2) వృషలాభము కొరకు ఒకే రూపపు దూడ గల ఆవు పాల అన్నములో గూగలము లవణము కలిపిన ముద్దలు చేసి దీనిచే సంపాతన అభిమంత్రణలు చేసి తినిపించవలెను.
3) దున్నిన మూడు చాళ్ళను కర్త 8వ మంత్రముచే అభిమంత్రించవలెను.
4) అద్భుత మహాశాంతి యందు నాగటి చాలు మధ్యన హల సంసర్గమైనపుడు ఈ సూక్తము శాన్త్యుదకమున అనుయోజనము చేయవలెను.
5) యజ్ఞవాస్తు సంస్కారమున 4వ మంత్రముచే నవీన అగ్నిని స్థాపించవలెను.
6) అగ్ని చయన కర్మమున క్షేత్రమును దున్ను నాగలిని 'బ్రహ్మ' ఈ సూక్తముచే అభిమంత్రించునది. 2వ మంత్రముచే గింజలు నాటి నాటిన వాటిని అధ్వర్యుడు అనుమంత్రించ వలెను.
3. వాడియై, నేలను చీల్చగల నాగలికి గల వజ్రము వంటి కర్రు రైతుకు సుఖములు కలిగించును. దాన్యాదులు పండించి సోమ యాగమునకు ఉపకరించును. భూమిలోనికి చొచ్చుకొని సాగును.
4. ఇంద్రుడు నాగటి చాలునందు చేరును గాక. పూష దానిని రక్షించును గాక. అట్టి నాగటి చాలు మాకు ప్రతి ఏట పాడి, పంట కలిగించును గాక.
5. మాకు సుఖములు కలుగుటకు నాగళ్ళు నేలను దున్నును గాక. మాకు సుఖము కలుగునట్లు నాగళ్ళు ఎద్దులను అనుసరించును గాక. సుఖముల, హలముల అధిష్టాన దేవతలారా! మా హవితో సంతృప్తులు కండి. మాకు చక్కని పంటలు కలిగించండి.
7. ఆదిత్య వాయు దేవతలారా! ఈ పొలము నందు మేము ఆర్జించు హవిని అందుకొనండి. ఆకాశము నందున్న జల దేవతలు దున్నిన ఈ చేలను తడుపుదురు గాక.
8. సీతే! - నాగేటి చాలా! వన్దామహే - నమస్కరించుచున్నాము. మాకు సౌభాగ్యములు కలిగించుము. మా విషయమున మంచి మనసు కలిగి ఉండుము. మాకు సుఫలవు అగుము.
9. సీతే! నీవు మధుర జల సంయుక్తవు. విశ్వేదేవతలు, మరుత్తులచే అనుగ్రహించ బడిన దానవు. పాడి పంట కలిగించుచు జల సహితవై మాముందు నిలువుము,
మూడవ సూక్తము - 18
వినియోగము :-
సవతిని వశపరచు కొనుటకు దీనిచే 'బాణాపర్ణపు' ఆకులను పొడిచేసి, ఎరుపురంగు మేక పాలలో కలిపి సవతి మంచము మీద పరచవలెను. 'అభితేధామ్' అను పాదముచే ఆ ఆకులను అభిమంత్రించి మంచము క్రింద వేయునది. 'ఉపతేధామ్' అను పాదముచే ఆకులను అభిమంత్రించి మంచము మీద వేయునది.
1) సభా విజయమునకు 5,6 మంత్రములను జపించుచు ఈశాన్యము నుండి సభలో ప్రవేశించునది.
1. 'పాఠ' అను పేరు సవతిని బాధించునది. భర్తను అనుకూలుని చేయునది. అది పరమ బలవతి. దానిని నేల త్రవ్వి సాధించినాను.
2. పాఠా! నీ ఆకులు ఊర్ధ్వ ముఖములు. సౌభాగ్యము కలిగించునవి. దేవతలచే అనుగ్రహించ బడినవి. అన్యులను ఓడించగలవి. నా సవతిని తలవంచునట్లు చేయుము. "పతిం మే కేవలం కృధి" నా భర్త నా వాడు మాత్రమే అగునట్లు చేయుము.
3. సవతీ! నేను నీ పేరైన ఎత్తను. నీవు నా భర్తను రమించకుండుము. నిన్ను చాలా, చాలా దూరమునకు పంపుచున్నాను.
4. పాఠా! నీ అనుగ్రహమున నేను గొప్ప దానను అగుదును. లోకమందలి గొప్పవారి కన్న గొప్ప దానను అగుదును గాక. నా సవతి నీచాతినీచ యగును గాక.
5. పాఠా! నేను సవతిని అణచగల దానను. నీవు శత్రువును అణచగల దానవు. మనము ఇద్దరము నా సవతిని అణచివేయుదుము గాక.
6. పాఠ పరాభవించ గలది. దానిని నా సవతి మంచము మీద పరచినాను. జయించగల ఈ ఓషధిని మంచము మీద ఉంచినాను. పాలు చేపు ఆవు దూడవైపు ఉరికినట్లు - నీరు పల్లమునకు పారినట్లు సవతీ నా వశవర్తినివై నన్ను సేవించుము. నాలుగవ సూక్తము - 19
వినియోగము :-
1) అన్య సేనను గడ గడలాడించుటకు ఈ సూక్తముచే ఘ్రుతాహుతులిచ్చి తెల్ల కాళ్ళ మేక లేక గొర్రెను అభిమంత్రించి శత్రుసేన మీదకు తోలవలెను.
