలా అఘోరించింది. ఇప్పుడే ఈ బరువు కూడానెత్తినెందుకు పెట్టుకోవడం?"
    "మరేం ఫరవాలేదు! ఇందులో మునిగిపోయిందేమీ లేదు. అయినా ఇప్పుడు నీ సంసారానికేం ముప్పువాటిల్లిందనీ? తగవులు, అభిప్రాయతేడాలూ ప్రతిఇంట్లోనూ ఉంటాయ్. అంతమాత్రాన భయపడితే ఎలా?" అందామె. హేమ ఇంక మాట్లాడలేకపోయింది. ఇదింక తనకితప్పదు. తొమ్మిదినెలలూ మోసి కనాల్సిందే. ఆ విషయం శ్రీనివాసరావుకి తెలియనీయదల్చుకోలేదామె.
    అలాంటి మూర్ఖుడి బిడ్డ తన కడుపులో ప్రాణంపోసుకోవడం తన దురదృష్టం! ఒకవేళ అతనితో సంబంధాలు త్రెంచుకున్నా అతని చిహ్నం మాత్రం మిగిలిపోతుంది. ఆలోచించి ఆలోచించి మనసంతా అశాంతిగా తయారయిందామెకి. ఆ ఆలోచనలనుండి తప్పించుకోడానికి తిరిగి రచనా వ్యాసంగంవేపు దృష్టి మళ్ళించిందామె. ఇప్పుడు అదివరలా కథ రాయడం కష్టమనిపించడంలేదు. ఎంతో తేలికగా వుంది. నెలరోజుల్లో నాలుగు కథలు పూర్తిచేయగలిగిందామె. వాటనన్నిటినీ వివిధ పత్రికలకూ పంపించింది.
    హేమ వెళ్ళిన వారం పదిరోజులవరకూ మామూలుగానే గడిచిపోయింది శ్రీనివాసరావుకి. హోటల్ భోజనం, స్నేహితుల ఇళ్ళల్లో కాలక్షేపం ఎంతో బావుందతనికి. బహుశా తనే బ్రతిమాలి ఆమెను ఇక్కడకు తీసుకొస్తాడనుకుంటోందేమో! తనకంత ఖర్మేమీ పట్టలేదు. పెళ్ళాంలేకపోతే ప్రపంచమేలేదన్నట్లు ప్రవర్తించే భార్యావిధేయులెందరో తనకు తెలుసు. భార్య రెండ్రోజులు కనిపించకపోతే బెంగపెట్టేసుకునే భర్తలూ ఉన్నారు. కానీ తను ఖచ్చితంగా చెప్పగలడు. వారెవ్వరి భార్యలూ హేమలాంటి పొగరుబోతులు మాత్రం అయి వుండరు.
    హేమద్వారా ఇక్కడి సంగతులన్నీవిని ఆమె తండ్రి తనదగ్గరకు బ్రతిమాలడానికొస్తాడని ఊహించాడతను. కానీ పదిహేనురోజులవుతున్నా ఏ జాడా తెలీకపోయేసరికి అతను నిరుత్సాహపడ్డాడు. ఆమె తండ్రి కూడా హేమలాగానే పొగరుబోతుగా కనిపించాడతనికి. వాళ్ళకు అంత పట్టుదల ఉంటే తనేనా తీసిపోయిందీ? ఓ రోజు ఆఫీసుకి బయల్దేరుతోంటే ఒక యువకుడు గేటుతెరుచుకుని లోపలకురావడం కనిపించింది శ్రీనివాసరావుకి.
    "నమస్కారమండీ!" చిరునవ్వుతో నమస్కరించాడతను. "నమస్తే!" అన్నాడు శ్రీనివాసరావు ప్రశ్నార్ధకంగా చూస్తూ. "నా పేరు చంద్రకాంత్! మా సిస్టరూ, హేమగారూ మంచి ఫ్రెండ్స్! ఆ విధంగా ఆమెతో నాకు పరిచయముంది! మీరు శ్రీనివాసరావ్ గారా?" అడిగాడతను.
    శ్రీనివాసరావ్ కి అర్ధమయిపోయింది. ఆ రోజుతను చదివిన ఉత్తరం ఇతనిదేనన్నమాట! అంటే హేమను ఓ దేవతలా భావిస్తూ ఆమె అడుగు జాడల్లో నడుస్తోంది ఈ మహానుభావుడే!
