Previous Page Next Page 
రేపల్లెలో రాధ పేజి 22


    అప్పటిదాకా నవ్వుతూ కేరింతలు కొడుతూ మాట్లాడినవారు గిల్టీగా తలలు వంచుకున్నారు. ఎవరిమటుకు వాళ్ళు, వాళ్ళనే ఎత్తి చూపుతున్నట్టు ఫీలయ్యారు.
    
    ముందుగా సీతారామయ్య మాట్లాడుతూ, "విశాలాక్షి చిన్నకూతురికి పెళ్ళయిందన్న విషయం నాకు పెళ్ళయ్యాక గానీ తెలియలేదు!" అన్నాడు.
    
    ఆమె భర్త అందుకు సమాధానం చెపుతూ, "ఆ అబ్బాయికి అనుకోకుండా లీవు కలిసిరావడంతో ఒక్క వారంలోనే హడావుడిగా పెళ్ళి జరిపించెయ్యాల్సి వచ్చింది. మీ అందరికీ కబురుచేసే టైముకూడా లేదు. గౌహతిలో వాళ్ళ పేరెంట్స్ ఉంటారుకాబట్టి అక్కడే చెయ్యాలంటే అలానే చేసి పంపించేశాం. ఈసారి జాహ్నవి రాగానే అందర్నీ పిలిచి సత్యన్నారాయణ వ్రతం చేద్దాం అనుకుంటున్నాం" అన్నాడు.
    
    కేశవరావు కలుగజేసుకుని, "నీలవేణికి ఆ మధ్య చాలా జబ్బు చేసిందట అయినా స్వంత అక్కా బావలకి కబురు చెయ్యలేదు. అంత పరాయివాళ్ళమా?" అన్నాడు.
    
    యశోద కూసా "ఔనే....! అమ్మ పోయినా నేనింకా బతికే ఉన్నానన్న విషయం మరిచిపోయావా?" అంది.
    
    ఆ మాత్రం ఆప్యాయతకే నీలవేణి కళ్ళు చెమరించాయి. "అలా అని కాదక్కా! అందరూ బిజీకదా...! అందుకే పనిమనిషిని పెట్టుకుని మా తంటాలేవో మేం పడ్డాం!" అంది.
    
    "మాధవ్ అమెరికానుండి రాగానే చూడటానికి వచ్చి, "పిన్నీ ఎలా ఉన్నావ్? ఇంటి పరిస్థితి ఏమిటీ?" అని అడిగితే ఆ ఆప్యాయతకి నాకు మానాన్నగారు గుర్తొచ్చి వాడి ఒళ్ళో తల పెట్టుకుని ఏడ్చేశాను" అంటూ మళ్ళీ ఏడ్చేసింది పురంధర.
    
    "గోవిందుకి ఉద్యోగం పోయినట్లు నువ్వు మాకు తెలియబరచి ఉండాల్సింది!" తప్పుచేసిన భావాన్ని పెద్దరికంతో కప్పిపుచ్చుతూ అన్నాడు కేశవరావు.
    
    "పిన్ని ఎలా చెప్తుంది నాన్నా? మాంచాలలూ, మాంధాతలూ పుట్టిన గడ్డమీద పుట్టిన అభిమానవతి. తెలుసుకోవడం పెద్దవాళ్ళ బాధ్యత!" అన్నాడు మాధవ్.
    
    "వానప్రస్థంలో ఉన్నాననుకున్నానేకానీ, ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తించానన్న విషయం ఇప్పుడే అర్ధమౌతోంది!" బాధగా అన్నాడు సీతారామయ్య.
    
    "అయిందేదో అయిపోయింది. ఇప్పుడు చెయ్యవలసిందేమిటో చూడండి!" అన్నాడు విశాలాక్షి భర్త నారాయణమూర్తి.
    
    "మీరూ, అత్తయ్యా మన స్వంత ఊళ్ళో పెద్దనాన్న దగ్గర ఉండడం" అన్నాడు మాధవ్.
    
    "ఆఁ!" అందరూ అవాక్కయిపోయి చూశారు.
    
    "ఉద్యోగం పోయింది. పిల్లలా ఈ దేశంలో లేరు, మీరెక్కడున్నా ఒకటే. ఆలాంటప్పుడు మన ఊళ్లోనే స్వంత ఇంట్లో ఉంటూ ఈ వయస్సులో పెద్దనాన్నకి తోడుగా ఉంటే ఎంత బాగుంటుందీ! అత్తయ్యా! ఎప్పుడో మరిచిపోయిన వాకిలి కళ్ళాపిలూ, కాళ్ళకి పసుపులూ, వరలక్ష్మి వ్రతాలూ చేయాల్సివస్తుందని భయపడుతున్నావా" అన్నాడు మాధవ్.
    
    "ఛ! అట్లతద్దెనాటి ఆటపాటలతో, రామునివారి కళ్యాణంలో వడపప్పూ, పానకాలతో పెరిగిన ఆ వూరి ఆడబడుచును కాదూ! నాకెందుకు భయం?" అంది విశాలాక్షి.
    
    "ఏం మావయ్యా? ప్రశాంతత కోసం కులూ మనాలీలూ, కొడైకెనాల్ లూ వెళ్ళాల్సిన పనిలేదు. రేపల్లెలాంటి పల్లెలో రేగడి మట్టి వాసనల్లో స్వచ్చంగా, సహజంగా కాలం గడపడం ఎంతటి అదృష్టమో వెళ్ళాక మీకే తెలుస్తుంది! ట్రై చేసి చూడండి!" అన్నాడు.
    