2) యుద్దమున విజయము కలుగుటకు దీనిచే ఘ్రుతహోమము, సక్తు హోమము చేసి ధనుస్సు వంటి ఇంధనము, బాణము వంటి సమిధను ఆధానము చేయునది. రాజునకు అభిమంత్రిత ధనుస్సు అందించునది.
3) అగ్ని చయనము నందు 'ఉన్నీయమాన ఉఖ్యాగ్ని' ని మొదటి మంత్రముచే 'బ్రహ్మ' అనుమంత్రించునది.
4) మహా వ్రాత ఆజిధావనమున 8వ ఋక్కుచే అవసృత బాణమును అభిమంత్రించునది.
1. నేను పురోహితుడను. శుభములు కలిగించువాడను. నా మంత్రము తీక్షణమగును గాక. అది తీక్షబలమును, తీక్ష వీర్యమును, తీక్ష క్షాత్రమును కలిగించును గాక.
2. నేను ఏ రాజ్యమున ఉన్నానో దానిని తీక్ష్ణము చేయుచున్నాను. ఓజస్సు, వీర్యము బలము కలిగించుచున్నాను. నేను హవిస్సులర్పించి శత్రువుల చేతులు ఆయుధము పట్టకుండ చేయుచున్నాను.
3. మా రాజు కార్యా కార్యములు తెలిసిన వాడు. సంపన్నుడు. అతని మీదకు ఎత్తి వచ్చు సేన తలలు వాల్చి పడిపోవును గాక. నా మంత్ర బలమున శత్రువును క్షీణింప చేయుచున్నాను. నా రాజునకు దిగ్విజయము కలిగించుచున్నాను.
4. నేను ఎవరి పురోహితుడనో ఆ రాజు పరశువు కన్న పదును గలవాడు. అగ్ని కన్నా తీవ్రత కలవాడు, ఇంద్రుని వజ్రాయుధమును మించిన తీక్ష్ణత గలవాడు అగుచున్నాడు.
5. మా రాజు యొక్క ఆయుధములను తీక్ష్ణము చేయుచున్నాను. ఆ రాజ్యమున శూరుల సమృద్ది కలిగించుచున్నాను. మా రాజు క్షాత్రము జరారహితము విజయోపేతము అగును గాక. మా రాజు యుద్ద సన్నద్దతను సకల దేవతలు రక్షింతురు గాక.
6. మఘవ ఇంద్రా! అశ్వ, గజాదుల ఉత్సాహ వంతములు అగును గాక. వాటికి విజయము కలుగును గాక. వీరులు విజయ నినాదములు చేయుదురు గాక. విజయ ఘోష సకల దిక్కులమ్ధుఇ వ్యాపించును గాక.
8. మంత్ర ప్రయుక్త తీక్ష్ణశరమా! మేము విడిచినంత శత్రువు మీద పడుము. జయించుము. శత్రు వీరులలో ఒక్కడైన మిగులకుండ వధింపుము.
ఐదవ సూక్తము - 20
వినియోగము :-
1) ఈ సూక్తముచే ఇసుక కసిలిన ధాన్యమును హోమము చేయవలెను. అర్ధోత్దాపన కర్మమున దీనిచే ఘ్రుత సమిధాది పదమూడు పదార్ధములచే హోమము చేయవలెను. దీనిచే అరణ్యులను తనయందు కాని అగ్నియందు గాని సమారోహణ చేయునది. దీనిచే సర్వయజ్ఞములందు నాలుగవ ఋక్కుచే అధర్వ వేదజ్ఞులగు నలుగురు ఋషులను ఆహ్వానించవలెను. అగ్ని చయన సమయమున పెట్టవలసిన గార్హ పత్య ఇటుకను ఈ ఋక్కుచే అభిమంత్రించునది.
2) అగ్ని చయనమున ఔదుంబర సమిధ తరువాత 2-4, 7 వ మంత్రములను జపించునది. 8వ మంత్రముచే వాజసనీయ హోమమును అనుమంత్రణ చేయునది.
1. అగ్నీ! ఈ అరణి నీకు ఋత్విజ యోని అయి ఉన్నది. దీని యందే నీవు పుట్టి ప్రజ్వరిల్లుచున్నావు. నీ ఉత్పత్తి మూలమును ఎరింగి దీనియందు ప్రవేశింపుము. విడువకుము. "నో వర్దయారయిమ్" మా ధనమును వర్ధిల్లచేయుము.
2. అగ్నీ! మాకు లభించు ఫలములతో ప్రత్యక్షమగుము. ప్రియముగా పలుకుము. వైశ్వానరాగ్నీ! నీవు ధనదాతవు కదా! మాకు కోరిన దానములను ప్రసాదించుము.
3. ఆర్యమ మాకు ధనము ప్రసాదించును గాక. భగదేవత, బృహస్పతియు మాకు ధనము అందింతురు గాక. ఇంద్రాణియు, ఇతర దేవేరులును మాకు ధనము ఇత్తురు గాక. వాగ్రూప సరస్వతియు మాకు ధనము ప్రసాదించును గాక.
5. అగ్నిదేవా! నీవు ఇతర అగ్నులచే కూడిన వాడవై మా యొక్క మంత్రమును, యజ్ఞమును 'వర్ధయ' నీకు హవిస్సులు అర్పించు ఈ యజమానికి ధనము నిచ్చునట్లు దేవతలకు ప్రేరణ కలిగించుము.