    "అవును!" అన్నాడు శ్రీనివాసరావ్ ముక్తసరిగా.
    "హేమగారూ లేరాండీ?"
    "ఊహు!"
    "ఎక్కడికెళ్ళారో తెలుసుకోవచ్చా?"
    "ఏమిటి ఆమెతో మీకు పని?" కటువుగా అడిగాడు శ్రీనివాసరావ్.
    "పనిమీద ఈ ఊరు వచ్చాను. ఆమెనోసారి చూచి పోదామనిపించింది...."
    "ఆమె అంటే మీకు చాలా అభిమానమనుకుంటాను....." చంద్రకాంత్ కి అతను ప్రశ్నలోని వ్యంగ్యం అర్ధమయింది.
    "అవును!" అన్నాడు అతని కళ్ళల్లోకి చూస్తూ.
    "అంత అభిమానమున్నవాళ్ళు ఇన్నాళ్ళకా ఆమెను చూడ్డానికొచ్చేదీ?" హేళన ధ్వనిస్తోంది అతని మాటల్లో.
    "నెలరోజుల క్రితం ఓసారి వచ్చాను. అంతకు ముందు మీ అడ్రస్ తెలీలేదు! లేకపోతే కనీసం మా సిస్టరయినా తప్పకవచ్చేది!"
    "నెలరోజుల క్రితం వచ్చారా?" ఆశ్చర్యంగా అడిగాడు శ్రీనివాసరావ్.
    "అవును! అప్పుడు మీరు ఇంట్లో లేరు"
    "ఓహో! నా ఇంట్లోనే నాకు తెలీకుండా సమావేశమవడం జరిగిందన్న మాట! బహుశా ఇప్పుడూ నేను ఇంట్లో ఉండిఉండను హేమ ఉంటుందని అనుకుని వచ్చిఉంటారు" కోపంగా అన్నాడతను.
    చంద్రకాంత్ భయపడ్డాడు. తను అనవసరంగా ఇరుక్కుపోయాడు. హేమ అతనిగురించి వివరంగా చెప్పకనే చెప్పింది. ఇప్పుడు తనేం మాట్లాడినా ప్రమాదమే! అతనుతననేమీ చెయ్యలేడు. కానీ ఆమెను హింసిస్తాడేమోనని భయం! అదీగాక తను ఎప్పుడూ ఇలాంటిపరిస్థితులు ఎదుర్కోలేదు. మొదట్నుంచి కూడా తనది నెమ్మదిస్వభావం! హైస్కూల్లోనూ, కాలేజీలోనూ ఎన్నోసార్లు ఎంతోమందితో అభిప్రాయభేదాలువచ్చాయ్, కాని ఏనాడువాటివల్ల దెబ్బలాటలు జరగలేదు. బలప్రయోగాలకుతావివ్వలేదు. అవన్నీ కొంతమంది బుద్దిహీనులు చేపట్టే నీచమయినపనులని తన అభిప్రాయం. ఎవరయినా తనని నిందించినా తను చాలాసార్లు చిరునవ్వుతో సహించాడు. ఏదో ఒకరోజు వాళ్ళే తన తప్పు తెలుసుకుంటారని తనకు తెలుసు. ఇప్పుడు శ్రీనివాసరావ్ వేసిన అపనిందకు కూడా శాంతంగానే జవాబివ్వడం ఎంతో అవసరం!
    "అప్పుడూ మీరు ఇంట్లో ఉంటారనే ఉద్దేశ్యంతోనే వచ్చాను. కానీ దురదృష్టవశాత్తూ మీరు లేరు. మీరు వస్తారేమోనని చాలాసేపు వెయిట్ చేశాను. కానీ మీరు అప్పటికీ రాకపోవడంతో అదే రాత్రి హైద్రాబాద్ కి బయల్దేరే అవుసరం ఉండడం వల్ల తిరిగి వెళ్ళిపోయాను. నిజానికి మిమ్మల్నిద్దరినీ హైద్రాబాద్ కు ఆహ్వానించమని మా సిస్టర్ మరీమరీ చెప్పింది. అయినా మాకు హేమ ఎంత మంచిస్నేహితురాలో ఆమె భర్తగా మీరూ అంతటి సన్నిహితులే!" చిరునవ్వుతో మాట్లాడాడు చంద్రకాంత్.