    విశాలాక్షికి అప్పుడే కావిళ్ళతో కాయగూరలూ, కడవల్లో పాలూ, ప్రాతః కాలాన సంకీర్తనలూ, సాయంకాలం పురాణ కాలక్షేపాలూ కళ్ళల్లో మెదిలి అవి మతాబుల్లా పువ్వులు విరియిస్తున్నాయి.
    
    "నువ్వు చెప్పేదేదో బాగానే ఉందిరా! అన్నాడు నారాయణమూర్తి.
    
    "విశాలీ... మళ్ళీ నాకు అమ్మ వస్తోందా ఈ వయసులో....?" రుద్దమవుతున్న గొంతుతో సీతారామయ్య అడిగాడు చెల్లెల్ని.
    
    "అన్నయ్యా! అంతటి అదృష్టాన్ని కాదనగలనా?" విశాలాక్షికి అన్నగారిమీద ఆప్యాయత వరద పొంగులా తన్నుకొచ్చేసి కళ్ళు రెండూ నీటి కడవలే అయ్యాయి.
    
    "గోవిందు బాబాయ్! మన పొలం వ్యవహారాలు చూసుకుంటాడు!" ఇంకో వార్త పేల్చాడు మాధవ్.
    
    గోవిందరావు అదిరిపడి చూశాడు.
    
    పురంధర కృతజ్ఞతగా చూసింది.
    
    పిల్లలిద్దర్నీ నీలవేణి పిన్ని పిల్లలు చదివే హాస్టల్లో చేర్పిద్దాం అన్నాడు మాధవ్.
    
    "అవును ఆదివారాల్లో మేం వెళ్ళి చూసొస్తూ ఉంటాంగా! అన్నాడు నీలవేణి భర్త విద్యావతి.
    
    "ఏరా, మాట్లాడవూ! ఉండటానికి నీకేం అభ్యంతరం?" అడిగాడు కేశవరావు తమ్ముడిని.
    
    "కాదనకండి, చిన్నవాడైనా దేవుడిలా వచ్చి ఓ దరి చూపిస్తున్నాడు. క్లబ్బులూ, రేసులూ లేనిచోట కొన్నాళ్ళు వుంటే మీకూ ఆ వ్యసనాలు దూరం అవుతాయి. నాకూ అయినవాళ్ళ మధ్య ఉన్నట్లు అవుతుంది!" అంది పురందర.
    
    "బాబాయ్! నేనూ నీతోనే వుంటాను. అక్కడ ఎర్రకొండల దగ్గర నాన్నకొన్న స్థలంలో ఫ్యాక్టరీ పెడతాను. తక్కువకి ఎరువులు సప్లయ్ చేసి, రైతన్నలకి సహాయపడదాం. ఈ చదువుకి అంతకన్నా సార్ధకత ఏముంటుందీ? ఎందరో నిరుద్యోగులకి ఉద్యోగావకాశాలు ఇచ్చి పల్లెలొదిలి పెట్టి పట్నాలకి వలస రాకుండా కాపాడిన వాళ్ళం అవుతాం! నాన్నా, అమ్మా కూడా నెమ్మదిగా అక్కడికే చేరతారు!" అన్నాడు మాధవ్.
    
    "మేము సరేనా! ఆ అమెరికా పిల్ల లిజీ ఏమంటుందో?" ఆటపట్టించింది. విశాలాక్షి.
    
    "అత్తగారితో కలిసి బ్యూటీపార్లర్లకీ, క్లబ్బులకీ, పబ్స్ కి తిరుగుతూ ఉంటుంది. అమ్మకెలాగూ సరదానే కదా!" అన్నాడు.
    
    "చచ్చినా ఒప్పుకోను! నా కోడలు నా దేశంలో పుట్టిన భాషమాట్లాడి, నా తిండి తినేదై ఉండాలి. ఏకాదశి ఉపవాసాలూ, శ్రావణ మంగళవారాలూ నోచాలి. నా మనవరాళ్ళచేత బొమ్మల కొలువులు పెట్టించాలి. పూర్ణంబూరెలూ, పులిహోరలూ చేయగలదై వుండాలి. శ్రీమహాలక్ష్మిలా బొట్టుపెట్టుకుని చీర కట్టుకుని కళకళలాడుతూ తిరగాలి! పాంటూ చొక్కా వేసుకుని సిగరెట్టు కాలుస్తూ తిరిగే పరాయిదేశం పిల్ల ఎంతమంచిదైనా నాకు అవసరం లేదు! ఫాస్ట్ ఫుడ్స్ ఎప్పుడైనా చేంజ్ కోసమే తప్ప, దాంతోనే ప్రతిరోజూ కడుపు నింపుకోవాలంటే వెగటు పుడతాయిరా!" ఆవేశంగా అంది యశోద.    
    
    "అంటే... నా క్కాబోయే భార్య పసుపు రాసుకుని సందెగొబ్బెమ్మల చుట్టూ 'మొగలిపూవంటీ మొగుడ్నీయవే" ... అని తిరిగేదై ఉండాలంటావా? గొంతు పెంచి అరిచాడు మాధవ్.
    
    "ఔను!" అంతే గట్టిగా అరిచింది యశోద.

 Previous Page Next Page