    "ఇదిగో చూడు మిస్టర్ చంద్రకాంత్! దయచేసి ఇంక ఇక్కడకురాకండి! హేమ నా భార్య! ఆమె మంచిచెడ్డలు చూసుకునేబాధ్యత నాది. ఆమెకు ఇంకా స్నేహితులూ, స్నేహితురాండ్రూ ఉండటం నాకిష్టం లేదు. అవన్నీ పెళ్ళి జరిగేవరకే, కేవలం కాలక్షేపం కోసం ఏర్పరచుకొనేవి. వివాహమయిన తర్వాత భార్యకి భర్తే స్నేహితుడు, ప్రియుడూ, ఆప్తుడూ, అన్నీనూ! మీకు అర్ధమవుతోందనుకుంటాను....." సీరియస్ గా అన్నాడతను.
    చంద్రకాంత్ మొఖం పాలిపోయింది. అతను అంత సంస్కారంలేని మనిషని తనూహించలేదు. ఆమెతో అంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడంటే బహుశా ఇద్దరిదీ తప్పు ఉండవచ్చేమో అనుకున్నాడు. కానీ ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోందీ, చివరకు హేమ ఇలాంటి రాక్షసుడినా చేసుకుంది? ఉహు! తనింక ఉపేక్షించకూడదు. తక్షణం ఆమె నీ ఇడియట్ బారినుంచి రక్షించాలి!
    "ఇంక మీరు వెళ్ళవచ్చు!" తనూ బయటకునడిచి తలుపుతాళం వేస్తూ అన్నాడు శ్రీనివాసరావ్.
    చంద్రకాంత్ కి అతనితో ఇంకేమీ మాట్లాడ బుద్ది కాలేదు. వెనుకకు తిరిగి తల వంచుకుని అడుగులు వేసుకుంటూముందుకి నడిచాడు. అతనికి లోలోపల బాధకలుగుతోంది ఆమెను ఇంత నీచంగా ఎందుకు చూస్తున్నాడతను? మరో మగాడివేపు కన్నెత్తికూడా చూసే మనిషి కాదే! ఆఖరికి తనకూ ఆమెకూకూడా సంబంధం ఉందేమోనని అనుమానిస్తున్నాడంటే అతనిది ఎంతటిదారుణమయిన మనోప్రవృత్తో అర్ధమవుతోంది. తన వయసెక్కడ? ఆమె వయసెక్కడ? తను ఇంకా విధ్యార్దే! ఆమె వివాహితురాలు! అసలా ఆలోచన ఎలా కలిగిందతనికి? ఆమెను తను ప్రేమించినమాట నిజమే! ఆమె తన సర్వస్వం అనుకున్నమాటా నిజమే! కానీ తమ మధ్య ఉన్న వయసు తేడా తన ప్రేమను అణచివేసింది. కనీసం ఆమెకు తన హృదయాన్ని విప్పి చెప్పేంత ధైర్యంకూడా లేకపోయింది. జీవితాంతం ఆమెను తను ఆరాధిస్తూనే ఉంటాడు. అనుక్షణం గుర్తు చేసుకుంటూనే ఉంటాడు. అంతే! అంతవరకే! ఆమె వివాహితురాలనీ, తను ఆమె కంటే వయసులో ఎంతో చిన్నవాడినీ, తనెలా మర్చిపోగలడు? ఆ విషయాన్ని ఎలా అలక్ష్యం చేయగలడు?
    ఇంతకూ హేమ ఏమయినట్లు? ఎక్కడి కెళ్ళినట్లు? వాళ్ళ ఇంటికి వెళ్ళిందా? ఒకవేళ ఆమెను ఇంట్లోనే వుంచి తాళంవేసి వెళ్ళాడా? భార్యను ఇంట్లోనే వుంచి ఇంటికి తాళంవేసి వెళ్ళే అనుమానపు భర్తల గురించి కొన్ని కథలు చదివాడు తను! ఈ శ్రీనివాసరావ్ కూడా అదే బాపతేమో? ఏదేమయినా ఓసారి హేమవాళ్ళింటికి వెళితే ఆమె లేకపోయినా ఆమె తల్లిదండ్రులద్వారానయినా ఆమె గురించిన విశేషాలు తెలుస్తాయని అనిపించింది అతనికి. సరాసరి బస్ స్టాండ్ కి నడిచాడు చంద్రకాంత్.

 Previous Page Next Page